‘రష్యా నుంచి భారత్ ఇకపై చమురు కొనదు, మోదీ నాకు చెప్పారు’: వెల్లడించిన డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డానియల్ కె
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు.
యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడం అవసరమని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు యుద్ధంలో రష్యాకు పరోక్షంగా సాయం చేస్తున్నట్లేనని ట్రంప్ చాలాసార్లు అంటూ వస్తున్నారు.
‘‘యుక్రెయిన్ యుద్ధం రష్యా ఒక వారంలోనే గెలవాల్సిన యుద్ధం. కానీ నాలుగేళ్లు గడిచాయి. ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నా. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంపట్ల నాకు అసంతృప్తిగా ఉంది. ఈ రోజు వారు రష్యా నుండి చమురు కొనబోమని నాకు హామీ ఇచ్చారు. ఇది ఒక పెద్ద ముందడుగు" అని ట్రంప్ అన్నారు.
బుధవారం వైట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.


ఫొటో సోర్స్, JIM WATSON/AFP via Getty Images
అమెరికా ఒత్తిడి
ఇరుదేశాల మధ్య వాణిజ్యం విషయంలో ఒత్తిడి పెంచేందుకు 'రష్యా నుంచి చమురు కొనుగోలు' అంశాన్ని వాడుతున్నారు ట్రంప్. కానీ భారతదేశం దానిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇది రెండుదేశాల మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలకు కారణమైంది.
రష్యా పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాస్‌ను ఎగుమతి చేస్తోంది. భారత్, చైనా, తుర్కియేలు ఈ చమురును కొనే ప్రధాన కొనుగోలుదారులు.
"ఇక చైనాను కూడా అదే విధంగా ఒప్పించాలి" అని ట్రంప్ బుధవారం వ్యాఖ్యానించారు.
రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడంలో భాగంగా, ఆ దేశం నుంచి చమురు కొనుగోలును ఆపాలని చైనాతో సహా ఇతర వాణిజ్య భాగస్వాముల మీద కూడా ఒత్తిడి తెస్తోంది ట్రంప్ ప్రభుత్వం.
భారతదేశపు చమురు దిగుమతులను 'వెంటనే' ఆపలేమని, ఈ మార్పు ఒక ప్రక్రియలో భాగమని, అది త్వరలో పూర్తవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారతదేశం నుండి వచ్చే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం వరకు సుంకాలను విధించింది.
రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేసినందుకు భారతదేశానికి వేసిన 'శిక్ష'గా ఈ భారీ సుంకాన్ని ట్రంప్ ఇటీవల అభివర్ణించారు.
ఆగస్టులో అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు భారతదేశానికి తీవ్ర ఇబ్బందికరమైన పరిణామంగా ఆర్ధిక నిపుణులు చెబుతారు. రష్యాతో లావాదేవీలపై అదనంగా 25 శాతం రుసుము ఉంటుంది.
యుక్రెయిన్ యుద్ధానికి అవసరమైన ప్రధాన ఆర్థిక వనరు రష్యా అమ్మే చమురేనని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Press Information Bureau (PIB)/Anadolu via Getty Images
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశ వైఖరి తటస్థమని గత కొన్ని నెలలుగా ప్రధాని మోదీ తన వైఖరిని ప్రకటిస్తున్నారు.
అయితే, భారతదేశం, రష్యా మధ్య పాత సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రష్యా చేస్తున్న యుద్ధం వల్ల భారతదేశం లాభపడుతుందనే ట్రంప్ ప్రభుత్వపు ఆరోపణను భారత అధికారులు విమర్శించారు. యూరప్‌తోపాటు అమెరికా కూడా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తోందని భారతదేశం గుర్తు చేసింది.
రష్యన్ చమురు వివాదం ట్రంప్, మోదీల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. అయితే బుధవారం ట్రంప్ మోదీని ప్రశంసిస్తూ, 'ఆయనొక గొప్ప వ్యక్తి' అని అన్నారు.
గతవారం తాను ట్రంప్‌తో మాట్లాడానని, వాణిజ్య చర్చలలో సాధించిన మంచి పురోగతిని తామిద్దరం సమీక్షించామని మోదీ కూడా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














