వకీల్ సాబ్ సినిమా రివ్యూ: 'పారిపోకు, దాక్కోకు.. ఎదుర్కో ప్రపంచాన్ని'

వకీల్ సాబ్

ఫొటో సోర్స్, Twitter/SVC_official

    • రచయిత, సౌమ్య ఆలమూరు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నో అంటే నో.. అమ్మాయి 'వద్దు' అంటే కచ్చితంగా 'వద్దు', 'కూడదు' అనే అర్థం. స్నేహితుడైనా, బాయ్ ఫ్రెండ్ అయినా, భర్త అయినా సరే వద్దు అన్నప్పుడు అమ్మాయిమీద చెయ్యి వేసే హక్కు ఎవరికీ లేదు. ఒక మనిషి మీద ఆ మనిషికి మాత్రమే హక్కు ఉంటుంది. అమ్మాయి కూడా ఒక మనిషి. తనకి ఏం కావాలో, వద్దో నిర్ణయించుకునే హక్కు తనకు మాత్రమే ఉంటుంది.

.. ఇదీ 'వకీల్ సాబ్' సినిమా కథకు కేంద్ర బిందువు.

ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరమైన చర్చకు తెర తీసిన 'వకీల్ సాబ్' మూవీ తెలుగు సినిమా దిశ మార్చుకుంటోందని చెప్పడానికి మరో ఉదాహరణ.

"నిజాన్ని గెలిపించాలంటే అనేకం కోల్పోవలసి వస్తుంది. అందుకు ధైర్యంగా నిలబడాలి. పారిపోకు, దాక్కోకు...ఎదుర్కో" అంటాడు ఈ సినిమాలోని లాయర్ సత్యదేవ్.

కానీ, ఆడ పిల్లలకు మాత్రమే ఎందుకు ఈ కష్టం? ఒక నిజాన్ని గెలిపించడానికి, తన హక్కులు పొందడానికి మహిళలు ఎందుకింత పోరాడాలి ? సమస్య ఎక్కడ ఉంది? అనే అంశాలపై 'వకీల్ సాబ్' సినిమా దృష్టి సారించింది.

అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు వేసుకుంటే తప్పు, గట్టిగా మాట్లాడితే తప్పు, నవ్వితే తప్పు. మానవ సహజమైన పనులేవీ అమ్మాయిలు చెయ్యకూడదు. ఎందుకు?

నవ్వినా, టచ్ చేసినా, సరదాగా మాట్లాడినా సిగ్నల్ ఇస్తోందని అనుకోవడం, తమకు నచ్చినట్టు స్వేచ్ఛగా ఉండే అమ్మాయిలను సునాయాసంగా బూతులు తిట్టగలగడం, వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం.. మన సమాజంలో తరచూ మనకు ఎదురుపడే అంశాలే.

ఒక అమ్మాయి కాస్త స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉంటే చాలు.. 'బుద్ధి చెప్పాలంటూ' తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శరీరంపై దాడి చేస్తారు.

ఏమిటీ వికృతమైన ఆలోచన? తప్పు ఎక్కడుంది? ఎవరు మారాలి?

ఈ అంశాలన్నిటినీ చర్చిస్తూ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది 'వకీల్ సాబ్' సినిమా.

వకీల్ సాబ్

ఫొటో సోర్స్, Twitter/SVC_official

ఐదేళ్ల క్రితం హిందీలో వచ్చిన 'పింక్' సినిమాకు రీమేకే అయినా తెలుగు సమాజానికి అనుగుణమైన మార్పులతో తీశారు.

అసలు కథలో బలం ఉన్నప్పుడు రీమేక్ చేయడం కొంత సులభమే అవుతుంది.

కానీ, ఆ కథను భిన్న సంస్కృతికి అనుగుణంగా తీయడం వెనుక కొంత కృషి అవసరం.

అలాగే, ఒరిజినల్ సినిమాకు, ఈ సినిమాకు ఐదేళ్ల తేడా ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో వచ్చిన మార్పులు, జరిగిన విషయాలను సినిమాలో చొప్పించగలగాలి. అక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది.

అందుకు ఈ చిత్ర దర్శకుడు వేణూ శ్రీరాంను తప్పక అభినందించాలి.

కథ ఏమిటి?

వేముల పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య) అనే ముగ్గురు అమ్మాయిలు ఉద్యోగం చేసుకుంటూ తమ కాళ్ల మీద తాము నిలబడడమే కాకుండా కుటుంబ పోషణ భారాన్ని కూడా మోస్తుంటారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి ఉంటారు.

పల్లవి, జరీనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులైతే, దివ్య బ్యుటీషియన్.

ఒకరోజు రాత్రి వాళ్లు ముగ్గురూ ఒక పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా వాళ్లెక్కిన టాక్సీ బ్రేక్ డౌన్ అవుతుంది.

టాక్సీ డ్రైవర్ అనుమాన ప్రవర్తనతో భయపడి ఆ దారిలో వచ్చే పోయే కార్లను లిఫ్ట్ అడిగేందుకు ప్రయత్నిస్తారు.

ఒక కారు ఆగుతుంది. అందులో తమకు తెలిసిన ఫ్రెండే ఉండడంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ కారు ఎక్కుతారు.

కారులో ఉన్న ముగ్గురు అబ్బాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలను ఒక రిసార్ట్‌కు తీసుకెళ్లి బలవంతం చేయబోతారు. వాళ్లల్లో ఒకరిని గాజుసీసాతో తలపై కొట్టి ఆ అమ్మాయిలు పారిపోతారు.

తల పగిలిన అబ్బాయి ఎంపీ కొడుకు కావడంతో ఆ యువతులపై రివర్స్ కేసు పెట్టి వాళ్లను రచ్చకీడ్చాలని చూస్తాడు.

ప్రజల తరపున పోరాడే మానవ హక్కుల లాయర్ సత్యదేవ్ (పవన్ కల్యాణ్) ఆ ముగ్గురు ఆడపిల్లలకు అండగా నిలబడి కోర్టులో వాళ్ల కేసు వాదిస్తాడు.

ఆర్థిక బలం, రాజకీయ బలం దండిగా ఉన్న ఎంపీ కొడుకు తరుపున లాయర్ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్) కేసు టేకప్ చేస్తాడు.

నాలుగేళ్లపాటు సస్పెండ్ అయి కోర్టు మెట్లెక్కని సత్యదేవ్ ఈ కేసులో గెలుస్తాడా? ఆ అమ్మాయిలకు న్యాయం దక్కుతుందా? కేసు వాదోపవాదాలలో ముఖ్యాంశాలేంటి?.. ఇవి వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

vakeel saab movie

ఫొటో సోర్స్, Twitter/SVC_official

సినిమాలో మెరుపులు

ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు వేముల పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య).. ఒక హిందు, ఒక ముస్లిం, ఒక గిరిజన అమ్మాయి.

పల్లవి ఇంటి పేరు 'వేముల' అని పెట్టడం రోహిత్ వేముల‌ను గుర్తు చేస్తున్నట్లుగా ఉంది.

అలాగే ముస్లిం, గిరిజన యువతుల నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆలోచనాత్మకంగా ఉంది.

ఆడపిల్లలు ఇళ్లు కదిలి అడుగు బయటపెట్టి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించే గమనంలో వాళ్లకి ప్రధానంగా తోడ్పడ్డ రెండు రంగాలు - బ్యూటీ పార్లర్లు, కాల్ సెంటర్లు.

దిగువ మధ్య తరగతి ఆడపిల్లలకు ఈ రెండు రంగాలూ అనేక ఉపాధి అవకాశాలకు తలుపులు తెరిచాయి. తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే తోవ చూపించాయి.

ఈ ట్రెండ్‌ను పట్టుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం.

ప్రధాన పాత్రల్లో మూడో అమ్మాయి గిరిజన తండా యువతి దివ్య నాయక్ బ్యూటీ పార్లర్లో పని చేస్తూ తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది.

కథలో రిసార్ట్‌కు వెళ్లిన తరువాత ఈ అమ్మాయిలు ముగ్గురూ ఆ అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి డబ్బు తీసుకుని బిజినెస్ చేశారని వాదిస్తూ వాళ్లను దోషులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తాడు లాయర్ నంద గోపాల్.

ఆ సందర్భంగా జరిగే వాదోపవాదాల మధ్య జరీనా మాట్లాడుతూ "పల్లవి డబ్బు తీసుకుంది. కానీ తరువాత మనసు మార్చుకుంది. నో అని చెప్పింది. నో అన్న తరువాత కూడా అతను బలవంతం చేశాడు. పల్లవి తల మీద కొట్టింది. చట్టం ప్రకారం పల్లవి చేసింది తప్పా? ఆ అబ్బాయి చేసింది తప్పా?" అని అడుగుతుంది.

దానికి న్యాయమూర్తి ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతారు. అంటే అది తప్పు కాదని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇది చాలా ముఖ్యమైన అంశం. సెక్స్ వర్కర్లైనా కూడా నో అంటే నో అనే లెక్క. ఏ అమ్మాయైనా సరే వద్దు అంటే ఆమె ఒంటిపై చేయి వేసే హక్కు ఎవరికీ లేదు.

ఆడవాళ్లు ఎవరి సొత్తూ కాదు. ఈ సన్నివేశాన్ని ప్రభావవంతంగా చిత్రీకరించాడు దర్శకుడు. కానీ, ఈ అంశం గురించి మరింత నేరుగా చర్చించి ఉంటే ఇంకా బాగుండేది.

సత్యదేవ్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి తనకి ప్రపోజ్ చేస్తుంది. అందుకు అతను హుందాగా.. “నాకు వీటి మీద ఆసక్తి లేదు, టైం లేదు. థ్యాంక్ యూ” అని చెప్తాడు.

తరువాత ఆ అమ్మాయి మరెప్పుడూ అతని వెంట పడదు. కొన్ని సంవత్సరాల తరువాత అతనే, ఆమెను చూసేవరకూ ఆమె మళ్లీ అతని ఎదుట పడదు.

ఈ సన్నివేశాలు మనకు రెండు విషయాలు చెబుతాయి.. అమ్మాయి ప్రపోజ్ చెయ్యగానే ఆమెను వంకరబుద్ధితో చూడక్కర్లేదని, అబ్బాయిలు నో అన్నా నో అనే అర్థమని.

తాను కేసులో చిక్కుకున్నప్పుడు తనకు ఏమాత్రం అండగా నిలబడకుండా చివర్లో కేసు గెలిచిన తరువాత మళ్లీ తనతో స్నేహానికి ప్రయత్నించే మాజీ బాయ్‌ఫ్రెండ్ అన్వర్‌కు జరీనా మధ్య వేలు చూపించే సన్నివేశం తెలుగు సినిమాల వరకూ ఒక బోల్డ్ స్టేట్మెంట్.

మానవ హక్కుల లాయర్‌గా సత్యదేవ్ సింగరేణి కార్మికుల తరుపున పోరాడడం, బూటకపు ఎన్‌కౌంటర్లో చనిపోయిన నక్సల్స్‌వైపు నిలబడడం, గ్యాస్ లీకేజీలతో ప్రభావితం చెందిన ప్రాంతపు ప్రజల తరుపున వాదించడం, రోడ్ల విస్తరణ కింద ఆవాసాలు కోల్పోయినవారికి న్యాయం కల్పించడం.. ఇవన్నీ తెలుగు సమాజంలోని అనేక అంశాలను ప్రతిబింబించేలా ఉన్నాయి.

vakeel saab movie

ఫొటో సోర్స్, Twitter/SVC_official

లాయర్ సత్యదేవ్ పాత్రకు పవన కల్యాణ్ పూర్తి న్యాయం చేశాడనే చెప్పొచ్చు. అతి లేకుండా ఏ సన్నివేశానికి ఎంత కావాలో అంతే నటించాడు. చాలా సందర్భాల్లో హుందాగా పాత్రకు తగ్గట్టు నటించాడు.

సత్యదేవ్ పాత్రకు మొదటి సగంలో పెద్దగా డైలాగులు ఉండవు. కానీ, పవన్ కల్యాణ్ తన హావభావాలతో మెప్పించాడు.

రెండో సగంలో కోర్టులో వాదోపవాదాల సమయంలో ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ పోటాపోటీగా నటించారు.

నివేదా థామస్, అంజలి, అనన్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

మాటలు, సంగీతం

ఈ సినిమా మాటల రచయితల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా సాగతీత లేకుండా, సూటిగా సంభాషణలు రాసుకున్నారు వేణు శ్రీరాం, మామిడాల తిరుపతి.

ఇంట్రవల్ తరువాత దాదాపు 45 నిముషాల్లో అసలు కథను సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

డైలాగులు అర్థవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.

"ఆరోజు ఆ అమ్మాయి అలా కొట్టి పారిపోకుండా ఉండి ఉంటే దిశ, నిర్భయలాగ అయి ఉండేది. అప్పుడు కడివెడు కన్నీళ్లు కార్చడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. మరో వారం రోజుల్లో అంతా మర్చిపోతారు. కానీ, ఆ పరిస్థితే రాకుండా అమ్మాయిలు ఎదురించి పోరాడితే ఇలా కోర్టుకు ఈడ్చి రచ్చ చేస్తారు" అంటూ చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి.

చివర్లో కేసు ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ దగ్గరకు వెళ్లి.. " ఓడిపోవడం అవమానం కాదు. మనల్ని మనం గెలిచేందుకు మరో అవకాశం అంటాడు" సత్యదేవ్.

సమాజం పట్ల, సాటి మనుషుల పట్ల సత్యదేవ్‌కున్న సహానుభూతిని తెలియజేసే డైలాగ్ అది.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ మెప్పించాడు. శబ్దాలతో హోరెత్తించకుండా అవసరమైన చోట ఎలివేషన్ ఇస్తూ నేపథ్య సంగీతం వినసొంపుగా సాగింది. కోర్టు సీన్లలో, చివరిగా రిసార్ట్‌లో ఏం జరిగిందో చూపించే సన్నివేశాల్లో బీజీఎం కథకు తోడ్పడింది.

కత్తెర వాడాల్సిన సన్నివేశాలు

సత్యదేవ్ లాయర్ కావాలని ఎందుకు అనుకున్నాడో చెప్పే నేపథ్యం వరకూ ఓకేగానీ అతనికో లవ్ స్టోరీ, అది అర్థాంతరంగా ముగిసిపోవడం పంటి కింద రాళ్లల్లా తగిలాయి.

సినిమాకు అవి చేకూర్చే అదనపు బలం ఏమీ లేనప్పుడు వాటిని కత్తిరించాల్సింది. సత్యదేవ్ ఎందుకు తాగుబోతు అయ్యాడో చెప్పేందుకు ఇంత ఫ్లాష్‌బ్యాక్ అవసరం లేదు.

అలాగే, అనవసరమైన రెండు మూడు ఫైట్లు.. బోరు కొట్టించాయి. సినిమాలో ప్రధాన పాత్రకు కొండలు పిండి చేసేంత శరీర ధారుడ్యం ఎందుకు ఉండాలి? ఈ ఫాంటసీల నుంచి ఇలాంటి సినిమాలైనా బయటపడితే బాగుండేది.

కోర్టులో న్యాయవాదులు ఇద్దరూ మాటిమాటికీ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, జడ్జి సీరియస్‌గా ముఖం పెట్టుకుని అందరి మీదా విరుచుకు పడడం ఎబ్బెట్టుగా అనిపించాయి.

తన ఆస్తి మొత్తాన్ని పేదలకు ఇచ్చేసిన మనిషికి, ఆశ, భయం మధ్య ఊగిసలాడే జనం తన కోసం నిలబడతారని ఆశించని మనిషికి, ఎక్కువగా పేదవాళ్ల కేసులే వాదించే లాయర్‌కు పెళ్లయిన తరువాత అంత పెద్ద ఇల్లు కట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?

ఇలాంటి సూక్ష బేధాలను తెలుగు సినిమా ఇంకా ఎప్పుడు పట్టించుకుంటుందో, మరి!

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)