కుక్కను తోడేలుగా చూపేందుకు ప్రయత్నించిన జూ... వీడియో వైరల్

జూలో తోడేలు బోనులో కుక్క

ఫొటో సోర్స్, BEIJING NEWS

    • రచయిత, కెర్రీ అలెన్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

సెంట్రల్ చైనాలోని ఒక జూలో.. తోడేలు పేరుతో కుక్కను ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు.

హుబే ప్రావిన్స్‌లోని షియానింగ్‌లో గల షియాంగ్వుషాన్ జూలో ఒక సందర్శకుడు తోడేలు ఎన్‌క్లోజర్‌ను సందర్శిస్తున్నట్లుగా చెప్తున్న వీడియో ఫుటేజి మంగళవారం నాడు సోషల్ మీడియాలో కనిపించింది.

ఆ ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువును ఆయన వీడియో తీశారు. ఆ జంతువు రాట్‌వీలర్ జాతికి చెందిన శునకంగా కనిపిస్తోంది. ‘‘ఓ తోడేలూ... నువ్వు నిజంగా తోడేలువేనా?’’ అని ఆ సందర్శకుడు ఆ జంతువును అడగటం ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో వెంటనే వైరల్‌గా మారింది. ఈ వీడియో కేంద్రంగా ఆన్‌లైన్‌లో అనేక జోకులు పేలాయి. అంతేకాదు.. కోవిడ్ అనంతర కాలంలో జంతుప్రదర్శనశాలలు అవసరమా అనే చర్చనూ రాజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జూల నిర్వహణ విషయమై చాలా మంది ఆందోళన వ్యక్తంచేశారు.

బోనులో కుక్క

ఫొటో సోర్స్, BEIJING NEWS

‘తోడేలు చనిపోయింది’

తోడేలు బోనులో కుక్క ఎందుకు ఉందని జూ పార్కు సిబ్బందిని తాను అడిగానని ఈ వీడియో చిత్రీకరించిన షు అనే వ్యక్తి బీజింగ్ న్యూస్‌కు చెప్పారు. ఆ బోనులో తోడేలు ఉండేదని, కానీ అది వయసుమళ్లి చనిపోయిందని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు.

జూ సిబ్బందిలో ఒకరు స్థానిక మీడియాకు ఈ విషయాన్ని నిర్ధారించారు. పార్కులో కాపలా కుక్కగా పెంచుతున్న శునకాన్ని తాత్కాలికంగా ఆ బోనులో ఉంచినట్లు సదరు ఉద్యోగి చెప్పారు.

అంతేకాదు.. జూను సక్రమంగా నడిపేందుకు అవసరమైనన్ని వనరులు అందేంత స్థాయిలో సందర్శకులు రావటం లేదని చెప్పటం ద్వారా.. జూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని కూడా ఆయన పరోక్షంగా సూచించారని.. shine.cn న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

ఈ జూ పార్కు సందర్శకులు ఒక్కొక్కరి నుంచి 15 యువాన్లు (సుమారు 200 రూపాయలు) చార్జీ వసూలు చేస్తుంది. ఇందులో పులులు, సింహాలు కూడా ఉంటాయి. తోడేలు బోనులో ఉన్నకుక్క వీడియో వైరల్ కావటంతో.. ఆ బోను వద్దకు దారి చూపించే చిహ్నాలను తొలగించాలని స్థానిక అటవీ శాఖ ఈ జూ అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

హుబే ప్రావిన్స్‌, షియానింగ్‌లోని షియాంగ్వుషాన్ జూ

ఫొటో సోర్స్, VCG/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హుబే ప్రావిన్స్‌, షియానింగ్‌లోని షియాంగ్వుషాన్ జూ

‘కనీసం ఒక హస్కీని పెట్టొచ్చు కదా’

ఈ సంఘటన ఆన్‌లైన్‌లో చాలా చర్చకు దారితీసింది. ప్రజాదరణ గల సినా వీబో మైక్రోబ్లాగ్‌లో చాలా మంది యూజర్లు.. ఈ వీడియో చూసి పగలబడి నవ్వినట్లు చెప్పారు. కొంతమంది తాము షాక్ తిన్నామని, కొంత విచారం కలిగిందని చెప్పారు.

‘కనీసం ఒక హస్కీని పెట్టండి’’ అంటూ ఒక యూజర్ సలహా ఇచ్చారు. హస్కీ జాతి కుక్క తోడేలు లాగా కనిపిస్తుంది. ఈ పోస్టుకు 6,000కు పైగా లైకులు లభించాయి.

అయితే.. ఆ బోనులో ఉణ్న తోడేలుకు ఆహారంగా ఆ కుక్కను అందులో పెట్టలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నామని చాలా మంది యూజర్లు స్పందించారు.

ఇంకొందరు కొన్ని జూలలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

ఇంతకుముందు కూడా అడవి జంతువుల స్థానంలో వేరే జంతువులను ఉంచి ఎదురు దెబ్బలు తిన్న ఉదంతాలు చాలా ప్రచురితమయ్యాయి.

2019లో వూహాన్ నగరానికి సమీపంలోని జీఫఎంగ్షాన్ ఫారెస్ట్ పార్కులో.. తోడేలు బోనులో పెంపుడు కుక్కను ఉంచిన వీడియో బయటకు వచ్చింది.

2017లో గ్వావంగ్జీలోని ఒక జూ తమ పార్కులో పెంగ్విన్లు ఉన్నాయని ప్రచారం చేసింది. తీరా సందర్శకులు వచ్చి చూస్తే అక్కడ గాలి ఊదిన బొమ్మ పెంగ్విన్లు కనిపించాయి.

ఇక 2013లో హెనాన్‌లోని ఒక జూలో ఆఫ్రికా పిల్లి పేరుతో టిబెటన్ మాస్టిఫ్ కుక్కను ప్రదర్శించారు.

పలు దేశాల్లోని జూల్లో గాడిదలకు రంగులు వేసి జీబ్రాలుగా చూపే ప్రయత్నాలూ చేసిన ఉదంతాలూ ఉన్నాయి.

జూలో ఒక పులి ఒత్తిడికి గురైందని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేశాయి

ఫొటో సోర్స్, BEIJING NEWS

ఫొటో క్యాప్షన్, జూలో ఒక పులి ఒత్తిడికి గురైనట్లు బీజింగ్ మీడియా కథనాలు ప్రసారం చేశాయి

‘మనుగడ కోసం తంటాలు’

ఈ వీడియో చాలా మందికి నవ్వు తెప్పించినప్పటికీ.. ఇటువంటి జూల నిర్వహణను కొనసాగించటం పట్ల కొందరు ఆందోళన వ్యక్తంచేశారు.

స్థానిక పర్యాటక రంగానికి జూలు ఉపయోగపడతాయని.. కానీ మహమ్మారి నేపథ్యంలో చాలా జూలు, ముఖ్యంగా చిన్న స్థాయి జూలు మనుగడ కోసం ఇబ్బందులు పడుతున్నాయని గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక ఒక కథనంలో పేర్కొంది. దీనివల్ల జంతువులను నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుందని చాలా మంది ఆందోళన తెలిపారు.

నాన్జింగ్ నగరంలోని ఒక ప్రఖ్యాత జూ గత జనవరిలో తమకు విరాళాలు అందించాలని ప్రజలను కోరింది. కోవిడ్ మహమ్మారి వల్ల తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించింది.

చైనాలో కోవిడ్ విజృంభణ హూబే ప్రావిన్స్‌లో అతి తీవ్రంగా ఉండటం వల్ల షియానింగ్ స్థానిక ఆర్థిక పరిస్థితి గత ఏడాది గణనీయంగా దెబ్బతిన్నది. ఈ నగరం.. కోవిడ్ మహహ్మారి కేంద్రకంగా ఉన్న వూహాన్‌కు ఎంతో దూరంలో లేదు. 2020లో జనవరి నుంచి మార్చి మధ్య కఠినమైన లాక్‌డౌన్ విధించిన ప్రాంతాల్లో ఈ నగరం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)