తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం.. ఎవరెవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు?

స్కూల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలైనవారిలో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు... ఇప్పటివరకూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఆగిపోవడంతో కూలీలుగా మారిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న ఉదంతాలు కూడా చూశాం.

తెలంగాణలో దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి గత ఫిబ్రవరిలో స్కూళ్లు ప్రారంభమవడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్ది రోజులకే మళ్లీ పాఠశాలలను ప్రభుత్వం మూసేయాలని ఆదేశించింది.

దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాయం అందించేలా తాజాగా నిర్ణయం తీసుకుంది.

పాఠశాలలను మళ్లీ తెరిచే వరకూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర సీఎం కేసీఆర్ గురువారం ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్

ఫొటో సోర్స్, twitter/GKamalakarTRS

ఫొటో క్యాప్షన్, జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్

ఎంత మందికి లబ్ధి?

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 10,807 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

వీటిలో ఉపాధ్యాయులుగా సుమారు 1.28 లక్షల మంది పనిచేస్తున్నారు. మరో 17 వేల మంది బోధనేతర సిబ్బందిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఈ లెక్కన ఆర్థిక సాయం రూపంలోనే ప్రభుత్వం వీరి కోసం నెలకు సుమారు రూ.29 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

అయితే, రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సంఖ్య రెండు లక్షలకుపైగానే ఉందని తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (టీఆర్ఎస్ఎంఏ) అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు బీబీసీతో అన్నారు.

తెలంగాణలో 10,807 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో 10,807 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి

ఏ ప్రాతిపదికన ఇస్తారు?

ప్రభుత్వ సాయానికి అర్హులైనవారు తమ బ్యాంకు ఖాతా సహా ఇతర వివరాలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మలను విధివిధానాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఈ అంశమై వీరు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్‌వోలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.

ఈ భేటీ ముగిసిన తర్వాత మంత్రి గంగుల కమలాకర్ బీబీసీతో మాట్లాడుతూ... అర్హులను ఏ ప్రాతిపదికన గుర్తించబోతున్నారో వివరించారు.

‘‘లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాలు కోల్పోయినవారు కూడా ప్రభుత్వ సాయానికి అర్హులే. లాక్‌డౌన్ విధించడానికి ముందు కాలం నాటి పేస్లిప్‌లతో సిబ్బంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఈఓ, ఎంఈఓ, కలెక్టర్ వీటిని పరిశీలించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు’’ అని ఆయన వివరించారు.

ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన హాస్టళ్లలో పనిచేసే వార్డెన్‌లు, ఇతర సిబ్బందికి కూడా ప్రభుత్వ సాయం అందుతుందని గంగుల కమలాకర్ చెప్పారు.

వేతనాలు అందని ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని మాత్రమే ప్రత్యేకంగా గుర్తించి సాయం అందిస్తారా? అన్న ప్రశ్నకు... అలాంటి వడపోత ఏమీ ఉండదని మంత్రి సమాధానం ఇచ్చారు.

దాసరి శ్రీపాల్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, దాసరి శ్రీపాల్ రెడ్డి

‘సమస్య మూలాల్లోకి వెళ్లాలి’

అయితే ఫీజుల వసూళ్లు సరిగ్గా సాగే పరిస్థితి లేకపోవడమే సమస్యకు మూల కారణమని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ఎంఏ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘పాఠశాలలు మూతపడినా... నిజానికి ఆన్‌లైన్ క్లాసులు ద్వారా బోధన కొనసాగుతోంది. ఉపాధ్యాయులకు పని ఉంటోంది. కానీ, ఫీజుల వసూళ్లు ఇదివరకటిలా సాగడం లేదు. లాక్‌డౌన్ సమయంలో ఫీజులు అడగకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అందరం పాటించాం. కానీ, లాక్‌డౌన్ ముగిసి... జనజీవనం కుదుటపడ్డాక కూడా ఫీజుల చెల్లింపుల్లో అదే నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఫీజులు వసూలు కాకపోతే, విద్యా సంస్థలు వేతనాలు ఎలా చెల్లిస్తాయి. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. అప్పుడు ఉపాధ్యాయులు ఇబ్బంది పడే పరిస్థితే ఉండదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమని, అయితే ప్రభుత్వం అందిస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉందని టీఆర్ఎస్ఎంఏ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు అన్నారు.

‘‘రూ.7 వేల నెలవారీ సాయమైనా ఇవ్వాలని మేం ప్రభుత్వాన్ని కోరాం. ఈ రోజుల్లో రూ.2 వేలతో ఇల్లు గడిచే పరిస్థితి అసలు ఉందా? కనీసం రూ.5 వేలు ఇచ్చినా బాగుండేది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

స్టూడెంట్

ప్రైవేటు లెక్చరర్ల పరిస్థితి ఏంటి?

కరోనా సంక్షోభం కారణంగా పాఠశాలలతోపాటు కళాశాలలను కూడా ప్రభుత్వం మూసేసింది.

పాఠశాలల సిబ్బందిలాగే ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్నవారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం మంచి పరిణామమని, అయితే తమ ఇబ్బందులను కూడా పట్టించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్‌ను ఈ విషయమై ప్రశ్నించగా... ‘‘కరోనా సంక్షోభం కారణంగా ప్రైవేటు పాఠశాలల సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. సీఎం కేసీఆర్ వారి సమస్యలు పరిష్కరించడాన్ని ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ప్రైవేటు లెక్చరర్ల అంశం ఇంతవరకూ చర్చకు రాలేదు. దాన్ని కూడా పరిశీలించే అవకాశాలున్నాయి’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)