కరోనా వైరస్‌తో మరణించిన ముస్లింలను ఆచారాలకు విరుద్ధంగా దహనం చేస్తున్నారంటూ శ్రీలంకలో ఆందోళన

ఫొటో సోర్స్, NIKITA DESHPANDE
- రచయిత, సరోజ్ పథిరానా
- హోదా, ‘బీబీసీ సింహళ’ ప్రతినిధి
కోవిడ్-19 సోకిందన్న అనుమానంతో మే 4న 44 ఏళ్ల ఫాతిమా రినోజా ఆస్పత్రిలో చేరారు. ఆమె ముగ్గురు బిడ్డల తల్లి.
శ్రీలంక రాజధాని కొలంబోలో నివాసం ఉంటున్న ఆమె శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతూ ఉండటంతో అధికారులు కరోనావైరస్ సోకి ఉండవచ్చని అనుమానించారు.
ఆమెను ఆస్పత్రిలో చేర్చిన రోజున అధికారులు తమపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఫాతిమా భర్త మహమ్మద్ షఫీక్ ఆరోపించారు.
“పోలీసులు, మిలటరీ, అధికారులు మా ఇంటికి వచ్చారు. మమ్మల్ని బయటకు తరిమివేసి ఇల్లాంతా డిస్‌ఇన్ఫెక్టర్లు చల్లారు. మేం చాలా భయపడ్డాం. కానీ వాళ్లు మాకు ఏమీ చెప్పలేదు. మూడు నెలల చిన్నారికి కూడా పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ సెంటర్లో మమ్మల్ని కుక్కల్లా చూశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు మహమ్మద్.
ఒక రాత్రి వారిని తమ అదుపులో ఉంచుకున్న అధికారులు మర్నాడు వారిని విడుదల చేసి రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు.
అదే సమయంలో ఆస్పత్రిలో ఫాతిమా కన్నుమూసినట్టు వారికి సమాచారం అందింది.

ఫొటో సోర్స్, NIKITA DESHPANDE
పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించిన అధికారులు
ఫాతిమా మృత దేహాన్ని గుర్తించేందుకు ఆమె పెద్ద కొడుకును పిలిచారు. కోవిడ్-19 సోకడంతో చనిపోయిందన్న అనుమానం వల్ల ఆమె మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.
శరీరాన్ని దహనం చేయడం ముస్లిం చట్టాలకు విరుద్ధమైనప్పటికీ తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆమె కొడుకు తెలిపారు.
“తదుపరి పరీక్షల కోసం ఆమె శరీర భాగాలు కావాలని అధికారులు నాతో చెప్పారు. ఆమె కరోనా కారణంగా మరణిస్తే వారికి శరీర భాగాలతో పనేముంది?” అని అతని తండ్రి మహమ్మద్ షఫీక్ ప్రశ్నించారు. తన భార్య విషయంలో అసలు ఏం జరిగిందో తమకు పూర్తిగా తెలియనివ్వలేదన్నది ఆయన ఆవేదన.
దీంతో కరోనా పేరుతో తమపై వివక్ష చూపిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీలంక ముస్లిం వర్గాలు చేస్తున్న ఆందోళనలో ఫాతిమా కుటుంబం కూడా భాగమైంది.

ఫొటో సోర్స్, EPA/CHAMILA KARUNARATHNE
డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయి?
కోవిడ్-19 కారణంగా మరణించిన వారి మృత దేహాలను ఖననం చేయ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచిస్తున్నప్పటికీ బాధితుల్ని దహనం చేయాలని అధికారులు బలవంతం చేస్తున్నారని ఆందోళనకారులు చెబుతున్నారు.
తమను భయపెట్టడంలో భాగంగా దేశంలోని మెజార్టీ సింహళీయులు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఇదొకటిని వారు అంటున్నారు. 2019 ఏప్రిల్ నెలలో కొలంబొలో జరిగిన పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పేర్కొనడం యావత్ దేశాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. అప్పటి నుంచి తమను శ్రీలంక సమాజం అనుమానాస్పదంగా చూడటం మొదలుపెట్టిందని ముస్లిం సమాజం ఆరోపిస్తోంది.
మార్చి 31న కరోనావైరస్ కారణంగా తొలిసారిగా ఓ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి మరణించారు. దీంతో కొన్ని మీడియా వర్గాలు వైరస్ వ్యాప్తికి ముస్లిం వర్గాలే కారణమవుతున్నాయని బహిరంగాంగానే విమర్శిస్తూ వచ్చాయి. అధికారికల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ముస్లిం వర్గంలో కోవిడ్-19 కారణంగా కేవలం 11 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అయితే వారందరి మృత దేహాలను ముస్లిం చట్టాలకు విరుద్ధంగా దహనం చేశారు.
“కోవిడ్-19 కారణంగా మరణించినా లేదా అనుమానాస్పద మరణమైన సరే వారందర్నీ తప్పని సరిగా దహనం చేయాలన్నది శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఖననం చేయడం వల్ల భూగర్భ జలాలకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది” అని ప్రభుత్వ చీఫ్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సుగత్ సమరవీర అన్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని స్థానిక ముస్లిం కార్యకర్తలు, మత పెద్దలు, రాజకీయనాయకులు శ్రీలంక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఒకే ఒక్క దేశం
మాజీ మంత్రి అలీ జడహిర్ మౌలానా దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం,182 డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల్లో, కేవలం శ్రీలంకలో మాత్రమే కోవిడ్-19 కారణంగా మరణించిన ముస్లింల మృత దేహాలను దహనం చేస్తున్నారని తెలుస్తోంది.
మృత దేహాన్ని పూడ్చటం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు కల్గుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలను చూపిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అని ముస్లిం వర్గాలు చెబుతున్నట్లు మౌలానా బీబీసీకి చెప్పారు.
వారి వాదనకు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత కూడా సమర్ధిస్తున్నారు. దహనం చేయడంలో ఎలాంటి శాస్త్రీయత లేదు. కేవలం మతాల పేరిట దేశాన్ని విభజించాలన్న చీకటి రాజకీయ ఎజెండాలో భాగంగానే శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.
ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా...
ఫాతిమా మరణించిన రోజే 64 ఏళ్ల అబ్దుల్ హమీద్ మహమ్మద్ రఫైదీన్ కూడా కొలంబోలోని తన సోదరి ఇంట్లో మరణించారు.
అదే రోజు తమ పొరుగున ఉన్న సింహళ జాతికి చెందిన ఓ వ్యక్తి కూడా మరణించారని అబ్దుల్ చిన్న కుమారుడు నౌషద్ బీబీసీకి చెప్పారు.
లాక్ డౌన్ కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో తన తండ్రి మృతదేహంతో పాటు, పొరుగునే మరణించిన సింహళజాతీయుని మృతదేహాన్ని కూడా కలిపి ఆస్పత్రికి తీసుకొని వెళ్లమని స్థానిక పోలీసులు చెప్పారు.
కోవిడ్-19 సోకే ప్రమాదం ఉండటంతో మార్ట్యురీలో తన తండ్రి మృతదేహాన్ని తాకేందుకు నౌషద్‌కు ఆస్పత్రి వైద్యులు అనుమతించలేదు. నిజానికి అప్పటికి కరోనావైరస్ కారణంగానే తన తండ్రి చనిపోయారా? లేదా? అన్న విషయం కూడా స్పష్టం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం చదవడం కూడా రాని నౌషద్‌ను, ఆయన తండ్రి మృత దేహాన్ని దహనం చేసేందుకు అంగీకరిస్తున్నట్టు తెలిపే కొన్ని పత్రాలపై సంతకాలు చేయమని అధికారులు కోరారు. వాస్తవానికి సంతకం పెట్టకపోతే ఏం జరుగుతుందన్న విషయం నౌషద్‌కు తెలియదని... ఒక వేళ నిరాకరిస్తే తన కుటుంబంపై, తన వర్గం వారిపై ఎక్కడ చర్యలు తీసుకుంటారేమోనని ఆయన భయపడ్డానని నౌషద్ చెప్పారు. అయితే అదే సమయంలో ఆయన పొరుగునే మరణించిన వ్యక్తి విషయంలో మాత్రం ఆస్పత్రి వర్గాలు మరోలా వ్యవహరించాయని ఆయన ఆరోపించారు. “మేం ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తి విషయంలో అన్ని సక్రమంగానే జరిగాయి. బంధువులు చివరి చూపు చూసేందుకు, మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు అనుమతించారు” అని నౌషద్ చెప్పారు.
అబ్దుల్ దహన కార్యక్రమాలకు కేవలం నౌషద్ సహా పరిమిత సంఖ్యలో బంధువుల్ని మాత్రమే అనుమతించారు.
మరోవైపు తన భార్య మరణించిన ఆరు వారాల తర్వాత కూడా కారణాలేంటో తెలుసుకునేందుకు మహ్మద్ షఫీక్ అష్టకష్టాలు పడుతున్నారు.
ఆస్పత్రి వర్గాలు అనుమానించినట్టు ఫాతిమాకు పాజిటివ్ రాలేదని వైరస్ పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఆ తరువాత వెల్లడించారు. “మా ముస్లిం వర్గంలో మరణించిన వారి మృతదేహాన్ని దహనం చేయం. ఆమెకు కరోనా సోకలేదన్న విషయం వారికి తెలిసినప్పుడు ఎందుకు ఆమెను దహనం చేశారు?” షఫీక్ అడిగుతున్న ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పేదెవరు?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- బ్రిటన్‌లో తీవ్రవాదం ముప్పు గణనీయ స్థాయిలోనే ఉందా
- సూర్యగ్రహణం: వివిధ దేశాల్లో నెలవంకలా మారిన సూర్యుడి చిత్రాలు
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
- కోర్టుకెక్కి పొద్దున్నే కూత పెట్టే హక్కును సాధించుకున్న కోడిపుంజు మృతి
- ఇక టిక్ టాక్ పాఠాలు.. విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చైనా యాప్
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








