ఉత్తర కొరియా గూఢచర్య కార్యక్రమాల కోసం జపాన్ బీచ్‌లో అమ్మాయిల కిడ్నాప్

ఫొటో సోర్స్, BBC/AFP/Getty Images
నవంబరు నెలలో సూర్యాస్తమయం తర్వాత 13 సంవత్సరాల మెగుమి యోకోట బ్యాడ్మింటన్ సాధన ముగించుకున్నారు. నీగట మత్స్య రేవును చల్లటి గాలులు కమ్ముకుంటున్నాయి. సముద్రపు అలల హోరు తీరానికి వినిపిస్తోంది.
అక్కడ నుంచి సరిగ్గా 7 నిమిషాలు నడిస్తే యోకోట ఇంటిని చేరుకోవచ్చు. చేతిలో ఉన్న పుస్తకాల సంచి, బ్యాడ్మింటన్ ర్యాకెట్ పట్టుకుని ఆమె స్నేహితులకు బాయ్ చెప్పి అక్కడి నుంచి బయల్దేరింది. కానీ, అక్కడికి 800 అడుగుల దూరంలో ఉన్న ఇంటికి మాత్రం ఆమె చేరుకోలేకపోయింది.
రాత్రి ఏడు గంటలైనా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లి సాకి యోకోటకు భయం మొదలైంది. దారిలో తన కూతురు కనిపిస్తుందేమోననే ఆశతో స్కూలు జిమ్ దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వెళ్లారు.
"పిల్లలంతా ఎప్పుడో వెళ్లిపోయారు" అని స్కూలు దగ్గర ఉన్న వాచ్ మ్యాన్ చెప్పారు.
ఆ చీకటిని చీల్చుకుంటూ పోలీసులు, ట్రాకర్ కుక్కలు, టార్చులు ఆ అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టాయి. దగ్గరలో ఉన్న పైన్ చెట్ల అడవిలో మెగుమి పేరు పిలుస్తూ వెతికారు. సాకి దారిలో కనిపిస్తున్న ప్రతి కారులోనూ తన బిడ్డ కోసం వెతుకుతూ సముద్రపు ఒడ్డుకు వెళ్లారు.
ఆమెకెందుకో సముద్రపు ఒడ్డున వెతకాలని అనిపించింది.
మరో వైపు, సాకికి కనిపించనంత దూరంలో ఉత్తర కొరియా ఏజెంట్లు కాపలా కాస్తున్న ఒక ఓడ కొరియా ద్వీపం వైపు ప్రయాణిస్తోంది. అదే బోటులో భయంతో వణికిపోతున్న ఒక స్కూలు అమ్మాయి ఉంది. వాళ్ళు ఒక్క ఆధారాన్ని కూడా విడిచి పెట్టలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా ఏజెంట్లకు చిక్కింది ఆ అమ్మాయి ఒక్కరే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు.
1977, 1983 మధ్య కాలంలో ఉత్తర కొరియా 17 మంది జపాన్ పౌరులను అపహరించిందని జపాన్ ప్రభుత్వం తెలిపింది. కొంత మంది విశ్లేషకులు మాత్రం ఆ సంఖ్య 100కి పైనే ఉంటుందని అంటున్నారు.
మెగుమి ఆచూకీ కోసం పోలీసులు దాదాపు 3,000 రోజులు వెతికినా జాడ దొరకలేదు.
యోకోట ఇంటిని ఒక కిడ్నాపింగ్ బృందం కూడా సందర్శించింది. పెట్రోల్ బోట్లు సముద్రం దగ్గర కాపలా కాశాయి.
ఈ పరిశోధనలో బాధను మిగిల్చిన శూన్యమే మిగిలింది.
1993లో దక్షిణ కొరియాకు అపహరణకు గురయి వచ్చిన ఉత్తర కొరియా గూఢచారి ఒకరు అపహరణకు గురైన ఒక జపాన్ మహిళ గురించి వివరంగా చెప్పారు. "నాకు ఆమె బాగా గుర్తున్నారు" అని ఆహ్న్ మయోన్గ్ జిన్ చెప్పారు. "నేను యువకుడిని. ఆమె అందంగా ఉండేవారు" అని చెప్పారు.
ఆమెను అపహరణకు గురి చేసిన ఒక స్పై మాస్టర్ ఆమె కథను 1988లో అతనికి వివరించినట్లు చెప్పారు.
ఈ అపహరణ ఒక అనుకోని తప్పిదం అని ఆయన చెప్పారు. ఆ అమ్మాయిని తీసుకురావాలని ఎవరూ అనుకోలేదు. ఒక గూఢచర్య మిషన్ పూర్తి చేసుకుని ఇద్దరు ఏజెంట్లు సముద్రపు ఒడ్డున తమను తీసుకుని వెళ్లేందుకు బోటు కోసం వేచి చూస్తుండగా వాళ్ళని ఎవరో చూసినట్లనిపించింది. వాళ్ళని కనిపెడతారనే భయంతో ఎదురుగా కనిపించిన వ్యక్తిని పట్టుకున్నారు. మెగుమి వయసుకి మించిన పొడవు ఉండేవారు. ఆ చీకట్లో ఆమె ఒక చిన్నారి అనే విషయాన్ని గుర్తించలేకపోయారు.

ఆమె 40 గంటల పాటు కటిక చీకటి గదిలో బందీ అయిన తర్వాత ఆమె ఉత్తర కొరియా చేరుకున్నారు.
ఆమె చేతి వేళ్ళు విరిగిపోయి ఉన్నాయి. ఏజెంట్లు చేసిన పనికి అధికారులతో చీవాట్లు పడ్డాయి. ఆమె చాలా చిన్న వయసులో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయితో వాళ్ళేమి చేస్తారు?
మెగుమి వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ, తినడానికి ఒప్పుకోలేదు. కొరియా భాష నేర్చుకుంటే ఇంటికి తిరిగి పంపిస్తామని వాళ్ళు ఆమెకు మాటిచ్చారు.
కానీ, దుఃఖంలో మునిగి తేలుతున్న ఆ చిన్నారికి అది అబద్ధమని తెలియదు. ఆ చిన్నారిని వెనక్కి పంపే ఉద్దేశ్యం వారికి లేదు.
నార్త్ కొరియా గూఢచారులకు జపాన్ భాష, ప్రవర్తనలో ఒక ఉన్నత వర్గానికి చెందిన గూడఛర్య శిక్షణా సంస్థలో శిక్షణ ఇచ్చేందుకు మెగుమిని వాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

దేశానికి భావి నాయకుడు కానున్న కిమ్ జోంగ్ ఇల్ ఆ సమయంలో ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అధినేతగా ఉన్నారు. ఆయన గూఢచర్య కార్యక్రమాన్ని విస్తరించాలని అనుకున్నారు.
ఇలా అపహరణకు గురి చేసిన విదేశీయులను కేవలం టీచర్లగా వాడుకోవడానికి మాత్రమే ఉంచలేదు. వాళ్ళని కూడా గూఢచారులుగా నియమించారు. లేదా వాళ్ళ వ్యక్తిగత వివరాలను దొంగలించి నకిలీ పాస్ పోర్టులు తయారు చేయడానికి వాడేవారు. వాళ్ళు విదేశీయులెవరినైనా వివాహం చేసుకోవచ్చు. వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా ఆ పాలకులకు సేవలందించవచ్చు.
జపాన్ సముద్ర తీరమంతా సాధారణ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. అపహరణకు గురవ్వడానికి వీలుగా, బాగా శిక్షణ పొందిన ఏజెంట్ల చేతి నుంచి తప్పించుకోలేని విధంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి.

"నాకు మా అక్క గురించి పెద్దగా జ్ఞాపకం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, నాకు తను చాలా బాగా గుర్తుంది. నేనప్పటికి 3 లేదా 4వ తరగతి చదువుతున్నాను.
మెగుమి సోదరులు టకుయ యోకోట , టెట్సుయాకి అప్పటికి 9 సంవత్సరాలు. మెగుమి కోసం వెతుకుతున్న పోలీసులు వాళ్లకి మార్షల్ ఆర్ట్స్ వీడియోలు చూపించి, "ఎవరితోనూ దెబ్బలు, తినకండి. దృఢంగా ఉండండి" అని చెప్పేవారు.
43 సంవత్సరాల పాటు వారు ప్రతి రోజు ఆ సలహాను పాటించాలనే ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆయనకు 52 సంవత్సరాలు. ఆయన సోదరి అపహరణకు గురి కాక ముందు ఆయనకు పంపిన ఒక పోస్టు కార్డు ఆయన చేతిలో ఉంది. ఆ పోస్టు కార్డు చివర ఆమె "నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను, నా కోసం ఎదురు చూడండి" అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
"ఆమె చాలా కబుర్లు చెబుతూ, చలాకీగా, ఉత్సాహంగా ఉండేవారు. ఆమె మా ఇంట్లో పొద్దు తిరుగుడు పువ్వు లాంటిది" అని అన్నారు.
ఆమె డైనింగ్ టేబుల్ మీద లేకపోతే మా మధ్య సంభాషణలే ఉండవు. వాతావరణం అంధకారంగా మారిపోతుంది".
"నాకు చాలా బెంగగా అనిపించింది. కానీ, నేను నిద్రపోయి లేచేసరికి ఆమె కనపడటం లేదని అర్ధమయింది.
మెగుమి కనిపించకుండా పోయిన రెండు దశాబ్దాల వరకు, ఏమి జరిగి ఉంటుందనే ఒక ప్రశ్న, ఒక పరిష్కారానికి గురి కాని కేసు మాత్రమే యోకోట కుటుంబం చేతుల్లో మిగిలుంది.
ఆమె వయసులో ఎలా పెరుగుతుందో ఊహించుకునే ప్రయత్నం చేసేవారు. ఆమె ఇంకా పొడవుగానే ఉందా? ఆమె చిన్నప్పటిలానే బుగ్గలు ఇంకా సొట్టలు పడుతున్నాయా? ప్రతి ప్రశ్న వెనక ఒక తెలియని నిశ్శబ్దం వెంటాడేది. ఆమె బ్రతికుందో లేదో వారికి తెలియదు.

1970 లలో సముద్ర తీర పట్టణాలలో సముద్రపు కాకుల్లా వదంతులు వ్యాపించేవి. వింతైన రేడియో సిగ్నల్ గురించి గుర్తు తెలియని షిప్పుల నుంచి లైట్లు కనిపించేవని, లేదా తీరంలో కొరియా సిగరెట్ ప్యాకెట్లు కనిపించాయని స్థానికులు చెప్పుకుంటూ ఉండేవారు.
ఆగష్టు 1978లో టొయోమో సముద్ర తీరంలో గడిపేందుకు వెళ్లిన ఒక జంటను నలుగురు ఆగంతకులు వారి ముఖాలను కప్పి, చేతులను కట్టేసి, బంధించారు.
అయితే, అటు వైపు ఒక కుక్కను పట్టుకుని నడుస్తున్న వ్యక్తి వీరిని చూసి అరిచి దాడి చేయడంతో వారు వాళ్ళను వదిలేశారు.
కానీ, అందరికీ ఇలా జరగడం అరుదు.

1980 జనవరి7 న జపాన్ సాంకే శింబున్ వార్తా పత్రిక ఒక ఫ్రంట్ పేజీ కధనాన్ని ప్రచురించింది. " తీరంలో గడపడానికి వెళ్లిన మూడు జంటలు విచిత్రంగా ఫుకుయ్, నిగాట , కగోషిమా తీరం నుంచి మాయమయ్యారు.
ఇందులో విదేశీ ఇంటెలిజెన్స్ పాత్ర ఏమైనా ఉందా?
కానీ, ఈ ఘటనకు ఉత్తర కొరియాకు సంబంధం ఉందని ఒక శిక్ష పడిన తీవ్రవాది వలన తెలిసింది.
కిమ్ హ్యూన్ హుయ్ అనే వ్యక్తి దక్షిణ కొరియాకు చెందిన విమానంలో బాంబును పెట్టేందుకు సహకరించడంతో 115 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. సియోల్ లో మరణ శిక్ష పడిన తర్వాత దాని వైపు చూస్తూ ఆమె ఉత్తర కొరియా దేశపు ఆదేశాలు అమలు చేస్తున్న ఏజెంట్ అని అంగీకరించారు. ఆమె రహస్యంగా పని చేసేందుకు జపాన్ భాషను, ప్రవర్తనను నేర్చుకున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఆమె టీచర్ కూడా అపహరణకు గురయిన ఒక జపాన్ మహిళ అని ఆమెతో కలిసి రెండేళ్ల పాటు ఉన్నానని చెప్పారు.
కిమ్ హ్యూన్ హుయ్ కి 1989లో మరణ శిక్ష పడింది.
ఆమె ఇచ్చిన ఆధారాలు చాలా ప్రేరేపించే విధంగా ఉన్నాయి. అయితే, జపాన్ నుంచి మనుషులను అపహరిస్తుందనే విషయం గురించి ఉత్తర కొరియా అధికారికంగా అంగీకరించలేదు. రెండు దేశాలది చాలా విరుద్ధమైన చరిత్ర. వాటి మధ్య ఎటువంటి దౌత్య సంబంధాలు లేవు.
ఈ విషయాన్ని జపాన్ దౌత్యవేత్తలు వ్యక్తిగతంగా చర్చించాలని అనుకున్నారు. అయితే, దీనిని ఉత్తర కొరియా చాలా ఆగ్రహంతో తిప్పి కొట్టింది. వారి దేశంలో అపహరణకు గురైన వారు ఎవరూ లేరని చెప్పి, చర్చలను రద్దు చేసింది.
అయితే మెగుమి తప్పిపోయిన సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత1997లో ప్యాంగ్-యాంగ్ ఈ విషయం పై విచారణ చేయడానికి అంగీకరించింది.
జనవరి 21, 1997
"మీ అమ్మాయి ఉత్తర కొరియాలో బ్రతికే ఉన్నట్లు మాకు సమాచారం ఉంది" అనే వార్త వినగానే షిగెరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక జపాన్ పార్లమెంట్ సభ్యుడి వ్యక్తిగత కార్యదర్శి టాట్ సుకిచి హోమోటో నుంచి అనుకోకుండా వారికి ఒక రోజు ఫోను కాల్ వచ్చింది. ఆయన ఉత్తర కొరియా అపహరణల గురించి విచారణ చేస్తూ వారినెంత త్వరగా వీలయితే అంత త్వరగా కలవాలనే ఆలోచనలో ఉన్నారు.
ఒక వైపు తీవ్రమైన దిగ్భ్రాంతితో పాటు, వారి హృదయాలలో ఒక ఆశ కూడా పుట్టింది. మెగుమి బ్రతికే ఉండి ఉంటారని జపాన్ ప్రభుత్వం భావించింది. అయితే, ఆమెను వెనక్కి ఎలా తీసుకుని రావాలనే ప్రశ్న మొదలయింది.
దీంతో ఆమె కిడ్నాప్ కథను వివరిస్తూ యోకోట కుటుంబం బయటకు వచ్చింది. అయితే, జరిగింది కప్పి పుచ్చుకోవడానికి ఉత్తర కొరియా తమ కూతురుని చంపేస్తుందేమో అని భయపడ్డారు. అయితే, ఆమె పేరు బయటకు చెప్పకుండా కేసు కొనసాగించాలని ఆమె తండ్రి కోరారు. ఈ వార్తను జపాన్ అంతటికీ చేర్చాలని, అందుకోసం దేశపు సహాయాన్ని అడగాలని నిశ్చయించుకున్నారు.
ఈ కుటుంబం ప్రైమ్ టైం టీవీ పై కనిపించింది. దీని పై పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తారు. మెగుమి లాంటి వారు చాలా మంది ఉన్నారని గ్రహించారు. ఇలా అపహరణకు గురయిన అమ్మాయిల గురించి వారి వారి కొడుకులు, చెల్లెళ్లు, అక్కలు, తమ్ముళ్లు, అన్నలు, అమ్మల గురించి చాలా మంది బాధపడుతున్నారని అర్ధమయింది.
అయితే, ఇలా అపహరణకు గురైన ఏడు కుటుంబాలు కలిసి 'ది అసోసియేషన్ ఆఫ్ ఫామిలీస్ ఆఫ్ విక్టిమ్స్ కిడ్నాప్డ్ బై నార్త్ కొరియా' అనే
సపోర్ట్ గ్రూపును స్థాపించి తమ ఆప్తుల రక్షణ కోసం డిమాండు చేయాలని నిర్ణయించుకున్నారు.
వాళ్లకు తెలిసిన సమాచారం గురించి వారు చర్చించుకున్నారు. ఈ అపహరణలు అన్నీ చాలా అవకాశవాదంతో కూడినవిగా అనిపించాయి. కానీ, ఇవి జరిగిన తీరు నెమ్మదిగా ఆవిష్కృతమవ్వడం మొదలయింది. ఈ అపహరణకు గురైన వారిలో చాలా మంది 20లలో ఉన్న ప్రేమలో ఉన్న యువతీ యువకులు. జపాన్లో ఉన్న సముద్ర తీరాలన్నీ నేరాలకు నెలవుగా పునర్చిత్రీకృతమయ్యాయి.
24 సంవత్సరాల రుమికో మసూమోటో ఆమె 23 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ షుయ్ చి ఇషి కావాతో కలిసి 1978 ఆగస్టు12న కగోషిమ సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూడటానికి వెళ్లారు. ఇది సరిగ్గా మెగుమి కనిపించకుండా పోయిన 9 నెలల తర్వాత జరిగింది. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి సిగ్గు పడుతూ ఆమె కుటుంబానికి తెలియచేసారు.
ఆ ప్రదేశంలో వాళ్ళ కారు లాక్ చేసి కనిపించింది. రుమికో వాలెట్, సన్ గ్లాసులు సీటులో ఉన్నాయి. వాళ్ళ చిత్రాలతో నిండిన కెమెరా కూడా అక్కడే ఉంది. అయితే, తీరంలో షుయ్ చి చెప్పులను పోలీసులు కనిపెట్టారు.
ప్రతి అపహరణ ఒక వ్యక్తిగత విషాద గాథ. అకస్మాత్తుగా మాయమైపోయిన ఆప్తులు, వారి నిష్క్రమణతో కొంత మంది పిచ్చి వారిగా కూడా అయిపోయారు.
మీడియా, ప్రజల నుంచి పెద్దగా సానుభూతి దొరకలేదు. ఈ అపహరణలను కేవలం ఆరోపణలగానే మీడియా రాసింది.
ఈ వాదనలన్నీ నార్త్ కొరియా గురించి దక్షిణ కొరియా చేస్తున్న తప్పుడు సమాచారమని జపాన్ లో చాలా మంది రాజకీయ నాయకులు భావించారు.
కానీ, ఈ కుటుంబాలు విన్నపాలు రాసి, ప్రభుత్వంతో లాబీ చేయడంతో నిజం మంచు బంతిలా తయారవ్వడం మొదలయింది.
ఐదేళ్ల తర్వాత ఇదంతా కిమ్ జోంగ్ దగ్గరకే వచ్చి ఆగింది.

ఫొటో సోర్స్, Yokota family
సెప్టెంబరు 17, 2002
"పొద్దునే జపాన్ ప్రధానిని ఈ దేశానికి వచ్చేటట్లు చేసినందుకు విచారిస్తున్నాం" అని ఉత్తర కొరియా నాయకుడు అన్నారు.
కానీ, జపాన్ కోపానికి, ఆ సమయానికి సంబంధం లేదు.
ఉత్తర కొరియాతో జపాన్ సంబంధాలను సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు చర్చలు జరిపేందుకు జపాన్ ప్రధాని జుని చిరో కోయి జుమీ ఉత్తర కొరియా సందర్శించారు.
1990లో ఉత్తర కొరియాలో దారుణమైన కరువు ఏర్పడిన తర్వాత సుమారు 20 లక్షల మంది జనాభా మరణించారు.
కిమ్ జోంగ్ ఇల్ కి ఆహార సహాయం, పెట్టుబడులు అవసరమయ్యాయి. కొరియాను 35 ఏళ్ల పాటు తన సామ్రాజ్యవాద పాలనలో ఉంచుకున్న జపాన్ తమకు క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంది.
అయితే, ఉత్తర కొరియా గూఢచారులు అపహరించిన ప్రతి ఒక్క జపాన్ పౌరుని వివరాలు ఇవ్వకుండా ఎటువంటి సహాయం చేసే ప్రసక్తి లేదని జపాన్ తేల్చి చెప్పింది.
ఆ చారిత్రక సమావేశానికి ఒక అరగంట ముందు అపహరణకు గురైన వారి పేర్ల జాబితా విడుదల అయింది. 13 మంది జపాన్ పౌరులను అపహరించినట్లు ఉత్తర కొరియా అంగీకరించింది. కానీ, అందులో 5 గురు మాత్రమే బ్రతికి ఉన్నారు.
మిగిలిన వారు, నీటిలో మునిగి, బొగ్గు హీటర్ నుంచి వచ్చిన పొగ పీల్చి, గుండె పోటుతో, వ్యక్తిగత కార్లు ఉండని దేశంలో కారు ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారని ఉత్తర కొరియా చెప్పింది. వరదల్లో వారి సమాధులు కొట్టుకుపోవడం వలన వారి అస్థికలను ఇవ్వలేమని ఉత్తర కొరియా తేల్చి చెప్పింది.
కొయిజుమీ ఆశ్చర్యంతో ఉండిపోయారు.
"ఈ సమాచారం ఆయనను కృంగదీసిందని ఆయన కిమ్ జోంగ్ ఇల్ కి చెప్పారు. జపాన్ ప్రజల రక్షణకు, ఆశలకు బాధ్యుడైన ఒక ప్రధానిగా, ఈ విషయాన్ని నేను తీవ్రంగా నిరసించాలి. ఈ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు ఎలా తీసుకుంటారో ఊహించడమే కష్టంగా ఉంది" అని అన్నారు.
కిమ్ ఇదంతా విని మౌనం వహించారు. ఆయన ఒక మెమో ప్యాడ్ పై నోట్స్ రాసుకున్నారు. "మనం ఇప్పుడు ఒక విరామం తీసుకుందామా " అని అడిగారు.
అయితే, ఆ సమావేశంలో సంకట స్థితిని ఊహించిన జపాన్ డెప్యూటీ క్యాబినెట్ ప్రతినిధి షింజో అబి ఈ అపహరణల గురించి ఉత్తర కొరియా బహిరంగంగా క్షమాపణ చెప్పని పక్షంలో ఇరు దేశాల మధ్య సాధారణ చర్చలు జరిగే ప్రసక్తి లేదని చెప్పమని సూచించారు.
సమావేశం తిరిగి ప్రారంభమవ్వగానే కిమ్ ఒక మెమో తీసుకుని "ఈ విషయాన్ని మా ప్రభుత్వ పాత్రతో సహా మేము నిశితంగా విచారణ చేసాం. కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతికూల సంబంధాలు ఈ సంఘటనలకు నేపధ్యం అని తెలుస్తోంది. ఇవి చాలా భీతిని కలిగించే సంఘటనలు" అని అన్నారు.
"1970, 80 లలో ఈ సంఘటనలు కొన్ని ప్రత్యేక మిషన్ సంస్థలు గుడ్డిగా దేశ భక్తితో చైతన్యవంతమైన , తప్పుగా మార్గదర్శకత్వం వహించిన హీరోయిజం వలన చేసినట్లు అర్ధమవుతోంది".
"ఇవన్నీ నా దృష్టికి రాగానే దీనికి బాధ్యులయిన వారిని శిక్షించాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు" అని అన్నారు.
ఈ అపహరణల ద్వారా ఉత్తర కొరియా గూఢచారులకు జపాన్ టీచర్లతో శిక్షణ ఇప్పించేందుకు, దక్షిణ కొరియాలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించేందుకు, నకిలీ వివరాలను సేకరించేందుకు ఈ అపహరణలను రూపొందించినట్లు ఉత్తర కొరియా నియంత చెప్పారు.
ఆయన మెగుమిని అపహరించిన దోషులను 1998లో శిక్షించినట్లు తెలిపారు. ఒకరికి ఉరి శిక్ష పడగా ఇంకొకరు 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ మరణించినట్లు తెలిపారు.
"క్షమించరాని పనులు చేసిన ఆ వ్యక్తుల కోసం నేను నేరుగా క్షమాపణ చెప్పేందుకు నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను,. ఇలా జరిగేందుకు నేను మళ్ళీ అనుమతించను" అని అన్నారు.
కోయి జుమీ ప్యాంగ్-యాంగ్ తీర్మానం పై సంతకం చేశారు.
అపహరణకు గురైన వారిలో 5 గురు బ్రతికి ఉండగా, 8 మంది మరణించారు. అపహరణకు గురైన వారి కుటుంబాలు అక్కడ నుంచి వచ్చే వారి వార్త కోసం ఎదురు చూస్తున్నాయి.
మెగుమి తల్లి తండ్రులు జపాన్ ఉప విదేశాంగ శాఖ మంత్రి షిగియో యుటకేతో కలిసి ఉన్నారు.
ఆయన దీర్ఘంగా ఊపిరి తీసుకుని, "మెగుమి యోకోట ఏప్రిల్ 13 1994 లో పైన్ చెట్ల అడవిలో ఉరి వేసుకుని చనిపోయారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఆమె మానసిక ఒత్తిడికి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందు మార్చ్ 1993 లో కూడా ఆమె ఒక సారి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు ఉత్తర కొరియా తెలిపింది" అని తెలిపారు.
దీనికి ఆధారంగా ఆసుపత్రి మరణ ధ్రువీకరణ రిజిస్టర్ చూపించారు. అయితే ఆ రిజిస్టర్లో చాలా సార్లు ఆమె చేరినట్లు, వెళ్లినట్లు రాసి, చివరికి మరణించినట్లు నమోదు చేశారు. ఇది అనుమానాస్పదంగా ఉందని జపాన్ భావించింది.
అయితే, మెగుమి తన భర్తతో కలిసి జూన్ 1994లో తన పక్కింట్లోనే ఉండేవారని మరో జపాన్ మహిళ చెప్పారు. ఈమె చెప్పిన సమయం మెగుమి మరణ తేదీ నమోదయిన మరో రెండు నెలల తర్వాత కనిపిస్తోంది. అక్కడ మెగుమి చాలా రోజులు నివసించినట్లు తెలుస్తోంది.
అయితే, యోకోట కుటుంబం మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్న వార్తను నమ్మలేదు.
నీగటలో పైన్ అడవులు ఉన్నాయి అని సాకి వాషింగ్టన్ పోస్టుకి 2002లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. "ఆమె వాటిని మిస్ అయి ఉంటారు. ఆమె ఒంటరిగా బాధపడి ఉంటారు. ఆమె మా కోసం చాలా ఎదురు చూసి ఉంటారు. ఆమె రాలేని పరిస్థితుల్లో ఉండి ఉంటారు. ఆ క్షణంలో ఆమె ప్రాణాలు తీసుకుని ఉండి ఉంటారు" అని అన్నారు.
"నేను ఏడ్చాను, కానీ ఆ మరు క్షణమే అలా జరిగి ఉండదని భావించాను. అలా జరగడం నాకిష్టం లేదు. అలా మరణించడం నాకిష్టం లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యోకోట కుటుంబం
మెగుమి మరణించినట్లు ప్రకటించిన 2 సంవత్సరాల తర్వాత ప్యాంగ్-యాంగ్ ఆమె అస్థికలను అందచేసింది. అవి సరిగ్గా ఆమె అపహరణకు గురయిన 27 సంవత్సరాలకు వచ్చాయి. జపాన్ సంస్కృతిలో భాగంగా ఆమె పుట్టినప్పుడు ఆమె బొడ్డు తాడును ఆ కుటుంబం వారు జాగ్రత్తగా దాచి పెట్టి ఉంచారు. ఆ అస్థికలతో డిఎన్ ఎ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆ రెండు శాంపిళ్లు సరిపోలేదు.
అయితే, ఆ అస్థికలు పాడైపోయి ఉండటం వలన కూడా సరైన ఫలితాలు వచ్చి ఉండకపోవచ్చని వాటిని పరీక్షించిన శాస్త్రవేత్త చెప్పారు.
కానీ, ఉత్తర కొరియా అనుమానించతగ్గ అవశేషాలను పంపిస్తుందనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. కౌరు మత్సుకి అనే 42 సంవత్సరాల వ్యక్తి అవశేషాలను పరిశీలించినప్పుడు అందులో ఉన్న ఒక దవడ ముక్క 60 ఏళ్లకు చెందిన మహిళవిగా దంత నిపుణులు చెప్పారు.
అక్టోబరు 15, 2002 లో అపహరణకు గురైన 5గురు వ్యక్తులు ఉత్తర కొరియా నుంచి సజీవంగా టోక్యో హనేడ ఎయిర్పోర్టు లో అడుగు పెట్టారు .
జపాన్ జెండాలతో వారికి స్వదేశానికి స్వాగతం పలకగా రన్ వే పై ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను వారు హత్తుకుని కన్నీరు కార్చారు.
ఈ ఐదుగురు జపాన్ లో ఒక వారం నుంచి 10 రోజులు ఉండవచ్చని అంగీకరించింది. కానీ, వారు మళ్లీ ఉత్తర కొరియాలో అడుగు పెట్టలేదు.
అపహరించిన వ్యక్తులు అపహరణకు గురైన వారు మరణించినట్లు చెప్పిన తర్వాత వారినెలా రక్షించగలం? ఈ ప్రశ్న కేవలం ఒక్క యోకోట కుటుంబానికి మాత్రమే కాదు, మరెంతో మందిని వేధిస్తున్న ప్రశ్న.
బాయ్ ఫ్రెండ్ తో కలిసి అపహరణకు గురైన రుమికో మసుమోటో కూడా మృతుల జాబితాలోనే ఉన్నారు. ఆమె 20లలో ఉండగానే గుండె పోటుతో మరణించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది., ఆమె కుటుంబం దానిని నమ్మడానికి సంసిద్ధంగా లేరు. "మా ఇంట్లో హృద్రోగ సమస్యలతో ఎవరూ లేరు" అని ఆమె సోదరుడు చెప్పారు.
ఆమె అపహరణకు గురయ్యే సమయానికి తెరావుకి మసుముటోకి 22 సంవత్సరాలు. ఆయన అప్పటికి ఫిషరీస్ కోర్సు చదువుతున్నారు. ఆయనకు ఇప్పుడు 65 సంవత్సరాలు.
ఆయన పుట్టిన రోజు మెగుమి పుట్టిన రోజు కూడా అక్టోబరు 05 వ తేదీనే . వాళ్ళిద్దరి మధ్యా 9 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. మెగుమి బ్రతికి ఉంటే 56 సంవత్సరాలు ఉండి ఉండేవి. రుమికోకి 66 సంవత్సరాలు ఉండేవి.
రుమికోకు నాకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Teruaki Masumoto
తెరావుకి మసుముటో
రుమికో చాలా ప్రేమతో మెలిగే పెద్ద సోదరి అని తెరావుకి చెబుతారు.
ఆయన యూనివర్సిటీలో చేరినప్పుడు రుమికో ప్రేమతో బహుకరించిన వాచీని ఆయన జాగ్రత్తగా పదిలపర్చుకున్నారు.
వాళ్ళ నాన్నగారు 2002లో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించారు. తల్లి 2017లో మరణించారు. ఆమె కూతురు ఇంటికి తిరిగి వస్తుందేమోననే ఆశతో సరిగ్గా 4 దశాబ్దాల పాటు ఎదురు చూసారు.
అపహరణకు గురైన పిల్లల కోసం వెతుకుతూ, ఆ వెతుకులాట ముగియకుండా లోకాన్ని వీడడం ఒక దారుణమైన వారసత్వాన్ని మిగల్చడం లాంటిది. కానీ, ఇదే సమస్యను అపహరణకు గురైన కుటుంబాలన్నీ ఎదుర్కొన్నాయి.

మెగుమి తల్లి సాకికి ఈ ఫిబ్రవరికి 85 ఏళ్ళు నిండుతాయి. మెగుమి తండ్రి మాత్రం జూన్ 2020లో మరణించారు. ఆయన మరణించేవరకు ఆయన కూతురు ఫోటో పక్కన పెట్టుకుని ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని పోరాడారు.
తెరావుకి , టకుయలకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వారికి ఇంట్లో మేనత్తల గురించి చెప్పారు. తెరావుకి 2004 నుంచి కోయిచిరో లిజుకతో కలిసి అపహరణల గురించి ప్రచారం చేశారు. లిజుకకి 16 నెలల వయసు ఉండగానే ఆయన తల్లి అపహరణకు గురయ్యారు.
కోయిచిరో లిజుక తల్లి తప్పిపోయేనాటికి నెలల పిల్లవాడు.
ఏకో టగుచి నైట్ క్లబ్లో ఒక హోస్టెస్ గా పని చేసేవారు. ఆమె మూడేళ్ళ పాపకి, ఈ పసికందుకు తల్లి. ఆమెకు భర్త లేరు.
ఆమె జూన్ 1978 నుంచి కనిపించకుండా పోయేసరికి ఆమె పిల్లలు అనాధలుగా మారారు.
ఆ బాబును ఆమె సోదరుడు షిగియో లిజుక పెంచుకున్నారు. ఆమె కూతురును మరో బంధువు పెంచుకున్నారు.
కోయిచిరో లిజుకకి తనకు జన్మనిచ్చిన తల్లి గురించి వివరాలేమీ తెలియదు.
ఆయనను తన అత్త, మామలు పెంచిన విషయం కూడా ఆయనకు తెలియదు.

ఫొటో సోర్స్, Koichiro Iizuka
"నాకు ఉద్యోగం వచ్చినప్పుడు విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. అప్పుడు నా కుటుంబ వివరాలు చూసినప్పుడు నన్ను నా మేనమామ పెంచుకున్నారని అర్ధం అయింది. ఇన్ని రోజులు వారు ఈ విషయాన్ని రహస్యంగా ఎందుకుంచారో నాకర్ధం కాలేదు. నేను ఒక వారం రోజులు ఆగి నన్ను పెంచిన తల్లి తండ్రుల దగ్గరకు వెళ్లాను.
భోజనం చేస్తూ నా తండ్రి జరిగిన విషయం అంతా వివరించారు. నేను ఆయన చిన్న చెల్లెలి కొడుకునని చెప్పారు.
అప్పుడు 1987లో కెఎఎల్ విమానం పేలుడుకి కారణమైన ఉత్తర కొరియా ఏజెంట్ కిమ్ హ్యూన్ హుయ్ గురించి చెప్పారు. ఆమెకు ఒక జపాన్ టీచర్ శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించినట్లు చెప్పారు. ఏకో సాన్ ని ఆమె టీచర్ గా గుర్తించినట్లు తెలిపారు. దాంతో ఆమె కూడా ఉత్తర కొరియాలో అపహరణకు గురయిన వ్యక్తిగా ఉన్నారని అర్ధం అయింది"
ఈ వాదనకు జపాన్ తిరిగి వచ్చిన ఫుకీ చిమురా అనే అపహరణకు గురైన వ్యక్తి బలం చేకూర్చారు. ఆమె ఏకోతో కలిసి ఉండేవారని చెప్పారు.
2004 లో జపాన్ నుంచి అపహరణకు గురైన వ్యక్తులు తిరిగి వచ్చిన తర్వాత కోయి చిరో ఏకో టగుచి కొడుకునని బహిరంగంగా ప్రకటించుకోవాలని నిర్ణయించుకున్నారు. దౌత్యపరమైన ప్రతిష్టంభనలతో ఆయన విసిగిపోయారు. ఈ అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి తనకు తోచినంత చేయాలని అనుకున్నారు.
"ఏకో సాన్ నా జ్ఞాపకాలలో సజీవంగా లేరు. కానీ, ఆమె నా కథలో భాగం. కానీ ఈ కథలో ఉన్న ఈమె నాకు జన్మనిచ్చారు. నేను తనను ఎప్పటికీ చూడలేననే ఊహ నాకు చాలా భయాన్ని కలిగించింది"అని ఆయన చెప్పారు.
ఆమె మరణించారని నార్త్ కొరియా చెప్పడం వెనక ఆధారాలేమీ లేవని ఒక విదేశాంగ శాఖ అధికారి నా తండ్రికి పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. ఆ విషయాన్ని నా తండ్రి అంగీకరించలేకపోయారు.
"ఆమెను ఎలా అయినా రక్షించాలని అనుకున్నాం."

విమానంలో బాంబు పెట్టిన కిమ్ హ్యూన్ హుయ్ చేసిన నేరాలకు మరణ శిక్ష పడింది. కానీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆమెకు క్షమా భిక్ష పెట్టారు. 2009 లో కోయి చిరో షిగియో కలిసి ఆమెను కలవడానికి దక్షిణ కొరియాలో బుసాన్ కి ప్రయాణించారు. ఆమెకు ఏకో గురించి తెలిసిన వివరాలను కనుక్కోవాలని అనుకున్నారు.
"ఏకో సాన్ నాకు ఒక సోదరిలా అనిపించే వారు. నా సోదరి కొడుకును ఈ రోజు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అని ఆమె అన్నట్లు కోయి చిరో గుర్తు చేసుకున్నారు. ఒక రోజు మేమంతా ఒక ఒకే చోట కలుస్తామనే ఆశ ఉంది" అని కోయి చిరో అన్నారు.
అయితే, ఏకో టగుచి ఒక కారు ప్రమాదంలో 1986లో మరణించారని ఉత్తర కొరియా అధికారికంగా ధృవీకరించింది.
కానీ, ఆ మరుసటి సంవత్సరమే ఆమె బ్రతికి ఉండగా చూసినట్లు ఒక డ్రైవర్ చెప్పారని కిమ్ చెప్పారు. ఆమెకు ఇప్పుడు 65 సంవత్సరాలు ఉండవచ్చు.
"సమయం చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఏకో సాన్ తో పాటు తోడ బుట్టిన మరో ఇద్దరు సోదరులు ఇప్పటికే మరణించారు. మా తండ్రి కూడా ముసలి వారవుతున్నారు. నా కుటుంబం మాత్రమే కాదు. అపహరణకు గురైన వారి మిగిలిన కుటుంబాలలో వారు కూడా ముసలివారవ్వడం నాకు తెలుస్తోంది.
అయితే, దక్షిణ కొరియా విమాన బాంబు వెనకాల ఉత్తర కొరియా పాత్ర ఉన్నట్లు అంగీకరించలేదు. కిమ్ హ్యూన్ హుయ్ అనే వ్యకి అనే వారే లేరని ఆ దేశం చెబుతూ వస్తోంది.
కిమ్ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత, అనేక మంది గూఢచారుల చుట్టూ ఆమె గడిపిన తర్వాత, ఏకో సాన్ ను విడుదల చేసే అవకాశం లేదేమోననే భయం కూడా ఉంది.
ఈ పోరాటంలో చిక్కుకున్న వారందరూ ఒకే రకమైన సమస్యను అనుభవిస్తున్నారు. గడిచిపోతున్న సమయం వారి ప్రయత్నాలను వెక్కిరిస్తుందేమోననే భయంతో ఉన్నారు. అపహరణకు గురైన వారి వయసు కూడా పెరిగి బ్రతికి ఉంటారో లేదో తెలియదు అనే అనుమానం ఉంది.
ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు బ్రతికి ఉన్న తరం వారు వెతకాల్సి ఉంటుంది.
"రెండు వైపులా సమయం మించిపోతుంది" అని టకుయో అన్నారు. 20 ఏళ్ళు జపాన్ లోనో, అమెరికాలోనో, యూకె లోనో గడపడం ఉత్తర కొరియాలో గడపడం నుంచి పూర్తిగా భిన్నమైనది. ఉత్తర కొరియాలో రేపటి వరకు బ్రతికి ఉండటం కాదు కదా ఈ రోజు కూడా సజీవంగా ఉండగలగడం కష్టమే" అని ఆయన అన్నారు.
తెరావుకి ఈ పోరాటం ఆపాలని అనుకోవడం లేదు.
"అపహరణకు గురైన వారు మరణిస్తే వాళ్ళ అస్థికలు మాకు కావాలి. అది జపనీయుల స్వభావం. వాళ్ళని రక్షించలేకపోయినందుకు మేము జపాన్ ప్రభుత్వాన్ని కూడా బాధ్యులను చేస్తాం. ఇప్పటికే 17 మంది అపహరణకు గురైన వారిని ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఇంకా 100 మందికి పైగా ఉత్తర కొరియా లో ఉన్నారని మేమనుకుంటున్నాం. మిగిలిన వారికి ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మా పోరాటాన్ని ఆపేది లేదు" అని తెరావుకి అన్నారు.
ఉత్తర కొరియా తిరిగి అప్పగించని 8 మంది వ్యక్తులు మరణించారని ప్రకటించినప్పటికీ వారి గురించి విచారణ చేపట్టడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. 2016 వరకు విచారణ చేపడతామన్న ఉత్తర కొరియా ఆ దేశం మీద న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినందుకు విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ విచారణను రద్దు చేసింది.
టోక్యో లో వినోదాత్మక ప్రదేశం రొప్పొంగిలో సాయంత్రపు దీపాల వెలుగులో కూతురు చేతులు పట్టుకుని నడవాలని మెగుమి తండ్రి కలలు కనేవారు. ఆమె తల్లి ప్రార్ధనలో కూతురితో కలిసి పొలానికి వెళ్లి, ఎవరూ లేని ఒంటరితనంలో ఆకాశం వైపు చూస్తూ వారిద్దరూ మాత్రమే ఏకాంతంగా, ప్రశాంతంగా గడపాలని అనుకునేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సాకి తన కూతురికి ఎప్పటికైనా చేరుతాయేమోననే ఆశతో బహిరంగ లేఖలు రాసేవారు.
అందులో ఒక లేఖ:
ప్రియమైన మెగుమి,
"నేను నిన్ను పలకరించడం విచిత్రంగా అనిపించవచ్చు. నువ్వు బాగానే ఉన్నావా?"
"నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, నా శరీరం బలహీనంగా మారుతోంది. రోజు రోజుకీ పరిస్థితి కష్టంగా మారుతోంది. ఆసుపత్రిలో మీ నాన్నగారు కోలుకోవడానికి వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలా అయినా ఆయన నిన్ను చూడటానికి మార్గం దొరికితే బాగుండును అని తొందరపడుతున్నాను"
"ఇది వృద్ధాప్యంలో కనిపించే నిజం. ఇలా జరుగుతున్నది మీ నాన్నకి నాకు మాత్రమే కాదు. మేము వయసు, అనారోగ్యం, అలసట వీటన్నిటితో గడుపుతున్నాం. కానీ, ఉత్తర కొరియాలో ఉన్న బాధితుల కుటుంబాలన్నీ వారి ప్రియమైన వారు తిరిగి జన్మ భూమికి తిరిగి వస్తే తమ చేతుల్లో దాచుకోవాలని ఎదురు చూస్తున్నారు".
"మా దగ్గర ఎక్కువ సమయం లేదు. మేము మా హృదయాలతో చాలా రోజులు గట్టిగా పోరాడాం. కానీ, ఈ పోరాటాన్ని మేము ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాం. నా వచ్చే పుట్టిన రోజును నీతో కలిసి గడపాలని అనుకుంటున్నాను".
"ఇది కేవలం జపాన్ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. కానీ, ఒక్కొక్కసారి ఏదో ఇబ్బంది నన్ను ఆవరిస్తుంది. కానీ, ప్రభుత్వ పని తీరు చూస్తుంటే మా ప్రయత్నాలన్నీ నిరర్ధకం అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారో లేదో తెలియదు. బాధితులను ఇంటికి తిరిగి తీసుకుని వస్తారో లేదో తెలియదు".
"ఈ చెలరేగుతున్న ఉప్పెనను నేను ఎలాగో ఒకలా నిలదొక్కుకున్నాను. నువ్వు కూడా భగవంతుని శక్తితో దీనిని తట్టుకుని నిలబడి ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని. మనం ఒంటరి వాళ్ళం కాదు. మీ అందరి గురించి ఆలోచిస్తూ నేను మీ కోసం ప్రార్ధన చేస్తున్నాను".
"బాధితులందరినీ జపాన్ తిరిగి తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం అవసరం అవుతుంది. అయితే, ఇందుకోసం జపాన్ గట్టిగా నిలబడగల్గాలి. కానీ, మాకు కూడా ప్రపంచం నలుమూలల నుంచి ధైర్యం, ప్రేమ, న్యాయం కావాలి".
"నా ఉత్తరం చదివిన వారంతా అపహరణకు గురయిన వారి గురించి మీ హృదయాలలో ఒక్క క్షణం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ గురించి మీ గళం కూడా విప్పండి."
"ప్రియమైన మెగుమి,
నిన్ను ఇంటికి తిరిగి తీసుకుని రావడానికి నేను పోరాడుతూనే ఉంటాను. నీ సోదరులు కూడా నాతో కలిసి పోరాడతారు. 84 ఏళ్ల వయసులో కూడా నా సంకల్పం చెదరదు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. ఎప్పటికీ ఆశను వీడకు."
నీ, యోకోట కుటుంబం.
ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు
- సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- 'రసాయన దాడి': సిరియా, రష్యాలను హెచ్చరించిన ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








