‘యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కావు’ అని నెహ్రూ ఎందుకన్నారు? పుతిన్ భారత పర్యటన వేళ ఆ వ్యాఖ్యలపై చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు జర్మనీ, ఫ్రాన్స్ రాయబారులు, బ్రిటిష్ హైకమిషనర్ సంయుక్తంగా రాసిన వ్యాసంపై భారతదేశంలో వివాదం నెలకొంది.
భారత్‌లో జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్, ఫ్రెంచ్ రాయబారి థీరీ మథౌ, బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌లు డిసెంబరు ఒకటోతేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వ్యాసం రాశారు.
ఈ వ్యాసం శీర్షిక - యుక్రెయిన్ యుద్ధం ముగియాలని ప్రపంచం కోరుకుంటోందిగానీ శాంతి గురించి రష్యా తీవ్రంగా ఆలోచించడం లేదు.
"యుక్రెయిన్ ప్రజలు మూడేళ్లకు పైగా తమ దేశాన్ని ధైర్యం, దృఢ సంకల్పంతో రక్షించుకున్నారు. రష్యా తన దళాలను ఉపసంహరించుకుని, చట్టవిరుద్ధమైన దురాక్రమణను ముగించడం ద్వారా లేదా కనీసం కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలలో పాల్గొనడం ద్వారా యుద్ధాన్ని వెంటనే ముగించవచ్చు" అని వ్యాసం ప్రారంభమవుతుంది.
"కానీ 2025లో రష్యా దాడులు బాగా పెరిగాయి. శాంతి చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి అధ్యక్షుడు పుతిన్ మొత్తం యుక్రెయిన్ యుద్ధంలోనే అతిపెద్దవైన 22 దాడులు జరిపారు" అని వ్యాసంలో ఉంది.
ఈ వ్యాసం మొత్తం యుక్రెయిన్ యుద్ధంపై రష్యాను నిందిస్తూ సాగింది. ఒక పేరాలో భారత ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ "యుద్ధం ముగియాలన్నవిషయాన్ని ప్రపంచం అంగీకరిస్తోంది. ఈ విషయంలో భారతదేశం కూడా స్పష్టంగా ఉంది. యుద్ధభూమిలో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని మోదీ అన్నారు" అని రాశారు.
జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల దౌత్యవేత్తలు రాసిన ఈ కథనాన్ని రష్యాలో భారత మాజీ రాయబారి, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కంవల్ సిబ్బల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాసాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందా?
"పుతిన్ భారత పర్యటనకు ముందు రష్యాకు వ్యతిరేకంగా ఈ విద్వేషపూరిత కథనాన్ని ప్రచురించడం దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమే. ఇది భారతదేశాన్ని కూడా అవమానిస్తుంది. చిరకాలమిత్రదేశంతో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఇది ప్రశ్నిస్తుంది" అని కంవల్ సిబ్బల్ రాశారు.
"ఇది మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. భారత్‌లోని యూరోపియన్ అనుకూల వర్గాలలో రష్యన్ వ్యతిరేక భావాలను రేకెత్తించడం, రష్యాతో మన సంబంధాల నైతికతను ప్రశ్నించడం దీని లక్ష్యం. ఈ మూడు దేశాల ప్రతినిధులు అధికారిక మార్గాల్లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. కానీ బహిరంగ ప్రకటనలు సముచితం కాదు" అన్నారు సిబ్బల్.
"టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ కథనాన్ని ప్రచురించడం పూర్తిగా తప్పు. ఇది మన దౌత్య, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకం. ఈ ముగ్గురు ప్రతినిధులు దౌత్య ప్రమాణాలను ఉల్లంఘించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బహిరంగంగా తన అసమ్మతిని వ్యక్తం చేయాలి" అని ఆయన సూచించారు.
పుతిన్ పర్యటన సందర్భంగా ఈ కథనం ఏ భారతీయ మీడియా సంస్థలోనూ ప్రచురించి ఉండకూడదని న్యూస్ వెబ్‌సైట్ ఫస్ట్‌పోస్ట్ సీనియర్ ఎడిటర్ శ్రీమాయ్ తాలుక్‌దార్ రాశారు.
‘‘యూరోపియన్ల రష్యన్ వ్యతిరేక నైతిక వాక్చాతుర్యానికి భారతదేశం వేదిక కాదు. ఈ వ్యాసం చాలా నీచమైనది, అనుచితమైనది. దానిని ప్రచురించాలని ఒక భారతీయ పబ్లికేషన్ తీసుకున్న నిర్ణయం కూడా అంతే అనుచితమైనది" అని తాలుక్‌దార్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
శ్రీమయ్ అభిప్రాయంపై ది హిందూ దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసినీ హైదర్ స్పందించారు. "ఇక్కడ మీడియాను ఎందుకు విమర్శిస్తున్నారు? ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందా, లేదా అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది" అని రాశారు.
గతంలో నేపాల్, వియత్నాంలో భారత రాయబారిగా పనిచేసిన రంజీత్ రాయ్‌ను ఈ వ్యాసం దౌత్య ప్రోటోకాల్ ఉల్లంఘనేనా అని ప్రశ్నిస్తే
"ఇది దౌత్య ప్రోటోకాల్ ఉల్లంఘన అని అనుకోను. కానీ మన అతిథులు వస్తున్నారనేది నిజం. వారు వచ్చేముందు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. యూరప్‌కు రష్యాతో సమస్యలు ఉన్నాయి. కానీ యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కాకూడదు. అయినప్పటికీ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరినైనా స్వాగతించాలని, అలాగే నిరసనగా ఏదైనా చెప్పడానికి లేదా రాయడానికి స్వేచ్ఛ ఉండాలని నేను నమ్ముతున్నాను" అని ఆయన బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పుతిన్ పర్యటనకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నమా?’
పుతిన్ భారత పర్యటనపై భారత్‌లోని జర్మన్ రాయబారితో ఏఎన్ఐ వార్తా సంస్థ మాట్లాడింది. దీనిపై కూడా సిబ్బల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"పుతిన్ పర్యటనకు ముందు రష్యాకు వ్యతిరేక ప్రకటనలు చేసే అవకాశాన్ని జర్మన్ రాయబారికి కల్పించడానికి ఏఎన్ఐ ఎందుకు ప్రత్యేక ప్రయత్నం చేసిందో అర్థం కాలేదు. మన ప్రెస్ అత్యుత్సాహంతో ఉన్నట్టుంది" అని సిబ్బల్ విమర్శించారు.
"పుతిన్‌కు ఏమి చెప్పాలో జర్మన్ రాయబారి చెప్పాల్సిన అవసరం లేదు. మనం యుక్రెయిన్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే యూరప్ సైనిక శక్తి ద్వారా మాత్రమే శాంతిని కోరుకుంటోందని కూడా మనకు తెలుసు. గతంలో నాజీ జర్మనీ రష్యాపై దురాగతాలు చేసి ఉన్నప్పటికీ, జర్మనీ యుక్రెయిన్‌కు ఆయుధాలు, ఆర్థిక సహాయం ఎందుకు అందిస్తోంది, అది మళ్లీ రష్యాతో ఎందుకు ఘర్షణ పడుతోంది అని వారి రాయబారిని అడగాలి" అని ఆయన సూచించారు.
"ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదు. కానీ అలా రాయడం మంచి విషయం కాదు. నేను అమెరికాలో భారత రాయబారిగా ఉన్నా అనుకోండి. పాకిస్తాన్ ప్రధాన మంత్రి తన ఆర్మీ చీఫ్‌తో కలిసి అక్కడికి వస్తున్నారు. మన ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే స్థానిక మీడియాను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా వార్తాపత్రిక వీలుకల్పిస్తే, మేం వారికి వ్యతిరేకంగా కథనాలు రాస్తాం. ఇప్పుడు పుతిన్ విషయంలో భారత మీడియా యూరోపియన్ దౌత్యవేత్తలకు వీలు కల్పించాలా, వద్దా అనేది వేరే ప్రశ్న" అని పేరు వెల్లడించకూడదనే షరతుపై ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మాకు సొంత విధానాలున్నాయి’
పుతిన్ భారత పర్యటన పశ్చిమ దేశాలకు ఒక సందేశం అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మా చెలానీ భావిస్తున్నారు.
"పోటీ కూటములుగా విడిపోవడం పెరుగుతున్న ప్రపంచంలో డిసెంబర్ 4-5 తేదీలలో పుతిన్ దిల్లీలో పర్యటించడం కేవలం దౌత్యపరమైన విషయం కాదు. ఇది శక్తిమంతమైన భౌగోళిక రాజకీయ సంకేతం. ఈ పర్యటన ముఖ్యమైన ఒప్పందాలకు దారితీయవచ్చు. స్విఫ్ట్ వ్యవస్థను దాటవేయడానికి, డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి కూడా ఇది చాలా కీలకం" అని బ్రహ్మా చెలానీ ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
ఆంక్షలు, ఇతర ఆర్థిక సాధనాలను ఆయుధాలుగా మలుచుకోవడం ద్వారా పాశ్చాత్య విధానాలు రష్యాను చైనాకు ఎలా చేరువ చేశాయో భారత్ ప్రత్యక్షంగా గమనించింది. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇది పుతిన్ మొదటి భారత్ పర్యటన అయినప్పటికీ చైనాను మించి రష్యాకు అవకాశాలున్నాయని, చైనాకు జూనియర్ భాగస్వామిగా ఉండబోమని ప్రపంచానికి మాస్కో తెలియజేస్తోంది.
‘‘భారతదేశం ఓ బలమైన సందేశాన్ని పంపుతోంది. భారత్‌తో ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అగౌరవంగా ప్రవర్తిస్తోన్నవేళ రష్యాను ఒంటరిగా చేయడంగానీ, భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే పాశ్చాత్య ఆంక్షల రేఖను అనుసరించడంగానీ భారత్ చేయడం లేదు. పశ్చిమ దేశాలు విధించిన 'మాతో ఉండండి లేదా మాకు వ్యతిరేకంగా ఉండండి' అనే విధానాన్ని భారత్ అంగీకరించబోదని, సొంత స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంటుందని పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దిల్లీ స్పష్టం చేస్తోంది" అని చెలానీ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావా?’
2022 జూన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ "తన సమస్యలు ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు తన సమస్యలు కావు అనే మనస్తత్వాన్ని యూరప్ ఏర్పరచుకుంది" అని వ్యాఖ్యానించారు.
జిందాల్ గ్లోబల్ లా స్కూల్ ప్రొఫెసర్ ప్రభాష్ రంజన్, జైశంకర్ వ్యాఖ్యను నవంబరు 3, 1948న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నెహ్రూ చేసిన ప్రసంగంతో పోల్చారు.
"యూరప్ సమస్యలను పరిష్కరించడంలో నాకు ఆసక్తి ఉంది. కానీ యూరప్‌ను దాటి కూడా ప్రపంచం ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అని అనుకోవడం ద్వారా మీరు మీ సమస్యలను పరిష్కరించుకోలేరు. సమస్యలను పూర్తిగా చర్చించాలి. మీరు ప్రపంచ సమస్యలలో ఒక్కదానిని విస్మరించినా సమస్యను సరిగ్గా అర్థం చేసుకోలేరు. నేను ఆసియా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, ఆసియా కూడా ఈ ప్రపంచంలో ఒక భాగం" అని నెహ్రూ ప్రసంగించారు.
జైశంకర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, అప్పటి జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 2023లో జరిగిన మ్యూనిచ్ భద్రతా సమావేశంలో "భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు సరైనవే. కానీ అంతర్జాతీయ సంబంధాలలో నియమాలను కచ్చితంగా పాటిస్తే ఇది యూరోపియన్ సమస్య మాత్రమే కాదు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














