దేశాన్ని కుదిపేసిన 'పొల్లాచ్చి కాల్పుల' ఘటన.. హిందీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆ రోజు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, DMK
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ వార్తలోని కొన్ని వివరణలు పాఠకులను కలవరపెట్టవచ్చు)
సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' చిత్రం విడుదలైంది. శివ కార్తికేయన్, రవి, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో సాగుతుంది.
అప్పట్లో జరిగిన ఈ నిరసనలను అణచివేయడానికి తమిళనాడు పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది మరణించారు.
ముఖ్యంగా, పొల్లాచ్చిలో జరిగిన కాల్పులను ఈ నిరసనలో అత్యంత దారుణమైన క్షణంగా పరిగణిస్తారు.
ఇంతకీ, అక్కడ ఏం జరిగింది?


ఫొటో సోర్స్, Getty Images
హిందీ అమలుతో..
హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ 1930ల చివరి నుంచి తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. 1937లో హిందీని వ్యతిరేకిస్తూ మొదటి నిరసన జరిగింది.
మద్రాస్ ప్రావిన్షియల్ శాసన సభ ఎన్నికల్లో గెలిచిన భారత జాతీయ కాంగ్రెస్.. రాజాజీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీ రాజగోపాలాచారి (రాజాజీ), చెన్నైలో జరిగిన సమావేశంలో విద్యార్థులు తప్పనిసరిగా హిందీ చదవాలని వ్యాఖ్యానించారు. జస్టిస్ పార్టీ, ఇతర సంస్థలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
1938 ఏప్రిల్ 21న, విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు హిందీని తప్పనిసరిగా చదవాలి. మొదట 125 పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా వరుస నిరసనలు జరుగుతుండగా, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
ఆ సమయంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. 1939 అక్టోబర్‌లో రాజాజీ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1940 ఫిబ్రవరి 21న అప్పటి మద్రాస్ గవర్నర్ జాన్ ఎర్స్కిన్, హిందీ తప్పనిసరి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.

ఫొటో సోర్స్, X
స్వాతంత్య్రం వచ్చాక మరోసారి..
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, 1948లో ఒమండూర్ రామసామి రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలల్లో హిందీని తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1948 జూన్ 20న, పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
కానీ, ఈసారి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు, కన్నడ, మలయాళం మాట్లాడే ప్రాంతాలలో మాత్రమే హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా, తమిళం మాట్లాడే ప్రాంతాలలో ఐచ్ఛిక సబ్జెక్టుగా ప్రకటించారు. ఈసారి కూడా తప్పనిసరి హిందీకి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.
అయితే, 1949 మార్చి చివర్లో, ముఖ్యమంత్రి ఒమండూర్ రామసామి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, తప్పనిసరి హిందీ ప్రణాళికను ఉపసంహరించుకున్నారు.
గణతంత్ర దేశంగా మారిన తర్వాత..
ఇక, 1965 సమీపిస్తున్న కొద్దీ, తమిళనాడులో హిందీ భయం తిరిగి మొదలైంది. దీనికి కారణం భారత అధికారిక భాష సమస్య. భారత దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన తర్వాత, రాజ్యాంగం హిందీ, ఇంగ్లిష్‌లను మొదటి 15 సంవత్సరాలు మాత్రమే దేశ అధికారిక భాషలుగా ఉంచింది. ఆ తర్వాత, హిందీ మాత్రమే అధికారిక భాషగా ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం, 1965 జనవరి 26 తర్వాత, హిందీ భారత దేశ ఏకైక అధికారిక భాషగా ఉంటుంది.
దీంతో, 1965 చివరి నాటికి, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో దీనిపై వ్యతిరేకత తలెత్తింది. తదనంతరం, జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1963లో 'అధికారిక భాషల చట్టం' తీసుకొచ్చింది. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, 15 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత (1965 తర్వాత) హిందీతో పాటు ఇంగ్లిష్ దేశ అధికారిక భాషగా 'కొనసాగవచ్చు' అని పేర్కొంది.
అంటే, "రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 15 సంవత్సరాల కాలం ముగిసినప్పటికీ, నియమిత రోజు నుంచి ఆంగ్ల భాషను హిందీతో పాటు ఉపయోగించడం కొనసాగించవచ్చు" అని పేర్కొన్నారు.
అయితే, అప్పటి డీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అన్నాదురై, ముసాయిదాలో వాడిన 'ఇంగ్లిష్ లాంగ్వేజ్ మే'అనే పదాలను 'ఇంగ్లిష్ లాంగ్వేజ్ షల్' గా మార్చాలని పార్లమెంటులో కోరారు. అయితే, "మే", "షల్" పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నందున ముసాయిదా చట్టంలో సవరణ అవసరం లేదని ప్రధాని నెహ్రూ స్పష్టం చేశారు. చివరికి, ఎటువంటి సవరణ లేకుండానే చట్టం ఆమోదం పొందింది.
ఇక, 1964 డిసెంబర్ 5న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్ హిందీ మాట్లాడని రాష్ట్రాలను మరోసారి కలవరపెట్టింది.
"జనవరి 26 నుంచి, రాజ్యాంగం ప్రకారం హిందీ కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా మారుతుంది. అధికారిక భాషల చట్టం, 1963లో హిందీతో పాటు ఇంగ్లిష్‌ను నిరంతరం ఉపయోగించేందుకు నిబంధన ఉన్నప్పటికీ, 1965 జనవరి 26 తర్వాత కేంద్ర ప్రభుత్వ అన్ని అధికారిక ప్రయోజనాలకు హిందీని ఉపయోగించాలని భావిస్తున్నారు" అని ప్రొఫెసర్ ఎ. రామసామి తన "స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా" పుస్తకంలో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వు సారాంశం ఏమిటంటే, 1965 జనవరి 26 నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా హిందీని ఉపయోగించనున్నారు. అయితే, ముఖ్యమైన, ప్రభుత్వ ఉత్తర్వులు హిందీ, ఇంగ్లిష్‌లో జారీ అవుతాయని అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉన్న గుల్జారీలాల్ నందా ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి 26 సంతాప దినంగా..
1965లో గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న కొద్దీ, తమిళనాడులో హిందీని అధికారిక భాష చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తీవ్రమయ్యాయి. జనవరి 26న సంతాప దినంగా పాటిస్తామని డీఎంకే ప్రధాన కార్యదర్శి సీఎన్ అన్నాదురై ప్రకటించారు. అయితే, దేశ గణతంత్ర దినోత్సవాన్ని సంతాప దినంగా పాటించడానికి అనుమతి లేదని ముఖ్యమంత్రి భక్తవత్సలం అన్నారు.
అయితే, హిందీ విధించడానికి వ్యతిరేకంగా విద్యార్థుల కమిటీ ఒక రోజు ముందుగానే, జనవరి 25న సంతాప దినానికి పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇంతలో జనవరి 22న, సీఎన్ అన్నాదురైతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
జనవరి 25 నుంచి నిరసనలు, ర్యాలీలు ఎక్కువయ్యాయి. చెన్నై, మధురైలలో ఈ నిరసనలు తీవ్రమయ్యాయి. అయితే, ఫిబ్రవరి 12న పొల్లాచ్చిలో జరిగిన కాల్పులు ఈ నిరసనకు పరాకాష్టగా నిలిచాయి.
"ఫిబ్రవరి 10న, తిరుప్పూర్‌లో విద్యార్థులు ఒక పోస్టాఫీసును దిగ్బంధించి నిరసన తెలిపినప్పుడు, పోలీసులు లాఠీలతో వారిని చెదరగొట్టారు. ఆ సమయంలో, ఒక పోలీసు కాల్పులు జరపడంతో 19 ఏళ్ల విద్యార్థి చనిపోయారు. ఆ తర్వాత, కోపంతో ఉన్న ఒక గుంపు పోస్టాఫీసు, రైల్వే స్టేషన్‌పై దాడి చేసింది. టెలిగ్రాఫ్ స్తంభాలను కూల్చివేసింది. పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించింది. ఒకే చోట ఇద్దరు పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్లు నిలబడి ఉండటం చూసి ఒక గుంపు వారిని వెంబడించింది. చివరికి వారిని పట్టుకుని, చంపి, దహనం చేశారు" అని ఎ. రామసామి తన పుస్తకంలో ప్రస్తావించారు.
ఆ తర్వాత, సైన్యాన్ని పిలిపించారు. తిరుప్పూర్ పట్టణం నిర్మానుష్యంగా మారింది. అయితే, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో నిరసనలు కొనసాగాయి.
"ఫిబ్రవరి 10న పోలీసులు ఏడు చోట్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం 25 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వాస్తవ మరణాల సంఖ్య బహుశా ఎక్కువగా ఉండవచ్చు" అని ఎ. రామసామి తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, unknown
పొల్లాచ్చి కాల్పులు
భాషా పోరాటం తీవ్రమవుతుండగా, కేంద్ర ఆహారశాఖ మంత్రి సి. సుబ్రమణ్యం, పెట్రోలియం, రసాయనాల శాఖ సహాయ మంత్రి ఓ.వి. అలకేశన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమిళనాడు విద్యార్థుల హిందీ వ్యతిరేక నిరసన మండలి ఫిబ్రవరి 12న తమిళనాడు అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు భారీగా మద్దతు లభించింది.
కానీ, అదే రోజు పొల్లాచ్చిలో దారుణ ఘటన జరిగింది. ఎ. రామసామి దీని గురించి వివరించారు.
"బంద్ రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో పాలక్కాడ్ రోడ్డులోని పోస్టాఫీసు ముందు కొంతమంది విద్యార్థులు, ప్రజలు గుమిగూడారు. పోలీసులను కూడా మోహరించారు. ఆ సమయంలో, ఒక విద్యార్థి పోస్టాఫీసు నేమ్ బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతసేపు గమనించిన పోలీసులు అతన్ని దిగమన్నారు. కానీ, అతను దిగలేదు. వెంటనే దిగకపోతే, కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ, యువకుడు దిగలేదు. దీంతో, ఒక పోలీసు అతనిపై కాల్పులు జరిపారు. విద్యార్థి కిందపడిపోయారు.
దీంతో, ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పోలీసులు లాఠీలతో వారిని చెదరగొట్టారు. అనంతరం, నిరసనకారులు తాలూకా కార్యాలయంపై దాడి చేయడం ప్రారంభించారు. అనంతరం, చిన్న గ్రూపులుగా విడిపోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి దిగారు. దీంతో, కోయంబత్తూరు నుంచి సైన్యం సహాయం కోరారు" అని ఆయన పేర్కొన్నారు.
"మధ్యాహ్నానికి ఆరు ట్రక్కుల్లో సైనికులు పొల్లాచ్చికి చేరుకున్నారు. ఆ సమయంలో కోయంబత్తూరు రోడ్డులోని పోస్టాఫీసుపై ఒక జనసమూహం దాడి చేయడం ప్రారంభించింది. ఇది చూసిన సైనికులు, అక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చివేస్తామని హెచ్చరించారు. వారు కదల్లేదు. దీంతో, సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది మరణించారు.
ఆ తర్వాత జనం పరిగెత్తారు. కాల్పుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా చనిపోయారు. జనసమూహం చెల్లాచెదురు కాగానే, ఒక తమిళ సైనికుడు కాల్పులకు గురైన నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకుని తన ఒడిలో పట్టుకున్నారు(ఎ. రామసామి మాత్రమే దీనిని ప్రస్తావించారు. పత్రికా కథనాలలో దీని గురించి ప్రస్తావించలేదు)" అని రామసామి తెలిపారు.
"ఆ తర్వాత, చాలాచోట్ల జనసమూహం గుమిగూడి ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేయడం ప్రారంభించాయి. రోడ్లపై రాళ్లు రువ్వారు. సైన్యం కదలికలను నిరోధించడానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాలూకా కార్యాలయం, పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రం, కోర్టులపై దాడి చేశారు. ఇంతలో పలు ప్రాంతాల్లో కాల్పులు కూడా జరిగాయి."
కచ్చేరి రోడ్డులో జరిగిన కాల్పుల్లో రాజేంద్రన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో, "నన్ను కాల్చండి" అంటూ మరో యువకుడు ముందుకు వచ్చారు. అక్కడికి వచ్చిన ఒక సైనికుడు ఆయన కాలిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత, యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కాలికి కట్టు కట్టుకున్న తర్వాత, ఆ యువకుడు తిరిగి రోడ్డుపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఆయన మరణించారు.
మరొక సంఘటనలో, ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిపై కాల్పులు జరిపారు, ఆ బుల్లెట్ ఆయన కడుపు గుండా బయటకు వచ్చి వెనుక దాక్కున్న పదేళ్ల బాలుడి తలలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరూ చనిపోయారు.
"ఈ కాల్పుల సంఘటనలతో పొల్లాచ్చి యుద్ధభూమిలా కనిపించింది. సైన్యం మెషీన్ గన్‌లను ఉపయోగించిందనే ఆరోపణలను జిల్లా కలెక్టర్ తిరస్కరించారు. 1965 మార్చి 27న శాసన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు" అని ఎ. రామసామి పేర్కొన్నారు.
ఎంతమంది మరణించారు?
"పొల్లాచ్చి ఘటనలో ఎంతమంది మరణించారో కచ్చితంగా చెప్పలేం. మృతుల సంఖ్య 80, 100 మధ్య ఉండవచ్చు. ప్రభుత్వం మృతుల సంఖ్యను తక్కువగా లెక్కించింది. దీనికి సరైన సమాధానం మనకు ఎప్పటికీ లభించకపోవచ్చు" అని ఎ. రామసామి పేర్కొన్నారు.
అలాడి అరుణ రాసిన 'హిందీ సామ్రాజ్యవాదం' పుస్తకం కూడా ఈ సంఘటనను క్లుప్తంగా వివరించినప్పటికీ, పొల్లాచ్చి కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యను ఇందులో చేర్చలేదు.
ఘటన మరుసటి రోజు, అంటే 1965 ఫిబ్రవరి 13న 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాసంస్థ కాల్పుల గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది.
"అల్లర్లను అణచివేసేందుకు సైనిక చర్యలు" అనే శీర్షికతో మొదటి పేజీలో వార్త ప్రచురించింది. అందులో "సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 4 సంవత్సరాల చిన్నారితో సహా పది మంది మరణించారు" అని పేర్కొంది.
1965 హిందీ వ్యతిరేక నిరసనలలో అత్యంత దారుణమైన ప్రాణనష్టం పొల్లాచ్చిలో జరిగిందని ఎ. రామసామి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













