పదకొండేళ్ల కిందట మిస్సయిన విమానం కోసం మళ్లీ సెర్చ్ ఆపరేషన్

మలేసియా విమానం, కౌలాలంపూర్, బీజింగ్, 2014

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్370 విమానం కనిపించకుండాపోయి దశాబ్దకాలం దాటింది.
    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మలేసియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్-370 శిథిలాల కోసం సెర్చ్ ఆపరేషన్ డిసెంబరు 30న మళ్లీ మొదలవుతుందని మలేసియా అధికారులు చెప్పారు.

239మందితో ప్రయాణిస్తూ ఎంహెచ్-370 కనిపించకుండాపోయి దశాబ్దకాలందాటింది.

ఈ ఏడాది మార్చిలో మొదలైన సెర్చ్ ఆపరేషన్‌ను వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడంతో నిలిపివేశారు. డిసెంబరు 30న మొదలు కానున్న ఆపరేషన్ 55 రోజుల పాటు కొనసాగనుంది.

ప్రభావితమైన కుటుంబాలకు న్యాయం చేయడంపై మలేసియాకు ఉన్న అంకితభావానికి తాజా సెర్చ్ ఆపరేషన్ నిదర్శనమని ఆ దేశ రవాణా శాఖ చెప్పినట్టు స్థానిక మీడియా తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మలేసియా విమానం, కౌలాలంపూర్, బీజింగ్, 2014

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిస్పయిన విమానంలో ప్రయాణించినవారి బంధువులు

2014 మార్చిలో కనిపించకుండా పోయిన విమానం

బోయింగ్ 777 ఎంహెచ్ 370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ 2014లో కనిపించకుండాపోయింది.

దీని కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ విమానయానయాన చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది.

ప్రస్తుత సెర్చ్ ఆపరేషన్‌కు ఓషన్ ఇన్‌ఫినిటీ అనే సంస్థ నేతృత్వం వహిస్తోంది. ''ఏమీ కనిపించకపోతే ఏమీ చెల్లించాల్సిన పనిలేని నో ఫైండ్, నో ఫీ'' విధానంలో ఇది జరుగుతోంది.

శిథిలాలు దొరికితే 70 మిలియన్ డాలర్లు(సుమారు 630 కోట్ల రూపాయలు) ఆ సంస్థకు చెల్లించాలని మలేసియా రవాణా మంత్రి లోక్ స్యూ గతంలో చెప్పారు.

మలేసియా విమానం, కౌలాలంపూర్, బీజింగ్, 2014

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిస్సయిన ప్రయాణికుల పేర్లు పజిల్ రూపంలో

26 దేశాలకు చెందిన 50 విమానాలు, 60 నౌకలతో గాలింపు

గతంలోనూ ఈ విమాన శిథిలాల వెతుకులాటకు ప్రయత్నాలు జరిగాయి. 26 దేశాలకు చెందిన 50 విమానాలు, 60 ఓడలు కలిసి చేపట్టిన ఓ సెర్చ్ ఆపరేషన్ 2017లో ముగిసింది. 2018లో ఓషన్ ఇన్‌ఫినిటీ చేసిన ప్రయత్నం మూడు నెలల తర్వాత ముగిసింది.

2014 మార్చి 8న టేకాఫ్ అయిన తర్వాత గంటలోనే ఎంహెచ్370కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపాయాయి. నిర్దేశించిన మార్గం నుంచి విమానం పక్కకు వెళ్లిపోయిందని రాడార్ చూపించింది.

విమానయానరంగంలో అతిపెద్ద మిస్టరీల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్నవారి కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాలని ఏళ్లుగా బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

మలేసియా విమానం, కౌలాలంపూర్, బీజింగ్, 2014

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలపిస్తున్న ఓ ప్రయాణికుని బంధువు

ఆ విమానం ఏమై ఉంటుంది?

ఈ ఘటన విషయంలో అనేక కుట్ర కోణాలపైనా చర్చ జరిగింది. పైలట్ కావాలనే విమానాన్ని కిందకు తీసుకెళ్లారని, విమానం హైజాక్ అయిందని రకరకాల ప్రచారం జరిగింది.

విమానం నియంత్రణ వ్యవస్థను కావాలనే మార్చిఉండొచ్చని 2018లో జరిగిన దర్యాప్తులో తేల్చారుగానీ దానికి కారణాలు మాత్రం తెలియలేదు.

శిథిలాలు దొరికితేనే దీనికి సమాధానం దొరకుకుతుందని పరిశోధకులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)