ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నెలానెలా జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి.. ప్రభుత్వం ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, facebook/Buggana Rajendranath Reddy
- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
"నేను ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైరయ్యాను. నాకు నెలకు రూ.45 వేలు పెన్షన్ వస్తుంది. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు విడతలుగా నా పెన్షన్ నుంచి ఆదాయపన్ను మినహాయిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఫిబ్రవరిలో నా పెన్షన్ నుంచి ఒకేసారి రూ. 44 వేలు కట్ అయిపోయింది. కేవలం వెయ్యి రూపాయలే జమైంది."
ఇది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పెన్షనర్ ఆవేదన..
"అధికారుల స్థాయిలో జరిగిన తప్పులకు నాలాంటి సామాన్యులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ సిబ్బంది విధుల నిర్వహణలో ఒత్తిడితో ఇలాంటి తప్పిదాలు జరిగిపోతున్నాయి. మళ్లీ వాటిని సరి చేసుకోవడానికి మేం కాళ్లరిగేలా తిరగాలి. ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. లేదంటే మేం ఇబ్బందులు పడుతున్నాం" అన్నారాయన.
ఆయన ఒక్కరే కాదు, రాష్ట్రంలో ఎంతో మంది ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. కొందరికైతే డీఏ జమ కాకుండానే ట్యాక్స్ కట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు కూడా సకాలంలో వేతనాలు అందడం లేదు. ఈ ఏప్రిల్‌లో 6వ తేదీన పెన్షన్లు, జీతాలు జమచేశారు. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయానికి వస్తే, చాలా శాఖల్లో నెలల తరబడి వేతనాలు పెండింగులో ఉన్నాయి.
స్కీమ్ వర్కర్లకూ ఈ సమస్య ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయలోపమే వీటన్నింటికీ కారణమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
ఆర్థిక సంవత్సరం ప్రారంభం, వరుస సెలవులు రావడంతో ఈ నెల కొంత సమస్య వచ్చిందని ప్రభుత్వం అంటోంది.

ఫొటో సోర్స్, SHANKAR
జనవరి నుంచి బకాయిలు, ఏప్రిల్‌లో జమ
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వేతనాలు ఇటీవల తరచూ ఆలస్యమవుతున్నాయి. ఒకటో తేదీన కాకుండా ఆ తర్వాత ఎప్పుడో ఖాతాల్లో జమ చేస్తున్నారు.
కానీ ఇటీవల బదిలీలతో వేరే ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు మాత్రం అనూహ్యంగా వేతనాలు నిలిచిపోయాయి.
ఏప్రిల్ 6 వరకూ చాలామందికి జీతాలు రావడం లేదు. దాంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు చేపట్టాయి.
ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఏడాది జనవరిలో ఉపాధ్యాయులను బదిలీలు చేశారు. అయితే, బదిలీ అయిన టీచర్ల వివరాలు విద్యాశాఖ నుంచి సీఎఫ్ఎంస్‌కి అందలేదనే కారణంతో వేతనాల చెల్లింపుల్లో సమస్య వచ్చింది. చివరకు ఉపాధ్యాయ సంఘాల రాయబారాల తర్వాత ఏప్రిల్ 5న కొందరికి, 6న మిగిలిన వారికి పెండింగ్ వేతనాల సహా మొత్తం చెల్లించారు.
అధికారుల మధ్య సమన్వయలోపం ఈ సమస్యకు ప్రధాన కారణమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ బీబీసీతో అన్నారు.
"జీఏడి, విద్యాశాఖ, సీఎఫ్ఎంఎస్ మధ్య సమన్వయం లేకపోవడంతో చాలామంది ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. ప్రస్తుతం పెండింగ్ వేతనాలు చెల్లించినప్పటికీ సమస్య పూర్తిగా సమసిపోలేదు. బదిలీ అయిన చోట పోస్టుతో సంబంధం లేకుండా అందరికీ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ముఖ్యమంత్రి ఆదేశాలతో బదిలీలు జరిగిన తర్వాత ప్రత్యేకంగా సీఎఫ్ఎంఎస్‌కి సమాచారం అవసరం లేదని విద్యాశాఖ చెప్పింది.
కానీ విద్యాశాఖ నుంచి సమాచారం లేక, జీతాలు చెల్లించలేకపోయామని సీఎఫ్ఎంస్ అంటోంది. ఇప్పుడైనా మొత్తం అందరి సమస్య పరిష్కరించాలి. లేదంటే అది పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, AP GOVT
బకాయి డీఏలతో మరో సమస్య...
2018 జులై నుంచి బకాయిలుగా ఉన్న కరువు భత్యం(డీఏ) ని మూడు విడతలుగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2021 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే ఫిబ్రవరి, మార్చిలో జమ కావాల్సిన డీఏ చాలామందికి జమ కాలేదు. అయినప్పటికీ డీఏ జమ అయినట్లుగా భావిస్తూ ట్రెజరీల్లో ఆ మేరకు ఆదాయ పన్ను కోత పెట్టడం కొందరిని ఆందోళనకు గురిచేసింది.
డీఏ బకాయిలు కూడా ఎక్కువమందికి జమయినట్టు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
కొన్ని చోట్ల సమస్య ఉన్నప్పటికీ ఏప్రిల్‌లో అందరికీ బకాయిలు లేకుండా జమ కాబోతున్నాయని, 2020 డిసెంబర్ వరకూ మొత్తం డీఏ అందరి ఖాతాల్లోకి చేరుతుందన్నారు.
అయితే మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియడం వల్ల కొందరికి పన్ను మినహాయింపులు చేసినట్టు తమకు సమాచారం ఉందని, అది పెద్ద సమస్య కాదని అన్నారు.

వేతనాలు ఆలస్యం ఎందుకు
డీఏ పెండింగులో ఉండడం కొంతకాలంగా జరుగుతోంది. కానీ ఇటీవల జీతాలు వేతనాలు పదే పదే ఆలస్యం కావడానికి రాష్ట్ర ఆర్థికస్థితితోపాటూ ఇతర సమస్యలు కూడా కారణమని చెప్పవచ్చు.
సహజంగా ప్రతి నెలా 25 నాటికి ఉద్యోగుల జీతాల బిల్లులను డ్రా అండ్ డిస్‌బర్సుమెంట్ అధికారులు ట్రెజరీలకు పంపించాల్సి ఉంటుంది.
అక్కడ పరిశీలన తర్వాత వాటిని సీఎఫ్ఎంస్‌కి పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ తర్వాత బిల్లులు ఆర్థిక శాఖకు చేరతాయి.
పెన్షన్ల విషయంలో మాత్రం సీఎఫ్ఎంఎస్ ద్వారానే బిల్లులు తయారై ట్రెజరీలకు చేరతాయి.
అక్కడ జాబితాలో తొలగింపులు, మార్పులు ఉంటే పూర్తి చేసి ఆర్థిక శాఖకు పంపిస్తారు.
అక్కడి నుంచి ప్రభుత్వం వద్ద నిధులను అనుసరించి రిజర్వుబ్యాంకుకు నివేదిస్తారు. దాని ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో నగదు జమ అవుతుంది.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయాయి. సామాజిక పెన్షన్లు ఒకటో తేదీ తెల్లవారుజామున ఇచ్చేస్తున్నారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల విషయం మాత్రం ఖాతరు చేయడం లేదు. అందుకే తరచూ జీతాలు లేటయిపోతున్నాయి. సాధారణ ఉద్యోగులం చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఒకటో తేదీనే జీతాలు వస్తాయనే ధీమా ఉండేది. దానికి తగ్గట్టు బ్యాంకులకు చెల్లింపులు, ఇతర అవసరాలు ప్లాన్ చేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అలా లేదు. నిర్ధిష్ట సమయం ఉండడం లేదు. పెన్షనర్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి" అని విద్యాశాఖ ఉద్యోగి వైఎస్ఎన్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణం..
ఆంధ్రప్రదేశ్ అప్పులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,25,234 కోట్లుగా ఉన్నాయి. ఇక తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.48,296 కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించారు.
అయితే, ఈ ఏడాది జనవరి(మూడో త్రైమాసికం)నాటికే ఈ అప్పులు రూ.73,913 కోట్లకు చేరాయి. అంటే బడ్జెట్ అంచనాలను మించి అప్పు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 131.88 శాతం పైగా అప్పులు చేయగా, ఈసారి అవి 150 శాతం దాటిపోయాయి.

ఫొటో సోర్స్, fb/YS Jagan Mohan Reddy
రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు, 3.6 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారికి ప్రతి నెలా వేతనాలు, పెన్షన్ల కోసం ప్రభుత్వం కనీసం రూ. 6 వేల కోట్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
దానిని సకాలంలో సర్దుబాటు చేయడమే ఇప్పుడు సమస్య అవుతోంది. ఇటీవల వేతనాలు కూడా అందరికీ ఒకే రోజు కాకుండా విడతల వారీగా చెల్లిస్తున్నారు.
సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం పెరగడం, కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ వాటా సకాలంలో అందకపోవడం వంటి ఎన్నో అంశాలు అప్పులకు కారణమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
అప్పులు పెరుగుతున్న సమయంలో సిబ్బంది సంక్షేమం కుంటుపడుతున్నట్టు ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు పి.రవికిరణ్ బీబీసీతో అన్నారు.
‘జీతాలకే దిక్కులు చూస్తున్నారు.. పీఆర్సీ, సీపీఎస్ ఇంకెక్కడ’
"తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు అందినా నేటికీ దాని జోలికి పోలేదు. సీపీఎస్ విషయంలో కూడా సీఎం చెప్పిన మాటలు ఆచరణలోకి రాలేదు. జీతాలు చెల్లించడానికే నెలనెలా ప్రభుత్వం దిక్కులు చూస్తుంటే, ఇతర ప్రయోజనాల మాట ఏమిటో అర్థం కావడం లేదు. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి ఉంది. గత ఏడాది కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం 20 వేల కోట్లకు పైగా పడిపోయింది. అదే సమయంలో కేంద్రం నుంచి తగిన తోడ్పాటు కూడా లేదు" అన్నారు రవికిరణ్.

ఫొటో సోర్స్, Getty Images
అవుట్ సోర్సింగ్ సిబ్బందికీ అదే సమస్య
బదిలీ అయిన ఉపాధ్యాయులకే కాకుండా రెవెన్యూ ఉద్యోగులకు కూడా వేతనాల పెండింగ్ సమస్య ఉంది. రాష్ట్రంలో 300 మందికి పైగా రెవెన్యూ సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి.
అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
వేతనాలు, పీఎఫ్ సహా ఇతర సదుపాయాలన్నీ అమలవుతాయని వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. అటవీశాఖ, మిగతా చాలా శాఖల్లో సిబ్బందికి ఈ సమస్య ఉంది.
ఇక స్కీమ్ వర్కర్లకు బిల్లులు, గౌరవ వేతనాలు పెండింగులో ఉన్నాయి.
వివిధ హోదాలతో అటవీశాఖలో 1987లోనే కాంట్రాక్ట్ పద్ధతిలో విధుల్లో చేరిన సిబ్బందికి 8 నెలలుగా జీతాలు రాలేదని, ఇటీవల ఆర్థిక సమస్యలతో నాగప్ప అనే ఉద్యోగి మరణించారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు ఏవీ నాగేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఆరు నెలలుగా బిల్లులు, గౌరవ వేతనాలు కూడా విడుదల చేయలేదు. యానిమేటర్లకు 2020 ఫిబ్రవరి నుంచి పెండింగ్ ఉంది. 35 వేల మంది గ్రామీణ అంగన్ వాడీలకు టీఏ బిల్లులు 2017 నుంచి బకాయిలున్నాయి. ఇలా వివిధ పథకాల్లో పనిచేస్తున్న వారికి కూడా బకాయిలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, facebook/YSJagan
ప్రతిపక్షాల విమర్శలు, తోసిపుచ్చుతున్న ప్రభుత్వం
ఏపీలో ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బీబీసీతో దీనిపై మాట్లాడారు.
"2020-21 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర పన్ను రాబడి రూ 70,679 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ. 49 వేల కోట్లతో కలిపి మొత్తం అప్పులు రూ.1.23 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అంటే, చెల్లింపులు మినహాయిస్తే, నికర అప్పు రూ.77 వేల కోట్లు. 2020-21లో గరిష్ఠ అప్పుల కారణంగా ఇకపై చెల్లింపులు కూడా రెట్టింపు అవుతాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ సంబంధిత సమస్యలపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ స్పందించారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి ఆయన అంగీకరించారు.. అదే సమయంలో ఆర్థిక పరిస్థితిపై విపక్షాల వాదనను తోసిపుచ్చుతున్నారు.
కరోనా సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక వ్యవస్థలోకి "డబ్బు పంపింగ్" చేసే ప్రయత్నం చేశామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర స్థూల రుణాలు ఇప్పుడు రూ .3.75 లక్షల కోట్లకు చేరుకున్న తరుణంలో, ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కోవిడ్ సమయంలో మేం వారికి తోడుగా ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం రూ.12 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఏపీలో ద్రవ్యోల్బణం మిగతా దక్షిణ భారత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ. ద్రవ్యోల్బణం బాగా పెరిగిందనే టీడీపీ ఆరోపణలకు, గణాంకాలకు చాలా తేడా ఉంది" అన్నారు.
ఉద్యోగుల వేతనాల విషయంలో సమస్యలన్నీ అధిగమించి అందరికీ ప్రతి నెలా చెల్లింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కొన్ని చోట్ల సమస్యలుంటే స్పందించి పరిష్కరిస్తున్నామని, త్వరలోనే ఆర్థిక పరిస్థితి గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








