ట్రంప్ టారిఫ్‌లపై భారత్ ఎందుకు మౌనంగా ఉంది?

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కీర్తి రావత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌పై 27 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.

దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన భారత్, తమ తదుపరి వ్యూహం ఏంటో చెప్పలేదు.

అమెరికా టారిఫ్‌లపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

''కొత్త పరిణామాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. వీటి ప్రభావానికి గురయ్యే అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. అమెరికా వాణిజ్య విధానంలో ఇటీవల వచ్చిన మార్పుల వల్ల పుట్టుకొచ్చే కొత్త అవకాశాల గురించి కూడా అధ్యయనం చేస్తున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా టారిఫ్‌లకు స్పందనగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటివరకు సమాధానం లేని ప్రశ్న ఇది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఎందుకు ప్రతిఘటించడం లేదు?

అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్ ఇంకా ప్రతీకార చర్యలు తీసుకోకపోవడానికి మూడు కారణాలున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకులు, నిపుణులు అజయ్ శ్రీవాస్తవ వివరించారు.

మొదటిది: భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం గురించి జరుగుతోన్న ద్వైపాక్షిక చర్చల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై మంతనాలు జరుగుతున్నాయి. ఆగస్టు-అక్టోబర్ మధ్యలో మొదటి దశ చర్చలు ముగుస్తాయి. ఈ దశలో టారిఫ్‌లను తొలగించడం గురించి చర్చిస్తారు. దీనివల్ల భారత్‌పై టారిఫ్‌లను తగ్గించడం లేదా ప్రతీకార టారిఫ్‌లను తొలగించవచ్చు.

రెండోది: అమెరికా టారిఫ్‌లు విధించిన తర్వాత వ్యాపార ప్రపంచంలో సమస్యలు పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమెరికా ప్రజలను, వ్యాపారవేత్తలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. టారిఫ్‌లు స్థిరంగా ఉండబోవని భారత్ భావించడానికి ఇది కూడా ఒక కారణం.

మూడోది: డోనల్డ్ ట్రంప్ మొదటి పదవీ కాలంలో, 2018 మార్చి సమయంలో భారత్ ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకం విధించారు. అప్పుడు కూడా భారత్ వెంటనే స్పందించలేదు. కానీ, 2019 జూన్‌లో అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లను విధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.

''మితిమీరిన ప్రతీకార చర్యకు సంబంధించిన విషయం కాదు ఇది. టారిఫ్‌లు భారత్‌పై మాత్రమే విధించలేదు. భారత్‌పైనే అత్యధిక టారిఫ్‌లు విధించలేదు. అమెరికాతో ఆలోచనాత్మకంగా చర్చలు జరపాలి. భారత్, అమెరికా రెండింటికీ ప్రయోజనం చేకూర్చే ఒప్పందం చేసుకోవాలి'' అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ అన్నారు.

భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్, రుబియో చర్చలు

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోను కలిశారు. ఈ సమావేశం తర్వాత చర్చలు బాగా జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

''మార్కో రుబియోతో మంచి సంభాషణ జరిగింది. ఇండో-పసిఫిక్, భారత ఉపఖండం, యూరప్, మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాకు సంబంధించిన అంశాలను చర్చించాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై ఏకాభిప్రాయం ఉంది'' అని ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు.

ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం

అమెరికాకు భారత్ ఔషధాలు, ఆటో పరికరాలు, దుస్తులు వంటివి ఎగుమతి చేస్తోంది. క్రూడాయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, మిలిటరీ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

భారతదేశానికి అమెరికా ఐదో అతిపెద్ద క్రూడాయిల్ సరఫరాదారు. అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ సరఫరాదారు.

2030 నాటికి దేశంలో సహజవాయువు వినియోగాన్ని 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం అనుకుంటోంది.

భారత్ నుంచి అమెరికా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతులు తక్కువ. ఈ రెండు దేశాల మధ్య 190 బిలియన్ డాలర్లు (రూ. 16,34,796 లక్షల కోట్లు) వాణిజ్యం జరుగుతోంది.

అమెరికాకు భారత ఎగుమతులు 83.77 బిలియన్ డాలర్లు (రూ. 7,20,772 లక్షల కోట్లు) కాగా, అమెరికా నుంచి భారత దిగుమతులు 40.12 బిలియన్ డాలర్లు (రూ. 3,45,200 లక్షల కోట్లు). అంటే ఈ వాణిజ్యంతో అమెరికా ఎదుర్కొనే వాణిజ్య లోటు 43.65 బిలియన్ డాలర్లు (రూ. 3,75,572 లక్షల కోట్లు).

ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మిగతా దేశాల ప్రణాళికలు ఏంటి?

ఏప్రిల్ 3న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించినప్పటి నుంచి 50కి పైగా దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి ప్రయత్నించాయని అమెరికా అధికారులు అంటున్నారు.

భారత్ తరహాలోనే వియత్నాం, తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు టారిఫ్‌లపై ప్రతీకార చర్యలకు బదులుగా చర్చల వైపే మొగ్గు చూపాయి.

అమెరికా నుంచి మరిన్ని వ్యవసాయ, యంత్రాలు, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యోచిస్తున్నామని, తమ ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌లు విధించాలని తైవాన్ అధ్యక్షుడు విలియం లై సూచించారు.

టారిఫ్‌ల అంశంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కలిశారు.

''అమెరికాతో వాణిజ్య లోటు లేకుండా చూసుకుంటాం. త్వరలోనే ఇది జరిగేలా చూస్తాం. ఇదే సరైన చర్య అని మేం అనుకుంటున్నాం. వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిస్తాం'' అని నెతన్యాహు అన్నారు.

టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత ట్రంప్‌ను కలిసిన తొలి అంతర్జాతీయ నాయకుడు నెతన్యాహు.

రక్షణ సామగ్రి సహా అమెరికా నుంచి మరిన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ అన్నారు.

వియత్నాంపై అమెరికా 46 శాతం టారిఫ్‌ విధించింది. టారిఫ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం ఇదే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)