కిమ్ జోంగ్-నామ్ హత్యను కళ్లకు కట్టినట్టు చూపించే డాక్యుమెంటరీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విన్సెంట్ దౌడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగేళ్ల కిందట సినీ దర్శకుడు రేయాన్ వైట్.. విమానాశ్రయంలో కిమ్ జాంగ్-నామ్ హత్యోదంతం గురించి విన్నపుడే అది అసాధారణ కథనమని ఆయనకు తెలుసు. కానీ దానిని సినిమా లాగా తీయాలనే ఉద్దేశం అప్పుడాయనకు లేదు. కొన్ని నెలల తర్వాత ఆయన ఈ ఉదంతం గురించి మళ్లీ ఆలోచించారు. అలా తనకు ఏమాత్రం తెలియని గూఢచారి ఆపరేషన్ల చీకటి ప్రపంచంలోకి, భౌగోళిక రాజకీయాల్లోకి తొంగిచూశారు.
రేయాన్ దశాబ్ద కాలానికి పైగానే డాక్యుమెంటరీలు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో స్వలింగ సంపర్కుల (గే) వివాహం కోసం సాగించిన న్యాయపోరాటం గురించి చిత్రీకరించిన ‘ద కేస్ అగైన్స్ట్ ఎయిట్’ వాటిలో అత్యుత్తమమైనదిగా భావిస్తారు.
‘‘కిమ్ జోంగ్-నామ్ కథ ఎంత విభ్రాంతికరమో 2017లో మేం గుర్తించాం. ఉత్తర కొరియా పాలకుడి సవతి సోదరుడిని కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఒక మహిళ ప్రాణాంతక నెర్వ్ ఏజెంట్ (విషం) చల్లి హత్యచేయటం, అదంతా ఒక రియాలిటీ టీవీ షో కోసం ఆడిన నాటకంగా చెప్పుకురావటం అంతా విడ్డూరంగా ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
కిమ్ జోంగ్-నామ్ మలేసియాలో వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ ప్రయోగానికి గురై ఆస్పత్రికి చేరటానికి ముందే చనిపోయారు. రెండు రోజుల్లోనే ఆయన హత్యకు కారకులంటూ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు వియత్నాం మహిళ డోవాన్ థి హువాంగ్. అప్పుడు ఆమె వయసు 28 సంవత్సరాలు. మరొకరు ఇండొనేసియా మహిళ సిటి ఐసియా. అప్పుడామె వయసు 25 సంవత్సరాలు.

ఫొటో సోర్స్, Dogwoof
2011 నుంచి ఉత్తర కొరియా సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్న కిమ్ జోంగ్-ఉన్.. తన సవతి సోదరుడు కిమ్ జాంగ్-నామ్‌ను ఇష్టపడేవారు కాదు. నామ్ కొన్ని సంవత్సరాల పాటు మకావులో ప్రవాస జీవితం గడిపారు.
ఆయన కథతో చిత్రించిన ఈ కొత్త డాక్యుమెంటరీలో నామ్ కెమెరాలో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
డోగ్ బాక్ క్లార్క్ అనే జర్నలిస్టు తనను సంప్రదించిన తర్వాతే ఈ కథను ఒక సినిమా ప్రాజెక్టుగా పరిశీలించటం ప్రారంభించారు రేయాన్.
‘‘జీక్యూ మేగజీన్ కోసం తాను ఒక లోతైన పరిశోధనాత్మక కథనాన్ని రాస్తున్నట్లు క్లార్క్ చెప్పారు. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కని చాలా విషయాలు ఉన్నాయని తెలిపారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోయే సమయంలో ఈ ఘటన జరగటాన్ని బట్టి అమెరికన్లు ఈ ఉదంతాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు.’’
"మలేసియాలో పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలు దోషులుగా తేలితే వారికి మరణ శిక్ష తప్పనిసరి అని కూడా క్లార్క్ వివరించారు. కానీ ఒక రియాలిటీ షో కోసమని నమ్మించి నామ్ మీద తాము రసాయనం చిలకరించేలా చేశారన్న తమ కథనానికి వారు కట్టుబడి ఉన్నారు.’’
’’ఆ వాదన వారికి రక్షణ కల్పించగలదనే ఆలోచన ఆ సమయంలో నాకు లేదు. పైగా ‘ద కేస్ అగైన్స్ట్ ఎయిట్’ అనుభవంతో మళ్లీ ఏదైనా కేసు విచారణ చుట్టూ సినిమా చేయకూడదని నేను అనుకున్నాను. ఆ సినిమా కోసం నేను 600 గంటలకు పైగా వీడియోలను చిత్రీకరించాల్సి వచ్చింది. దానినంతా ఎడిట్ చేసుకోవటం చాలా కష్టం.’’
’’కానీ క్లార్క్ చెప్పిన దాని గురించి నేను ఆలోచించిన కొద్దీ.. డాక్యుమెంటరీ చేయటానికి అవసరమైన ‘త్రీ-కట్ స్ట్రక్చర్’ ఈ విచారణలో లభిస్తుందని నాకు అర్థమైంది. అంతే.. కొన్ని వారాల్లో మలేసియా విమానం ఎక్కేశాను.’’
’’ఆ తర్వాత చాలా రోజులకు కానీ.. ఆ మహిళలు చెప్తున్నది సరిగా లేదని నేను ఆలోచించటం మొదలుపెట్టాను. కానీ వారు చెప్తున్నది విన్నపుడు వారు నిజంగా అమాయకులేమో? అనిపించింది’’ అని రేయాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Dogwoof
క్రైమ్ డాక్యుమెంటరీలకు సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించటం సాధారణ అంశంగా మారిపోయింది. 2017 ఫిబ్రవరి 13వ తేదీన కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏం జరిగిందనే వీడియో అందుబాటులోకి రాకపోతే ఈ డాక్యుమెంటరీ తీయటం అసాధ్యంగా కనిపించిందని రేయాన్ చెప్పారు.
మలేసియా పోలీసులు, ఇతర సంస్థలు ఆ వీడియోలను విడుదల చేయటానికి ఏడాదికి పైనే పట్టింది.
ఆ సీసీటీవీ రికార్డింగ్‌లు చివరికి ఎలా బయటికి వచ్చాయో ఈ డైరెక్టర్ చెప్పలేదు. కానీ ఆయన సినిమాలో అవి అసాధారణ భాగంగా ఉన్నాయి. అయితే.. నామ్ మీద దాడి, తదనంతర పరిణామాలకు సంబంధించిన ఆ సీసీటీవీ దృశ్యాలను ఎడిట్ చేయలేదని, తారుమారు చేయలేదని రేయాన్ ఎలా నిర్ధారించుకున్నారు?
‘‘వేలాది గంటల ఫుటేజీని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలించాల్సి వచ్చింది. ప్రతి దాని మీదా అనేక కెమెరాల నుంచి రికార్డైన దృశ్యాలున్నాయి. ఒక చిన్న భాగం మిస్సయింది. లేదంటే ప్రతి క్షణమూ లెక్కలోకి వచ్చేది. ఆ డీవీడీలన్నిటినీ ప్రాసెస్ చేయటానికి మేం ప్రత్యేకమైన బర్నర్ కంప్యూటర్లు కొనాల్సి వచ్చింది. ఈ పని పూర్తి చేయటానికి మూడు నెలలు పట్టింది’’ అని రేయాన్ వివరించారు.
నిందిత మహిళలిద్దరూ వేర్వేరు దేశాల వారు. విభిన్నమైన జీవిత నేపథ్యాలున్న వారు.
రేయాన్ ఆ ఇద్దరు మహిళల కుటుంబాలను కలిశారు. ఈ సినిమా కోసం సహకరించటానికి వారి కుటుంబాలు అంగీకరించాయి. ‘‘ఓ పెద్ద డాక్యుమెంటరీ చేస్తున్న దర్శకుడిగా కన్నా.. త్వరగా ఇంటర్వ్యూ చేసి వెళ్లిపోయే సాధారణ మీడియా వ్యక్తిగానే వారు నన్ను చూశారని నేను అనుకుంటున్నా’’ అని ఆయన చెప్పారు.
‘‘ఆ మహిళలు బహుశా అబద్ధాలు చెప్తున్నారేమోనని మేం మొదట భావించాం. కానీ కొంత కాలానికి వారు చెప్తున్నదంతా సరిపోలుతున్నట్లు మేం తెలుసుకున్నాం. కానీ అది చాలా నెమ్మదిగా తెలుసుకోగలిగాం’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Dogwoof
ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న కాలంలో ఎక్కువ భాగం ఆ మహిళలిద్దరూ జైలులోనే ఉన్నారు. ఐసియా 2019 మార్చిలో పోలీసు కస్టడీ నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత రెండు నెలలకు హువాంగ్ కూడా విడుదలయ్యారు.
రేయాన్ తన సినిమా కోసం వెచ్చించిన రెండున్నర సంవత్సరాలు మొత్తం.. ఉత్తర కొరియా ప్రభుత్వంతో రేయాన్‌కు ప్రత్యక్ష సంప్రదింపులు లేవు. కనీసం.. అలాంటివి లేవని ఆయన భావిస్తున్నారు.
‘‘ఇది పారనోయియా కావచ్చు కానీ.. ఇటువంటి ప్రాజెక్టు విషయంలో మనం ఎవరికైనా ఈమెయిల్ చేస్తే.. ఆ మెయిల్ ఎవరికి పంపుతున్నామో ఆ వ్యక్తి ఆయన చెప్పుకుంటున్న వ్యక్తేనని మనకు కచ్చితంగా తెలుసా?’’ అని రేయాన్ వ్యాఖ్యానించారు.
‘‘గత ఏడాది మేం ఈ సినిమా ప్రివ్యూ ప్రదర్శించినపుడు నేను ఫేస్‌బుక్ ద్వారా డోవన్‌తో మాట్లాడుతున్నాను. కానీ ఆమె కోపంగా పంపుతున్న మెసేజీలు ఆమెవి లాగా అనిపించలేదు. అందులోని ఇంగ్లిష్ భాష కూడా ఆమె ఉపయోగించే భాష లాగా అనిపించలేదు’’ అని రేయాన్ తెలిపారు.
‘‘దీంతో ఆమెకు నేను వేరే యాప్ ద్వారా మెసేజ్ చేశాను. అప్పుడు మాకు అర్థమైంది.. నాతో మాట్లాడటానికి ఇంకెవరో ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను చాలా బాగా కాపీ కొట్టారని. అప్పుడు డోవాన్ మెసేజీలను వక్రీకరించింది ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన వారేనని నేను వేలెత్తి చూపగలనా? నాకు కచ్చితంగా తెలియదు. కానీ ఇదే తరహాలో జరిగిన ఉదంతాలు ఇంకా ఉన్నాయి’’ అని వివరించారాయన.

ఫొటో సోర్స్, Dogwoof
అయితే.. ఉత్తర కొరియా వంటి అత్యంత రహస్య ప్రభుత్వం.. బాహ్య ప్రపంచంతో దాదాపుగా ఎలాంటి సంబంధాలు లేకుండా తలుపులు మూసుకున్న ఒక ప్రభుత్వం.. ఒక అమెరికా డాక్యుమెంటరీలో తనను ఎలా చిత్రీకరించారనే విషయాన్ని పట్టించుకుంటుందని రేయాన్ నమ్ముతున్నారా?
‘‘ఉత్తర కొరియా గురించి ఏ విషయమైనా ఇతమిద్ధంగా చెప్పటం కష్టం. కానీ చాలా పెద్దదైన బహిరంగ ప్రదేశంలో ఒక హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎంత ప్రచారం జరిగితే అంత మేలని వారు భావిస్తుండవచ్చేమో. ఆ విమానాశ్రయంలో ప్రతి కదలికనూ రికార్డు చేస్తున్న సెక్యూరిటీ కెమెరాలు అపరిమితంగా ఉన్నాయి. కిమ్ జోంగ్-నామ్‌ను మరో ప్రాంతంలో మరో రకంగా హత్య చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి అసాధారణ రీతిలో ఈ హత్య చేయటానికి వెనుక గల హేతుబద్ధత ఏమిటి?. రక్త సంబంధీకులైనా సరే తమ దేశ సుప్రీం లీడర్‌కు కోపం తెప్పిస్తే, లేదంటే ఆయన దారికి అడ్డం వస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి చూపటానికి.. బాహాటంగా హత్య చేయాలని కిమ్ జోంగ్-ఉన్, ఆయన కోసం పనిచేస్తున్న వారు కోరుకున్నారు’’ అంటారు రేయాన్.
‘అసాసిన్స్’ డాక్యుమెంటరీ డాగ్‌వూఫ్ ఆన్ డిమాండ్ ద్వారా, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి:
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









