LGBT: బైసెక్సువల్ అని చెప్పుకోగానే అమ్మాయిల కష్టాలు ఎందుకు పెరుగుతాయి?

LGBT

ఫొటో సోర్స్, Sonal Giani/Facebook

ఫొటో క్యాప్షన్, సోనల్ జ్ఞాని
    • రచయిత, సింధువాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“పురుషుడు, మహిళల్లో ఒకరిని ఎంచుకోవడం, కేక్, ఐస్‌క్రీంలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం లాంటిదే. అలా అన్ని రకాల ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నా, అన్నిటినీ రుచిచూడకపోవడం తెలివితక్కువ తనమే అవుతుంది” అని ఐస్‌లాండ్ ప్రముఖ పాప్ గాయకుడు బియర్క్ ఒకసారి అన్నారు..

బియర్క్ చెప్పింది కొంతమందికి ‘అర్థరహితం’గా అనిపించవచ్చు, కానీ అక్కడ ఆయన బైసెక్సువాలిటీ దిశగా సంకేతం ఇచ్చారు.

పురుషులు, మహిళలు ఇద్దరి పట్లా లైంగిక ఆకర్షణకు గురైనవారిని బైసెక్సువల్(ద్విలింగ సంపర్కులు) అంటారు.

మనం ఎల్జీబీటీక్యూ సమాజం గురించి మాట్లాడుకుంటే, అందులో ‘బీ’ అంటే బైసెక్సువల్ అనే అర్థం వస్తుంది.

ఒక అమ్మాయి బైసెక్సువల్ అయితే

దిల్లీలో ఉండే 26 ఏళ్ల గరిమా కూడా తనను బైసెక్సువల్‌గా భావిస్తారు. ఆమె అమ్మాయిలు, అబ్బాయిల పట్ల సమాన లైంగిక ఆకర్షణకు గురయ్యారు. ఇద్దరితో డేట్ చేశారు.

“నేను మొదటిసారి ఒక అమ్మాయిని కిస్ చేసినప్పుడు, నాకు ఆ క్షణం అబ్బాయిని కిస్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే అనిపించింది. ఇది అంత సహజమే అయినప్పుడు జనం దానిని అసహజం అని ఎందుకు అంటారో.. అని నాకు అనిపించింది” అన్నారు.

గరిమ ఎలాంటి భయం, సంకోచం లేకుండా తనను తాను అంగీకరించారు. కానీ ఆమె దానిని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టం,.

“మన సమాజంలో అమ్మాయిలు తమ సెక్సువాలిటీ గురించి బయటపెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే, ఏదైనా చెబితే, మనకు అసలు లైంగిక కోరికలే లేవని చెప్పినట్లు భావిస్తారు. అలాంటిది మీరు అబ్బాయి, అమ్మాయి ఇద్దరినీ ఇష్టపడుతున్నారనేది తెలిస్తే.. జనం అసలు స్వీకరించరు” అని ఆమె చెప్పారు.

గరిమకు యుక్తవయసులోనే అమ్మాయిలు అంటే ఇష్టం మొదలైంది. కానీ ఆమె ఎప్పుడూ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.

“మన చుట్టుపక్కల వాతావరణంలో వేరే సెక్సువాలిటీ గురించి ఎవరూ మాట్లాడరు. ఎవరూ చెప్పుకోరు. సినిమాలు, కథల నుంచి ప్రకటనల వరకూ అన్నీచోట్లా కేవలం మహిళ, పురుషులనే చూపిస్తారు. అలాంటప్పుడు మనం అదే కరెక్ట్ అని, అదే నార్మల్ అని అనుకుని ఉండిపోతాం” అన్నారు.

కాలేజీలో ఫస్ట్ ఇయర్‌కు వచ్చేసరికే గరిమ ఎల్‌జీబీటీక్యూ సమాజం గురించి చాలా వివరాలు చదివి తెలుసుకున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరి పట్లా ఆకర్షణ ఉండడం సహజమేనని ఆమె తెలుసుకన్నారు. తన మొదటి బాయ్‌ఫ్రెండుతో బ్రేకప్ తర్వాత ఆమె ఒక అమ్మాయితో డేట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికిగానీ ఆమె తన సెక్సువాలిటీని అంగీకరించలేకపోయారు.

కానీ బైసెక్సువల్ గుర్తింపుతో ఒక అమ్మాయి ఒక సంకుచిత సమాజంలో జీవించడం అంత సులభం కాదని గరిమ మళ్లీ సందిగ్ధంలో పడ్డారు.

బయటి ప్రపంచం కాదు కదా, స్వయంగా ఎల్జీబీటీ సమాజంలో కూడా బైసెక్సువల్ గురించి చాలా సందేహాలు, అపోహలు ఉంటాయి. ఫలితంగా ఆమె ఆ సమాజంలో కూడా చాల రకాల వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.

LGBT

ఫొటో సోర్స్, AFP

నమ్మకం, చరిత్రపై ప్రశ్నలు

“బైసెక్సువల్ అయిన వారు భాగస్వామితో నమ్మకమైన బంధాన్ని కొనసాగించరని ఎల్జీబీటీ సమాజంలో చాలా మంది భావిస్తారు. బైసెక్సువల్ పురుషులు, మహిళలు ఇద్దరిపట్లా ఆకర్షితులవుతారు కాబట్టి, వారు తమ సౌకర్యానికి తగినట్లు బంధాలు నిర్ణయించుకుంటారని వారు అనుకుంటారు” అని ఆమె చెప్పింది

“సాధారణంగా లెస్బియన్ అమ్మాయి ఒక బైసెక్సువల్ అమ్మాయితో బంధం పెట్టుకోవాలని అనుకోదు. ఎందుకంటే బైసెక్సువల్ అమ్మాయి తనతో కచ్చితంగా డేట్ చేస్తుంది. కానీ పెళ్లి చేసుకుని జీవితాంతం తోడు కావాలనే విషయానికి వచ్చేసరికి ఆమె తన సౌలభ్యం, సమాజం కట్టుబాట్లకు తగ్గట్టు ఎవరో ఒక అబ్బాయి చేయి అందుకుంటుంది, బైసెక్సువల్ అబ్బాయిలు కూడా, కాస్త ఇలాగే ఆలోచిస్తారు” అంటుంది గరిమ

అంతే కాదు, బైసెక్సువల్ వ్యక్తులను చాలాసార్లు అత్యాశ ఉన్నవారుగా భావిస్తారు. అలాంటి వారు బంధాలపై కమిట్‌మెంట్ చూపించరని, ఒకే చోట ఉండాలని భావించరని, అందరితో డేట్ చేయాలని కోరుకుంటారని భావిస్తారు.

“మాకు కూడా అదే చెప్పారు. మా సెక్సువాలిటీ మేం గురించి భ్రమల్లో ఉన్నామని, కొంత కాలం తర్వాత అవి తొలగిపోతాయని అన్నారు. మేం ఎలా ఉన్నామో అలా మమ్మల్ని వారెవరూ స్వీకరించరు. ఎప్పుడూ సందేహంగా చూస్తుంటారు” అని గరిమ చెప్పారు.

పురుషులు చాలాసార్లు బైసెక్సువల్ అమ్మాయిలను కేవలం సెక్సువల్ ఫాంటసీకి సంబంధించి చూస్తుంటారు.

“నేను నా లైంగికత గురించి బాహాటంగా మాట్లాడతాను. అందుకే జనం నా గురించి ఏవేవో ఊహించుకుంటారు. అబ్బాయిలు నాకు సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజులు పంపిస్తుంటారు. బహుశా బైసెక్సువల్ అమ్మాయి ఎవరితో అయినా పడుకోడానిక సిద్ధమైపోతుందని వాళ్లకు అనిపిస్తుందేమో.. వారు సమ్మతి, ఇష్టాయిష్టాల గురించి అసలు ఆలోచించరు” అంటారు గరిమా.

LGBT

బైసెక్సువాలిటీపై నిర్లక్ష్యం

ఎల్జీబీటీ సమాజం లోపల ఉన్న అందరిపై ఏదో ఒక ఒత్తిడి ఉంటుందని కూడా చెబుతున్నారు.

గే అని, లేదంటే లెస్బియన్‌గా కానీ అంగీకరించేలా ఎల్జీబీటీ సమాజంలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా ఒత్తిడి ఉంటుందని ఫిల్మ్ మేకర్, ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త సోనల్ జ్ఞాని(32) చెప్పారు.

“బైసెక్సువాలిటీ గురించి మాట్లాడ్డానికి జనం అంత సహజంగా ముందుకు రారు అందుకే బైసెక్సువల్ వ్యక్తులపై ఉన్న ఒత్తిడి వల్ల వారు చాలాసార్లు తమను గే లేదా లెస్బియన్ అని చెబుతారు” అని ఆమె చెప్పారు.

సమాజం లోపలే బైసెక్సువాలిటీని ఇలా కావాలనే నిర్లక్ష్యం చేయడాన్ని జెండర్ స్టడీ భాషలో బైసెక్సువల్ ఇరేజర్(Bisexual erasure) అంటారు.

తనను తాను బైసెక్సువల్‌గా చెప్పుకునే సోనల్.. “ఎల్జీబీటీ సమాజంలో ఉన్నవారు కూడా ఇదే సమాజంలో భాగం. వారు కూడా వివక్ష నుంచి విముక్తి పొందలేరు” అని చెప్పారు.

“మీడియా, పాపులర్ కల్చర్‌లో బైసెక్సువాలిటీకి దాదాపుగా స్థానం లేదనే చెప్పాలి. స్వలింగ సంపర్కం అంశానికి సంబంధించి ఇప్పుడు మెల్లమెల్లగా సినిమాలు, వెబ్ సిరీస్ లాంటివి వస్తున్నాయి. కానీ బైసెక్సువాలిటీ ఇప్పటికీ అలాంటి చర్చలకు చాలా దూరంగా ఉంది” అంటారు సోనల్.

తన అనుభవాలను షేర్ చేసుకున్న ఆమె నాకు నేను స్వయంగా బైసెక్సువల్ అని బాహాటంగా చెప్పుకున్నప్పటికీ, నా మహిళా పార్టనర్‌తో నన్ను చూసిన కొంతమంది చాలాసార్లు నన్ను లెస్బియన్‌ అనుకున్నారని చెప్పారు.

“నేను వారికి పదేపదే, నేను బైసెక్సువల్‌ను అని చెప్పినా, చాలా చానళ్లలో, వార్తా పత్రికల్లో నన్ను లెస్జియన్ అని చెప్పారు. నేను ఒక పురుషుడితో కనిపిస్తే వారు నన్ను స్ట్రెయిట్ అనుకుంటారు. అదే, మహిళతో కనిపిస్తే నన్ను లెస్జియన్ అంటారు. నా బైసెక్సువాలిటీని ఎందుకో నిర్లక్ష్యం చేశారు” అన్నారు.

LGBT

ఫొటో సోర్స్, Getty Images

బైసెక్సువల్ అంటే పోర్న్, ఫాంటసీ కాదు

ఒక అమ్మాయి స్వయంగా తన బైసెక్సువల్ గుర్తింపును బహిరంగంగా అంగీకరించడం అనేది చాలా సాహసోపేత చర్య అవుతుందని సోనల్ చెప్పారు.

“చాలాసార్లు బైసెక్సువల్ అమ్మాయిలను పోర్న్ కు కలిపి చూస్తారు. వారి చరిత్ర గురించి ప్రశ్నలు లేవదీస్తారు. అలాంటప్పుడు అది ఆ అమ్మాయిల భద్రతకు సంబంధించిన సమస్యగా కూడా మారుతుంది. బైసెక్సువల్ అమ్మాయిలు ఓపెన్‌గా బయటకు రాకపోవడానికి కారణం కూడా అదే” అన్నారు

యవ క్వీర్ యాక్టివిస్ట్ ధర్మేష్ చౌబే మరో ముఖ్యమైన విషయం గురించి కూడా వివరించారు.

బైసెక్సువల్ అయిన పురుషులు, మహిళల లైంగితను సమాజం తమ సౌలభ్యానికి తగ్గట్టు రకరకాల వాదనలతో కొట్టిపారేందుకు ప్రయత్నిస్తోందని ఆయన భావిస్తున్నారు.

“బైసెక్సువల్ అమ్మాయిల గురించి మాట్లాడే సమాజం.. వారు స్ట్రెయిటే, కాకపోతే కాస్త సెక్సువల్ అడ్వెంచర్ చేయాలని చూస్తున్నారు అంటుంది. అటు బైసెక్సువల్ పురుషుల గురించి మాత్రం, వారు గే, కానీ తమ స్వలింగ సంపర్కాన్ని దాచేందుకు హోమోసెక్సువల్ అయినట్లు నటిస్తున్నారని అంటుంది. అంటే పితృస్వామిక సమాజంలో మహిళ లైంగికతకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మొత్తం మీద తాము గే కావడం వ్యాధి కాదని, దానికి నివారణలు వెతకవద్దని, వారి కోరికలను పట్టించుకోవాలని పురుషులు ఆశిస్తున్నారు” అని ధర్మేష్ చెప్పారు.

LGBT

ఫొటో సోర్స్, Getty Images

టేక్ మీ యాజ్ అయామ్

ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికీ భారత్‌లో బైసెక్సువల్ అమ్మాయిలు మెల్లమెల్లగా అయినా బయటకు రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా జూన్‌లో(ప్రైడ్ మంత్) చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎలాంటి సంకోచం లేకుండా తమ సెక్సువాలిటీని అంగీకరించారు.

జూన్ నెలను ఎల్జీబీటీ సమాజం ప్రైడ్ మంత్‌గా భావిస్తోంది. ఈ నెలలో తమ సంఘర్షణ, కోరికలు, సాధించిన వాటి గురించి మాట్లాడుతోంది.

ప్రస్తుత సమయంలో బైసెక్సువల్ యువతులు కూడా చాలా సామాజిక సంకెళ్లను తెంచుకున్నట్లు కనిపించడానికి కూడా ఇదే కారణం. వారు తమ బైసెక్సువాలిటీని అంగీకరించాలని కోరుతున్నారు. తాము ఎలా ఉన్నామో, అలాగే స్వీకరించమని చెబుతున్నారు.

2018 సెప్టెంబర్‌లో భారత సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను నిర్వీర్యం చేసింది. అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కోర్టు తీర్పును చదువుతూ జర్మనీ రచయిత యోహన్ వాఫ్గాంగ్‌ మాటను గుర్తు చేసుకున్నారు. జస్టిస్ మిశ్రా అప్పుడు “అయాం వాట్ అయాం, సో టేక్ మీ యాజ్ అయాం”(I am what I am, so take me as I am) అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)