భారత విదేశాంగ విధానం కష్టాల్లో పడిందా?

ప్రధాని మోదీ, జైశంకర్, భారత్, అమెరికా, చైనా, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజ్‌నీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరిగే చర్చలు విఫలమైతే, భారత్‌పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని ఆగస్ట్ 13న అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ అన్నారు.

'' భారత మల్టీ-అలైన్‌మెంట్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ వైఫల్యాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వ్యూహం ద్వారా ప్రతి ఒక్కరికీ భారత్ ముఖ్యమైనదిగా మార్చాలని భావించారు. కానీ, ప్రతి ఒక్కరికీ భారత్‌తో అవసరం లేకుండా పోయింది'' అని ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలించే ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నార్డ్ బర్ట్రెండ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

'' మరోలా చెప్పాంటే, తనకు తాను ఇబ్బందులు కొనితెచ్చుకునేలా.. భారత్ తనను తాను మార్చుకుంది. చైనాతో ఘర్షణ పడకుండా, ట్రంప్ ఆంక్షల ద్వారా బలమైన సందేశం పంపాల్సి వచ్చినప్పుడు.. భారత్‌ను బెదిరిస్తారు. ఎందుకంటే, భారత్ చాలా పెద్ద దేశం, కొంత ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ, సమర్థవంతంగా తిప్పికొట్టగలిగినంత శక్తివంతమైనదైతే కాదు'' అని ఆయన రాశారు.

''ప్రతి ఒక్కరికీ స్నేహితుడిగా ఉండాలని ప్రయత్నిస్తే, ప్రతిఒక్కరికీ మీరు ఒక ప్రెజర్ వాల్వ్ అవుతారు. మరీముఖ్యంగా, మీ స్థానమేంటో మీరు బలంగా చెప్పే సామర్థ్యం లేనప్పుడు..'' అని ఆర్నార్డ్ బర్ట్రెండ్ పేర్కొన్నారు.

మల్టీ-అలైన్‌మెంట్ అంటే.. అన్ని గ్రూప్‌లతో భారత్ కలిసి ఉంటుంది. నెహ్రూ నాన్-అలైన్‌మెంట్‌తో (అలీన విధానం) పోలిస్తే ఇది భిన్నమైంది.

అయితే, ఇది కేవలం పదాల్లో తేడా మాత్రమేనన్నది చాలామంది భావన. ఎందుకంటే, నేను ప్రతి ఒక్కరితో ఉంటానని అంటున్నావంటే, ఎవరో ఒకరితోనే ఉండననే అర్థమని అభివర్ణిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మల్టీ-అలైన్‌మెంట్ విధానం విఫలమైందా?

కానీ, భారత్ విషయంలో ఆర్నాడ్ చేసిన వ్యాఖ్యలు ఆరు రోజుల్లోనే మారిపోయినట్లు కనిపించాయి. ఆగస్ట్ 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన ఫోటోలను పోస్ట్ చేశారు.

''భారత్‌ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. కానీ, యూరప్‌కు లేని రాజకీయ సత్తా మోదీకి ఉంది. ఒకవేళ రష్యాతో యూరప్‌ ఇలానే చేస్తే ఊహించుకోండి, ట్రంప్‌కు ఇన్ని అవకాశాలు వచ్చేవి కావు. యూరప్‌కు ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం ఉండేది కాదు'' అని ఆర్నాడ్ అదే పోస్టులో రాశారు.

'' యూరోపియన్ నేతలను ట్రంప్ స్కూల్ పిల్లల మాదిరిగా ఎలా చూశారో, ఆర్థికంగా ఎలా నష్టం కలిగించారో.. వాటి గురించి నేను మాట్లాడటం లేదు. అన్నివిధాలుగా యూరప్ బాధపడుతున్న పరిస్థితి. ఒకవైపు, అమెరికా తొత్తుగా అవమానాలకు గురవువుతోంది, అదే సమయంలో ఈ పరిస్థితిని ఆర్థికపరంగానూ ట్రంప్ వాడుకుంటున్నారు. ఈ పరోక్ష యుద్ధానికి యూరప్ మూల్యం చెల్లిస్తోంది. పొరుగు దేశం నుంచి శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటోంది. మరోవైపు, ట్రంప్ రష్యాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు.''

'' చైనాపై భారతీయులకు ఉన్న వ్యతిరేకత రష్యా‌పై యూరప్‌లో లేదు. యూరప్‌తో పోలిస్తే భారత్‌కు రాజకీయంగా ఇది చాలా కష్టం. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై ఆసియా నాయకులకు ఉన్న నిబద్ధత యూరప్‌లో లేదు'' అని ఆర్నార్డ్ రాశారు.

ఆర్నార్డ్ తన వైఖరి మార్చుకోవడంపై ఇంగ్లిస్ న్యూస్ పేపర్ "ది హిందూ" ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ, "దేశాలు దీర్ఘకాలికంగా ఆలోచిస్తాయి. విశ్లేషకులు స్వల్పకాలానికే ఆలోచిస్తారు'' అని రాశారు.

పుతిన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ప్రభుత్వ మల్టీ-అలైన్‌మెంట్ పాలసీ నిజంగా విఫలమైందా? అని ఫ్రాన్స్‌కు భారత మాజీ రాయబారి జావెద్ అష్రఫ్‌ను ప్రశ్నించగా.. '' నేనలా అనుకోవడం లేదు. ఎస్‌సీవో సదస్సుకు నరేంద్ర మోదీ వెళ్తున్నారంటే.. అది అమెరికాకు వ్యతిరేకంగా ఆయన వెళ్తున్నారని కాదు. ట్రంప్‌ రావడానికి ముందు కూడా, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు జరిగాయి. అమెరికాతో సంబంధాలు వాణిజ్యపరంగా కొంత దెబ్బతిన్నాయి. కానీ, మిగిలిన సంబంధాలు బాగానే ఉన్నాయి'' అని జావెద్ అష్రఫ్ తెలిపారు.

'' భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం.. భారత్ తన ప్రయోజనాల విషయంలో రాజీపడకపోవడం. అందుకే, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అమెరికాతో చర్చిస్తోంది. చైనా, రష్యాలు చాలా శక్తివంతమైనవి. అందుకే, అవి వాటి కోణంలో అమెరికాకు సమాధానమిస్తున్నాయి. ఒకవేళ మనకు కూడా అంత శక్తి ఉంటే, మనం కూడా అదే స్థాయిలో స్పందించేవాళ్లం. అదే తేడా'' అని జావెద్ అష్రఫ్ అన్నారు.

మోదీ చైనా పర్యటన ట్రంప్ వైఖరితో ముడిపడి ఉన్నప్పటికీ, చైనాతో సంబంధాలను మెరుగుపరిచే ఈ ప్రక్రియ అకస్మాత్తుగా ప్రారంభం కాలేదని థింక్ ట్యాంక్ 'బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్' సీనియర్ ఫెలో తన్వీ మదన్ అభిప్రాయపడ్డారు.

''గత ఏడాది రష్యాలోని కజాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. చైనాతో సంబంధాలను భారత్ మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. అలా చేయడం ద్వారా, తన వ్యూహాత్మక, ఆర్థిక పరిధిని విస్తరించుకోవడంతో పాటు సరిహద్దు ఉద్రిక్తతలకు తావులేకుండా పోతుంది'' అని తన్వీ మదన్ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు.

''కానీ, ఇక్కడ ప్రశ్నేంటంటే.. వీటికి చైనా కట్టుబడి ఉంటుందా? సరిహద్దు ఘర్షణల వల్ల చాలాసార్లు చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోయిన ఘటనలను మనం చూశాం. ఒకవేళ భారత్‌ను చైనా బలహీనంగా భావిస్తే, సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తొచ్చు'' అని అన్నారు.

చైనా, వాంగ్ యీ, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ చైనా పర్యటన

ఆగస్ట్ 18, 19 తేదీల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఆగస్ట్ 21న ఆయన పాకిస్తాన్ వెళ్లారు. వాంగ్ యీ భారత్‌ తర్వాత పాకిస్తాన్ వెళ్లడంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.

''చైనాతో భారత్ సంబంధాలను మెరుగుపర్చుకోవాలనుకుంటే, చైనా దాన్ని స్వాగతిస్తుంది. కానీ, భారత్‌కు ఎలాంటి రాయితీలు లభించవు. చైనా తన ప్రయోజనాల విషయంలో రాజీపడదు. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ఆపదు'' అని షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలో దక్షిణాసియాతో చైనా సంబంధాలను పరిశీలించే నిపుణులు లిన్ మిన్వాంగ్ న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధించింది. ఆగస్ట్ 27 నుంచి భారత్‌పై ఈ 50 శాతం టారిఫ్‌లు విధిస్తే, అమెరికాతో వాణిజ్యం కష్టంగా మారుతుంది.

గత నాలుగేళ్లుగా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది. అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 131.84 బిలియన్ డాలర్లుగా (రూ.11,51,010 కోట్లు) ఉంది.

అమెరికాతో జరిగే ఇంత పెద్ద మొత్తంలో వాణిజ్యానికి అవాంతరాలు ఎదురైతే, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడటం అనివార్యం.

ఇలాంటి పరిస్థితిలో, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలి. లేదంటే కొత్త మార్కెట్ల కోసం భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

'' దౌత్యానికి బదులుగా అమెరికాకు తలవంచడానికి భారత్ నిరాకరిస్తే, అతిపెద్ద వాణిజ్య భాగస్వామిని, ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్‌ను భారత్ కోల్పోనుంది. చైనాతో స్నేహం పెంచుకోవడం లేదా దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలు తీసుకోవడం మంచిది. కానీ, ఇవేవీ అమెరికా స్థానాన్ని భర్తీ చేయలేవు'' అని బ్లూమ్‌బర్గ్ రాసింది.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. చైనా రెండో స్థానంలో ఉంది. భారత్ కూడా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనాతో చెడు సంబంధాలను కలిగి ఉండటం ద్వారా భారత్ సమస్యలను పెంచుకోవాలనుకోవడం లేదు.

భారత్‌కు చైనా, అమెరికాలు రెండు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో 127.7 బిలియన్ డాలర్లుగా (రూ.11,14,841 కోట్లుగా) ఉంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు చైనా వెళ్తున్నారు. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా వెళ్తున్నారు.

ఏడేళ్ల తర్వాత చైనా వెళ్తోన్న మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడేళ్ల తర్వాత చైనా వెళ్తోన్న మోదీ

భారత్, చైనాకు ఒకరికొకరు అవసరం

తూర్పు లద్దాఖ్‌లో 2020 ఏప్రిల్‌కు ముందునాటి యథాతథ స్థితి పునరుద్ధరణ జరగలేదు, ఇలాంటి సమయంలో మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు.

2020 తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల పేర్లను మాండరిన్‌(చైనీస్ భాష)లో పలుమార్లు చైనా మార్చింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పిలుస్తోంది. టిబెట్, తైవాన్ రెండూ చైనాలో భాగమేనని చెప్పే.. 'వన్ చైనా' పాలసీని భారత్ విశ్వసిస్తుందనేది వేరే వ్యవహారం.

ఎస్‌సీవో సదస్సుకు కోసం చైనా వెళ్లాలన్న ప్రధాని మోదీ నిర్ణయం ఊహించినది కాదు. 2023లో ఎస్‌సీవోకు భారత్ నేతృత్వం వహించింది. ఈ సదస్సును భారత్ వర్చ్యువల్‌గా నిర్వహించింది.

భారత్ ఈ సదస్సును వర్చ్యువల్‌గా నిర్వహించడానికి ప్రధాన కారణం.. చైనా ఆధిపత్యం వహించే గ్రూప్‌లపై భారత్ అంత ఉత్సాహం చూపించకపోవడమే.

అదేవిధంగా, 2022లో భారత్ జీ-20 సదస్సు నిర్వహించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆ సదస్సుకు హాజరు కాలేదు. అయితే, అమెరికాతో భారత్ సంబంధాలు క్షీణిస్తోన్న తరుణంలో మోదీ చైనా వెళ్తున్నారు.

అమెరికాతో బ్రేకప్ కావడంతో, చైనాకు భారత్ ప్రేమ సందేశం పంపుతోందన్నది నమ్మబుద్ధి కావడం లేదని 'కళింగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండో-పసిఫిక్ స్టడీస్' ఫౌండర్ ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర చెప్పారు.

''అమెరికాతో బ్రేకప్ కాలేదు. చైనాకు కొత్తగా ఎలాంటి ప్రేమ సందేశం పంపలేదు. ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి కేవలం భారత్‌పైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది. కానీ, భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం ట్రంప్‌తో ముడిపెట్టకూడదు. ఇరుదేశాల మధ్య ఘర్షణల సమయంలో కూడా చైనాతో భారత వాణిజ్యం పెరిగింది'' అని ప్రొఫెసర్ మహాపాత్ర తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)