ప్యాసింజర్ విమానాలను భారత్ సొంతంగా తయారు చేసుకోగలదా, రష్యాతో ఒప్పందం ఏమైంది?

భారత్‌లో ఎస్‌జే-100 విమానాల తయారీకి రష్యా, భారత్‌ల మధ్య మాస్కోలో ఒప్పందం కుదిరింది

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి.భారత విమానయాన మార్కెట్‌లో 90 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో, ఎయిరిండియా సంస్థలు రాబోయే 10 ఏళ్ల కోసం దాదాపు 1500 విమానాలను ఆర్డర్ చేశాయి.

ప్రయాణికుల డిమాండ్‌ పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు ఈ చర్య తీసుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 86 శాతం విమానాలను సరఫరా చేసే బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థల నుంచే ఈ ఆర్డర్లు రావాలి.

అయితే ఈ సంస్థల్లో 2024లో మునుపెన్నడూ లేనంతగా విమానాల డెలివరీలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం, భారతీయ ఆర్డర్లపై కూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పరిస్థితి మళ్లీ ఓ పాత ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది. భారత్ సొంతంగా ప్యాసింజర్ విమానాలు తయారు చేయడానికి ప్రయత్నించాలా? ఇదే ఆ ప్రశ్న.

భారత్‌లో ఎస్‌జే-100 ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి అక్టోబర్‌లో భారత్, రష్యా దేశాలు మాస్కోలో ఒక ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఈ అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశీయంగా విమానాల ఉత్పత్తిపై ఆశలు పెంచింది.

కానీ, ఈ రష్యా ఒప్పందం ఒక పరిష్కారమా? ఈ ఉమ్మడి తయారీ ప్రణాళిక కార్యరూపం దాల్చడానికి ముందే అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది.

ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఎస్‌జే-100 ప్యాసింజర్ విమానంలో జంట ఇంజిన్లు ఉంటాయి. ఇది 103 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఈ విమానాలు ఇప్పటికే రష్యాకు చెందిన అనేక విమానయాన సంస్థల్లో సేవలు అందిస్తున్నాయని యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ) చెబుతోంది.

ఎస్‌జే-100 విమానాలను 'గేమ్ చేంజర్'గా అభివర్ణించిన భారత్, పరిమిత దూర మార్గాల్లో వీటిని ఉపయోగించాలనుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు, సాధ్యా సాధ్యాలను నిపుణులు ప్రశ్నించారు. ఆయా అంశాల్లో చాలా వరకు ఇంకా స్పష్టత లేదు.

రష్యా కంపెనీ, భారత్‌లో విమానాల తయారీని వేగంగా మొదలుపెట్టి, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలదా అనేది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అతిపెద్ద ఆందోళన. 2008-2020 మధ్య దాదాపు 200 ఎస్‌జే-100 ప్యాసింజర్ విమానాలను తయారు చేసినట్లు సదరు విమాన తయారీ సంస్థ చెబుతోంది.

అయితే, 2022లో యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల విమానాల విడిభాగాల సరఫరా ఆగిపోయింది. దీనివల్ల ఆ కంపెనీ దాదాపు 40 వ్యవస్థలను మార్చాల్సి వచ్చింది.

2023లో ఇతర దేశాల విమానాల విడిభాగాలకు బదులుగా సొంత విడిభాగాలతో విమానాలను నడపాల్సి వచ్చింది.

ఈ విమానాల గుర్తింపును యూరప్ విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ రద్దు చేసింది. ఫలితంగా ఎస్‌జే-100 విమానాలతో పాటు ఇతర రష్యా విమానాలు యూరప్ దేశాల గగనతలాల్లో ఎగరడానికి వీల్లేకుండా అయింది. దేశీయంగా ప్రయాణికుల విమానాలను తయారు చేయాలని భారత్ ఎంతోకాలంగా అనుకుంటోంది. కానీ, ఈ దిశగా చాలా పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించింది. చిన్న, మధ్య స్థాయి విమానాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 1959లో 'నేషనల్ ఏరోస్పేస్ లేబోరేటరీస్ (ఎన్‌ఏఎల్)'ను ఏర్పాటు చేసింది.

ఈ సంస్థ ద్వారా రెండు సీట్లు ఉండే హన్సా, అయిదు సీట్లు ఉండే ట్రైనర్ విమానాలను తయారు చేసింది. కానీ, ప్రయాణీకుల విమానాల తయారీ ఇప్పటికీ సాధ్యం కాలేదు.

భారత్ 1960లలో విదేశీ లైసెన్సుల కింద ప్యాసింజర్ విమానాలను తయారు చేసింది. ప్రభుత్వ ఆధీనంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) యూకే డిజైన్ చేసిన 'Avro 748 జెట్స్'ను డజన్ల కొద్దీ త్పత్తి చేసింది. వీటిని మిలిటరీతో పాటు కమర్షియల్ విమానసంస్థలు కూడా ఉపయోగించాయి. తర్వాత దశల వారీగా వీటిని తొలగించారు.

భారత్ 1980లలో జర్మనీకి చెందిన డార్నియర్ సంస్థ భాగస్వామ్యంతో 19 సీట్ల ప్యాసింజర్ జెట్ విమానాలను తయారు చేసింది. వీటిలో కొన్నింటిని ఇప్పటికీ మిలిటరీ, కొన్ని పరిమిత పౌర మార్గాల్లో వాడుతున్నారు.

ఇదే ఉత్సాహంతో భారత్ సొంతంగా చిన్న ప్యాసింజర్ విమానాలను డిజైన్ చేయడానికి ప్రయత్నించింది.

గత నెలలో వేల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఎన్‌ఏఎల్‌కు చెందిన 15 సీట్ల సరస్ విమానం తయారీలో సహకారానికి 2000 సంవత్సరంలో రష్యాతో భారత్ ఒక ఒప్పందం చేసుకుంది. ఈ సరస్ విమానం 2004 మే నెలలో మొదటిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, రెండో ప్రోటోటైప్ విమానాన్ని పరీక్షిస్తున్నప్పుడు 2009లో ముగ్గురు పైలట్లు చనిపోవడంతో ఈ ప్రాజెక్టును అక్కడితోనే నిలిపేశారు.

ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత, సరస్ ఎంకే2 అనే తర్వాతి ప్రోటోటైప్ విమానంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పునరుద్ధరించింది. సరస్ ఎంకే2 అనేది 19 సీట్ల విమానం. ఇది ఇంకా గుర్తింపు కోసం, ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తోంది.

ఇలాంటిదే మరో ప్రాజెక్ట్ అయిన 'ది రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆర్‌టీఏ)' మొదలై ఏళ్లు గడిచినప్పటికీ కొద్దిపాటి పురోగతినే చూసింది. రష్యన్ ఎస్‌జే-100తో పోల్చదగిన ఈ 90 సీట్ల విమాన తయారీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల నివేదికను 2011లోనే సమర్పించారు. కానీ, ఇప్పటికీ దీని పనులు పెద్దగా ముందుకు సాగలేదు.

భారత్‌లో విమానాల తయారీ రంగం చాలా కాలంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని విమానయాన నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్య వరకు దేశీయ ప్రయాణాలకు డిమాండ్ పెద్దగా లేకపోవడం, అత్యంత నైపుణ్యం గల నిపుణుల కొరత, తయారీ రంగానికి సంబంధించిన వ్యవస్థ విస్తృతంగా లేకపోవడం వంటివి ఈ రంగం ఎదగకపోవడానికి కారణాలని ఎన్‌ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ అభయ్ పశిల్కర్ అన్నారు.

భారతీయ కంపెనీలు అంతర్జాతీయ తయారీదారులతో కలిసి పనిచేయడమే దీనికి పరిష్కారమని ఆయన సూచించారు.

దీన్నిబట్టి చూస్తే ఎస్‌జే-100 ప్రాజెక్ట్ నిజంగానే ఒక గేమ్ చేంజర్ కాగలదా? ఇప్పటికైతే ఇది అలాగే కనిపిస్తోందని హెచ్‌ఏఎల్ మాజీ అధికార ప్రతినిధి గోపాల్ సుతార్ అభిప్రాయపడ్డారు. భారత సొంత ప్రాజెక్టులేవీ ఇప్పట్లో పూర్తవడానికి సమీపంలో లేవు కాబట్టి రష్యాతో కలసి పనిచేయడం ఒక మంచి మార్గంగా కనిపిస్తోందన్నారు.

రష్యాకు కూడా ఈ ప్రాజెక్ట్ ముఖ్యం. ఎస్‌జే-100 విమానాలను ప్రపంచం అంగీకరిస్తే, పాశ్చాత్య దేశాల సాంకేతికత లేకుండానే తాము పౌర విమానాలను తయారు చేయగలమని రష్యా నిరూపించుకున్నట్లవుతుంది.

ఈ ఒప్పందంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రష్యా ఎప్పుడూ భారత్‌కు నమ్మకమైన మద్దతుదారుగానే ఉంటుందని సుతార్ వంటి నిపుణులు అంటున్నారు.

'ఆంక్షల వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా, వాటిని ఇరు దేశాలు ముందే ఊహించి ఉంటాయి' అని సుతార్ అన్నారు.

విమానయాన రంగం వేగంగా ఎదగాలంటే విమానాలు అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, శిక్షణ పొందిన సిబ్బంది కూడా ఉండాలి.

పైలట్ల రోస్టర్‌లో పేలవ ప్లానింగ్ కారణంగా ఇండిగో విమానయాన సంస్థ ఈ మధ్య వేల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దీనివల్ల వేల మంది ప్రయాణికులు గంటల కొద్ది, రోజుల పాటు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)