సెక్స్‌ వర్కర్స్‌‌ను కార్మికులుగా గుర్తించాలా... వారి వృత్తిని చట్టబద్ధం చేయడం సాధ్యమేనా?

సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సమాజంలో వివక్షకు గురవుతూ, ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపులేని సెక్స్‌వర్కర్లకు కూడా మానవ హక్కులుంటాయని, వాటిని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) స్పష్టం చేసింది. సెక్స్‌వర్కర్లను “సాంప్రదాయేతర కార్మికులు’’గా గుర్తించాలని సూచించింది.

ఇప్పటి వరకు సెక్స్‌ వర్కర్లకు అందుబాటులో లేని ప్రభుత్వ పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు వారికి అందేలా చూడాలని, దీనికి అవసరమైన గుర్తింపు పత్రాలను ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల సంఘం సూచించింది.

కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా సమాజంలో దెబ్బతిన్న బలహీన వర్గాల ప్రజల సమస్యలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి, అనేక ఇతర వృత్తుల వారికిలాగానే సెక్స్‌వర్కర్స్‌ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వాళ్లకు సాంప్రదాయేతర కార్మికులుగా గుర్తింపునిచ్చి కార్మికులకు ఇస్తున్న ప్రయోజనాలు అందించాలని చెప్పింది.

లాక్ డౌన్ కాలంలో సెక్స్ వర్కర్ల జీవితం నరకంగా మారింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్ డౌన్ కాలంలో సెక్స్ వర్కర్ల జీవితం నరకంగా మారింది

మానవ హక్కుల సంఘం చేసిన సూచన ఓ గొప్ప సూచనని, సంతోషకరమైన విషయమని నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ సెక్స్‌ వర్కర్స్‌ (ఎన్‌.ఎన్‌.ఎస్‌.డబ్ల్యూ.) పేర్కొంది.

సెక్స్‌ వర్కర్ల హక్కుల కోసం ఎన్‌.ఎన్‌.ఎస్‌.డబ్ల్యూ. ఆధ్వర్యంలో అనేక సంఘాలు పని చేస్తున్నాయి.

“కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సెక్స్‌వర్కర్లు ఉపాధిని కోల్పోయారు. తమను కార్మికులుగా గుర్తించాలంటూ వారు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులుగా గుర్తింపు లభిస్తే ప్రభుత్వం నిరుద్యోగులకు అందించే భృతి, తదితర ప్రయోజనాలు వారికి కూడా అందుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం అమలైతే అది వారికి గొప్ప ఊరట’’ అని నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ సెక్స్‌ వర్కర్స్‌కు న్యాయ సలహాదారుగా పని చేస్తున్న ఆర్తి పాయ్‌ బీబీసీతో అన్నారు.

మహారాష్ట్ర తరహాలో పాలిచ్చే తల్లులైన సెక్స్‌వర్కర్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాని కూడా మానవహక్కుల సంఘం వివిధ రాష్ట్రాలకు సూచించింది.

పాలిచ్చే తల్లులైన సెక్స్‌వర్కర్లకు ఈ ఏడాది జులై 2020 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వపు మహిళా శిశు సంక్షేమ శాఖ రేషన్‌ సరుకులను అందిస్తోంది.

సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా గుర్తించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సూచించింది
ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా గుర్తించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సూచించింది

ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు లేకపోయినా వారికి తాత్కాలిక పత్రాలతో రేషన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘం సూచించింది. “ ఇల్లు విడిచి వచ్చిన సెక్స్‌వర్కర్లలో ఎక్కువమందికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. అందుకే వారిని ఆదుకోవాలని మానహహక్కుల సంఘం ప్రత్యేకంగా సూచించింది’’ అని ఆర్తిపాయ్‌ అన్నారు.

వలస వచ్చిన సెక్స్‌ వర్కర్లకు వలస కూలీలకు అందించే ప్రయోజనాలను అందించాలని, తమ భాగస్వాముల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను గృహహింస కేసులుగా పరిగణించాలని, అలాగే వారికి ఉచిత శానిటైజర్లు, మాస్కులు, సబ్బుల, ఇతర ఆరోగ్య సదుపాయాలతోపాటు టెస్టులను కూడా ఉచితంగా చేయాలని మానహహక్కుల కమిషన్‌ సూచించింది.

హెచ్‌ఐవీతోపాటు శారీరకంగా సంక్రమించే పలు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలకు సంబంధించిన అంశాలలో ప్రభుత్వం వారికి సాయం చేయాలని కమీషన్‌ సూచించింది.

సెక్స్‌ వర్కర్లకు, వేశ్యావృత్తి పీడితులకు మధ్య తేడాను గుర్తించి, అందుకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది ఆర్తిపాయ్‌ ప్రశంసించారు.

“ఇక్కడ సెక్స్‌ వర్కర్లంటే పొట్టకూటి కోసం ఈ వృత్తిలోకి దిగిన వారు. వేశ్యావృత్తి బాధితులంటే వారికి ఇష్టంలేకపోయినా బలవంతంగా ఈ వృత్తిలోకి వచ్చినవాళ్లు’’ అని పాయ్‌ అన్నారు.

“గుర్తింపు కోసం మేం చాలా ఏళ్లుగా పోరాడుతున్నాం. ఎట్టకేలకు మమ్మల్ని నేరస్తులుగా కాకుండా కార్మికులుగా గుర్తించాలన్నారు. ఇది చాలా సంతోషించే విషయం. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం చాలా ఉంటుంది’’ అని నేషనల్ నెట్‌వర్క్‌ ఫర్‌ సెక్స్‌ వర్కర్స్‌ సంస్థకు సమన్వయకర్తగా పని చేస్తున్న అయేషా రాయ్‌ వ్యాఖ్యానించారు.

సెక్స్ వర్కర్ల చుట్టూ జరిగే ప్రతిదాన్ని నేరంగా చూస్తున్నారంటున్న స్వచ్ఛంద సంస్థలు
ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్కర్ల చుట్టూ జరిగే ప్రతిదాన్ని నేరంగా చూస్తున్నారంటున్న స్వచ్ఛంద సంస్థలు

ఎన్‌హెచ్‌ఆర్‌సి నిర్ణయానికి నేపథ్యమేంటి ?

బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంగా నేషనల్ హ్యూమన్‌ రైట్స్ కమీషన్‌ ఈ సూచనలు చేసింది. కొద్దిరోజుల కిందట ఓ కేసుకు సంబంధించి మడగావ్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అడిషనల్‌ సెషన్స్‌ జడ్జ్ సమర్ధించారు. అయితే ఆయన ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టివేసింది.

మనుషుల అక్రమ రవాణ (నిరోధక) చట్టం కింద ముగ్గురు యువతులను పోలీసులు వల పన్ని పట్టుకున్న కేసులో ముంబైలోని దిగువ కోర్టుల్లో విచారణ జరిగింది. కింది కోర్టులు ఆ ముగ్గురు మహిళలను దోషులుగా గుర్తించాయి. తర్వాత వారిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని వారి సొంత ఊళ్లకు చేర్చారు.

అయితే, ఈ కేసు బాంబే హైకోర్టులో విచారణకు రాగా చీఫ్‌ జస్టిస్‌ పృథ్విరాజ్‌ కె.చవాన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. “వేశ్యావృత్తి చేస్తున్నారనే కారణంతో ఏ వ్యక్తినీ శిక్షించడానికి చట్టాలలో నిబంధనలు లేవు” అన్నారు. నిందితులు వేశ్యావృత్తి చేశారనడానికిగానీ, ఎవరినైనా అందుకు ప్రోత్సహించారనడానికిగానీ ఎలాంటి ఆధారాలు లేవు” అని చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యానించారు.

“నిందితులుగా చెబుతున్న వారంతా మేజర్లే. దేశంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివసించే హక్కు వారికి ఉంది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్నారు’’ అని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుబట్టారు. అవి న్యాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

“మా పోరాటమంతా వాళ్లు ఉపయోగిస్తున్న భాష గురించే. కోర్టుల్లో కూడా మమ్మల్ని వేశ్యలు అని సంబోధిస్తుంటారు. కానీ, వేశ్యావృత్తి, వేశ్య అన్నవి చట్ట వ్యతిరేకమైనవని న్యాయశాస్త్రంలో ఎక్కడా లేదు. ఈ కేసులో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు ఊరట కలిగించేలా ఉంది. ఎందుకంటే ఇందులో నిందితులకు శిక్ష పడితే జైళ్లు లేదా జైలు తరహా ప్రదేశాలలో ఉంచుతారు ” అని మహారాష్ట్ర సాంగ్లీలో సంగ్రామ్‌ సంస్థ అనేక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న మీన శేషు బీబీసీతో అన్నారు. సెక్స్‌ వర్కర్లను బలిపశువులను చేయడం ఎప్పటి నుంచో ఉంది అంటారామె.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’

సెక్స్ వర్క్‌ను చట్టబద్ధం చేయడమే మిగిలిందా ?

“సెక్స్‌వర్క్‌ను నేరంగా పరిగణించవద్దని మేం ఎప్పటి నుంచో కోరుతున్నాం. మన చట్టాలు సెక్స్‌వర్క్‌ను నేరం అనడంలేదు కానీ, దాని చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నేరంగానే చూస్తున్నాయి. అందుకే సెక్స్‌వర్క్‌ను చట్టబద్ధం చేయాలని కాకుండా నేరంగా పరిగణించ వద్దని మేం కోరుతున్నాం. ఎందుకంటే రేపు ఒక మహిళ ఒక లైసెన్స్‌ సంపాదించి నేను సెక్స్‌ వర్కర్‌గా మారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి రాకూడదు’’ అంటున్నారు మీనశేషు.

“ఇదొక పెనుమార్పు. కర్ణాటక సెక్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ కూడా తమను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇచ్చిన సూచనను మా పిటిషన్‌కు జత చేస్తాం. ఈ చీకటి రోజుల్లో కూడా ఓ కాంతి రేఖ కనిపిస్తోంది’’ అని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంగమ ఎల్జీబీటీ కమ్యూనిటీ డైరక్టర్‌ రాజేశ్‌ బీబీసీతో అన్నారు.

మొత్తం మీద సెక్స్‌వర్కర్లను కూడా కార్మికులుగా గుర్తించాలన్న వాదనకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సూచనతో బలం చేకూరింది. కొందరు భావిస్తున్నట్లు అధికారిక గుర్తింపునకు ఈ సూచన బాటలు పరుస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)