భారత్‌పై ట్రంప్ కోపానికి 'అసలు' కారణం వేరే ఉందా, రష్యన్ మీడియా ఏమంటోంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈ ఏడాది జనవరిలో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినపుడు, రష్యా పట్ల ఆయన వైఖరి బైడెన్ ప్రభుత్వానికి భిన్నంగా ఉంది.
యుక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ట్రంప్ నేతృత్వంలోని అమెరికన్ ప్రభుత్వం చాలాసార్లు మద్దతు ఇచ్చింది.
మరోవైపు, ఫిబ్రవరిలో యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కలవడానికి వైట్‌హౌస్‌కు వచ్చినప్పుడు, వారి మధ్య చర్చ జరిగింది.
ఆ సమయంలో, జెలియన్ స్కీ శాంతిని కోరుకోవడం లేదని, ఆయన అంగీకరించకపోతే అమెరికా ఈ యుద్ధం నుంచి బయటకు వస్తుందని ట్రంప్ అన్నారు.
రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ గెలవలేదని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
ఆ సమయంలో, భారత్, రష్యాల మధ్య స్నేహంపై ట్రంప్‌కు ఎటువంటి సమస్యా ఉండదని నిపుణులు భావించారు.
కానీ, గత ఐదు నెలల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాన్ని పెంచారు.
ఈ క్రమంలో ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చి రష్యా నుంచి దూరం చేయగలరా? అనే విషయంపై రష్యన్ మీడియాలో చర్చ జరుగుతోంది.
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ (టీఏఎస్ఎస్) ఆగస్టు 9న రాజకీయ విశ్లేషకులకు ఈ ప్రశ్న వేసింది.
ట్రంప్ ఒత్తిడి కారణంగా భారత్ అమెరికా విదేశాంగ విధానాన్నిఅనుసరించబోదని రష్యా సెక్యురిటీ కౌన్సిల్‌లోని సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు ఆండ్రీ సుషెంట్సోవ్ అభిప్రాయపడ్డారు.
భారత్ విషయంలో ఈ రకమైన అమెరికా విధానం విఫలమైందన్నారాయన. అందుకే అమెరికా ఒత్తిడి ఎక్కువ కాలం నిలవదని సుషెంట్సోవ్ అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, Getty Images
'చమురు కారణం కాదు'
"ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్‌పై సుంకాన్ని రెట్టింపు చేయాలనే నిర్ణయం ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి ముందే తీసుకున్నారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్నందునే అమెరికా సుంకాన్ని రెట్టింపు చేసిందనేది అసలు కారణం కాదు. భారత్‌పై అమెరికా ఒత్తిడికి కారణం వేరే కారణం ఉంది" అని సుషెంట్సోవ్ టాస్‌కు చెప్పారు.
"జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనాతో వివాదం తలెత్తినప్పుడు అమెరికా భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది. అటువంటి పరిస్థితిలో, భారత్ తన నాయకత్వాన్ని అంగీకరించి, స్వతంత్ర విదేశాంగ విధానంపై తన పట్టును వదులుకోవాలని అమెరికా కోరుకుంటుంది. కానీ, ఈ వ్యూహం ద్వారా అమెరికా ఎత్తుగడ సఫలం కాదు. అందుకే, భారతదేశంపై అమెరికా ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు" అని ఆయన అన్నారు.
"ఒత్తిడి చేయడం అనేది అమెరికా వ్యూహంలో భాగం. అది సఫలం కానప్పుడు, అధ్యక్షుడు గెలిచామని ప్రకటించుకుంటారు. మునుపటి నిర్ణయాలలో నిశ్శబ్దంగా మార్పులు చేస్తారు. అమెరికా రెచ్చగొడుతూ వాణిజ్యాన్ని కవచంగా ఉపయోగిస్తుంది, ఇందులో ఒప్పందాలకు అవకాశం తక్కువ" అని సుషెంట్సోవ్ అన్నారు.
"బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. ట్రంప్ అక్కడి ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. ఫలితంగా ప్రతిఘటన పెరుగుతోంది, ప్రభావిత దేశాలు స్పందించడానికి మార్గాలను వెతకడం ప్రారంభిస్తాయి" అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రష్యాకు డోభాల్
ఆగస్టు 6న, ట్రంప్ భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఆగస్టు 7న, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా చేరుకున్నారు.
అజిత్ డోభాల్ రష్యా పర్యటనలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశారు. ఈ ఏడాది చివరి నాటికి పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తారని డోభాల్ చెప్పారు.ః
భారత ప్రధాని మోదీ ఆగస్టు 8న రష్యా అధక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. పుతిన్ ఈ ఏడాది చివరినాటికల్లా భారత్‌ను సందర్శిస్తారని చెప్పారు.
ఆగస్టు 7న రష్యా టుడే (ఆర్‌టీ) కూడా ఒక కథనం ప్రచురించింది. అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరి నాటికి న్యూదిల్లీని సందర్శిస్తారని, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెలలో రష్యాలో పర్యటిస్తారని పేర్కొంది.
"రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలనే ఒత్తిడి భారత్‌పై ఉన్నప్పుడు, అజిత్ డోభాల్ రష్యాను సందర్శించారు. భారత్-రష్యాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి చర్చిస్తున్నాయి. ఇందులో, అరుదైన భూ ఖనిజాలు, విమాన భాగాల ఉత్పత్తి, రైల్వేలో సహకారాన్ని పెంచడం గురించి చర్చ జరుగుతోంది" అని రష్యా టుడే తెలిపింది.
"మరిన్ని ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయడానికి డోభాల్ రష్యాతో మాట్లాడారని భారత మీడియాలో కూడా చెబుతున్నారు. భారత్‌లో ప్రస్తుతం మూడు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వాటిని ఉపయోగించింది'' అని తెలిపింది.
రష్యన్ మీడియా గ్రూప్ రోసియా సెగోడ్న్యా డైరెక్టర్ జనరల్ డిమిత్రి కిసెలెవ్ గతవారం స్పుత్నిక్ న్యూస్‌తో మాట్లాడుతూ "భారత్, రష్యాల మధ్య స్నేహం రెండు దేశాలకు చాలా ముఖ్యమైనది. అమెరికా అల్టిమేటం విషయంలో కూడా, భారత వైఖరి తార్కికంగా, సమతుల్యంగా ఉంది. రష్యాతో సంబంధాల పరంగా భారత్ ఎవరి ఒత్తిడికీ లొంగదు. భారత్, రష్యాలోని సామాన్య ప్రజలు కూడా ఒకరినొకరు నమ్ముతారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'రష్యాను వదిలేసి భారత్‌పై సుంకాలు'
యుక్రెయిన్‌లో 2008 నుంచి 2012 వరకు బ్రిటిష్ రాయబారిగా ఉన్నారు లీ టర్నర్. ఆగస్టు 11న మాస్కో టైమ్స్‌లో పుతిన్, ట్రంప్ మధ్య జరగనున్న శిఖరాగ్ర సమావేశం గురించి టర్నర్ ఒక విశ్లేషణ రాశారు.
"ఇంతకుముందు భారతదేశంపై అమెరికా 100 శాతం సుంకం విధిస్తుందని చెప్పారు, కానీ ఇప్పుడది 50 శాతం సుంకాన్ని ప్రకటించింది. ఈ సుంకం కూడా ఆగస్టు 27కి ముందు అమలు కాదు. దీనికి ముందే, అంటే ఆగస్టు 15న పుతిన్, ట్రంప్ సమావేశం కానున్నారు. భారత్ తప్ప, రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న మరే దేశం లక్ష్యం కాలేదు" అని తెలిపారు టర్నర్.
యుక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యపై భారత్‌ను శిక్షించడం అమెరికా విదేశాంగ విధానంలో తిరోగమనం అని టర్నర్ భావించారు. గతంలో ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడిని 'నియంత' అని సంబోధించారని గుర్తుచేశారు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రష్యా పక్షాన నిలిచారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కూడా యుక్రెయిన్ 2014కి ముందు ఉన్న సరిహద్దులను తిరిగి పొందలేదని, నేటోలో చేరలేదని చెప్పారు.
"యుక్రెయిన్ ప్రయోజనాలను విస్మరిస్తూ పుతిన్-ట్రంప్ సమావేశంలో అమెరికా ఒక ఒప్పందానికి రావొచ్చు. రష్యాపై ట్రంప్ ఎలాంటి కొత్త సుంకాలను విధించలేదు. కానీ, అమెరికా చేయగలిగినవి చాలా ఉన్నాయి. రష్యన్ చమురు ట్యాంకర్లపై అమెరికా ఎటువంటి చర్య తీసుకోలేదు. రష్యన్ చమురు వాణిజ్యానికి సహాయపడే బ్యాంకులు, శుద్ధి కర్మాగారాలపై అమెరికా ప్రత్యేక ఆంక్షలేవీ విధించలేదు" అని టర్నర్ తెలిపారు.
"ఇప్పుడు యుక్రెయిన్ తన భూభాగాన్ని కోల్పోవాల్సిన ఒప్పందానికి ట్రంప్ అంగీకరించవచ్చనే భయం ఉంది. ఇందుకు యుక్రెయిన్ నిరాకరిస్తే, దాన్ని అంగీకరించేలా అమెరికా ఒత్తిడి తెస్తుంది" అని చెప్పారు.
"జనవరిలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ఇలాగే చేసింది. యుక్రెయిన్‌కు ఆయుధ సరఫరాలను నిలిపివేసింది. నిఘా సమాచారాన్ని పంచుకునే ప్రక్రియకు కూడా అంతరాయం కలిగించింది. మరోవైపు, రష్యాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు" అని టర్నర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఒత్తిడి పనిచేయదు'
భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకాలపై యూరోసెర్బియా.నెట్ (Euroserbia.net) ఎడిటర్ కాన్‌స్టాంటిన్ వాన్ హాఫ్‌మెయిస్టర్ ఆగస్టు 7న ఒక వ్యాసం రాశారు.
"భారత్, రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు బలంగా మారాయి. 2021-22లో కేవలం రూ. 1.13 లక్షల కోట్లు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.9 లక్షల కోట్లకు పెరిగింది" అని వాన్ రాశారు.
"రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు, ఎరువులను దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా రష్యా, భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా మారింది. భారత్ ప్రస్తుతం దాని మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 35 నుంచి 40 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.4.3 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది" అని తెలిపారు.
"రష్యా, భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. రెండు దేశాలు పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థను దాటి వ్యాపారం చేస్తున్నాయి. దాదాపు 90 శాతం ద్వైపాక్షిక వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరుగుతోంది. ఇప్పుడు 'వాణిజ్య నది' మాస్కో నుంచి న్యూదిల్లీకి ప్రవహిస్తోంది. ఇప్పుడు రెండు దేశాలకు స్విఫ్ట్ కారిడార్ అవసరం లేదు" అని వాన్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














