నగ్నంగా నటి: అవార్డు ఇవ్వడానికి వచ్చి వేదికపైనే దుస్తులు విప్పేసిన ఫ్రాన్స్ యాక్టర్

ఫొటో సోర్స్, EPA
ప్రభుత్వానికి తన గళం వినిపించడానికి ఫ్రాన్స్‌లో ఒక నటి అవార్డుల వేడుకలో తన దుస్తులు విప్పేశారు. కరోనా మహమ్మారి సమయంలో కళను, సంస్కృతిని కాపాడడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఒక సందేశం ఇచ్చారు.
57 ఏళ్ల కొరెన్ మాసిరో సీజర్ అవార్డుల కార్యక్రమం వేదికపై ఇలా చేశారు. ఫ్రాన్స్‌లో సీజర్ అవార్డులను ఆస్కార్‌కు సమానంగా భావిస్తారు.
మాసిరో అవార్డుల వేదికపైకి గాడిదను తలపించేలాంటి కాస్ట్యూమ్ కప్పుకొని వచ్చారు. దాని లోపల ఆమె రక్తంతో తడిచినట్లు ఉన్న ఒక డ్రెస్ వేసుకుని ఉన్నారు. తర్వాత ఆమె ఆ రెండింటినీ విప్పేసి నగ్నంగా నిలుచున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఫ్రాన్స్‌లో సినిమా హాళ్లు మూతపడి మూడు నెలలు దాటింది. ప్రభుత్వం వాటిని తెరవాలనే నిర్ణయం తీసుకోకపోవడంతో చాలామంది కళాకారులు అసంతృప్తితో ఉన్నారు.
సీజర్ అవార్డుల కార్యక్రమ నిర్వాహకులు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్ ఇవ్వడానికి మాసిరోను వేదికపైకి పిలిచారు.
కానీ, వేదికపైకి రాగానే, తన డ్రెస్ విప్పేసిన మాసిరో కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులందరినీ షాక్ ఇచ్చారు. ఆమె శరీరంపై కొన్ని సందేశాలు రాసి ఉండడం కూడా కనిపించింది. ముందువైపు పొత్తి కడుపుపై ఆమె "సంస్కృతి లేకుంటే, భవిష్యత్తు లేదు" అని రాసుకుని వచ్చారు.
వీపు మీద "మాకు మా కళను తిరిగివ్వండి, జాన్" అని రాసుకుని ఫ్రాన్స్ ప్రధానమంత్రి జాన్ కాస్టెక్స్‌కు ఆమె మరో సందేశం కూడా ఇచ్చారు.

ఫొటో సోర్స్, EPA
ఈ వేడుకలో మాసిరో నగ్నంగా మారడానికి ముందు, మరికొంతమంది కళాకారులు కూడా ప్రభుత్వానికి ఇలాంటి అప్పీలు చేశారు.
"నా పిల్లలు జారా స్టోర్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లచ్చు, కానీ వాళ్లు సినిమా చూడ్డానికి మాత్రం వెళ్లకూడదు. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు" అని సీజర్ అవార్డుల్లో బెస్ట్ స్క్రీన్‌ప్లే పురస్కారం గెలుచుకున్న స్టెఫనీ డెమాస్టియర్ అన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో వందలాది కళాకారులు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినీ విమర్శకులు సినీరంగానికి సంబంధించిన ఇంకా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పారిస్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు
మిగతా ప్రాంతాలపై ఎత్తివేసినట్లే, సినిమా హాళ్లు, కళా వేదికలపై కూడా నిషేధం ఎత్తివేయాలని, వాటిని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది సీజర్ అవార్డుల వేడుకలో ఫ్రెంచ్ నటుడు ఆల్బర్ట్ డుపాంటల్ నటించిన 'గుడ్‌బాయ్ మోరాన్స్' సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. డెన్‌మార్క్ సినిమా 'అనదర్ రౌండ్'కు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ అవార్డ్ లభించింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: 'చీకటి పడిన తరువాత ఇక్కడికి రావాలంటే మగవాళ్లమే భయపడతాం.. అలాంటిది ఆమె ఇక్కడ ఉంటోంది'
- సంచయిత గజపతిరాజు ఇంటర్వ్యూ: 'గుడికి వెళ్తే చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని వెళ్తా.. సినిమాకి వెళ్తే ప్యాంట్, షర్ట్ వేసుకుంటా'
- తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు
- కుక్కను తోడేలుగా చూపేందుకు ప్రయత్నించిన జూ... వీడియో వైరల్
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- ఇంటి పని ఆడవాళ్లే చేయాలా.. వేతనం లేని ఈ పని మానేస్తే ఏం జరుగుతుంది
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








