సోషల్ మీడియాలో తమ న్యూడ్ ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?

సోషల్ మీడియా
    • రచయిత, గురుప్రీత్ సైనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని ఓ పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల బాలికకు తోటి విద్యార్థుల్లో ఒక అబ్బాయి మంచి స్నేహితుడిగా మారాడు. అయితే, కొన్ని రోజులకు స్నేహం మితిమీరుతున్నట్లు భావించడంతో ఆమె అప్రమత్తమైంది.

అభ్యంతరకర ఫోటోలు పంపాలని ఆమెను అతడు కోరేవాడు. దీంతో అతడి స్నేహానికి ఆమె ముగింపు పలికింది.

పాఠశాలలో చదువు పూర్తయిన తర్వాత ఆమె 2014లో విదేశాలకు వెళ్లిపోయింది. అయితే, ఆమెను మాత్రం అతడు వదిలిపెట్టలేదు.

ఆమెను కలిసేందుకు ఏకంగా అతడు బ్రిటన్‌కు వెళ్లాడు. నేరుగా తన ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకు దిగి గాయాలపాలు కూడా చేశాడు. దీంతో స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

2017లో యూకేలోని మెజిస్ట్రేట్ కోర్టు అతణ్ని దోషిగా నిర్ధారించింది. అంతేకాదు ఆమెను మళ్లీ కలవాలని ప్రయత్నించొద్దని సూచించింది. ఆమె రెండేళ్లుగా నివసిస్తున్న నగరంలోకి ప్రవేశించొద్దని కూడా స్పష్టం చేసింది.

సోషల్ మీడియా

తర్వాత సోషల్ మీడియాలో..

2019 అక్టోబరు-నవంబరులో తన వ్యక్తిగత ఫోటోలు కొన్నింటిని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా కొన్ని సోషల్ మీడియా సైట్లలో అతడు పెట్టినట్లు ఆమె గుర్తించారు. ఈ ఫోటోలను 16ఏళ్ల వయసున్నప్పుడు అతడికి ఆమె పంపించారు.

దీనిపై దిల్లీ సైబర్ పోలీస్ విభాగంలో ఆమె ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన ఫోటోలను డిలీట్ చేయాలని ఆమె కోరారు.

ఇప్పుడు ఆమె వయసు 24ఏళ్లు. తన ఫోటోలను సోషల్ మీడియా సైట్లు డిలీట్ చేయడంలో విఫలం కావడంతో ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ఫోటోలకు సంబంధించి 50కి పైగా యూఆర్‌ఎల్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆమె కోర్టుకు తెలిపారు.

సోషల్ మీడియా

సోషల్ మీడియా సైట్లు ఏం చెబుతున్నాయి?

ఈ అంశంపై జులైలో ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, గూగుల్‌కు చెందిన యూట్యూబ్ స్పందించాయి. ఆమె ఫోటోలకు సంబంధించిన అన్ని యూఆర్‌ఎల్‌లను తాము డిలీట్ చేసినట్లు కోర్టుకు వివరించాయి. అయితే, మళ్లీ ఎవరో ఆ ఫోటోలను అప్‌లోడ్ చేయడం వల్లే మళ్లీ మళ్లీ అవి కనిపిస్తున్నట్లు తెలిపాయి.

నిందితుడు అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఇప్పటికే చాలా మంది వరకు వెళ్లిపోయాయి. తాము డిలీట్ చేసినప్పటికీ.. కొందరు మళ్లీ అప్‌లోడ్ చేస్తున్నారని ఆ సంస్థలు తెలిపాయి.

దీంతో అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియాలో అడ్డుకొనే ఆవశ్యకతను దిల్లీ హైకోర్టు నొక్కి చెప్పింది. ఇలాంటివి మరింత మందికి చేరకుండా నిలువరించాలని సూచించింది.

ఇలాంటి ఫోటోలను తొలగించాలని అభ్యర్థనలు వచ్చిన వెంటనే సంస్థలు చర్యలు తీసుకోవాలని కంపెనీలకు కోర్టు స్పష్టీకరించింది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, iStock

మళ్లీ అప్‌లోడ్ చేసేవారిపై చర్యలు

మరోవైపు అభ్యంతరకర ఫోటోలను మళ్లీ అప్‌లోడ్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోర్టు సూచించింది.

బాలల అశ్లీలతకు సంబంధించి ఎలాంటి సమాచారమూ తమ వేదికలపై ఉండకుండా చూడాలని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు కోర్టు నొక్కిచెప్పింది.

ఈ సందర్భంగా బాలలపై లైంగిక కార్యకలాపాల నిరోధక చట్టం(పోక్సో)లోని సెక్షన్ 20ను కోర్టు ప్రస్తావించింది.

తాజా కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారం బాలల అశ్లీలత కిందకు వస్తుందని, ఎందుకంటే ఆ ఫోటోలు పంపించినప్పుడు ఆమె వయసు 16ఏళ్లు అని కోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు ఈ కేసును సైబర్ నేరాల్లో అత్యున్నత సంస్థ అయిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)కి బదిలి చేయాలని, ఈ సమాచారం డిలీట్ చేయడానికి సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వివరించింది.

వారిని గుర్తించడం ఎలా?

ఏదైనా ఫోటోను డౌన్‌లోడ్ చేసి, మళ్లీ అప్‌లోడ్ చేసే వారిని గుర్తించడం ఎలా? వారిపై చర్యలు తీసుకోవచ్చా?

ఈ విషయంపై సైబర్ నిపుణుడు నిఖిల్ పహ్వా మాట్లాడారు. ‘‘ఈ కంపెనీల దగ్గర వినియోగదారుల ఫోన్‌ నంబర్లు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఫేస్‌బుక్ లేదా గూగుల్ అకౌంట్లను ఈ-మెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు సాయంతో క్రియేట్ చేస్తుంటారు’’.

‘‘ఈ నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ సాయంతో మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేసేవారిని గుర్తించవచ్చు’’.

‘‘కంపెనీల నుంచి ఈ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే మొబైల్ ఆపరేటర్లను పోలీసులు సంప్రదిస్తారు. దీంతో వారిని గుర్తించేందుకు వీలుపడుంది’’.

‘‘నాకు తెలిసినంత వరకు, ఈ విషయంలో కొంతమందిపై చర్యలు తీసుకుంటే ప్రజలకు గట్టి సందేశం పంపినట్లు అవుతుంది. ఫలితంగా ఎవరైనా అప్‌లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మరోవైపు బాధిత బాలికకు న్యాయం చేకూరడంలో ఇది చాలా ముఖ్యం’’.

ఇలాంటి కేసుల్లో బాధితులకు 20ఏళ్లుగా సాయం చేస్తున్న సైబర్ చట్టాల నిపుణురాలు డాక్టర్ కర్ణిక సేత్ కూడా బీబీసీతో మాట్లాడారు. ‘‘ఇలాంటి కేసుల్లో చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడమే పరిష్కారం. సంబంధిత చట్టాల్లో నిపుణులైన వారిని బాధితులు ఆశ్రయిస్తే మంచిది’’అని ఆమె అన్నారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, GETTY CREATIVE STOCK

అదే పరిష్కారం..

బాధితురాలు నేరుగా కోర్టును సంప్రదిస్తే.. వెంటనే అలాటి చిత్రాలను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని డా.కర్ణిక వివరించారు.

‘‘చాలా కేసుల్లో కోర్టులు డిలీట్ చేయమని చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఎవరోఒకరు అప్‌లోడ్ చేయడంతో మళ్లీ ఆ ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. అసలు కోర్టులు చెప్పకముందే సంస్థలు చర్యలు తీసుకుంటే మంచిది’’.

‘‘ఈ విషయంలో టెక్నాలజీ సాయం తీసుకోవాలి. ఒకేలాంటి ఫోటోలను, వీడియోలను గుర్తించే చాలా టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫోటో డీఎన్‌ఏ విధానంలో ఇవి పనిచేస్తాయి. దీనిలో భాగంగా ప్రతి ఫోటోకు ఒక కోడ్ ఉంటుంది. దాని సాయంతో అలాంటి ఫోటోలు ఇంటర్నెట్‌లో మరెక్కడైనా ఉన్నాయోమో తెలుసుకోవచ్చు’’.

ఈ విధానాన్ని ఆశ్రయిస్తే.. ఫోటోలు మరింత మందికి చేరకుండా అడ్డుకోవచ్చని కర్ణిక వివరించారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

బాలల విషయంలో..

మరోవైపు బాలల అశ్లీలతకు సంబంధించి తాము చాలా చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ఫేస్‌బుక్ ఓ ప్రమాణ పత్రంలో తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)తో కలిసి పనిచేస్తున్నామని సంస్థ తెలిపింది.

ఎన్‌సీఎంఈసీ ఓ స్వచ్ఛంద సంస్థ. తప్పిపోయిన బాలల కోసం సంస్థ పనిచేస్తుంది. బాలలపై లైంగిక వేధింపులను తగ్గించేందుకు కృషి చేస్తుంది.

ఇంటర్నెట్‌లో బాలలకు సంబంధించి అశ్లీల సమాచారన్ని రిపోర్ట్ చేసేందుకు ఎన్‌సీఎంఈసీ ఓ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తమకు ఏదైనా రిపోర్ట్ అందిన వెంటనే ఆ అశ్లీల సమాచారాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తామని సంస్థ తెలిపింది.

మరోవైపు బాలల అశ్లీల సమాచారం, లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి సంబంధించి యూట్యూబ్‌తోపాటు తమ సెర్చ్ ఇంజిన్లలోనూ చర్యలు తీసుకొంటున్నట్లు గూగుల్ కూడా ఓ ప్రమాణపత్రాన్ని దాఖలుచేసింది.

ఎవరైనా రిపోర్ట్ చేస్తే వెంటనే స్పందించి ఆ సమాచారాన్ని డిలీట్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.

యూట్యూబ్‌లో వ్యక్తులు లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇలా ఎవరైనా బాలల అశ్లీల సమాచారాన్ని గుర్తించి రిపోర్ట్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

‘‘ఫేస్‌బుక్, గూగుల్ ప్రమాణపత్రాలను పరిశీలిస్తే వారు అభ్యంతరకర సమాచారాన్ని అడ్డుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది’’అని కోర్టు కూడా వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, iStock

తగినంత మందిని నియమించాలి

బాలల అశ్లీల సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు వీలైనంత మేర కృషిచేస్తున్నాయని సైబర్ నిపుణులు భావిస్తున్నాయి. అయితే సంస్థలు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు చెబుతున్నారు.

‘‘బాలల అశ్లీల సమాచారాన్ని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ విషయంలో చాలా మంది టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. కానీ ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో అభివృద్ధి అయ్యేందుకు సమయం పడుతుంది’’అని సైబర్ నిపుణుడు నిఖిల్ వ్యాఖ్యానించారు.

‘‘రోజూ సోషల్ మీడియాలో బిలియన్ల కొద్దీ చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. అందుకే రిపోర్ట్ చేసిన వెంటనే ఇలాంటి సమాచారాన్ని అడ్డుకునే దిశగా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’.

‘‘ఇంటర్నెట్‌లో చిన్న చిన్న వీడియోలు చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి. అందుకే వెంటనే స్పందించడం మంచిది’’అని కర్ణిక వివరించారు.

ఈ దిగ్గజ సంస్థలకు భారత్‌లోనూ తగినంతమంది ప్రతినిధులు ఉండాల్సిన అవసరముందని ఆమె వివరించారు.

‘‘కంప్యూటర్ ఆధారిత స్పందనలు ఇచ్చి ఊరుకోవడం సరికాదు. వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రతినిధులను అందుబాటులో ఉంచాలి’’అని ఆమె సూచించారు.

ఇంటర్నెట్‌ను నియంత్రించడం అంతతేలిక కాదు.. కానీ సాంకేతికత, చట్టాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే.. కొంతవరకు ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని పుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)