UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వ‌ట్లేదు?

UNSC India

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్ర‌స్తుతం భార‌త్‌తోపాటు మెక్సికో, నార్వే, ఐర్లాండ్ కూడా తాత్కాలిక స‌భ్య‌త్వం పొందాయి.

ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (యూఎన్ఎస్‌సీ) తాత్కాలిక స‌భ్య దేశంగా భార‌త్ ఎనిమిదోసారి ఎన్నికైంది. బుధ‌వారం జ‌రిగిన ఓటింగ్‌లో స‌ర్వ ప్ర‌తినిధి స‌భ‌లోని 193 దేశాల్లో 184 దేశాలు భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లికాయి.

భార‌త్ విజ‌యం సాధించిన అనంత‌రం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ట్వీట్‌చేశారు. "భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్య‌త్వం కోసం ప్ర‌పంచ దేశాలు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చినందుకు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ప్ర‌పంచ శాంతి, భ‌ద్ర‌త‌, స‌మానత్వ భావ‌న‌ల‌ను ప్రోత్స‌హించేందుకు స‌భ్య‌దేశాల‌తో క‌లిసి భార‌త్ ప‌నిచేస్తుంది" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

"అంత‌ర్జాతీయ ఉగ్రవాదంపై దీటుగా స్పంద‌న;‌ ఐరాసలో సంస్క‌ర‌ణ‌లు; అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర చ‌ర్య‌లు; సాంకేతికత‌ల‌కు ప్రోత్సాహాల‌ను ప్రాథ‌మ్యాలుగా గుర్తించి అడుగులు వేస్తాం"అని ఇప్ప‌టికే భార‌త్ విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్ స్ప‌ష్టంచేశారు.

ప్ర‌స్తుతం భార‌త్‌తోపాటు మెక్సికో, నార్వే, ఐర్లాండ్ కూడా తాత్కాలిక స‌భ్య‌త్వం పొందాయి. 1 జ‌న‌వ‌రి, 2021తో మొద‌ల‌య్యే ఈ ప‌ద‌వీ కాలం రెండేళ్లు ఉంటుంది.

ఏమిటీ భ‌ద్ర‌తా మండ‌లి?

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఏర్పాటైన‌ ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఆరు ప్ర‌ధాన సంస్థ‌లుంటాయి. వీటిలో భ‌ద్ర‌తా మండ‌లి కీల‌క‌మైన‌ది. అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. శాంతికి భంగం క‌లిగించే ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌డు ఇది స‌మావేశం అవుతుంది. అత్య‌వ‌స‌ర ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటుంది.

అయితే, భ‌ద్ర‌తా మండ‌లిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, రాజ‌కీయ చ‌ర్చ‌ల‌ కంటే దోపీడీనే ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది అని ఐరాసలో అమెరికా రాయ‌బారిగా ప‌నిచేసిన జియేన్‌ క‌ర్క్‌ప్యాట్రిక్ ద‌శాబ్దాల క్రిత‌మే వ్యాఖ్యానించారు.

భ‌ద్ర‌తా మండ‌లిలో (యూకే, చైనా, ఫ్రాన్స్‌, ర‌ష్యా‌, అమెరికా)ఐదు శాశ్వ‌త స‌భ్య దేశాలుంటాయి. వీటితోపాటు ప‌ది తాత్కాలిక స‌భ్య దేశాల‌కూ మండ‌లిలో చోటుంటుంది.

ప్ర‌స్తుతం బెల్జియం, డొమినిక‌న్ రిప‌బ్లిక్‌, జ‌ర్మ‌నీ, ఇండోనేషియా, ద‌క్షిణాఫ్రికా, ఎస్టోనియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనెడైన్స్‌, ట్యునీషియా, వియ‌త్నాం, నైజ‌ర్‌లు తాత్కాలిక స‌భ్య‌దేశాలు.

బెల్జియం, డొమినిక‌న్ రిప‌బ్లిక్‌, జ‌ర్మ‌నీ, ఇండోనేషియా, ద‌క్షిణాఫ్రికాల ప‌ద‌వీ కాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. వీటి స్థానంలో తాజాగా ఎన్నికైన దేశాలు వ‌స్తాయి.

శాశ్వ‌త స‌భ్య‌దేశాల సంఖ్య‌ను విస్త‌రించాల‌ని ఎప్ప‌టినుంచో డిమాండ్లు వ‌స్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, శాశ్వ‌త స‌భ్య‌దేశాల సంఖ్య‌ను విస్త‌రించాల‌ని ఎప్ప‌టినుంచో డిమాండ్లు వ‌స్తున్నాయి.

ఎన్నిక ఎలా?

శాశ్వ‌త స‌భ్య దేశాల్లో ఎలాంటి మార్పూ ఉండ‌దు. కానీ తాత్కాలిక స‌భ్య దేశాలకు స‌ర్వ‌ప్ర‌తినిధి స‌భ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ఒక్కో దేశానికి రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉంటుంది.

అన్ని ఖండాల్లోని దేశాల‌కూ ప్రాతినిధ్యం ల‌భించేలా తాత్కాళిక స‌భ్య దేశాల ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. దీని కోసం ప్ర‌పంచ దేశాల‌ను ఐదు గ్రూప్‌లుగా విభ‌జించారు.

వీటిలో ఆఫ్రికా గ్రూప్ నుంచి ముగ్గుర్ని, ఆసియా-ప‌సిఫిక్ గ్రూప్ నుంచి ఇద్ద‌ర్ని, లాటిన్ అమెరికా-క‌రీబియ‌న్ గ్రూప్ నుంచి ఇద్ద‌ర్ని, ప‌శ్చిమ ఐరోపాతోపాటు ఇత‌రుల నుంచి ఇద్ద‌ర్ని (వీరిలో ఒక‌రు ప‌శ్చిమ ఐరోపా నుంచి త‌ప్ప‌నిస‌రి), తూర్పు ఐరోపా నుంచి ఒక‌ర్ని ఎన్నుకుంటారు.

తాత్కాలిక‌ స‌భ్య దేశాల్లో ఒకటి అరబ్‌ దేశం అయ్యుండాలి. ఒక‌సారి దీన్ని ఆసియా ప‌సిఫిక్ నుంచి మ‌రోసారి ఆఫ్రికా నుంచి ఎన్నుకుంటారు. 1967 తర్వాత ఈ నిబంధ‌న అమ‌లులోకి వ‌చ్చింది.

శాశ్వ‌త స‌భ్య‌దేశాల సంఖ్య‌ను విస్త‌రించాల‌ని, ఒక్కో ఖండం నుంచి ఒక్కో దేశానికి ప్రాతినిధ్యం క‌ల్పించాల‌ని ఎప్ప‌టినుంచో డిమాండ్లు వ‌స్తున్నాయి. అయితే శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం అభ్య‌ర్థిస్తున్న దేశాల‌కు వాటి పొరుగునున్న దేశాల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

ఈ అంశంపై ఇదివ‌ర‌క‌టి ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ బాన్ కీ మూన్ కూడా స్పందించారు. "రెండు ద‌శాబ్దాలుగా భ‌ద్ర‌తా మండ‌లి సంస్క‌ర‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది. మారిన ప్ర‌పంచ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మండ‌లిని విస్త‌రించాలి" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం ఆసియా ప‌సిఫిక్ నుంచి భార‌త్‌, ప‌శ్చిమ బ్లాక్ నుంచి ఐర్లాండ్‌, నార్వే, లాటిన్ అమెరికా-క‌రీబియ‌న్ గ్రూప్‌ నుంచి మెక్సికో తాత్కాలిక స‌భ్య దేశాలుగా ఎన్నిక‌య్యాయి.

స‌ర్వ‌ప్ర‌తినిధి స‌భ‌లో జ‌రిగే ఓటింగ్‌లో పాల్గొన్న స‌భ్య‌దేశాల్లోని మూడింట రెండొంతుల మంది మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే తాత్కాలిక స‌భ్య‌త్వం ల‌భిస్తుంది.

ఒక్క శాశ్వ‌త స‌భ్య దేశం వీటోతో అడ్డుకున్నా మండ‌లి చ‌ర్య‌లు నిలిచిపోతాయి.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఒక్క శాశ్వ‌త స‌భ్య దేశం వీటోతో అడ్డుకున్నా మండ‌లి చ‌ర్య‌లు నిలిచిపోతాయి.

ఏం అధికారాలు ఉంటాయి?

ఐరాస భ‌ద్ర‌తా మండ‌లికి కొన్ని ప్ర‌త్యేక అధికారాలు ఉంటాయి. వీటిని ఐక్య‌రాజ్య‌స‌మితి చార్ట‌ర్‌లోని 24 నుంచి 26 అధిక‌ర‌ణ‌ల్లో పొందుప‌రిచారు.

భ‌ద్ర‌తా మండ‌లి అధికారాల్లో అంత‌ర్జాతీయ శాంతి, భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది. ఐరాస నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు స‌భ్య దేశాలు చ‌ర్య‌లు తీసుకుంటాయి.

ప్ర‌పంచ దేశాల మ‌ధ్య వివాదాల‌పై మండ‌లి విచార‌ణ చేప‌డుతుంది. వివాదాల ప‌రిష్కారానికి అనుస‌రించే విధానాలతోపాటు ఆయుధాల నియంత్ర‌ణ‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది.‌

శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ముప్పుల‌ను అంచ‌నావేయ‌డంతోపాటు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కూడా సూచిస్తుంది.

దేశాల అతిక్ర‌మ‌ణ‌ల‌ను అడ్డుకొనేందుకు ఆర్థిక ఆంక్ష‌లు విధిస్తుంది. ఉత్త‌ర కొరియా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను అడ్డుకొనేందుకు ఈ నిబంధ‌న కిందే ఆంక్ష‌లు విధించారు.

అతిక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డే దేశాల‌పై సైనిక చ‌ర్య‌ల‌కు మండ‌లి ఆదేశిస్తుంది. కొత్త దేశాల‌కు సభ్య‌త్వంపై సిఫార్సులు ఇవ్వ‌డంతోపాటు వ్యూహాత్మ‌క ప్రాంతాల‌పై ప‌ర్య‌వేక్షిస్తుంది. ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌తోపాటు ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్‌కు న్యాయ‌మూర్తులు త‌దిత‌ర ప‌ద‌వుల‌కు ఎంపిక‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తుంది.

అయితే, ఒక్క శాశ్వ‌త స‌భ్య దేశం వీటోతో అడ్డుకున్నా.. ఈ చ‌ర్య‌లు నిలిచిపోతాయి.

కొన్నిసార్లు మండ‌లి ఆదేశాల‌తో సంబంధం లేకుండానే కొన్ని శాశ్వ‌త స‌భ్య దేశాలు చ‌ర్య‌ల‌కూ దిగుతుంటాయి.

"నానాజాతి స‌మితికి ప‌ట్టిన‌గ‌తే ఐరాస‌కు ప‌ట్ట‌కూడ‌ద‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే భ‌ద్ర‌తా మండ‌లి ఆమోదం లేకుండానే కొన్ని దేశాలు సైనిక చ‌ర్య‌ల‌కు వెళ్తున్నాయి. ఇలాచేస్తే ఆ గ‌తి ప‌ట్ట‌క త‌ప్ప‌దు"అని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు.

2013లో మండ‌లి అనుమ‌తి లేకుండా సిరియాలో అమెరికా వైమానిక‌ దాడులు చేసిన‌ప్పుడు పుతిన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఐరాస

ఫొటో సోర్స్, Getty Images

చ‌ర్య‌లు ఎలా తీసుకుంటారు?

శాంతి, భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఏదైనా ముప్పుపై ఫిర్యాదు వ‌చ్చిన‌ప్పుడు శాంతియుత మార్గాల్లో ప‌రిష్క‌రించుకోవాల‌ని మొద‌ట మండ‌లి సూచిస్తుంది.

  • ఒప్పందంలో అనుస‌రించాల్సిన నిబంధ‌న‌లనూ మండ‌లి సూచిస్తుంది.
  • కొన్నిసార్లు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తుంది.
  • విచార‌ణా చేప‌డుతుంది.
  • ప్ర‌త్యేక బృందాల‌నూ పంపిస్తుంది.
  • ప్ర‌త్యేక రాయ‌బారులనూ నియ‌మిస్తుంది.
  • వివాదం శాంతియుతంగా ప‌రిష్కార‌మ‌య్యేలా సూచించాల‌ని సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కూ అభ్య‌ర్థిస్తుంది.

ఘ‌ర్ష‌ణ‌లు ప్ర‌మాద‌కర‌ స్థాయికి చేరితే... దాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు మండ‌లి ప్ర‌య‌త్నిస్తుంది. దీని కోసం ఏం చ‌ర్య‌లు తీసుకుంటుందంటే...

  • ఘ‌ర్ష‌ణ‌లు మ‌రింత తీవ్రం కాకుండా ఉండేందుకు కాల్పుల విర‌మ‌ణ ఆదేశాలు జారీ చేస్తుంది.
  • ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు శాంతి ప‌రిర‌క్ష‌ణ ద‌ళాలు, సైనిక ప‌రిశీల‌కుల‌ను పంపిస్తుంది.
  • ఆర్థిక ఆంక్ష‌లు, ఆయుధాలపై నిషేధం, ఆర్థిక జ‌రిమానాలు, ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లనూ విధిస్తుంది.
  • ఒక్కోసారి సైనిక ప‌రమైన చ‌ర్య‌ల‌కూ ఆదేశాలు జారీచేస్తుంది.

ఈ నిర్ణ‌యాల‌న్నీ ఓటింగ్ ద్వారా భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు తీసుకుంటారు. అయితే ఓటింగ్ ద్వారా తీసుకొనే ఏ నిర్ణ‌యాన్నైనా వీటోచేసే అధికారం శాశ్వ‌త స‌భ్య దేశాల‌కు ఉంటుంది.

"వీటో అధికారాలే భ‌ద్ర‌తా మండ‌లికి పెద్ద అడ్డంకిగా త‌యార‌య్యాయి. అతిక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డే దేశాల‌పై ఆంక్ష‌లు విధించ‌కుండా ఇవే అడ్డుకుంటున్నాయి" అని ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గ్యుటెర‌స్ వ్యాఖ్యానించారంటే వీటో అధికారాలు ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో అర్థంచేసుకోవ‌చ్చు.తాత్కాలిక స‌భ్య‌త్వంతో ఉప‌యోగ‌ముందా?

వీటో అధికారాల‌తో శాశ్వ‌త స‌భ్య‌దేశాలు అంతా స‌ర్వ‌మై న‌డిపిస్తున్న‌ప్ప‌టికీ... తాత్కాలిక స‌భ్య‌త్వంతోనూ కొన్ని ఉప‌యోగాలున్నాయ‌ని అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు భావిస్తున్నారు.

"అంత‌ర్జాతీయంగా త‌మ‌ ప్ర‌తిష్ఠను నిరూపించుకొనేందుకు చాలా దేశాలు భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌త్వం కోసం పోటీప‌డ‌తాయి. కొన్ని దేశాలు శాశ్వ‌త స‌భ్య‌త్వం లేక‌పోయినా ప్ర‌పంచ శాంతి భ‌ద్ర‌త‌కు చాలా తోడ్పాటు అందిస్తాయి. మండ‌లిలో జ‌రిగే శాంతి ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో వారు భాగ‌స్వామ్యం కావాల‌ని కోరుకుంటారు. అందుకే వారు శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం పోటీ ప‌డ‌తారు." అని డ‌జ్‌ ఎలిఫెంట్ డాన్స్ పుస్త‌క ర‌చ‌యిత‌, విదేశాంగ నిపుణుడు డేవిడ్ మ‌లోన్ విశ్లేషించారు.

మ‌రోవైపు వివాదాలకు సంబంధించి త‌మ వాద‌న‌ని భ‌ద్ర‌తా మండ‌లి ద్వారా ముందుకు తీసుకెళ్లేందుకు చాలా దేశాలు తాత్కాలిక స‌భ్య‌త్వాన్ని కోరుకుంటాయ‌ని ఆయ‌న అన్నారు.

మ‌రోవైపు తాత్కాలిక‌ స‌భ్య‌త్వంతో వ‌చ్చే అధికారాలు నామ‌మాత్ర‌మైన‌వని ఆఫ్ట‌ర్ అనార్కీ పుస్త‌కంలో నార్త్ వెస్ట‌ర్న్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఇయాన్ హ‌ర్డ్ వ్యాఖ్యానించారు.

"చాలా దేశాలు తాత్కాలిక స‌భ్య‌త్వం ద్వారా భ‌ద్ర‌తా మండ‌లి నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేయాల‌ని అనుకుంటారు. అయితే ఆ అవ‌కాశం చాలా త‌క్కువ‌. ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రింత త‌గ్గిపోయింది." అని ఆయ‌న అన్నారు.

ఏ సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం?

ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి ప్ర‌పంచం మొత్తానికీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ... కేవ‌లం ఐదు శాశ్వ‌త స‌భ్య దేశాలే దాన్ని నియంత్రిస్తున్నాయ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ అనంత‌రం తీసుకునే ఏ నిర్ణ‌యాన్నైనా ఈ ఐదు దేశాలూ వీటో చేయ‌గ‌లుగుతున్నాయి.

నానాజాతి స‌మితి త‌ర‌హాలో ఐరాస కూడా విఫ‌లం కాకుండా చూసేందుకు ఈ అధికారాలు త‌ప్ప‌నిస‌ర‌ని ఐదు దేశాలు వాదించ‌డంతో అప్ప‌ట్లో ఈ ప్ర‌త్యేక అధికారాల‌ను వారికి క‌ట్ట‌బెట్టారు.

అయితే ఇప్ప‌టికీ గ‌త శ‌తాబ్ద‌పునాటి ప‌రిస్థితుల‌నే ఈ మండ‌లి ప్ర‌తిబింబిస్తోంద‌ని 2015లో జ‌రిగిన‌ జీ-4 దేశాల స‌మావేశం‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

భార‌త్‌తోపాటు జీ-4లోని మిగ‌తా దేశాలైన బ్రెజిల్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్ కూడా శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే యునైటింగ్ ఫ‌ర్‌ క‌న్సెన్స‌స్ గ్రూప్ పేరుతో ఏర్పాటైన కొన్ని దేశాలు ఈ డిమాండ్‌ను వ్య‌తిరేకిస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో పాకిస్తాన్‌, ట‌ర్కీ కూడా ఉన్నాయి.

భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్యత్వం ఇచ్చేందుకు అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ర‌ష్యా బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు తెలిపాయి. చైనా మాత్రం వ్య‌తిరేకిస్తోంది.

సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి శాశ్వ‌త‌ స‌భ్య దేశాల మ‌ధ్య విభేదాలున్న‌య‌ని చెబుతూ చైనా త‌ప్పించుకుంటోంది. వీటో అధికారాలు ఇవ్వ‌కుండా భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్యుల సంఖ్య‌ను 15 నుంచి 25కు పెంచాల‌ని సూచిస్తోంది.

భ‌ద్ర‌తా మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌దేశం హోదా పొందే న్యాయ‌బ‌ద్ధ‌మైన‌ హ‌క్కు భార‌త్‌కు అన్నివిధాలా ఉంద‌ని 2004లోనే అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ నొక్కి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)