భారత్ అనుమతి లేకుండా లక్షద్వీప్ సమీపంలో అమెరికా నావికాదళ విన్యాసాలు

నౌక
    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా నౌకాదళానికి చెందిన నౌక జాన్ పాల్ జోన్స్ (డీడీజీ 53) ఏప్రిల్ 7న లక్షదీవులకు పశ్చిమాన 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఈఈజడ్)లో సైనిక విన్యాసాలు సాగించినట్లు చెప్పుకొంది.

అయితే, భారతదేశం నుంచి అనుమతి తీసుకోకుండానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ ఆపరేషన్ జరిగిందని అమెరికా నావికా దళానికి చెందిన ఏడో ఫ్లీట్ ధ్రువీకరించడమే కాకుండా, అలా చేసేందుకు తమకు అధికారం, స్వేచ్ఛ ఉన్నాయని పేర్కొంది.

ఏడో ఫ్లీట్ అమెరికా నావికదళంలోనే అతి పెద్దదైన, అభివృద్ధి చెందిన నౌకల సముదాయం.

పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల ప్రాంతాలనూ ఇది కవర్ చేస్తుంది.

లక్షదీవుల సమీపంలో జరిపిన ఆపరేషన్ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉందని ఏడో ఫ్లీట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

"ఇండియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఆ దేశ అనుమతితో సంబంధం లేకుండా అమెరికా నావికాదళం తమ హక్కులను వినియోగించుకోవడం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అంతే కాకుండా, అమెరికా నావికాదళం ప్రతిరోజు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆపరేషన్లు నిర్వహిస్తుంటుందని.. ఇలాంటి ఆపరేషన్లు ఇంతకుముందు కూడా నిర్వహించామని, ఇకపై కూడా నిర్వహిస్తామని ఏడో ఫ్లీట్ తెలిపింది.

అమెరికా నౌక

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం అనుమతి లేకుండా ఇతర దేశాల ఓడలు భారత ప్రాంగణంలోకి రావొచ్చా?

నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను అంతర్జాతీయ చట్టాల్లో గుర్తిస్తారు. అయితే, వీటికి కొన్ని షరతులు ఉంటాయి.

కాగా, భారతదేశానికి చెందిన జోన్లలోకి ఇతర దేశాల ఓడలు ప్రవేశించడం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందా అనేది ప్రస్తుత వివాదం.

అలా చేసే హక్కు తమకు ఉందని అమెరికా అంటోంది. కానీ, భారత సముద్ర చట్టం అందుకు అనుమతించదు.

భారత చట్టాల ప్రకారం విదేశీ నౌకలు భారత ఈఈజడ్ మీదుగా ప్రయాణించలేవు.

జయశంకర్

భారతదేశం ఏమంటోంది?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందిస్తూ.. "ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను అనుసరించి భారతదేశానికి చెందిన ఈఈజడ్‌లో ఇతర దేశాల నౌకాదళాలకు సైనిక విన్యాసాలు, యుద్ధాభ్యాసాలు చేసేందుకు అధికారం ఉండదు.

ముఖ్యంగా ఆ విన్యాసాలలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు వినియోగించినట్లయితే ఆ తీర ప్రాంత అనుమతి లేకుండా ఆపరేషన్లు నిర్వహించకూడదు.

యూఎస్ నౌక జాన్ పాల్ జోన్స్ కదలికలను పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్క జలసంధి వరకూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుత సంఘటనపై భారతదేశ ఆందోళలను దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు తెలియజేశాం" అని తెలిపింది.

"ఐక్యరాజ్య సమితి కన్వెషన్ అనుసరించి సముద్ర చట్టాల పట్ల ఇండియా, అమెరికా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. అయితే, సైనిక విన్యాసాల సమయంలో పేలుళ్లకు పాల్పడ్డారా లేదా అనేది చూడాలి. ఒకవేళ పేలుళ్లు జరిగితే ఈ సమస్య రూపం మారిపోతుంది" అని భారత నావికాదళానికి చెందిన రిటైర్డ్ కొమోడోర్ సి. ఉదయ భాస్కర్ తెలిపారు.

"ఇన్నోసెంట్ పాసేజ్ అని ఒకటుంటుంది. దీని ప్రకారం ఏ జోన్‌లో ఓడలు ప్రవేశించనున్నాయో ఆ జోన్ అధికార దేశానికి ముందే సమాచారం అందిస్తారు. విన్యాసాల సమయంలో పేలుళ్లు జరుగుతాయనుకుంటే ‘నోటీస్ టూ మరీనర్స్’ ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, ప్రస్తుత వివాదంలో చాలా అస్పష్టత ఉంది. అమెరికా ప్రోటోకాల్ పాటించామని చెబుతోంది. సముద్ర చట్టాలను రెండు దేశాలు భిన్నంగా అర్థం చేసుకుంటున్నాయి. ఇది ఒక వింత పరిస్థితి" అని ఆయన వివరించారు.

సముద్రం
ఫొటో క్యాప్షన్, సముద్రం

ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి?

ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే దేశ తీరానికి 200 నాటికల్ మైళ్లు అంటే 370 కిలోమీటర్ల దూరంలో ఉండే కొన్ని ప్రత్యేక హక్కులు దఖలుపడిన సముద్ర ప్రాంతం.

ఏప్రిల్ 7న అమెరికా నౌకాదళ ఏడో ఫ్లీట్ మాల్దీవుల సముద్ర తీరాన్ని దాటి భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ప్రవేశించింది.

ఈ సంఘటన భారతదేశానికి కచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే విషయమే. ఎందుకంటే హిందూ మహా సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా దూకుడును తగ్గించేందుకు ఇండియా, అమెరికా కలిసి పని చేస్తున్నాయి.

ఈ రెండు దేశాలు కూడా క్వాడ్ గ్రూపు సభ్యులే. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కలిసి పని చేస్తున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో అమెరికా నౌకాదాళం చర్యలను పట్టించుకోకుండా ఉండడం ఇండియాకు అసాధ్యం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎన్నో సందేహాలు

"1995 నాటి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలను భారత్ ఆమోదించిందిగానీ అమెరికా ఇంతవరకూ ఆమోదించలేదు. భారత దేశ చట్టాలకు విరుద్ధంగా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ప్రవేశించడమే తప్పు. పైగా దాని గురించి ప్రచారం కూడా చేస్తున్నారు" అంటూ భారత నౌకాదళ మాజీ అధ్యక్షుడు అరున్ ప్రకాశ్ ట్వీట్ చేశారు.

"దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా నౌకలు నిర్వహించిన ఫ్రీడం ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ అంతరార్థం చైనాకు 'ఇది ఒక పెద్ద మారిటైమ్ హక్కు' అనే సందేశం పంపడమే.

అయితే, అమెరికా నౌకాదళం ఏడో ఫ్లీట్ ఇలా చేయడం ద్వారా ఇండియాకు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)