‘స్మశానానికి స్థలం కేటాయించకపోతే తహసిల్దార్ కార్యాలయంలోనే అంత్యక్రియలు’: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
స్మశానానికి స్థలం చూపించాలని అధికారులను పలుమార్లు కోరినా ఫలితం లేనందున కర్నాటక రాష్ట్రం గదగ్ జిల్లాలో హాతలగేరి గ్రామస్థులు ఒక మృతదేహానికి నడిరోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహించారని 'ఆంధ్రజ్యోతి' పత్రిక తన కథనంలో వెల్లడించింది.
''ఈ సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గదగ్ జిల్లా హాతలగేరి గ్రామంలో శ్మశానానికి ప్రత్యేకంగా స్థలం కేటాయింపులు లేవు. రైతులు వారి పొలాల్లోనే అంత్యక్రియలు జరుపుకొనేవారు. కాగా నాలుగు రోజుల కిందట ఒకే రోజున ఉదయం చెన్నబసప్ప, మధ్యాహ్నం యల్లప్ప అనేవారు మృతి చెందారు. అంత్యక్రియలకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో మృతుల కుటుంబసభ్యులు హాతలగేరి- నాగసముద్రం మార్గమధ్యంలోని ప్రధాన రహదారిపై మృతదేహాలను దహనం చేశారు.
విషయం తెలుసుకున్న తహసీల్దారుతో పాటు అధికారులు గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చించే యత్నం చేశారు. కొన్నేళ్లుగా శ్మశానానికి స్థలం కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. వెంటనే శ్మశానానికి స్థలం చూపాలన్నారు. లేకపోతే తహసీల్దారు కార్యాలయంలోను భవిష్యత్తులో అంత్యక్రియలు జరుపుతామని వారు హెచ్చరించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/kcr
18న మంత్రివర్గ విస్తరణ?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈ నెల 18న ఉండొచ్చని 'ఈనాడు' పత్రిక తన కథనంలో పేర్కొంది.
''ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పుపై కొంత స్పష్టత ఇచ్చారు. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎనిమిది మందికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, రేఖానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, ఆరూరి రమేశ్, వినయ్ భాస్కర్, నరేందర్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఈ నెల 19వతేదీన గవర్నర్ శాసన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమయానికి సభలో మంత్రులు ఉండాలి. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాల సమయంలోనూ మంత్రులు మాట్లాడాలి. శాసన సభా వ్యవహారాల వ్యవహారాల మంత్రి కూడా అప్పటికి ఖరారు కావాలి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ఈ నెల 18వతేదీ అనుకూలమని సీఎం భావిస్తున్నట్టు సమాచారం'' అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, facebook/NaraChandrababuNaidu
టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ఫిబ్రవరిలో
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరిలో విడుదల చేస్తారని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది. వెల్లడించింది.
''జనవరిలో తొలి జాబితా విడుదల చేసే ఆలోచన ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలం క్రితం పార్టీ నేతల టెలి కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఆ దిశగా అంతర్గత కసరత్తు కూడా చేపట్టారు. కానీ తాజా పరిణామాలతో ఆ ముహూర్తం మారినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో తొలి జాబితా విడుదల ఉంటుందని ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ తర్వాత అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉంటుందని అంటున్నారు. జనవరిలో అనేక వరుస కార్యక్రమాలతో పని ఒత్తిడి అధికంగా ఉండటం కూడా వాయిదాకు కారణంగా చెబుతున్నారు. ఈ నెల 11 వరకూ జన్మభూమి జరగనుంది. తర్వాత సంక్రాంతి పండుగ సెలవులు వస్తున్నాయి. ఆ తర్వాత 18న మంత్రివర్గ సమావేశం, 20న రాత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. 25న ఆయన తిరిగి వస్తారు. ఆ మర్నాడు రిపబ్లిక్ దినోత్సవం. 27న రాజమండ్రిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏతావాతా ఫిబ్రవరిలోనే తొలి జాబితా విడుదలయ్యే వాతావరణం కనిపిస్తోంద''ని అందులో పేర్కొంది.

ఫొటో సోర్స్, UttamKumarReddy
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిపోరు: సమీక్ష సమావేశంలో నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పరాజయానికి పొత్తులు కూడా ఓ కారణమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారని 'ఈనాడు' తన కథనంలో రాసింది. ''
''శనివారం గాంధీభవన్‌లో నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, అజారుద్దీన్, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, ఆయా నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలన్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, KannaLakshmiNarayana
నన్ను చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు: కన్నా లక్ష్మీనారాయణ
తనను చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం గూండాలను పంపిందని బీజీపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారని 'సాక్షి' తన కథనంలో పేర్కొంది.
''గుంటూరు కన్నావారితోటలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని విజయవాడ నుంచి వచ్చిన టీడీపీ నేతలు శనివారం ఉదయం ముట్టడించారు. సుమారు గంటసేపు ఆయన ఇంటి ఎదుట బైఠాయించి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ సమయంలో కన్నాతో పాటు మరో ఇద్దరు మాత్రమే ఇంటిలో ఉన్నారు. ముట్టడి విషయం తెలిసి పోలీసులు వచ్చినా.. టీడీపీ వారిని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో కన్నా కూడా వారికి ఎదురుగా కూర్చున్నారు. బీజేపీ యువమోర్చా నేతలు టీడీపీ నేతలను అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో మరింత మంది పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని లాడ్జిసెంటర్ నుంచి శంకర్‌విలాస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం నగరంపాలెం పోలీసు స్టేషన్ వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, కన్నాను చంపుతామంటూ బెదిరిస్తూ.. ఇంటిపైకి రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు'' అని ఆ కథనంలో రాశారు.
కన్నా దీనిపై విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారని, వైఎస్ జగన్‌పై విశాఖలో కత్తితో దాడిచేశారని నేడు తనను చంపేందుకు ప్రయత్నించారన్నారని ఆరోపించారని రాశారు.
ఇవి కూడా చదవండి:
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








