పైలట్ కావడం ఎలా? ఏం చదవాలి? ఎంత ఖర్చవుతుంది, జీతం ఎంత ఉంటుంది?

పైలట్, శిక్షణ, ఖర్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విమానయాన రంగంలో ఇటీవలి పరిణామాలు చర్చనీయమయ్యాయి. పైలట్ల కొరత, విమానాశ్రయాలలో పొడవైన క్యూలు, రద్దయిన విమానాలు, ప్రయాణికుల బాధలు, గుత్తాధిపత్య ఆరోపణలు, కంపెనీ వివరణలు వంటివి.

కానీ ఇప్పుడు మనం వాటన్నింటి గురించి కాకుండా పైలట్ ఉద్యోగం గురించి చర్చిస్తున్నాం.

భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. 75 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.

2024 సంవత్సరంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 1300 కంటే ఎక్కువ కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లను జారీ చేసింది. అంటే ఈ సంవత్సరం చాలా మంది కొత్త పైలట్లు చేరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పైలట్, శిక్షణ, ఖర్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో

ఫొటో సోర్స్, dit Kulshrestha/Bloomberg via Getty

ఫొటో క్యాప్షన్, పైలట్ లైసెన్స్ పొందాలంటే 200 గంటల పాటు ఫ్లయింగ్ ట్రైనింగ్ అవసరం.

పైలట్ కావడం ఎలా?

పైలట్ కావడం ఎలా అన్న ప్రశ్నకు ఒక ప్రసిద్ధ విమానయాన సంస్థలో పైలట్ సమాధానం ఇచ్చారు.

భారతదేశంలో పైలట్ కావడానికి రెండు మార్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఒకటి చాలా సంవత్సరాలుగా అమలులో ఉంది. మరొకటి ఎయిర్‌లైన్ కంపెనీ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్.

రెండు సందర్భాల్లోనూ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదివి 50శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి.

ఎవరైనా కామర్స్ లేదా ఆర్ట్స్ నేపథ్యం నుంచి వచ్చినట్టయితే వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లేదా ఏదైనా స్టేట్ బోర్డ్ ఓపెన్ పరీక్ష ద్వారా ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో పాస్ కావడం తప్పనిసరి.

భారతదేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీజీసీఏ) ఏవియేషన్ రెగ్యులేటర్. పైలట్ శిక్షణకు అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించడానికి డీజీసీఏ దేశవ్యాప్తంగా అనేక మంది వైద్యులకు గుర్తింపు ఇచ్చింది.

పైలట్ శిక్షణకు ముందు అభ్యర్థికి క్లాస్ 2 మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది డీజీసీఏ ఆమోదిత వైద్యులు జారీ చేస్తారు. ఆ వ్యక్తి పైలట్ శిక్షణ పొందేందుకు తగిన ఆరోగ్యంతో ఉన్నారా లేదా అనేది ఇది నిర్ధరిస్తుంది.

ఆ తర్వాత డీజీసీఏ నిర్వహించే క్లాస్ 1 వైద్య పరీక్ష ఉంటుంది. దీనిని భారత వైమానిక దళం ఆమోదించిన వైద్యులు నిర్వహిస్తారు.

కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) పొందడానికి ఈ పరీక్ష సర్టిఫికేట్ అవసరం. ఇందులో కళ్లు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఈఎన్‌టీ పరీక్షలు ఉంటాయి.

రెండు పరీక్షల ఖర్చు దాదాపు పది వేల రూపాయలు.

అయితే, ఎవరైనా వర్ణ అంధత్వంతో ఉంటే వారు పైలట్ కాలేరు. రక్తం, మూత్ర పరీక్షలు వంటి ప్రాథమిక పరీక్షలు మొదట్లో అవసరం. ఏదైనా ఒక్కటి విఫలమైనా వారు పైలట్ కాలేరు.

పైలట్, శిక్షణ, ఖర్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty

ఫొటో క్యాప్షన్, పైలట్ శిక్షణ ఏ దేశంలో అయినా పొందవచ్చు.

తర్వాతేం జరుగుతుంది?

అన్ని అర్హతలు ఉంటే తర్వాత డీజీసీఏ సీపీఎల్ పరీక్ష రాయాలి. ఇది సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుంది.

ఈ కోర్సులో ఉత్తీర్ణులైన వారు రెండు రకాల శిక్షణ పొందుతారు. గ్రౌండ్ ట్రైనింగ్, ఫ్లయింగ్.

గ్రౌండ్ ట్రైనింగ్ అనేది పైలట్ శిక్షణలో విద్యార్థి దశ. ఇది వాతావరణ శాస్త్రం, వాయు నియంత్రణ, నావిగేషన్, రేడియో టెలిఫోనీ, సాంకేతిక విషయాలను కవర్ చేస్తుంది.

రాత పరీక్షలలో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి.

ఆ తర్వాత అభ్యర్థులు భారత్‌లో డీజీసీఏ ఆమోదించిన ఫ్లయింగ్ శిక్షణ సంస్థలలో (ఎఫ్‌టీవోలు) చేరతారు. ఇక్కడ వారు 200 గంటల పాటు ఫ్లయింగ్ శిక్షణ పొందుతారు.

ఇది కాకుండా మరొక అవకాశం క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్. దీనిని ఎయిర్‌లైన్స్ కంపెనీలు నిర్వహిస్తాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక అభ్యర్థి తన విమానయాన వృత్తిని ఎయిర్‌లైన్ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్‌తో ప్రారంభిస్తే, దానికి ఒక నిర్దిష్ట సిలబస్ ఉంటుంది. ఇందులో సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ రెండూ ఉంటాయి.

ఇందులో భాగస్వామి విమాన శిక్షణ సంస్థలు (ఎఫ్‌టీవోలు) వద్ద ఆచరణాత్మక విమానయాన సెషన్‌లతో పాటు విమానయాన ప్రాథమిక అంశాలలో లోతైన బోధన ఉంటుంది.

విమానయానరంగం అవసరాలకు అనుగుణంగా పైలట్లు నైపుణ్యాలను పొందగలిగేలా ఈ ఇంటిగ్రేటెడ్ శిక్షణ రూపొందింది.

ఉదాహరణకు ఎయిర్ ఇండియాకు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్‌ ఉంది. దీని కింద అభ్యర్థులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) , టైప్ రేటింగ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ ఎయిర్‌లైన్ రెండు గ్లోబల్ పార్టనర్ స్కూళ్లలో శిక్షణ ఇస్తారు.

శిక్షణ సమయంలో అభ్యర్థులకు చిన్న విమానాలను నడపడం నేర్పుతారు.

ప్రయాణికుల విమానాలను నడపాలంటే వారికి టైప్ రేటింగ్ అని పిలిచే మరొక లైసెన్స్ అవసరం.

ఎయిర్ ఇండియా శిక్షణ అకాడమీ మహారాష్ట్రలోని అమరావతిలో ఉంది. రెండు గ్లోబల్ పార్టనర్ స్కూల్స్ అమెరికాలో ఉన్నాయి.

క్యాడెట్ ప్రోగ్రామ్ ద్వారా విమానయాన సంస్థలు కొన్ని పరీక్షల ఆధారంగా ఇంటర్ తర్వాత విద్యార్థులను తమ క్యాడెట్‌లుగా ఎంపిక చేసుకుంటాయి.

తర్వాత వారు పైలట్ శిక్షణ పొందుతారు. ఎయిర్‌లైన్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత టైప్ రేటింగ్ పొందుతారు. కానీ దీనికి ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి.

పైలట్, శిక్షణ, ఖర్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో

ఫొటో సోర్స్, Imtiyaz Khan/Anadolu Agency/Getty

పైలట్ శిక్షణకు ఎంత ఖర్చవుతుంది?

రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. తర్వాత శిక్షణ ప్రారంభమవుతుంది.

అభ్యర్థులు ఈ శిక్షణను భారత్‌లో లేదా మరే ఇతర దేశంలోనైనా పొందవచ్చు.

కెప్టెన్ మోహిత్ విమానంలో కవితాత్మక ప్రకటనలు చేయడం ద్వారా వైరల్ అయ్యారు. ఇప్పుడు ఒక విమానయాన సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 'పొయెటిక్ పైలట్' అనే శిక్షణ అకాడమీని కూడా నడుపుతున్నారు.

"చాలా మంది భారత్, అమెరికా, దక్షిణాఫ్రికాలను ఎంచుకుంటారు. నాలాగే కొందరు కెనడాకు కూడా వెళ్తారు. పైలట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారనేదానితో సంబంధం లేదు. డీజీసీఏ రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. విమానయాన సంస్థలు కూడా పైలెట్లు ఓ ప్రత్యేక దేశం నుంచి శిక్షణ పొందిఉండాలని భావించవు. భారతీయ పైలట్ లైసెన్స్ ఉందా లేదా అనేది ముఖ్యం"

భారత్‌లో ఈ శిక్షణకు 14 నుంచి 15 నెలలు పడుతుంది. శిక్షణ రుసుం రూ. 50-55 లక్షలు ఉంటుంది.

అమెరికాలో ఈ శిక్షణకు 10 నెలలు పడుతుంది ఖర్చు రూ. 50-52 లక్షలవుతుంది.

దక్షిణాఫ్రికాలో ఇది 12-14 నెలల కోర్సు. రూ. 35-40 లక్షల వ్యయమవుతుంది.

"ఇది గ్రాడ్యుయేషన్ లాంటిది కాదు. ఇక్కడ ప్రతి విద్యార్థికి మూడు-నాలుగు సంవత్సరాల కోర్సు ఉండదు. అభ్యర్థికి 200 గంటల ఫ్లైట్ ట్రైనింగ్ ఉండాలి. అంటే విమానం నడిపిన అనుభవం ఉండాలి. కొంతమంది దీనిని పది నెలల్లో పూర్తి చేస్తారు. ఇంకొందరు ఎక్కువ సమయం తీసుకోవచ్చు" అని కెప్టెన్ మోహిత్ వివరించారు.

శిక్షణ పూర్తయిన తర్వాత, ఏ ఎయిర్‌లైన్ కంపెనీలో అయినా పనిచేయడానికి అభ్యర్థులు అర్హత సాధిస్తారు.

పైలట్ ఒక విమానయాన సంస్థలో చేరినప్పుడు వారు మొదట ఫస్ట్ ఆఫీసర్‌గా ఉంటారు. విమానంలో కెప్టెన్‌తో పాటు కో-పైలట్‌లుగా పనిచేస్తారు.

కెప్టెన్ కావడానికి ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్(ఏటీపీఎల్) అని పిలిచే ప్రత్యేక లైసెన్స్ అవసరం.

ఈ లైసెన్స్ పొందడానికి, అభ్యర్థులు నావిగేషన్, రేడియో నావిగేషన్, వాతావరణ శాస్త్రం వంటి అంశాలను కవర్ చేసే డీజీసీఏ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. వారికి కనీసం 1,500 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండాలి.

ఓ పోస్టు పడితే ముందుగా దానికి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత ఎయిర్‌లైన్ కంపెనీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు, డీజీసీఏ పరీక్ష వేర్వేరు. ఇవి మెరిట్ ఆధారంగా ఉంటాయి.

"ఒక ఎయిర్‌లైన్ కంపెనీకి 300 మంది పైలట్లు అవసరమైతే, వెయ్యి మంది పరీక్ష రాసి ఉంటే, ఆ కంపెనీ తదుపరి రౌండ్‌కు అత్యధిక స్కోరు సాధించిన వారిని మాత్రమే పిలుస్తుంది. అయితే డీజీసీఏ పరీక్షలో 70 మార్కులు సాధించడం అవసరం. ఆ పరీక్షలో 80 లేదా 90 స్కోర్ చేసిన వారికి ప్రత్యేక అవకాశం ఏమీ ఉండదు'' అని కెప్టెన్ మోహిత్ వివరించారు.

పైలట్, శిక్షణ, ఖర్చు, ఎయిర్ ఇండియా, ఇండిగో

ఫొటో సోర్స్, Getty Images

జీతం, కెరీర్ డెవలప్‌మెంట్

భారత విమానయాన పరిశ్రమలో పైలట్ జీతం చాలా బాగుందని ఒక పైలట్ మాకు చెప్పారు.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం డీజీసీఏ ఇప్పుడు నియమాలను కూడా రూపొందించిందన్నారు.

"ఒక పైలట్ 12 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లి రావడానికి ప్రయాణ సమయాన్ని కలిపితే, అది దాదాపు 15 గంటల విరామం అవుతుంది. ఇంకా వారానికి ఒకసారి పైలట్ 48 గంటలు లేదా రెండు రోజులు నిరంతర విరామం తీసుకోవాలి. గతంలో ఇది 36 గంటలు ఉండేది" అని కెప్టెన్ మోహిత్ చెప్పారు.

జీతం విషయానికొస్తే ఫస్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ. లక్షా 25వేల నుంచి రెండున్నర లక్షలు లభిస్తాయి.

కెప్టెన్‌కు నెలకు రూ. 4 లక్షల నుంచి 8 లక్షల జీతం ఉంటుంది. అంతర్జాతీయ విమానయాన సంస్థలో ఉద్యోగమైతే జీతం ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

పశ్చిమాసియాదేశాల్లో పైలట్ల ఖాళీలు ఎక్కువగా ఉంటాయని, ఎందుకంటే ఆయాదేశాల వారు ఈ వృత్తిలో తక్కువగా ఉంటారని కెప్టెన్ మోహిత్ చెప్పారు.

అక్కడ ఒక ఫస్ట్ ఆఫీసర్ నెలకు 8-9 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. పన్నులు తక్కువగా ఉంటాయి. అయితే మీరు వేరే దేశంలో నివసించాల్సి ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

పైలట్లు కేవలం విమానాలు నడపడానికే పరిమితం కారని, వారు ఎయిర్‌లైన్ అకాడమీలో ఇన్‌స్ట్రక్టర్లగా కూడా మారొచ్చని మోహిత్ తెలిపారు.

ఫ్లైట్ డిస్పాచర్‌గా పని చేయవచ్చు లేదా చార్టర్డ్ ప్లేన్ పైలట్ కూడా కావచ్చు.

పైలట్ కావడం వల్ల ప్రయోజనాలనుండడంతోపాటు విద్య, శిక్షణ కూడా అంతే ఖరీదైనవి. సంప్రదాయ సీపీఎల్ శిక్షణ కోర్సు ధర 55 నుంచి 85 లక్షల రూపాయల మధ్య ఉంటుంది.

కొన్ని విమానయాన సంస్థలు క్యాడెట్ పైలట్ శిక్షణ కోసం కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తాయి.

ఒక సగటు కుటుంబానికి చెందిన విద్యార్థి ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కూడబెట్టుకోగలడని కెప్టెన్ మోహిత్‌ను అడిగాం. దీనికి ఆయన తన సొంత ఉదాహరణను చెప్పారు. "ఎడ్యుకేషన్ లోన్ మంచి అవకాశం. ఎందుకంటే వేరే బాధ్యతలు లేకపోతే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలోపు లోన్ చెల్లించేయొచ్చు'' అని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)