అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఇంటి పని ఆడవాళ్లే చేయాలా.. వేతనం లేని ఈ పని మానేస్తే ఏం జరుగుతుంది

మహిళలు, శ్రమ విలువ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటి పనికి విలువపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది
    • రచయిత, అనంత్‌ ప్రకాశ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఇటీవల ఓ విడాకుల కేసుకు సంబంధించిన చైనాలోని ఓ కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఐదేళ్లపాటు కొనసాగిన వివాహ బంధంలో భార్య చేసిన శ్రమకు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

ఈ కేసులో విడాకులు పొందిన మహిళకు రూ.5.65లక్షలు(భారతీయ కరెన్సీ విలువ ప్రకారం) పరిహారం రూపంలో అందింది.

ఈ తీర్పు చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది. కోర్టు తీర్పుపై సోషల్‌ మీడియాలో యూజర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఇంట్లో పని చేసినందుకు మహిళలు పరిహారం అడగడం సరికాదని కొందరు వాదించగా, ఉద్యోగానికి వెళ్లగలిగినా, ఇంటి దగ్గరే ఉండి పని చేసినందుకు పరిహారం దక్కడం సబబేనని మరికొందరు వాదించారు.

ఈ ఏడాది జనవరిలో భారత సుప్రీంకోర్టు కూడా ''మహిళల ఇంటి పని కుటుంబంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తోంది'' అని వ్యాఖ్యానించింది.

'ఇంటిపని'ని ఆర్థిక వ్యవహారంగా చూస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. భారత్‌, చైనాలతోపాటు పాశ్చాత్య దేశాలలో కూడా అనేక కోర్టులు మహిళల శ్రమను 'అన్‌పెయిడ్ లేబర్'గా పేర్కొన్నాయి.

'ఇంటి పని' జీడీపీలో ప్రతిఫలించదు. పైగా సమాజం కూడా వ్యాపారానికి, ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాధాన్యం ఇంటి పనికి ఇవ్వదు. మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలు 'ఇంటి పని' వదిలేసి ఉద్యోగమో, వ్యాపారమో మొదలుపెడితే ఏం జరుగుతుంది ?

శ్రమ విలువ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్త్రీల శ్రమ దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా సహకరిస్తుంది

'ఇంటి పని' అంటే ఏంటి?

గృహిణులు ఇంట్లో చేసే పనికి పురుషుల బయట చేసే పనికి ఇచ్చినంత గౌరవం ఎందుకివ్వరని మహిళలు నిలదీస్తున్నారు. పైగా మహిళల ఇంటి పనిగంటలు పురుషుల ఆఫీసు లేదా వ్యాపారపు పని గంటలకంటే ఎక్కువ.

కొన్నేళ్లుగా ఇంటి పనిని, జర్నలిజం వృత్తిని నిర్వహిస్తున్న కృతికా కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

''ఇంటి పనికి ఎందుకు విలువనివ్వరో అర్ధంకాదు. అసలు అది పనేకాదని కొందరు అంటుంటారు. కానీ వాటిని చేయడం అంత సులభం కాదు. అన్నం వండటం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, పెద్దవాళ్లకు వేళకు మందులివ్వడం ఇలా ఎక్కడా విశ్రాంతే ఉండదు'' అన్నారు కృతిక.

''సాయంత్రం ఎవరికైనా ఆకలైతే వెంటనే వండి పెట్టాలి. అసలు మహిళల దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది అనుకుంటారు. అడిగితే తప్ప ఇంట్లో వాళ్లు కాస్త సాయం కూడా చేయరు. తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడరు'' అన్నారు కృతిక.

మహిళలు, పనిగంటలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైమ్ యూజ్'సర్వే ప్రకారం మహిళలు ప్రతి రోజూ 299 నిమిషాలు వేతనం లేని ఇంటి పని చేస్తారు.

పని గంటల్లో అసమానత

పని గంటల విషయంలో మహిళలదే అగ్రస్థానం. 'టైమ్ యూజ్' తాజా సర్వే ప్రకారం ఇంట్లో మహిళలు ప్రతి రోజూ 299 నిమిషాలు వేతనం లేని ఇంటి పని చేస్తారు. అదే పురుషులు రోజుకు 97 నిమిషాలు మాత్రమే ఇంటి పనిలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యుల బాగోగుల కోసం మహిళలు 134 నిమిషాలు కేటాయిస్తుండగా, పురుషులు కేవలం 76 నిమిషాలు మాత్రమే ఇందులో గడుపుతున్నారు.

'విలువ' కట్టడం కష్టమేనా ?

ప్రతి పనికి విలువ ఉంటుంది. మరి ఇంట్లో చేసే పనికి మాత్రం ఎందుకు ఉండకూడదు ? పని విలువను గణించే ముందు ఆ పనిని సరిగ్గా మదింపు చేయాల్సి ఉంటుంది. మహిళ ఇంటి పని విలువను అంచనా వేసేందుకు మూడు పద్ధతులు ఉన్నాయి.

1)ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్

2)రీప్లేస్‌మెంట్ కాస్ట్‌ మెథడ్

3)ఇన్‌పుట్‌/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్

మొదటి ఫార్ములా ప్రకారం బయటకు వెళ్లి రూ.50వేలు సంపాదించగలిగే మహిళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆ పని విలువను రూ.50 వేలుగా పరిగణించాలి.

రెండో ఫార్ములా ప్రకారం ఇంటి కోసం చేసే పనిని సర్వీసుగా పరిగణించి, ఆ సర్వీసు చేసే వారు ఆ పనికి ఎంత విలువను తీసుకుంటారో అంత వేతనం ఇవ్వాలి.

మూడో ఫార్ములా ప్రకారం ఒక మహిళ ఇంట్లో చేసే పనికి మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి వేతనం ఇవ్వాలి.

అయితే ఈ ఫార్ములాలు ఏవీ మానసికంగా చేసే సర్వీసుకు విలువ కట్టలేవు.

భారత సుప్రీంకోర్టు, ఇంటి పని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు ఇంటి పనులు శ్రమతో కూడుకున్నవి

ఆర్థిక వ్యవస్థలో మహిళల వాటా

భారతీయ మహిళలు చేసే ఇంటి పని దేశపు ఆర్థిక వ్యవస్థలో 3.1శాతం ఉంటుందని 'ఆక్స్‌ఫామ్' సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది.

2019 సంవత్సరంలో మహిళలు చేసిన ఇంటి పని విలువ 10 ట్రిలియన్ అంటే పది లక్షల కోట్ల అమెరికన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా వేసింది.

దీని విలువ ఫార్చ్యూన్ గ్లోబల్-500 జాబితాలోని అతి పెద్ద కంపెనీలు వాల్‌మార్ట్, ఆపిల్,అమెజాన్‌ల ఆదాయంకంటే ఇది ఎక్కువ.

ఇంత విలువ ఉందని తెలిశాక కూడా మహిళల పనికి ఉన్న ఆర్ధిక విలువను గుర్తించడానికి కోర్టులు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఇటీవల సుప్రీంకోర్టు కూడా మహిళల శ్రమకు ఆదాయన్ని నిర్ణయించడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. ''మహిళలు చేసే పని కేవలం కుటుంబానికే కాక దేశ ఆర్ధిక వ్యవస్థకు సహకరిస్తుంది. దీన్ని అందరూ అంగీకరించాలి. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా వారి సంప్రదాయకంగా ఆర్ధిక విశ్లేషణల నుంచి మినహాయిస్తున్నారు. ఇలాంటి ఆలోచనా దృక్పథాన్ని మార్చుకుని మహిళల పనికి చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం ద్వారా సామాజిక సమానత్వాన్ని సాధించే ప్రయత్నం చేయాల్సి ఉంది'' అని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది.

మహిళల పని, జీడీపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళల ఇంటి పని కుటుంబంతోపాటు దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మహిళలు చేసే పని ఏమిటి?

మహిళల శ్రమ విలువను మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రత్యక్షంగా సహకరించిన సీనియర్ సిటిజన్లకు అందించే సేవకు సంబంధించింది. రెండోది ప్రస్తుతం జీడీపీకి సహకరిస్తున్న యువతకు చేసే సర్వీసు. మూడోది, రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్థకు చేయూతనివ్వబోయే చిన్నారులకు చేసే సర్వీసుకు సంబంధించింది. వీటిని నైరూప్య శ్రమ (Abstract labour ) అని కూడా పిలుస్తారు. అంటే దేశఆర్ధిక వ్యవస్థలో నిమగ్నమై ఉన్నవారికి సేవలు అందించి తద్వారా వారు యాక్టివ్‌గా ఉండేందుకు ఉపయోగపడే శ్రమ ఇది.

అంటే ఒక మహిళ తన భర్త ఆఫీసుకు లేదా వ్యాపార కార్యక్రమాలకు వెళ్లడానిక అవసరమైన అన్నిరకాల ఇంటి పనులు అంటే ఆహార పానియాలు, లాండ్రీలాంటి సర్వీసులన్నీ చేస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్య బాధ్యతలన్నీ చూసుకుంటుంది. అలాగే పిల్లలకు ఎదగడానికి అవసరమైన అన్ని పనులు చేయడం ద్వారా వారు భవిష్యత్తులో దేశ ఆర్ధిక వ్యవస్థలో భాగస్వాములయ్యేలా సిద్ధం చేస్తుంది. గతంలో దేశ ఆర్ధికవ్యవస్థలో భాగస్వాములైన అత్త మామల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలను కూడా ఆమే చూసుకుంటుంది.

ఈ పనులన్నింటి నుంచి గృహిణి తప్పుకుంటే, ఆయా సర్వీసులకు కుటుంబ యజమాని విలువ చెల్లించాల్సి ఉంటుంది.

పురుషాధిక్య సమాజం, మహిళలు

ఫొటో సోర్స్, MARJI LANG/LIGHTROCKET VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పురుషాధిక్య సమాజం మహిళలను ఇంటి పనికి పరిమితం చేసింది

మహిళలు పని చేయడం మానేస్తే?

''వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది'' అని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అర్చన ప్రసాద్ అన్నారు. ఆమె అసంఘటిత రంగం, కార్మికులకు సంబంధించిన వ్యవహారాలపై అధ్యయనం చేశారు.

"మహిళలు శ్రమశక్తికి పునరుత్తేజం కలిగిస్తున్నారు. ప్రతి పురుషుడి శ్రమలో స్త్రీల వేతనం లేని శ్రమ ఉంటుంది.'' అన్నారామె.

మహిళలు చేసే శ్రమను జీడీపీలో భాగంగా గుర్తించాలని న్యూజీలాండ్‌కు చెందిన ఆర్ధికవేత్త మార్లిన్ వేరింగ్ అన్నారు. గర్భాన్ని కూడా మహిళ ఉత్పాదక చర్యగా పరిగణించాలని, భవిష్యత్ మానవ వనరులకు ఆమె జన్మనిస్తుందని ఆమె అన్నారు. ''మా దేశంలో ఆవు, మేక, గొర్రె, గేదె పాలను కూడా ఆర్ధిక వ్యవస్థలో భాగంగా చూస్తారు. కానీ తల్లి పాలను చూడరు. వాస్తవానికి అది ప్రపంచంలో అత్యుత్తమ ఆహార వస్తువు. పిల్లల ఆరోగ్యానికి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. కానీ దానిని పట్టించుకోరు'' అన్నారామె.

మహిళల పనికి వేతనం

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, మహిళలు ఒకరోజు ఇంటి పని మానేస్తే వ్యవస్థ స్తంభించిపోతుందని సామాజికవేత్తలు అంటున్నారు.

ఆర్థిక గుర్తింపు ఎలా ఇవ్వాలి?

మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక గుర్తింపు ఎలా ఇవ్వాలనే ప్రశ్న తలెత్తుతుంది. ''మహిళలు చేసే పనిని ఉత్పత్తిగా చూడాలి'' అన్నారు అహ్మదాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్‌లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ ఇందిరా హిర్వే.

''ఇంట్లో మహిళలు వంట, బట్టలు ఉతకడం, మార్కెట్ నుంచి సరుకులు తీసుకురావడం, పిల్లలను చూసుకోవడం, ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారిని చూడటంలాంటివన్నీ ఉత్పత్తితో నేరుగా సంబంధం ఉన్న పనులు. ఈ పనుల ద్వారా ఆమె దేశ ఆరోగ్యానికి, ఆదాయానికి సహకరిస్తున్నారు'' అన్నారు ఇందిరా హిర్వే.

'' ఒక నర్సు సర్వీసు జాతీయ ఆదాయంలో పరిగణిస్తారు. కానీ ఒక గృహిణి అదే పని చేస్తే దానికి గుర్తింపు ఉండదు. ఇది సరికాదు'' అన్నారామె. చరిత్రను మార్చాల్సిన క్షణం వచ్చిందని ఇందిర అంటున్నారు.

1975లో ఐస్‌లాండ్‌లో 90%శాతంమంది మహిళలు అక్టోబర్ 24న ఒక రోజంతా ఇంటి పనులు చేయవద్దని నిర్ణయించారు. దీంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లిన పురుషులంతా ఇంటికి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. అలాగే ఇంట్లోని పిల్లలు రెస్టారెంట్లకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత సమయంలో కూడా మహిళలు ఈ రకమైన చెల్లించని శ్రమ చేయడం మానేస్తే 1975 నాటి పరిస్థితులే పునరావృతమవుతాయని హిర్వే అన్నారు.

దేశ ఆర్ధిక వ్యవస్థలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళల ఇంటి పనులకు తగిన విలువ ఇవ్వాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి

'కుటుంబం అంతమవుతుంది.'

మహిళలు ఇంట్లో పనిచేయడం మానేస్తే కుటుంబం అనే వ్యవస్థ అంతమైపోతుందని ప్రొఫెసర్‌ హిర్వే అభిప్రాయ పడ్డారు.''అభివృద్ధి అంటే అందరూ తమకు నచ్చిన పని చేయడం. స్త్రీలు డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్, ఇంజినీర్ కావాలనుకుంటే ఇంజినీర్ కావచ్చు. కానీ పురుషాధిక్య సమాజం మహిళలను ఇంటికే పరిమితం చేసింది. వారి కాళ్లకు సంకెళ్లు వేసింది. ఇంటి పని తర్వాతే మరేదైనా పని చేయాలని వారిపై ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ఇంటి పని మానేస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. వేతనం లేని స్త్రీ శ్రమ లేకుండా దేశ ఆర్ధిక వ్యవస్థ నడవదని గుర్తు పెట్టుకోవాలి.'' అన్నారు హిర్వే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)