చైనా: మోదీ ఇటురాగానే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో పుతిన్ ఏం మాట్లాడారు?

చైనాలో మంగళవారం ద్వైపాక్షిక సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, CMShehbaz

ఫొటో క్యాప్షన్, చైనాలో మంగళవారం ద్వైపాక్షిక సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1955లో అప్పటి సోవియట్ కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి నికితా కృశ్చేవ్ శ్రీనగర్ వచ్చారు. నాటి జమ్మూకశ్మీరు యువరాజు కరణ్ సింగ్ ఆయన్ను ఆహ్వానించారు.

కశ్మీర్‌ను సందర్శించవద్దని పాకిస్తాన్ తనను, తమప్రధాని నికోలాయ్ బుగేన్యన్‌ను కోరిందని ఆ పర్యటన సందర్భంగా కృశ్చేవ్ వెల్లడించారు.

''కరణ్ సింగ్ ఆహ్వానాన్ని అంగీకరించవద్దని కరాచీలోని సోవియట్ యూనియన్ రాయబారిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ కోరింది'' అని కృశ్చేవ్ చెప్పారు.

పాకిస్తాన్ అభ్యర్థనపై కృశ్చేవ్ స్పందిస్తూ, ''ఇది దురుద్దేశపూరితమైన చర్య. పెద్ద బాధ్యతను పాకిస్తాన్ తన భుజాలకు ఎత్తుకుంటోంది. ఇది మరో దేశం అంతర్గత వ్యవహారంలో పాకిస్తాన్ అనుచిత జోక్యం. మనం ఏమి చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో చెప్పే ధైర్యం గతంలో ఏ దేశానికీ లేదు. భారత్‌తో మనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి'' అని చెప్పారు.

ఈ పర్యటన సందర్భంలోనే, కశ్మీర్ వివాదం గురించి కూడా కృశ్చేవ్ స్పష్టంగా మాట్లాడారు.

''కశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాల పేర్లను నేను చెప్పదలచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే అది విస్తృతచర్చకు దారితీస్తోంది’’

''కశ్మీర్ సమస్యను రెచ్చగొడుతున్నవారు రెండు దేశాల మధ్య విద్వేషపూరిత విత్తనాలను నాటుతున్నారు. కశ్మీర్ ముస్లిం మెజార్టీ కాబట్టి పాకిస్తాన్‌లో కలవాలి అని చాలా దేశాలు భావిస్తున్నాయి. కశ్మీర్ ప్రజలు భారతదేశంతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో ఆటబొమ్మగా మారాలని కోరుకోవడంలేదు'' అని కృశ్చేవ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1955, నవంబర్‌లో దిల్లీలోని పాలం విమానాశ్రయంలో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి నికితా ఎస్.కృశ్చేవ్, సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి నికోలాయ్ బుగేన్యన్‌ (కుడి వైపు చివరి వ్యక్తి)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1955, నవంబర్‌లో దిల్లీలోని పాలం విమానాశ్రయంలో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి నికితా ఎస్.కృశ్చేవ్, సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి నికోలాయ్ బుగేన్యన్‌

పాకిస్తాన్‌పై కృశ్చేవ్ ఆగ్రహం...

కశ్మీర్ పర్యటన సందర్భంగా, భారతదేశ విభజనపై కూడా కృశ్చేవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మతం కారణంగా విభజన జరగలేదని, 'విభజించి పాలించు' విధానాన్ని అనుసరిస్తున్న మూడో దేశం కారణంగా జరిగిందని చెప్పారు.

అమెరికాతో పాకిస్తాన్ సాన్నిహిత్యంపైనా కృశ్చేవ్ విమర్శించారు. అప్పట్లో పాకిస్తాన్ బాగ్దాద్ ఒప్పందంలో చేరింది. అది కృశ్చేవ్‌కు నచ్చలేదు. బాగ్దాద్ ఒప్పందం సోవియట్‌కు వ్యతిరేకమని ఆయన అన్నారు.

తుర్కియే, ఇరాక్, బ్రిటన్, పాకిస్తాన్, ఇరాన్ కలిసి 1955లో బాగ్దాద్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పట్లో ఈ బాగ్దాద్ ఒప్పందాన్ని ఒక భద్రతా సంస్థగా పిలిచేవారు. అందులోని ఐదు సభ్య దేశాలు తమ ఉమ్మడి రాజకీయ, సైనిక, ఆర్థిక లక్ష్యాల గురించి చర్చించుకున్నాయి. ఇది 'నేటో' తరహాలో జరిగింది.

శ్రీనగర్ పర్యటన సందర్భంలోనే నికితా కృశ్చేవ్ భారత్‌కు అభయమిచ్చారు.

''మేం మీకు చాలా దగ్గరగా ఉన్నాం. మీరు పర్వత శిఖరంపై నుంచి పిలిచినా, మేం మీ పక్షాన ఉంటాం'' అని చెప్పారు.

కానీ ఇప్పుడు సోవియట్ యూనియన్ కానీ, 1955 కాలంనాటి పరిస్థితులు కానీ లేవు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటికీ, కశ్మీర్‌పై రష్యా వైఖరి మారలేదు కానీ పాకిస్తాన్‌పై రష్యా వైఖరి మాత్రం కృశ్చేవ్ వైఖరిలా లేదు.

చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, చైనాలో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు.

పాకిస్తాన్ కోరిక... రష్యా సమ్మతి...

భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా నుంచి భారత్‌కు వెనుదిరిగిన వెంటనే, మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు.

పాకిస్తాన్ ఇప్పటికీ రష్యాకు సంప్రదాయ భాగస్వామి అని పుతిన్ ఈ సమావేశంలో షాబాజ్ షరీఫ్‌తో అన్నారు.

షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్, రష్యా మధ్య సంబంధాలను తాను గౌరవిస్తానని, అయితే పాకిస్తాన్ కూడా రష్యాతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని ఆశిస్తోందని చెప్పారు. ఆ సమయంలో పుతిన్ కూడా దానికి అంగీకరిస్తున్నామన్నట్లుగా తల ఊపారు.

షాబాజ్ షరీఫ్, పుతిన్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన తన్వి మదన్ 'ఎక్స్'లో పోస్టు చేస్తూ ఇలా రాశారు...

''మీమ్స్ ప్రపంచం కాకుండా వాస్తవ ప్రపంచం కూడా ఉంది. పుతిన్ కూడా ఏ దేశంతోనూ ముడిపడి లేరు. షాబాజ్ షరీఫ్‌తో కలిసినప్పుడు, పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకున్నారు. ఇది కొత్తేమీ కాదు. పహల్గాం దాడి తర్వాత రష్యా వైఖరి గురించి ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ట్రంప్‌ వైపే చూశారు.''

పహల్గామ్‌లో దాడి తర్వాత రష్యా భారతదేశాన్ని నిరాశపరిచిందని, కానీ ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదని తన్వి మదన్ భావిస్తున్నారు.

''గత 12 ఏళ్లకాలంలో యుక్రెయిన్‌పై రెండుసార్లు దాడి చేసిన రష్యా... పాకిస్తాన్‌తో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ను అడుగుతోంది'' అని తన్వి మదన్ మే 4వ తేదీన 'ఎక్స్'లో ఒక పోస్టులో రాశారు.

థింక్ ట్యాంక్ ఓఆర్ఎఫ్‌లో భారత్-రష్యా సంబంధాలపై నిపుణుడు అలెక్సీ జఖారోవ్ షాబాజ్ షరీఫ్, పుతిన్ మధ్య జరిగిన సమావేశం గురించి 'ఎక్స్'లో ఇలా రాశారు...

''మోదీ చైనా నుంచి వెనుదిరిగిన తర్వాత, ద్వైపాక్షిక ఎజెండాపై షాబాజ్ షరీఫ్, పుతిన్ చర్చించుకున్నారు. పుతిన్ పాకిస్తాన్‌ను తమ సాంప్రదాయ భాగస్వామి అని సంబోధించారు. వాణిజ్యం పెంచడం గురించి మాట్లాడారు. యూఎన్‌ఎస్‌సీ (ఐక్యరాజ్య సమితి భద్రతామండలి)లో సహకారం పెంపు కోసం అడిగారు. మాస్కో పర్యటనకు షాబాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు. దక్షిణాసియాలో సమతుల్య విధానానికి షాబాజ్ షరీఫ్ కూడా పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.''

పుతిన్, మోదీ, షీ జిన్‌పింగ్ మాటామంతీ

ఫొటో సోర్స్, @narendramodi

రష్యాకు పాకిస్తాన్ సంప్రదాయ భాగస్వామేనా?

పాకిస్తాన్ వాస్తవంగా రష్యాకు సంప్రదాయ భాగస్వామిగా ఉందా? అనే విషయమై దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్ కుమార్ స్పందిస్తూ, ''సోవియట్ యూనియన్ కాలంలో అయినా, అది విచ్ఛిన్నం తర్వాత అయినా పాకిస్తాన్ ఎప్పుడూ రష్యాకు సాంప్రదాయ భాగస్వామి కాదు. మనం బ్రిటిష్ ఇండియాను చూసినా, జార్‌తో వారి శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుతిన్ పాకిస్తాన్‌ను సాంప్రదాయ భాగస్వామి అని పిలుస్తున్నారు కానీ ఇది చారిత్రక వాస్తవాలకు అతీతమైనది'' అన్నారు.

''పాకిస్తాన్‌తో మీ సాన్నిహిత్యం పెరిగితే, మన సంబంధాలు కచ్చితంగా ప్రభావితమవుతాయని రష్యాకు భారత్ స్పష్టంగా చెప్పింది. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ చైనా ద్వారా రష్యాతో తన సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది'' అని ప్రొఫెసర్ రాజన్ కుమార్ చెప్పారు.

''పాకిస్తాన్, రష్యా రెండూ చైనాకు ముఖ్యమైన భాగస్వాములనేది సుస్పష్టం. ఈ ఆసియా ఖండంలో భారతదేశ సమతుల్యతను అస్థిరపరచడమే పాకిస్తాన్ వ్యూహం. యురేషియా ఖండంలో రష్యాతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా భారతదేశం పాకిస్తాన్‌ను అదుపులో ఉంచుతోంది. పాకిస్తాన్, రష్యా, చైనాలు కలిసి రావడం భారతదేశానికి అతిపెద్ద ముప్పు. రష్యా, చైనా ఇప్పటికే కలిసి ఉన్నాయి'' అని రాజన్ కుమార్ ప్రస్తావించారు.

"నేను మాత్రమే కాదు, థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్ సీనియర్ ఫెలో అయిన ఆష్లే జె టెల్లిస్ కూడా ఇదే చెబుతున్నారు.

ఖండాంతర ముప్పు దృష్ట్యా భారతదేశం పూర్తిగా అమెరికా శిబిరంలోకి వెళ్లలేదన్నారు. చైనా, రష్యా, పాకిస్తాన్ చేతులు కలిపితే బ్రిటిష్ ఇండియాలో మాట్లాడుకున్న మాదిరిగానే 'గ్రేట్ గేమ్' మొదలవుతుంది. అలాంటి పరిస్థితి తలెత్తడానికి భారత్ అనుమతించదు" అని రాజన్ కుమార్ చెప్పారు.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1965లోయుద్ధం జరిగినప్పుడు రష్యా సమతుల్యత పాటించింది. తాష్కెంట్‌లో రష్యా మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది. ఈ ఒప్పందం తర్వాత, రష్యా తనకు పూర్తిగా వ్యతిరేకం కాదని పాకిస్తాన్ భావించింది.

ఐక్యరాజ్య సమితిలో 1991లో 'దక్షిణాసియా అణు రహిత మండలం' (సౌత్ ఆసియా న్యూక్లియర్ ఫ్రీ జోన్)ను పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను భారత్ వ్యతిరేకించింది.

అందులోకి చైనాను చేర్చకపోతే ఈ ప్రతిపాదనకు అర్థం లేదని భారత్ వాదించింది. పాకిస్తాన్ ప్రతిపాదన భారతదేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకే అని చెబుతారు. కానీ నాటి సోవియట్ యూనియన్ పాకిస్తాన్ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది.

 పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పుతిన్ ఎప్పుడూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు...

రష్యాతో భారతదేశ స్నేహం పట్ల అమెరికా ఇప్పటికీ అసంతృప్తిగా ఉంది. కానీ అమెరికా ఒత్తిడికి తలొగ్గడానికి భారత్ నిరాకరించింది.

రష్యాతో స్నేహాన్ని తెంచుకోవాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తే, అది పుతిన్ శక్తిని మరింత బలోపేతం చేస్తుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.

భారతదేశంపై సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించినప్పుడు, థింక్ ట్యాంక్ అనంత సెంటర్ సీఈవో ఇంద్రాణి బాగ్చి ఇలా రాశారు, "ఇది చాలా ప్రమాదకరమైనది. భారతదేశం రష్యాకు ప్రత్యేకమైనదని పశ్చిమ దేశాలు నమ్ముతాయి, కాబట్టి పుతిన్‌ను శాంతింపజేయడానికి భారతదేశాన్ని శిక్షించండి. పుతిన్ తన ప్రయోజనాల నుంచి వెనక్కి తగ్గరు. భారతదేశానికి హాని జరుగుతున్నా ఆయన పట్టించుకోరు. అటువంటి పరిస్థితిలో, భారతదేశం పంచింగ్ బ్యాగ్‌గా మారుతుంది. సంబంధం లేకున్నా తత్ఫలితాలతో నష్టపోతుంది.''

ఇంద్రాణి బాగ్చి అభిప్రాయంపై తన్వి మదన్ స్పందిస్తూ, "ఒకవేళ ట్రంప్ భారతదేశాన్ని ఇబ్బంది పెడితే, పుతిన్ ప్రయోజనం పొందుతారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తే, రష్యాతో సంబంధాలను బలోపేతం చేయాలని భారతదేశంలో డిమాండ్ వస్తుంది. అటువంటి పరిస్థితిలో, చైనాతో ఒప్పందానికి భారతదేశం మరింత సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది" అని రాశారు.

"మనం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి తిరిగి వస్తామని లేదా చైనాకు దగ్గరగా వెళ్తామని భారతదేశంలో కొంతమంది ఆలోచిస్తున్నారు. భారతదేశం గురించి ట్రంప్ అలా ఆలోచిస్తారని నేను అనుకోను. ప్రస్తుతం చైనాతో పోటీ గురించి ట్రంప్ ఆందోళన చెందడం లేదు" అని తన్వి మదన్ చెబుతున్నారు.

ఇవన్నీ ఉన్నప్పటికీ, పాకిస్తాన్ పట్ల భారతదేశ ఆందోళనను పుతిన్ అర్థం చేసుకున్నారని ప్రొఫెసర్ రాజన్ కుమార్ భావిస్తున్నారు. పుతిన్ గత 25 సంవత్సరాలుగా రష్యాలో అధికార కేంద్రంలో ఉన్నా ఇప్పటివరకు పాకిస్తాన్‌ను సందర్శించకపోవడాన్ని ఒక నిదర్శనంగా ఆయన చెబుతున్నారు.

ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడు ఎవరకూ పాకిస్తాన్‌ను సందర్శించలేదు.

సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు కూడా ఎవరూ సందర్శించలేదు. సోవియట్ యూనియన్ పతనమైన 16 ఏళ్ల తర్వాత, 2007 ఏప్రిల్ 11వ తేదీన నాటి రష్యా ప్రధాన మంత్రి మిఖాయిల్ ఫ్రాడ్కోవ్ పాకిస్తాన్‌లో పర్యటించారు.

దక్షిణాసియాలో పుతిన్ సందర్శించే ఏకైక దేశం భారత్.

పాకిస్తాన్‌లోని అప్పటి రష్యా రాయబారి అలెక్సీ డెడోవ్, 2016, మార్చి 17న ఇస్లామాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో పాకిస్తాన్-రష్యా సంబంధాలపై మాట్లాడుతూ, "సమస్య ఏమిటంటే పాకిస్తాన్ సందర్శన అనేది కేవలం ఉత్సవంగా ఉండకూడదు. ఈ పర్యటనకు ఒక ఘనమైన కారణం ఉండాలి. అలాంటి ఒక ఘనమైన కారణం ఉంటే, ఈ పర్యటన కచ్చితంగా జరుగుతుంది. దీనికి సన్నాహాలు, ఒప్పందాలు చాలా అవసరం" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)