విశాఖ: తొట్లకొండకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఫిల్మ్‌ క్లబ్‌కు భూమి ఇవ్వడంపై ఆందోళనలు ఎందుకు..

తొట్లకొండ
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధ క్షేత్రాలు విశాఖలో ఉన్నాయి.

వాటిలో తీర ప్రాంతంలో ఉన్న 'తొట్లకొండ' బౌద్ధారామం అతి ముఖ్యమైనది.

ఈ కొండపై రాతి నీటి తొట్టెలు ఉండటంతో దీనికి తొట్లకొండ అనే పేరు వచ్చింది.

ఇక్కడ తొట్లకొండతో కలిపి మొత్తం ఎనిమిది కొండలు ఒకే వరుసలో ఉంటాయి.

అయితే ఇందులో ఏ కొండకూ లేనన్ని భూ వివాదాలు తొట్లకొండకే ఉన్నాయి.

ఈ కొండపై బౌద్ధ భిక్షువుల చైతన్య గృహాలు, ఆరామాలు, విహారాలు, మహా స్థూపం, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.

వీటి చుట్టుపక్కల ఉన్న భూమిని ప్రభుత్వం ఇతర సంస్థలకు, వ్యాపార అవసరాలకు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇంతకూ ఈ కొండపై బౌద్ధారామానికి చెందిన భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత?

తొట్లకొండ

నౌకాదళం కనుగొన్న కొండ

1975 సమయంలో భారత నౌకదళం తన అవసరాల కోసం స్థలాన్వేషణ చేస్తున్నప్పుడు తొట్లకొండను కనుగొన్నారు.

తొలుత నౌకదళం చేసిన ఏరియల్ సర్వేలో ఇక్కడి బౌద్ధ స్థూపాల‌ను గుర్తించారు.

ఆ తర్వాత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో ఈ నిర్మాణాలు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందు బౌద్ద భిక్షువులు నివసించిన ఆవాసాలుగా నిర్ధారించారు.

1978లో తొట్ల‌కొండ‌ను పురాత‌న ప్రాంతంగా, రక్షిత ప్రాంతంగా గుర్తించారు.

"ఇక్కడ జరిగిన తవ్వకాల్లో రోమన్లు, శాతవాహనుల కాలాల నాటి వెండి నాణాలు, బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనాలు లభించాయి. ఈ కొండపై రాతి స్తంభాలు, చైతన్య గృహాలు, వంటశాల, భోజనశాల, విహారాలు, ప్రధాన బౌద్ధ భిక్షు గది, సమావేశ మందిరం, గిడ్డంగి తదితర కట్టడాలు లభ్యమయ్యాయి. తొట్లకొండపై ఉన్న రాతి నీటి తొట్టెలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొంటాయి. బౌద్ధ భిక్షువులు తమ నీటి అవసరాల కోసం అప్పట్లో ఇక్కడ 11 నీటి తొట్టెలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏ కాలమైనా నీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, నీరు నిల్వ ఉండే విధంగా ప్రత్యేక శైలిలో వీటిని తీర్చిదిద్దారు" అని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఆర్కియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ తిమ్మారెడ్డి బీబీసీతో చెప్పారు.

తొట్లకొండ

పదకొండు తొట్టెల కొండ

"బౌద్ధ భిక్షువులు నీటిని నిల్వ చేసుకోవడం కోసం రాతిని తొలిచి తొట్టెలను తయారు చేసుకున్నారు. ఈ రాతి తొట్టెలు రెండు రకాలు. ఒకటి తాగునీటి అవసరాలకు ఉపయోగించేవి. రెండు చీవరాలకు (భిక్షువులు ధరించే పై వస్త్రం) రంగు అద్దుకోవడానికి రంగు నీటిని నిల్వ చేసే తొట్టెలు. అలాగే తొట్లకొండపైన ఉన్న మహా స్థూపంపై తెల్లని సున్నం అద్దేవారు. రాత్రిపూట దానిపై దీపాలను అలంకరించేవారు. అప్పట్లో దీపాలతో వెలుగుతున్న ఈ స్థూపమే రాత్రిళ్లు కొండపైకి ఎక్కే భిక్షువులకు, నావికులకు లైట్ హౌస్‌లా పని చేసేది అనడానికి ఆధారాలున్నాయి" అంటూ ప్రొఫెసర్ తిమ్మారెడ్డి తొట్లకొండ చరిత్ర వివరాలు తెలిపారు.

"ఇక్కడ నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇటుకలకు మూడింతలు పెద్దవిగా ఉన్న ఇటుకలతో కట్టారు. ఇవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ మధ్య కాలంలో కొన్ని అసాంఘిక శక్తులు కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేశాయి. ప్రకృతి వైపరిత్యాల కారణంగా మరికొన్ని కూలిపోయాయి. మరోవైపు, ఈ కొండపై ఉన్న భూమిని ప్రభుత్వం ఇతరులకు ఇచ్చేస్తోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న తొట్లకొండలాంటి పురాతన కట్టడాలే మన చరిత్రను భవిష్యత్తు తరాలకు చెబుతాయి. మనం భావి తరాలకు అందించగలిగే అపురూప సంపద అదే" అని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ అన్నారు.

తొట్లకొండ

బౌద్ధుల భూమే అందరికి కావాలా?

ఇప్పడు కూడా తొట్లకొండ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే మరిన్ని బౌద్ధ స్థావరాలు బయటపడతాయి. ఇలాంటి చోట కొత్తగా నిర్మాణాలు చేపడితే పురావస్తు సంపదను కోల్పోతాం. ఏవేవో సంస్థలకు అక్కడి స్థలాలు కేటాయించడంపై పోరాడుతున్నాం. పురావస్తుశాఖ పరిధిలోని స్థలంపై ప్రభుత్వ జోక్యం మంచిది కాదు. ప్రతిసారీ అందరికీ తొట్లకొండలోని పవిత్రమైన బౌద్ధ భూమే కనిపిస్తుందా?" అని తొట్లకొండ భూ కేటాయింపులపై కోర్టులలో పోరాటం చేస్తున్న ఏయూ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ పీడీ సత్యపాల్ అన్నారు.

"విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించక ముందు నుంచే ఇక్కడ భూమి బంగారంతో సమానం. అందులోనూ సాగరతీరానికి అభిముఖంగా, కొండలపై.. నగరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అందరి దృష్టి తొట్లకొండ, దాన్ని ఆనుకుని ఉన్న కొండలపై పడింది. సర్వే నంబర్‌ 314లో మొత్తం 3,143.40 ఎకరాలు ఉంది. ఇందులోనే తొట్లకొండ ఉంది. ఇదంతా ఆర్కియాలజీ సైట్ పరిధిలోకే వస్తుంది. ఎందుకంటే, నిర్మాణాలు ఉన్న చోటు మాత్రమే కాకుండా దాని పరిసర ప్రాంతాలను కూడా పురావస్తు స్థలాలగానే గుర్తించాలి. కానీ తొట్లకొండపై బౌద్ధ నిర్మాణాలున్న 120.88 ఎకరాలు మాత్రమే బౌద్ధ ప్రాధాన్యం ఉన్న స్థలమని ప్రభుత్వం నిర్థారించడం అన్యాయం. రీ సర్వే చేస్తే చాలా విషయాలు బయటపడతాయి" అని ఆయన చెప్పారు.

తొట్లకొండ

ఆర్కియాలజీ శాఖ యూత్ అండ్ టూరిజం విభాగమా?

యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన జీవో నెం. 21ని ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో కొండ పైకి నడకదారితో కలిపి తొట్లకొండలో పురావస్తు శాఖకు చెందిన స్థలం కేవలం 120.88 ఎకరాలేనని, మిగతాదంతా పురావస్తు శాఖ స్థలం కాదని చెప్పింది.

అదే విధంగా, ఫిల్మ్ క్లబ్‌కు కేటాయించిన 15 ఎకరాల స్థలం.. బౌద్ధ నిర్మాణాలు, దాని పరిసరాలకు చాలా అవతల ఉన్నదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవని కూడా పేర్కొంది.

దీంతో బౌద్ధ సంఘాలు ఆందోళనలకు దిగాయి.

"తొట్లకొండపై ఆర్కియాలజీ పరిశోధనలు సైతం పూర్తిగా జరగలేదు. ఇంకా చాలా ప్రాంతాన్ని పరిశోధించాల్సి ఉంది. అలా చేస్తే మరిన్ని బౌద్ధ నిర్మాణాలు, బౌద్ధ పరిసరాలు బయటపడతాయి. అమెరికాకు చెందిన లార్స్‌ ఫోగ్లిన్‌ అనే ఆంత్రోపాలజిస్టు 20 ఏళ్ల క్రితం తొట్లకొండపై ఉన్న బౌద్ధ స్తూపాలపై పరిశోధన చేసి.. 'ఆర్కియాలజీ ఆఫ్ ఎర్లీ బుద్ధిజం' అనే పుస్తకంలో రాశారు. ప్రస్తుతం ఉన్నవి కాకుండా మరో 120 వరకు బౌద్ధ నిర్మాణాలు ఉండొచ్చని ఫోగ్లిన్‌ ఆ పుస్తకంలో రాశారు. అసలు చరిత్ర విశిష్టత ప్రభుత్వ పెద్దలకు తెలుసా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, పురావస్తు ప్రాధాన్యత విభాగాన్ని యూత్ అడ్వాన్స్‌మెంట్ అండ్ టూరిజం విభాగంలో కలిపినప్పుడే తొట్లకొండపై ప్రభుత్వ అవగాహన అర్థమవుతోంది" అని ప్రొఫెసర్ సత్యపాల్ అన్నారు.

తొట్లకొండ

ఫిల్మ్ క్లబ్‌కు స్థలం ఇస్తారా?

భవిష్యత్తులో తవ్వకాలు జరిపితే మరిన్ని బౌద్ధ అవశేషాలు బయటపడవచ్చనే ఉద్దేశంతో 1978లో తొట్లకొండ, పరిసర కొండలతో కలిపి 3,300 ఎకరాలను పురావస్తు సంపదగా అధికారికంగా నోటిఫై చేశారు.

ఇందుకోసం ఆ భూమినంతటినీ 314 (పాత) సర్వే నంబరు కింద ప్రత్యేకంగా గుర్తించారు.

1960 చట్టం ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం, భూములను ఇతర అవసరాలకు ఉపయోగించడం నేరం.

అయితే, కాలక్రమేణా రెవెన్యూ విభాగం ఆ ప్రాంతాన్ని సబ్‌డివిజన్‌ చేసి ఇతర అవసరాలకు ఉపయోగిస్తోందని బౌద్ధ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

"2016లో రెవెన్యూ, స్టేట్ ఆర్కియాలజీ సంయుక్తంగా సర్వే చేశాయి. అందులో తొట్లకొండ మీద బౌద్ధ నిర్మాణాలన్నీ కలిపి 7 ఎకరాల 14 సెంట్లుగా లెక్క తేల్చారు. సుప్రీంకోర్డు తీర్పును అనుసరించి దానికి మరి కొంత భూమిని చేర్చి 120 ఎకరాలు ఆర్కియాలజీ ఇంపార్టెన్స్ ఉన్న భూమిగా తేల్చారు. ఇటీవల కాలంలో కొండ పైకి చేరుకునే దారిని సైతం అందులో కలిపి మొత్తం 120.88 ఎకరాలుగా సర్వే ద్వారా నిర్ణయించారు. తొట్లకొండ భూముల కేటాయింపులపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. 120.88 నోటిఫైడ్ ల్యాండ్ కాకుండా మిగతా ల్యాండ్‌లో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఫిల్మ్ క్లబ్)కు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది అని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై కూడా ప్రస్తుతం కొందరు పిల్స్ వేశారు" అని భీమిలి ఎమ్మార్వో ఈశ్వర్ తెలిపారు.

తొట్లకొండ

'కోర్టులున్నాయి.. చట్టాలున్నాయి.. '

ప్రభుత్వం తొట్లకొండపై ఇళ్ల స్థలాలు, గెస్ట్ హౌస్‌లు, ఐటీ కంపెనీలు, గ్రౌహౌండ్స్‌కు స్థలం, తాజాగా ఫిల్మ్ క్లబ్‌కు సైతం స్థలం కేటాయించింది.

రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధారామం ఇది.

ఇప్పటికీ జపాన్‌, మంగోలియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, చైనా, శ్రీలంక తదితర దేశాల బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు.

పురావస్తుశాఖ చట్టం, సముద్రతీర రక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడే భూములు కేటాయింపు, నూతన నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని బుద్ధిస్ట్ మాన్యుమెంట్‌ ప్రొటెక్షన్‌ కమిటీ కన్వీనర్‌ కొత్తపల్లి వెంకటరమణ అంటున్నారు.

"తొట్లకొండపై బౌద్ధ ప్రాధాన్యం ఉన్న స్థలం కేవలం 120.88 ఎకరాలు మాత్రమేనని, ఈ విషయమై ఎవరికైనా అభ్యంతరం ఉంటే తక్షణమే తెలియజేయాలని, రెండు నెలల్లో ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే 120.88 ఎకరాలనే ఖరారు చేస్తామని చెప్పడం అన్యాయం. కొండపై ఉన్న 3,143.40 ఎకరాలు బుద్ధిస్ట్‌ ప్రాంతమని ఆధారాలు చూపుతున్నా.. అభ్యంతరాలు చెప్పాలంటూ ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఇదంతా డ్రామా. గడుపు ముగియగానే తొట్లకొండ సర్వే నెంబర్‌ను విభజిస్తారు. దీనిపై మేమైతే కోర్టుల ద్వారా పోరాటాలు చేస్తున్నాం. అలాగే అన్ని రాజకీయ పక్షాలను, ప్రభుత్వ పెద్దలను కలిశాం. న్యాయం జరిగేంత వరకూ బుద్దుని భూమి కోసం పోరాటం చేస్తూనే ఉంటాం" అని బుద్ధిస్ట్ మాన్యుమెంట్‌ ప్రొటెక్షన్‌ కమిటీ కన్వీనర్‌ కొత్తపల్లి వెంకటరమణ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)