భారత్‌పై డోనల్డ్ ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నారు? నిపుణులు చెబుతున్న 5 ప్రధాన కారణాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. దీంతో ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతో కలిపి మొత్తం సుంకాలు 50 శాతం కానున్నాయి.
అదనపు సుంకాలకు ఆదేశాలిస్తూ, ''భారత ప్రభుత్వం ఇప్పటికీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది''అని వైట్‌హౌస్ పేర్కొంది. అందుకే అదనపు సుంకాలు విధించినట్లు తెలిపింది.
ఈ అదనపు సుంకాలు ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వస్తాయి.
అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో భారత్ కంటే చైనా ముందున్నప్పటికీ, ప్రత్యేకంగా భారత్‌నే అమెరికా ఎందుకు లక్ష్యం చేసుకుందనేదే ఇక్కడి ప్రశ్న.

చైనా మాత్రమే కాకుండా, యూరప్ నుంచి తుర్కియే వరకు అనేక ఇతర దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి.
అయితే, భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహానికి ఇతర అనేక కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
వారి దృక్పథంలో అలాంటి ఐదు ప్రధాన కారణాలేమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం బ్రిక్స్. ఇందులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ దేశాలన్నీ డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మింగుడుపడడం లేదు. బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామంటూ ఎప్పటికప్పుడు బెదిరిస్తూ వస్తున్నారు.
బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీని తీసుకొస్తే, అమెరికాతో వాణిజ్యానికి వీడ్కోలు పలికేందుకు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నాటి నుంచి చమురును రూబుల్స్(రష్యన్ కరెన్సీ)లో చైనా కొనుగోలు చేస్తోంది .
యూఎస్ కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్ ప్రకారం, 2022లో అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు సగభాగం అమెరికన్ డాలర్లలోనే జరిగింది. డాలర్ ద్వారానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది.
ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ జియోపాలిటిక్స్ ప్రొఫెసర్ ఫైసల్ అహ్మద్, బ్రిక్స్ అంతకంతకూ విస్తరిస్తోందని భావిస్తున్నారు.
''ఇప్పుడు ఇరాన్ కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ గురించి చర్చ జరుగుతోంది. దాని గురించే అమెరికా భయపడుతోంది. వీళ్లు బలంగా ఉంటే డాలర్ బలహీనమవుతుంది. మరిన్ని సుంకాలు విధిస్తే, ఆర్థిక వ్యవస్థకు హాని కలుగుతుంది. అప్పుడు అమెరికా ఆధిపత్యం అలాగే కొనసాగుతుంది'' అని ఆయన అన్నారు.
మరోవైపు, థింక్ ట్యాంక్ అయిన గేట్‌వే హౌస్‌లో ఫెలోగా ఉన్న నైనిమా బసు ''బ్రిక్స్‌లోని ఇతర దేశాలు చాలా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాయి, కానీ భారత్ అలసత్వ వైఖరి కారణంగా వారు అలా చేయలేకపోతున్నారు. అమెరికాతో సంబంధాల కారణంగా భారత్ బ్రిక్స్‌ను బలహీనపరుస్తోందని పదేపదే ఆరోపణలు ఎదుర్కొంటోంది'' అన్నారు.
''అమెరికాపై కేవలం భారత్ ఒక్కటే కాదు, ఇతర బ్రిక్స్ దేశాలు కూడా ఆధారపడ్డాయి. అయినా, అమెరికా నుంచి భారత్ ఇలాంటి సుంకాలను ఎదుర్కొంటోంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా చాలా ఏళ్లుగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ మొదటి పదవీకాలంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి, కానీ ఫలించలేదు.
వాణిజ్య ఒప్పందం అమెరికాకు భారత మార్కెట్లను తెరుస్తుందని ట్రంప్ విశ్వసిస్తున్నారు, కానీ కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నైనిమా బసు మాట్లాడుతూ, ''వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ వెనక్కి తగ్గింది. అందుకు తగిన కారణాలే ఉన్నప్పటికీ, భారత మార్కెట్లలోకి విస్తృతంగా ప్రవేశించేందుకు తలుపులు తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది'' అన్నారు.
భారత్, అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లు(అంటే సుమారు 70 వేల కోట్ల రూపాయలు). భారత్ బియ్యం, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది. అమెరికా నుంచి డ్రైఫ్రూట్స్, యాపిల్స్, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది.
అమెరికాకు రాయితీలు కల్పిస్తే, ఇప్పుడున్న మాదిరిగా ఎం.ఎస్.పీ (కనీస మద్దతు ధర)కు రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేమని, ఇది దేశంలో పెద్ద సమస్యగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ముఖ్యంగా.. బియ్యం, గోధుమలు, పాల ఉత్పత్తుల వంటి వాటిపైనే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య 2020లో ఘర్షణ జరిగిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి చైనాలో పర్యటించనున్నారు.
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ ఈ పర్యటన జరగనుంది.
గతేడాది అక్టోబర్‌లో, రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు.
2025 జూన్‌లో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా బీజింగ్‌లో పర్యటించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ కూడా చైనా వెళ్లారు.
భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని జామియా మిలియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగ ప్రొఫెసర్ రేష్మీ కాజీ అన్నారు.
''ఏదైనా దేశం అమెరికాను సవాల్ చేస్తోందంటే, అది చైనానే. ఒకప్పుడు ఈ ప్లేస్‌లో రష్యా ఉండేది. కానీ ఇప్పుడు చైనాతోనే అమెరికాకు అతిపెద్ద ముప్పు. చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్ అవసరం.''
''భారత్, చైనా మధ్య కైలాష్ మానసరోవర్ యాత్ర మళ్లీ మొదలైంది. ప్రధాని మోదీ చైనా పర్యటన తర్వాత, బీజింగ్ - దిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీస్ కూడా ప్రారంభం కావొచ్చని అనుకుంటున్నా. చైనా ఎప్పటి నుంచో ఇది కోరుతోంది. రానున్న రోజుల్లో వీసా పరిమితులను కూడా ఎత్తేయచ్చు'' అని నైనిమా బసు అన్నారు.
''ఇదంతా అమెరికాకు మింగుడుపడడం లేదు, రష్యా నుంచి చమురు కొంటున్నారంటూ సాకులు చెబుతోంది. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపేస్తే భారత్‌పై అమెరికా సుంకాలు విధించదా?'' అని ఆమె ప్రశ్నించారు.
''ప్రధాని మోదీ అమెరికా వెళ్లిన సమయంలో, ట్రంప్ భారత్‌ను టారిఫ్ కింగ్ అని సంబోధించారు. అందువల్ల సుంకాలు విధింపును నిలువరించడం కష్టం. అయితే, దానిని కనీసం పరిమితుల్లోపు ఉంచొచ్చు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ విషయంలో ఈసారి ట్రంప్ కఠినంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. గత పదవీ కాలంలో కాస్త మృదువుగా వ్యవహరించినట్లు కనిపించారు.
భారత్, పాక్ మధ్యన తన వల్లే కాల్పుల విరమణ జరిగినట్లు ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నారు, అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని స్పష్టం చేసింది.
''ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోదీ తనకు కొంత క్రెడిట్ ఇవ్వాలని, లేదంటే కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చేయాలని ట్రంప్ కోరుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇది ట్రంప్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది'' అని బసు అన్నారు.
ప్రొఫెసర్ రేష్మి కాజీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ బహుమతి పొందాలనుకుంటున్నారని ఆమె అన్నారు.
''పాకిస్తాన్, కంబోడియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కోసం డిమాండ్ చేశాయి. అయితే, భారత్ స్పందించలేదు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

టారిఫ్, నాన్ టారిఫ్ అనేవి వాణిజ్య ఒప్పందం, ఎగుమతులు - దిగుమతుల నియంత్రణకు సంబంధించినవి.
‘‘ఏదైనా వస్తువు ఎగుమతి - దిగుమతిపై విధించే పన్నును, సుంకం అంటారు. అయితే, నాన్ టారిఫ్ విధానంలో ఏ వస్తువు ఎగుమతి లేదా దిగుమతులను పరిమితం చేయడం, లైసెన్సింగ్, తనిఖీలు, నాణ్యతాపరమైన నిబంధనల వంటివి ఉంటాయి ’’ అని వివరించారు ప్రొఫెసర్ ఫైసల్ అహ్మద్.
‘‘నాన్ టారిఫ్ నిబంధనలపై అమెరికా చాలా కాలంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్‌పై ట్రంప్ అసంతృప్తికి ఇదో పెద్దకారణం. ప్రతి దేశం నాన్ టారిఫులు విధిస్తున్నప్పటికీ , అమెరికా అందులోనూ మినహాయింపు కోరుకుంటోంది.''
''భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అమెరికా అభివృద్ధి చెందిన దేశం. అందువల్ల రెండు దేశాలనూ ఒకేలా చూడలేం. దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడంపై భారత్ దృష్టి పెట్టింది'' అని ఫైసల్ అహ్మద్ విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














