ముంబయి ధారావి: ఆసియాలోని ఈ అతిపెద్ద మురికివాడలో కరోనాను ఎలా కంట్రోల్ చేశారు

ఫొటో సోర్స్, JOHNNY MILLER / MEDIADRUMIMAGES.COM
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది ప్రపంచంలోని అతిపెద్ద మురికి వాడల్లో ఒకటి. సామాజిక దూరం పాటించడం అనేది అక్కడి వారికి సాధ్యమయ్యే పనికాదు. కానీ జనసాంద్రత ఉండే చోట కరోనా విజృంభిస్తుంది. మరి, అలాంటి చోట కరోనాను ఎలా నియంత్రించారు?
ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు సుమారు 5,00,000మంది నివసిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం కాదు. ధారావిలో మాంఛెస్టర్ నగరంకన్నా ఎక్కువ జనాభా ఉంటుంది. కానీ వీరు ఆ నగరంలోని హైడ్‌పార్క్, కెన్సింగ్టన్ గార్డెన్ అంతటి ప్రదేశంలో నివసిస్తున్నారు.
ధారావిలో 8-10మంది మనుషులు వందచదరపు అడుగుల ప్రదేశంలో నివసించాలి. ఇక్కడ 80% శాతం మంది పబ్లిక్ టాయిలెట్లను వాడతారు. ఆ చిన్నచిన్న ఇరుకు సందుల్లోనే నివాసాలు, పరిశ్రమలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉండేవాళ్లలో చాలామంది రోజుకూలీలు. ఎక్కువమంది ఇళ్లలో అన్నం వండుకోరు. బైట తిని రావాల్సిందే.

ఫొటో సోర్స్, Reuters
దేశ ఆర్ధిక, కళారాజధానికి నడిబొడ్డున ఉండే ఈ ధారావి ప్రాంతంలో కరోనా ప్రస్తుతానికైతే నియంత్రణలోనే ఉంది. ఇక్కడ ఏప్రిల్ 1న మొట్టమొదటి కేసు నమోదుకాగా మొత్తం 2000మందికి వైరస్ సోకినట్లు ఇప్పటి వరకు పరీక్షలలో తేలింది. ఇందులో 80మంది చనిపోయారు. సగంమంది వైరస్ నుంచి కోలుకున్నారు.
జూన్ మూడో వారం వచ్చేసరికి నమోదవుతున్న రోజువారి కేసులు 43 నుంచి 19 పడిపోయాయి. ఏప్రిల్‌లో సరాసరి రెట్టింపురేటు (డబ్లింగ్ రేట్) 18 రోజులుకాగా, జూన్‌నాటికి అది 78రోజులకు చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
కంటైన్‌మెంట్‌గా ప్రకటించడం, ఎక్కువ టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌లో పెట్టి వారికి ఆహారం అందించడంలాంటి సత్వర చర్యలతో పరిస్థితిని అదుపు చేశారని చెప్పొచ్చు.
పాజిటివ్ రోగులను గుర్తించిన వెంటనే క్వారంటైన్‌కు పంపడమే వ్యాధివ్యాప్తి కట్టడిలో ఉండటానికి కారణమని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఫీవర్ క్యాంపుల ద్వారా స్క్రీనింగ్ టెస్టులు విస్తృతంగా జరపడం, మొబైల్ వ్యాన్‌లతో ఇంటిదాకా వచ్చి స్క్రీనింగ్ చేయడం ఇందులో భాగం. తీవ్రమైన ఎండల కారణంగా పీపీఈ కిట్లు ధరించి ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేయడం సిబ్బందికి కష్టంగా ఉండేది
దీంతో ఫీవర్ క్యాంపులు నిర్వహించి దాదాపు 360,000మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ ఫీవర్ క్యాంపుల్లో సుశిక్షితులైన సిబ్బంది, డాక్టర్లు పీపీఈ కిట్లు ధరించి, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు, ఆక్సీ మీటర్ల సాయంతో ప్రతి రోజు 80మందిని స్క్రీనింగ్ చేసేవారు.
ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే అక్కడికక్కడే కోవిడ్-19 టెస్ట్ నిర్వహించేవారు. పాజిటివ్ అని తేలిన వారందరని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లకు పంపేవాళ్లు. స్కూళ్లను, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. దాదాపు 10,000మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. వాళ్లలో ఎవరి పరిస్థితైనా బాగా లేకపోతే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మూడు పెద్ద ప్రైవేటు ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రికి తరలించేవారు. ''కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి ఫీవర్ ఆసుపత్రులు ఎంతగానో సహాయపడ్డాయి'' అని ఈ మురికివాడలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ అమృతా బవాస్కర్ వెల్లడించారు. '' ప్రజలలో చాలామంది స్వచ్చందంగా వస్తున్నారు. అనుమానం రాగానే టెస్టు చేయించుకుంటున్నారు. కొందరు తమ వయసును ఎక్కువ చేసి చెప్పి త్వరగా టెస్టులు చేయించుకోవాలని భావించగా, మరికొందరు దగ్గు, జలుబు ఉన్న వ్యక్తుల పక్కన కూర్చున్నామని, తమకు టెస్ట్ చేయాలంటూ వస్తున్నారు. చాలామందిలో భయం ఉంది, అవగాహనా కూడా ఉంది'' అని డాక్టర్ బవాస్కర్ అన్నారు.
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 11,000 టెస్టులు జరిగాయి. కానీ ఇంకా పాజిటివ్ రోగులున్నా ఎలాంటి లక్షణాలు బైటపడనివారు చాలామందే ఉన్నారు. తాము ముంబయితోపాటు ఎక్కడ ఈ మహమ్మారి విజృంభించినా దాన్ని కంట్రోల్‌లో పెట్టగలమన్న నమ్మకంతో ఉన్నారు అధికారులు.

ఫొటో సోర్స్, Reuters
ఇక్కడ మరణాలు తక్కువగా ఉండటానికి యువత ఎక్కువమంది ఉండటమే ఒక కారణమని కూడా భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో ఎక్కువమంది 21 నుంచి 50 ఏళ్లలోపు వారే. కంటైన్‌మెంట్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం బాగా కలిసి వచ్చింది. ఆదాయంలేని వారికి ఉచితంగా అన్నం పెడుతూ క్వారంటైన్ చేయడం కట్టడికి ఉపకరించింది. ''సామాజిక దూరానికి మా దగ్గర అవకాశాలు చాలా తక్కువ. కానీ మేం వ్యాధివ్యాప్తి గొలుసును తెంచగలిగాం'' అని ధారవి ప్రాంతం బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ దిఘావ్‌కర్ అన్నారు.
ధారవి ఎప్పడూ మీడియా దృష్టిలో ఉంటుంది. ''స్లమ్‌డాగ్ మిలియనీర్'' సినిమా కారణంగా ఈ ప్రాంతం పేరు ప్రపంచ మీడియా దృష్టికి కూడా వెళ్లింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బిజినెస్ స్కూల్ విద్యార్ధులు, సిటీ ప్లానర్లు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న వందకోట్ల రూపాయల విలువైన సంప్రదాయ మార్కెట్‌పై పరిశోధనలు చేశారు.
ఫీవర్ క్యాంపుల్లో ప్రైవేటు డాక్టర్లు కూడా చేరిపోయారు. నగరంలోని ధనవంతులు, రాజకీయ నాయకులు, లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థలు వందల, వేల ఉచిత భోజనాలను, రేషన్‌ను అందించాయి. బాలీవుడ్ నటులు భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, మందులు, వెంటిలేటర్ల కోసం తమవంతు సాయం చేశారు. '' సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేసే సంస్కృతి ముంబయి ప్రజలకు ఉంది. ధారవిలో ఇన్ఫెక్షన్‌ను కట్టడి చేయడంలో వారు అధికారులకు బాగా సహకరించారు '' అని ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న ఆర్మిడా ఫెర్నాండెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే కరోనా వైరస్ ఆర్ధికంగా ఈ ప్రాంతంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రాంతం తోలు పరిశ్రమ, కుండలు, కుట్లు అల్లికలకు ప్రసిద్ధి. దాదాపు 5000 చిన్న పరిశ్రమలు ఇక్కడ పని చేస్తున్నాయి. 15,000 వరకు ఒక గదిలో సాగే వర్క్ షాపులు కూడా ఉన్నాయి. ముంబయిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు ఇది కేంద్రం
నైపుణ్యం ఉన్న పనివారిని దశాబ్దాలుగా ఆకర్షిస్తూనే ఉంది ధారవి. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు మూసేయడంతో దాదాపు 150,000మంది ఈ ప్రాంతం నుంచి తమ సొంత ఊళ్లకు వలస వెళ్లినట్లు అంచనా.
స్థానిక వ్యాపారుల నుంచి బంగారాన్ని, వస్తువులను కుదవబెట్టి డబ్బులు తీసుకున్నారు. దీంతో వారంతా అప్పుల్లో కూరుకుపోయారు.
''ఇక్కడ కంటైన్‌మెంట్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ధారవి ఆర్ధిక స్థితిని ఇది మార్చేసింది'' అని స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న న్యాయవాది వినోద్ శెట్టి అన్నారు. "చాలామందికి రెక్కాడితేగాని డొక్కాడదు. స్లమ్ లోపలా, బయటా ఎక్కడా వారికి పని దొరకలేదు'' అన్నారు వినోద్ శెట్టి.
ఇక ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటంటే, కంపెనీలు ఒక్కొక్కటిగా తెరుస్తున్నారు. ఉపాధి పోయినవాళ్లంతా మళ్లీ రావచ్చు. కానీ అంతా మాస్కులు తొడుక్కుని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు కిరణ్ దిఘావ్‌కర్.
కానీ ఇంకా అనేక ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఇక్కడున్న వారంతా పదే పదే చేతులు కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉండాలంటే వీళ్లకు నీళ్లెక్కడివి? ఒకవేళ వర్కర్లంతా తిరిగి వస్తే వారికి ఉద్యోగాలు ఉన్నాయా ? ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రాంతాన్ని లాక్‌డౌన్‌లో ఉంచుతారు ? ఇప్పటికిప్పుడు కంపెనీలు ప్రారంభించినా, అవి లాభాల్లోకి వెళ్లడానికి ఎంతకాలం పడుతుంది? ''యుద్ధం ఇంకా ముగియ లేదు. వైరస్ పూర్తిగా లేకుండా పోయే వరకు ముగియదు కూడా'' అన్నారు దిఘావ్‌కర్.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- భారత, చైనాల చర్చల్లో ఏకాభిప్రాయం.. వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకారం
- కరోనా వైరస్‌తో మరణించిన ముస్లింలను ఆచారాలకు విరుద్ధంగా దహనం చేస్తున్నారంటూ శ్రీలంకలో ఆందోళన
- భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఎవరి అండా లేకుండా నింగికెగిసిన తార.. అర్థంతరంగా నేల రాలడానికి కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు?
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








