మనుషులు అసలు ఈ భూమిపై ఎలా ఆధిపత్యం సాధించగలిగారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జస్టిన్ రోవ్లాట్, లారెన్స్ నైట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రాయి, రాయి రాపిడి చేసి నిప్పు పుట్టించినప్పుటి నుంచి, శిలాజ ఇంధనాలను మండించి పారిశ్రామిక విప్లవం తెచ్చినవరకూ... మానవ జాతి అభివృద్ధిలో శక్తి గొప్ప పాత్ర పోషించింది.
ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తిని ఎలా తెచ్చుకుంటున్నామన్నది మనకు ఎప్పుడూ సవాలుగానే ఉంటూ వస్తోంది. ఈ సవాలును అధిగమించాలంటే మొత్తం మానవ జాతి కలిసిరావడం అవసరం.
ఈ ప్రపంచంపై మనుషులు ఆధిపత్యం సాధించడంలో శక్తే మనకు ప్రధాన ఆయుధంగా నిలిచింది.
ఖండాలను సైతం గంటల వ్యవధిలో చుట్టేందుకు తోడ్పడుతున్న జెట్ ఇంధనం, మొత్తం నగరాలనే క్షణాల్లో నాశనం చేసేయగల బాంబులే కాదు... మనం రోజూ ఉపయోగించుకునే శక్తి అది.
ఉదాహరణకు ఓ మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుందాం. అలా విశ్రాంతి తీసుకుంటున్నందుకు ఆ వ్యక్తి... పాత రకం లైట్ బల్బుతో సమానంగా 90 వాట్ల (జౌల్స్ పర్ సెకండ్) శక్తిని ఉపయోగించుకుంటాడు.
అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు మనిషి నిత్యం దానికి వంద రెట్లు శక్తిని వినియోగించుకుంటాడు. ఇళ్లలో విద్యుత్, కార్లకు ఇంధనం... ఇలా మనం వాడే అన్నీ వస్తువులు, వనరులకు అయ్యే శక్తి దాని కిందకి వస్తాయి.
సగటు అమెరికన్ రోజూ 10 వేల వాట్ల శక్తిని ఉపయోగించుకుంటాడు.
మిగతా జంతువులకు, మనకు ఉన్న భిన్నమైన జీవనశైలి, శారీరక నిర్మాణం, నాగరికతకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇదే జవాబు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ భూమి మీద మిగతా జీవులన్నింటి కన్నా భిన్నంగా... మనుషులు తమ శరీరం నుంచి వచ్చే శక్తినే కాకుండా, ఇతర శక్తులను చాలా ఎక్కువగా ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు.
మనం నిప్పు కనిపెట్టిన జీవులం.
అప్పటి నుంచి లక్షల ఏళ్లపాటు శక్తితో ఓ గొప్ప బంధం నిర్మించుకుంటూ వచ్చాం.
నిప్పు మనకు వెచ్చదనం, క్రూరజంతువుల నుంచి రక్షణ కోసమే కాదు... ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడింది.
మన శరీరతత్వం చాలా రకాలుగా మారడానికి నిప్పు కారణమైందని ఆంథ్రోపాలజిస్ట్‌లు అంటున్నారు.
ఒక జీవికి శక్తిని మెరుగ్గా వినియోగించుకునేందుకు తోడ్పడే ఏ అంశమైనా, దాని పరిణామ క్రమంపై గొప్ప ప్రభావం చూపుతుందని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న రేచల్ కార్మోడీ వ్యాఖ్యానించారు.
‘‘వంట చేయడం మొదలుపెట్టడం మన పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టం. వంట చేయడం వల్ల మన ఆహారంలోని శక్తి రూపాంతరం చెందుతుంది’’ అని ఆమె అన్నారు.
వేడి చేసినప్పుడు మన ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు బహిర్గతమవుతాయి. వాటిని జీర్ణం చేసుకోవడం మనకు చాలా సులువు అవుతుంది.
వండని పచ్చి ఆహారం నుంచి వచ్చే క్యాలరీల (శక్తి) కన్నా, ఇలా వండిన ఆహారం నుంచి వచ్చే క్యాలరీలు ఎక్కువ. ఓ రకంగా ముందే జీర్ణమైన ఆహారం తింటున్నట్లు అన్నమాట.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా అదనపు శక్తిని తీసుకోవడం వల్ల మనుషుల్లో పరిణామ క్రమంలో చిన్న పేగులు ఏర్పడటానికి కారణమైందని... కోతుల్లాంటి మన దగ్గరి జాతి జీవుల కన్నా మన మెదడు ఎక్కువ శక్తిని వినియోగించుకోవడం మొదలుపెట్టిందని రేచల్ అంటున్నారు.
‘‘మన మెదడుకు శక్తి పెరుగుతున్న కొద్దీ, అదొక సానుకూల వలయాన్ని సృష్టించింది. న్యూరాన్లు పెరిగాయి. తెలివి బాగా పెరిగింది’’ అని అమెరికాలోని వాండర్‌బిల్డ్ యూనివర్సిటీలో న్యూరో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సుజానా హెర్కులనో హౌజెల్ అన్నారు.
మెదడు పదును పెంచుకుని, మనం ఆహారపు వేటలో మెరుగయ్యాం.
ఆహారం నుంచి శక్తిని సులభంగా పొందేందుకు మరిన్ని మార్గాలు కనిపెట్టాం. రాళ్లతో పగులగొట్టాం. పొడి చేసుకుని తిన్నాం. ఎండబెట్టుకుని ఆరగించాం. కాల్చుకుని కూడా తిన్నాం.
ఇలా చేస్తూ మన శరీరానికి శక్తి సరఫరాను మరింత పెంపొందించుకున్నాం.
అలా మన మెదడు మరింత చురుగ్గా మారింది. ఇదొక వలయంలా ఏర్పడి, మన మెదళ్లు అద్భుతమైన స్థాయిని అందుకున్నాయి.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ లక్షల ఏళ్లలో వాతావరణం చాలా రకాలుగా మారుతూ వచ్చింది. ఉత్తరార్ధ గోళంలో మంచు పొరలు కప్పుకున్నాయి. మళ్లీ తొలిగిపోయాయి.
చివరి మంచు యుగం 12 వేల ఏళ్ల క్రితం ముగిసింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగి, స్థిరపడ్డాయి.
శక్తి రూపాంతరీకరణపై మానవజాతి దృష్టిపెట్టింది. అసలు ఊహించని స్థాయిలో సాంకేతిక మార్పులకు దారితీసిన పెద్ద విప్లవం అది.
‘‘మరో రెండు వేల ఏళ్లలో చైనా, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా... ఇలా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మొదలైంది. మంచు యుగంలో వ్యవసాయం అనేది దాదాపు అసాధ్యమైన పని. ఆ తర్వాత వాతావరణం వేడెక్కడం, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలుపెరగడంతో మొక్కలు పెరిగేందుకు బాగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి’’ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ బెటింగర్ చెప్పారు.
అలా వండుకోవడం నుంచి పంటలు పండించడం వైపు మనిషి దృష్టి సారించాడు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయానికి మనిషి చాలా శ్రమను పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.
ఆ శ్రమకు ప్రతిఫలంగా సమృద్ధిగా ఆహారం లభించింది.
పంటలను పండించడం గురించి ఓసారి మాట్లాడుకుందాం. పొలాలను సోలార్ ప్యానెల్స్ లాగా అనుకోండి. సౌరశక్తిని విద్యుత్‌గా మార్చడానికి బదులుగా మనం జీర్ణం చేసుకోగలిగే రసాయనిక శక్తిని అవి ఇస్తాయన్న మాట.
పైగా అప్పుడు పండించినవన్నీ గోధములు, మొక్కజొన్నలు, వడ్ల లాంటి ధాన్యాలే. వీటి ద్వారా శక్తిని నిల్వ చేసుకోగలిగామన్నమాట.
వాటిని అవసరమైనప్పుడు వాడుకున్నాం. వాటిని ఒకరితో ఒకరం మార్చుకుని వర్తకం చేశాం. మళ్లీ పంటలు వేయడానికి విత్తనాలుగా ఉపయోగించుకున్నాం.
మిగతా జంతువులను మచ్చిక చేసుకోవడానికి కూడా ఆ ధాన్యాలను వాడుకున్నాం. అలా మచ్చిక చేసుకున్న జంతువుల నుంచి మాంసం, పాల లాంటివి పొందాం.

ఫొటో సోర్స్, Getty Images
‘‘శతాబ్దాలు గడిచిన కొద్దీ మనిషి మచ్చిక చేసుకున్న జంతువులు, పెంచుకున్న మొక్కలు... ఇలా అన్నీ మనిషి చుట్టూ ఓ రకమైన ప్యాకేజీలా మారాయి. పంటలను వేసి జంతువులను పోషించాం. జంతువులను ఉపయోగిస్తూ పంటలను సాగు చేశాం. ఇలా మనకు మరింత మెరుగైన ఆహార వనరులు దొరికాయి’’ అని అమెరికాలోని స్మితోసియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన పరిశోధకురాలు మెలిండా జెడర్ చెప్పారు.
మరింత ఆహారం దొరికిందంటే... మరింత మంది మనుషులు తయారయ్యారు. అలా పెరిగిన జనం కొత్త ప్రాంతాలకు వెళ్లారు. మరింత ఆహారం సంపాదించే, కొత్త పద్ధతులు కనిపెట్టారు.
సౌరశక్తిని వ్యవసాయం ద్వారా వినియోగించుకుంటూ సాగిన ఓ వలయం అది.
అలా ఏర్పడిన మిగులు శక్తితో మనం పెద్ద పెద్ద జనాభాలను పోషించుకోగలిగాం. అందరూ వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. దీంతో మనుషులు వేరే పనుల మీద కూడా దృష్టి పెట్టారు.
మంచి పనిముట్లను తయారుచేశారు. ఇళ్లు కట్టారు. లోహాలను ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. ముఖ్యంగా ఒక మనిషి మరో మనిషికి సూచనలు చేయడం మొదలుపెట్టాడు.
మనుషుల మధ్య బంధాల్లో కొన్ని మౌలిక మార్పులు వస్తూ నాగరికతలు ఏర్పడటం మొదలైంది.
వేటాడుతూ బతికిన సమయంలో, దొరికిన ఆహారాన్ని సమంగా పంచుకుని మనుషులు బతికారు. కానీ, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక, మనుషుల్లో అసమానతలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
పొలాల్లో ఎక్కువ కష్టం చేసినవాళ్లు సహజంగానే ఎక్కువ ఫలితాలు పొందారు. అలా పండించినవారి నుంచి లోహపు ఆయుధాలు ఉన్నవాళ్లు పన్నుల రూపంలో తమ వాటా తీసుకున్నారు.
నిజానికి వ్యవసాయం అంతటి ఫలాలు అందించినా, కొన్ని వేల ఏళ్ల పాటు మనుషుల్లో ఎక్కువ మంది జీవన ప్రమాణాలు పెద్దగా మెరుగపడలేదు.
‘‘మనుషులు అంతా విలాసంగా ఉన్నది వేటాడిన రోజుల్లోనే. అప్పుడు వాళ్లు వారానికి 20 గంటలు మాత్రమే పని చేసేవాళ్లు. ఆ తర్వాతి యుగాల్లో రాజులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మాత్రమే అలాంటి విలాస జీవితాలు అనుభవించగలిగారు. ఇప్పుడు చాలా మంది అలాంటి పరిస్థితికి చేరుకున్నారు’’ అని ఆర్కియాలజిస్ట్‌గా పనిచేస్తున్న క్లేర్ వాల్టన్ అన్నారు.
సూర్యుడి నుంచి రోజూ వస్తున్న ఆ కిరణాల నుంచి పరోక్షంగా పొందుతున్న ఆ శక్తి పరిమితులను దాటి మనిషి మరింత ఎదిగేందుకు శక్తి వినియోగంలో పెనుమార్పు కావాల్సి వచ్చింది.
18వ శతాబ్దంలో ఆ మార్పు వచ్చింది. శిలాజ ఇంధనాలు దానికి దారితీశాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేల లోపల ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గుర్తించాం. లక్షల ఏళ్ల క్రితం సౌర శక్తిని నింపుకుని నేల లోపల మరుగునపడిపోయిన అడవుల ప్రస్తుత రూపమే బొగ్గు.
ఆ తర్వాత 20వ శతాబ్దంలో దాని కన్నా మెరుగైన చమురు, సహజ వాయువు దొరికాయి.
ఎన్నో కొత్త రకాల కార్యకలాపాలు సాధ్యమయ్యాయి.
ఈ శిలాజ ఇంధనాలు విరివిగా లభించాయి. గొప్ప శక్తిని అందించడంతో పాటు మనుషులు జంతువులపై ఆధారపడటాన్ని తగ్గించాయి.
మొదట బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజిన్లు మనుషులను ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకువెళ్లాయి. అనంతరం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు వచ్చాయి. ఆ తర్వాత జెట్ ఇంజిన్లు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, NASA
‘‘ఒక గుర్రం ఇచ్చేది ఒక హార్స్ పవరే. ఇప్పుడు లక్షల హార్స్‌పవర్ ఇచ్చే యంత్రాలు మన పరిశ్రమల్లో ఉన్నాయి. శాటర్న్ వీ రాకెట్ సామర్థ్యం 16 కోట్ల హార్స్‌పవర్’’ అని వివరించారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పర్యావరణ చరిత్రకారుడు పాల్ వార్డ్.
శిలాజ ఇంధనాలు మన వాహనాలకు ఇంధనంగానే కాదు... ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సహజ వాయువులో దాదాపు ఐదు శాతం అమ్మోనియా ఆధారిత ఎరువుల తయారీలో వినియోగం అవుతోంది. అదే జరగకుంటే సగం ప్రపంచం ఆకలితో అలమటిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తైన బొగ్గులో 13 శాతం ఇనుమును ఉక్కుగా మార్చేందుకే సరిపోతోంది.
ఇక ప్రపంచవ్యాప్త కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో ఎనిమిది శాతం కాంక్రీట్ నుంచే వస్తున్నాయి.
శిలాజ ఇంధనాలను ఉపయోగించుకోవడం మన జీవణ ప్రమాణాలపై గొప్ప ప్రభావం చూపించింది. పారిశ్రామిక విప్లవం తర్వాత మనం ఆరోగ్యపరంగా చాలా మెరుగయ్యాం. మనిషి సగటు ఆయుప్రమాణం పెరిగింది. మనుషుల సగటు ఎత్తు కూడా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇదంతా శిలాజ ఇంధనాలతో వచ్చిన విప్లవ ఫలితమే. అవే లేకపోతే, ఇప్పుడున్న రవాణా సదుపాయాలు ఉండేవి కాదు. విమానాలు ఉండేవి కాదు. ఆహార ఉత్పత్తిలో మిగులు ఏర్పడేది కాదు. చైనాలో తయారయ్యే సెల్‌ఫోన్లు 20 వేల కంటెయినర్లతో ఉన్న భారీ ఓడల్లో అమెరికా వరకూ వచ్చేవి కావు’’ అని కెనడాలోని మనిట్బోడా యూనివర్సిటీకి చెందిన వాక్లావ్ స్మిల్ అన్నారు.
అయితే, వ్యవసాయంలో ఉన్న కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించి, ఉన్నత జీవన ప్రమాణాలు కల్పించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ రూపు తెచ్చిన శిలాజ ఇంధనాలు... మన పర్యావరణంపై పెను ప్రభావాన్నే చూపించాయి. మన మనుగడను ప్రశ్నార్థకం చేయగల ముప్పులను కూడా తెచ్చాయి.
రెండు శతాబ్దాల క్రితం వ్యవసాయంతో వచ్చిన పరిమితులను బొగ్గు, చమురు, సహజ వాయువుతో మనం దాటేశాం.
ఇప్పుడు వాటి వల్ల వచ్చిన గ్లోబల్ వార్మింగ్ ముప్పును దాటేందుకు మనం మళ్లీ సూర్యుడి నుంచి రోజూ వస్తున్న ఆ శక్తి వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఈ సవాలును మనం దాటొచ్చు కూడా.
ఇవి కూడా చదవండి:
- దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








