పాబ్లో ఎస్కోబార్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ డాన్‌ను చంపేందుకు వేసిన ప్లాన్ ఎలా విఫలమైంది

ఫొటో సోర్స్, TWORIVERSMEDIA
- రచయిత, స్టీవెన్ బ్రకెల్‌హర్స్ట్
- హోదా, బీబీసీ న్యూస్, స్కాట్‌లాండ్
అది 1989వ సంవత్సరం. స్కాట్‌లాండ్‌కు చెందిన మెక్ అలీస్ నాయకత్వంలో బ్రిటన్‌కు చెందిన కొందరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని చంపడానికి బయలుదేరారు.
కొలంబియాలో మెడెల్లిన్ మాదకద్రవ్యాల ముఠాలకు పాబ్లో ఎస్కోబార్ నాయకుడు. చరిత్రలోనే అత్యంత ధనికుడైన నేరస్తుడిగా, దుర్మార్గుడిగా ఆయన్ను చెబుతుంటారు.
ప్రపంచ మార్కెట్‌లో 80శాతం కొకైన్ మాదక ద్రవ్యాన్ని తయారు చేసి, సరఫరా చేసే వ్యక్తిగా అప్పట్లో ఎస్కోబార్‌కు పేరుంది.
ఎస్కోబార్‌ను చంపడానికి ఆయన ప్రత్యర్ధులు పథకం రచించారు. ఇందుకోసం బ్రిటిష్ ఆర్మీలో ప్రత్యేక విభాగమైన స్పెషల్ ఎయిర్ సర్వీసెస్ (సాస్) మాజీ సభ్యుడైన మెక్ అలీస్‌ను ఎంచుకున్నారు.
కానీ, ఎస్కోబార్ ప్రత్యర్ధుల ప్రయత్నం విఫలమైంది. ఇదే విషయంపై 'కిల్లింగ్ ఎస్కోబార్' అనే పేరుతో కొన్నేళ్ల కిందట ఒక డాక్యుమెంటరీ కూడా విడుదలైంది.
ఈ ఆపరేషన్ వివరాలు, దాని వెనకున్న వ్యక్తుల గురించి ఆ డాక్యుమెంటరీ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
1942లో గ్లాస్గోలో మెక్ అలీస్ జన్మించినట్లు ఈ డాక్యుమెంటరీ రూపకర్త డేవిడ్ విట్నీ చెప్పారు.
స్కాట్‌లాండ్‌కు దగ్గరలోని రిడ్రీలో అలీస్ బాల్యం గడిచింది. నేర స్వభావం కలిగిన ఆయన తండ్రి బార్లీన్నీ అనే ప్రాంతంలోని జైల్లో ఎక్కువ కాలం గడిపారు. ఈ ప్రాంతం రిడ్రీకి సమీపంలోనే ఉంటుంది.
"నాకు చంపడంలో సైన్యం శిక్షణ ఇచ్చింది. కానీ, నాలో పోరాడే గుణాలు గ్లాస్గో నుంచే వచ్చాయి" అని ఆయన ఈ డాక్యుమెంటరీలో అంటారు. మెక్ అలీస్‌కు ఇప్పుడు 78 సంవత్సరాలు.
అలీస్ 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి సైన్యంలో చేరారు. తనలో ఉండే ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కడానికి అదొక్కటే మార్గంగా ఆయనకు తోచింది.
మొదట పారాచూట్ రెజిమెంట్లో చేరి, ఆ తర్వాత కొద్ది కాలానికే ఎలైట్-22 రెజిమెంట్‌లో సభ్యుడయ్యారు. స్కాట్‌లాండ్ సైనికుడిగా బోర్నియోలో పని చేశారు. అడవులలో జరిగిన భయంకరమైన యుద్ధాలలో పాల్గొన్నారు.
1969లో సైన్యం నుంచి వైదొలిగిన అలీస్, తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే అంటారు.

ఫొటో సోర్స్, TWORIVERSMEDIA
ఆ తర్వాత ఒకటి రెండు ఉద్యోగాలు చేసినా ఎక్కడా కుదురుకోలేకపోయారు. తాను జీవితంలో ఓడిపోయినట్లు ఆ సమయంలో అనిపించిందని ఆయన చెప్పారు.
ఆవేశంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా గాయపర్చడంతో అలీస్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. విడుదలయ్యాక అంగోలా సివిల్ వార్, రొడీషియా (ప్రస్తుత జింబాబ్వే), దక్షిణాఫ్రికాలలో కిరాయి సైనికుడిగా పని చేశారు.
1976లో అంగోలాలో ఉన్న సమయంలో డేవ్ టామ్‌కిన్‌ని కలిశారు. టామ్‌కిన్ సైనికుడు కాదు. ఆయుధాల సరఫరా, ఒప్పందాలు కుదర్చడంలాంటి పనులు చేసేవారు.
ఈ ఇద్దరూ అనుకోకుండా మంచి స్నేహితులుగా మారారు. అప్పుడే ఎస్కోబార్‌ని చంపే మిషన్‌ను టామ్‌కిన్స్ మెక్ అలీస్‌కి అప్పగించారు.
ఈ హత్య పథకానికి సూత్రధారి ఎస్కోబార్ ప్రత్యర్ధి ముఠాకు చెందిన జార్జ్ సాల్సెడో. ఈ ఆపరేషన్ కోసం ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలని టామ్‌కిన్స్‌కు జార్జ్ సాల్సెడో సూచించారు. ఇందుకు టామ్‌కిన్స్ మొదట సంప్రదించింది మెక్ అలీస్‌నే.
"ఎంతో అనుభవం ఉందని నమ్మితే తప్ప ఎస్కోబార్‌ను చంపే పనిని అప్పగించరు" అన్నారు మెక్ అలీస్. " అతన్ని చంపడానికి నాకు నైతికత అడ్డు రాలేదు. దాన్ని నేను హత్యగా చూడలేదు. ఒక లక్ష్యంగా చూశాను" అన్నారు మెక్ అలీస్.
"ఎస్కోబార్ తన హెసిందా నెపోలెస్ ర్యాంచ్‌కు వెళ్లినప్పుడు అతనిపై దాడి చేసి చంపగలమని అప్పట్లో జార్జ్ సాల్సెడో టీమ్ భావించింది" అని మెక్ అలీస్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, TWORIVERSMEDIA
తుపాకులు, బాంబులు
ఎస్కోబార్ ఎస్టేట్‌లో ఒక జూకు సరిపడా విదేశీ జంతువులు, భారీ అటవీ ప్రాంతం, విలాసవంతమైన పాత కార్లు, ఒక ప్రైవేటు ఎయిర్ పోర్టు, ఒక బుల్ రింగ్ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూలో చూసిన మెక్ అలీస్ హత్య పథకం అమలుకు ఓకే చెప్పారు. మిషన్ మొదలైంది.
టామ్‌కిన్స్ 12 మంది కిరాయి సైనికులను సమకూర్చుకున్నారు. వారిలో కొందరు గతంలో ఆయనతో కలిసి పనిచేశారు. వారు సూచించిన మరికొందరు ఈ టీమ్‌లో చేరారు.
జార్జి సాల్సెడో వారికి కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సాయం చేశారు. కలి కార్టెల్ మాఫియా కంపెనీ వారికి వసతి సౌకర్యాలను చూసుకుంది. ఒక్కొక్కరికీ నెలకు 5000 డాలర్లు, ఇతర ఖర్చులు ఇచ్చేవారు.
టామ్‌కిన్స్‌కు మాత్రం రోజుకు 1000 డాలర్లు ఇచ్చేవారు.
టామ్‌కిన్స్ చిత్రీకరించిన వీడియో ఫుటేజ్ కూడా ఈ డాక్యుమెంటరీలో ఉంది. అందులో వారు డబ్బు కట్టలతో ఆడుకోవడం కనిపిస్తుంది.
మొదట వారంతా కలీ నగరంలో ఉన్నారు. కానీ, అక్కడుంటే అందరి దృష్టి తమ పై పడుతుందని ఊరికి దూరంగా
పచ్చిక బయళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, TWO RIVERS MEDIA
అక్కడ వారికి ఆయుధాలను సమకూరాయి. "అప్పుడు క్రిస్మస్‌లా అనిపించింది. మాకు కావాల్సిన ఆయుధాలన్నీ లభించాయి" అని మెక్ అలీస్ చెప్పారు.
కిరాయి సైనికులు ఈ మిషన్ కోసం చాలా కష్టపడ్డారు. కానీ, టామ్‌కిన్స్, మెక్ అలీస్‌లకి మాత్రమే వాళ్ల టార్గెట్ ఎవరో తెలుసు.
మిగిలిన వారికి ఈ విషయం చెప్పే లోపే, ఓ బృందం ఈ పని నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.
దాడి చేసే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, ఎవరికీ కనపడకుండా, వినపడకుండా సాధన చేసేందుకు ట్రైనింగ్‌ను అడవిలోకి మార్చారు.
ఈ దాడికి సంబంధించిన ప్రణాళికలో హెసిందా నెపోలెస్ ర్యాంచ్‌లోకి వెళ్లేందుకు రెండు హెలికాఫ్టర్లు ఉంటాయి.
పని పూర్తయిన తర్వాత ఎస్కోబార్ తలను ట్రోఫీలా పట్టుకుని తేవాలి.

ఫొటో సోర్స్, TWO RIVERS MEDIA
ఎస్కోబార్ తన ర్యాంచ్‌లో ఉన్నట్లు సమాచారం రాగానే వారు వారి లక్ష్యం వైపు సాగారు. కానీ ఆ దాడి జరగ లేదు. మెక్ అలీస్, టామ్‌కిన్స్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో పైలట్ మరణించారు. మిగిలిన వారు బతికారు.
కానీ, మెక్ అలీస్ తీవ్రంగా గాయపడి నడవ లేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనను అక్కడ నుంచి రక్షించే వరకు భరించలేని బాధతో మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు.
ఈ కుట్ర గురించి తెలుసుకుని ఎస్కోబార్ తన మనుషులను పర్వతాల దగ్గరకు పంపించారు. "పాబ్లోకి కనుక దొరికిపోయి ఉంటే నా చావు ఘోరంగా ఉండేది" అని అలీస్ చెప్పారు.

ఫొటో సోర్స్, TWO RIVERS MEDIA
అక్కడ నుంచి ఎలాగోలా బయటపడిన ఆయన, తాను గతంలో దేవుడి ముందు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు.
తాను మారాల్సిన అవసరం ఉందని గ్రహించానని చెప్పారు.
యుద్ధ భూమిలో వైఫల్యాల కన్నా, భర్తగా, తండ్రిగా ఎక్కువ విఫలమయ్యానని అలీస్ బాధపడ్డారు.
"నాకు చాలా బాధలున్నాయి. అవేవీ తీరేవి కావు" అని ఆయన అన్నారు.
1993లో తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో పాబ్లో ఎస్కోబార్ మరణించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








