‘హ్యాండ్స్ ఆఫ్’ అంటూ ట్రంప్‌పై అమెరికా వ్యాప్తంగా నిరసనలు దేనికి?

వాషింగ్టన్ డీసీలో గుమిగూడిన వేలాదిమంది ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ డీసీలో గుమిగూడిన వేలాదిమంది ప్రజలు
    • రచయిత, బోస్టన్‌నుంచి రాబిన్ లెవిన్ సన్ కింగ్, వాషింగ్టన్ డీసీ నుంచి జెన్నా మూన్, ఫ్లోరిడా నుంచి బెర్ండ్ డెబస్ మన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ తీరును నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా పలు నగరాలలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. జనరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద నిరసన ఇదే.

‘హ్యాండ్స్ ఆఫ్' పేరుతో అమెరికాలోని 50 రాష్ట్రాలలోని 1,200 ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆందోళనకారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

బోస్టన్, షికాగో, లాస్‌ఏంజలెస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ సహా పలు నగరాలలో శనివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.

సామాజిక, ఆర్థిక సమస్యలు సహా, ట్రంప్ ఎజెండాపై తమకు అనేక అభ్యంతరాలున్నాయని నిరసనకారులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత అమెరికా వెలుపల, లండన్, పారిస్, బెర్లిన్ లాంటి దేశాలలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

బోస్టన్‌లో అమెరికా విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్ దాడులతోపాటు అరెస్టులు, బహిష్కరణలకు దారితీసిన సంఘటనలు తమను నిరసనకు ప్రేరేపించాయని ఆందోళనకారులు చెప్పారు.

కిందటి నెలలో బోస్టన్ ప్రాంతంలోని టఫ్ట్స్ యూనివర్సిటీలో తుర్కియే అంతర్జాతీయ విద్యార్థిని రుమేసా ఓజటర్క్‌ను ముసుగు ధరించిన అమెరికా ఏజెంట్లు అరెస్ట్ చేయడం తనను ఈ ఉద్యమానికి ప్రేరేపించిందని లా స్టూడెంట్ కేటీ స్మిత్ బీబీసీతో అన్నారు.

''నేను పెద్దగా నిరసనలలో పాల్గొనే అమ్మాయిని కాను. కానీ ఏ పరిణామం ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నా, అది ఇప్పుడైనా సరే..తరువాతైనా'' అని ఆమె చెప్పారు.

లండన్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్ లో ఓ నిరసనకారుడు ట్రంప్‌లాగా కనిపించే ఒక టాయిలెట్ బ్రష్‌ను ప్రదర్శించాడు.

లండన్‌లో..

లండన్‌లో నిరసనకారులు ‘ప్రజలను బాధించడం ఆపండి’, ‘అతను మూర్ఖుడు’ అని ఇంగ్లిషులో రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కనిపించారు.

అమెరికా విదేశాంగ విధానంలో ట్రంప్ చేసిన మార్పులను ప్రస్తావిస్తూ 'హ్యాండ్స్ ఆఫ్ కెనడా', 'హ్యాండ్స్ ఆఫ్ గ్రీన్‌ల్యాండ్' 'హ్యాండ్స్ ఆఫ్ యుక్రెయిన్' అంటు నినదించారు.

కెనడా, గ్రీన్‌ల్యాండ్‌లను విలీనం చేసుకోవడానికి ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో బహిరంగంగా గొడవపడిన ఆయన యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అమెరికా, డోనల్డ్ ట్రంప్, టారిఫ్, దిగుమతులు, ఇండియా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యూస్టన్, టెక్సస్‌లలోనూ నిరసనకారులు పోగయ్యారు.

వాషింగ్టన్ డీసీలో డెమొక్రటిక్ చట్టసభ సభ్యుల ప్రసంగాలను వినేందుకు వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. ముఖ్యంగా ట్రంప్ పాలనలో సంపన్నుల పాత్రపై, ప్రత్యేకించి ఎలాన్ మస్క్ గురించి అనేక కామెంట్లు వినిపించాయి.

''మన ప్రభుత్వాన్ని బిలియనీర్ స్వాధీనం చేసుకోవడాన్నిఖండిస్తున్నా'' అని ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు మాక్స్‌వెల్ ఫ్రాస్ట్ అన్నారు.

''ప్రజలను మీరు దోచుకుంటే, వారు కచ్చితంగా బ్యాలెట్ బాక్సులలోనూ, వీధులలోనూ తమ ప్రతాపం చూపుతారు'' అన్నారు.

ఫ్లోరిడా కాంగ్రెషనల్ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఊహించిన దానికంటే తక్కువ మెజార్టీతో విజయం సాధించిన వారం రోజుల తరువాత ట్రంప్‌కు, ఆయన మిత్రపక్షాలకు ఈ నిరసన సెగ తగిలింది. ఇక విస్కాన్సిన్ ఓటర్లు సుప్రీంకోర్టులో సేవలందించడానికి డెమోక్రటిక్ జడ్జిని ఎన్నుకున్నారు. మస్క్ అభ్యర్థిని దాదాపు 10 శాతం పాయింట్ల తేడాతో తిరస్కరించారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్ ప్రభుత్వ విధానాలు, ఎలాన్ మస్క్ ప్రభావంపై ఓటర్ల ఆగ్రహాన్ని అందిపుచ్చుకునేందుకు డెమొక్రాట్లు ప్రయత్నించారు.

పెంగ్విన్లు నివసించే ఆస్ట్రేలియా ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని వాషింగ్టన్‌లో నిరసనకారులు తప్పుబట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెంగ్విన్లు నివసించే ఆస్ట్రేలియా ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని వాషింగ్టన్‌లోనిరసనకారులు తప్పుబట్టారు.

అప్రూవల్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి?

అధ్యక్షుడు ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ కాస్త తగ్గుముఖం పట్టాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన రాయిటర్స్ / ఇప్సోస్ పోల్ ప్రకారం, ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 43శాతానికి పడిపోయింది, ఇది జనవరిలో ట్రంప్ తన రెండో పదవీకాలాన్ని ప్రారంభించిన తర్వాత నమోదైన కనిష్టస్థాయి. జనవరి 20న ఆయన అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉంది.

అదే పోల్‌లో ఆర్థిక వ్యవస్థ ఆయన చేతుల్లో ఉండటాన్ని 37శాతం మంది అమెరికన్లు అంగీకరిస్తున్నారు. అలాగే యుఎస్‌లో జీవన వ్యయాల పరిష్కారానికి ట్రంప్ వ్యూహాన్ని 30శాతం మంది ఒప్పుకుంటున్నారు.

హార్వర్డ్ క్యాప్స్/హారిస్ ఇటీవల నిర్వహించిన మరో సర్వేలో రిజిస్టర్డ్ ఓటర్లలో 49 శాతం మంది ట్రంప్ పనితీరును సమర్ధిస్తున్నారు. ఇదే సర్వేలో 54 శాతం మంది ఓటర్లు అధ్యక్షుడిగా జో బైడెన్ కంటే మెరుగ్గా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

వాషింగ్టన్‌లో థెరిసా అనే ఒక నిరసనకారిణి బీబీసీతో మాట్లాడుతూ "మేము మా ప్రజాస్వామ్య హక్కులను కోల్పోతున్నాం" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)