ఎవరీ పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఎప్పుడూ కారులో తిరిగే ఆయన ఆరోజు బైక్‌పై ఎందుకు వెళ్లారు?

ఫొటో సోర్స్, Bishop pratap Sinha
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ప్రవీణ్ కుమార్ పగడాల పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది.
ఆయన మార్చి 24 రాత్రి 11 గంటల 42 నిముషాల సమయంలో, రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు జాతీయ రహదారి పక్కన తన ద్విచక్రవాహనంతో సహా కింద పడిపోయి, విగతజీవిగా కనిపించారు.
అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదంటూ క్రైస్తవ సమాజం పెద్దలు, క్రైస్తవ సంఘాలు, ప్రవీణ్ కుమార్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో అప్పటివరకు ప్రమాదవశాత్తూ మరణించారని అంచనాకి వచ్చిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


ఫొటో సోర్స్, UGC
ఆయన మరణించిన తర్వాత నుంచి అంటే మార్చి 25 నుంచి ఈ కథనం రాసే సమయానికి కూడా ప్రవీణ్ కుమార్ పగడాల కోసం సోషల్ మీడియాలో ప్రోస్ అండ్ కాన్స్ రెండువైపులా విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడివారు? ఆయన క్రైస్తవ మత ప్రసంగాలతో పాటు జీవనోపాధి కోసం ఏం చేస్తుంటారు? ఆయన కుటుంబం, తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి?
ఈ వివరాలపై అంతర్జాలంలో ఎక్కువగా శోధన జరుగుతోంది.

ఫొటో సోర్స్, UGC
కడప నుంచి హైదరాబాద్‌కు మకాం..
అయితే, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతర్జాలంలో స్పష్టంగా, ఎక్కువగా లభించడం లేదు.
కొన్ని సోషల్ మీడియా వేదికల్లో స్వయంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వీడియోల ద్వారా కొంత సమాచారం లభ్యమవుతోంది. వాటి ప్రకారం,
ప్రవీణ్ కుమార్ పగడాల 1980లో కడపలోని ప్రొద్దుటూరులో జన్మించారు.
ఆయన తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే, తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్‌కు ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనం నుంచి చదువులో బాగా రాణించినప్పటికీ, తాను అల్లరి విపరీతంగా చేస్తుండేవాడినంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చారు.
"నా అల్లరితో మా తల్లిదండ్రులు భయపడిపోయేవారు. నేను ఏమైపోతానో అని ఆందోళన చెందుతూ ఉండేవారు. ప్రాథమిక విద్య పూర్తైన తర్వాత ఊరిలో హాస్టల్ లో ఉంటూ చదువుకునేవాడిని" అని తన గత జీవితం గురించి మాట్లాడుతూ ఒక క్రైస్తవ సభలో చెప్పుకొచ్చారు పాస్టర్ ప్రవీణ్ కుమార్.
"ఒకసారి మా అన్నయ్యని ఊరిలో ఒక వ్యక్తి కొట్టాడని తెలిసింది. దాంతో కోపంతో ఆయన్ని నేను బాగా కొట్టాను. ఆయన చనిపోతాడేమో అనుకునేంతలా కొట్టాను. ఆ సంఘటన నాకు విపరీతమైన భయం కలిగించింది. ఆ సమయంలో నాకు అత్తయ్య వరసయ్యే ఆమె పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సీఐగా పని చేస్తున్నారు. ఆమె సహాయంతో అప్పుడు నేను కొట్టిన వ్యక్తి నుంచి కేసు పెట్టకుండా కాంప్రమైజ్ చేశారు.
ఆ సంఘటన తర్వాత నేను కడపలోనే ఉంటే ఇలాంటి తగాదాల్లో తలదూర్చాల్సి వస్తుందని భావించాను. అందుకే నేను హైదరాబాద్‌కి మకాం మార్చాను" అని ప్రవీణ్ కుమార్ పగడాల మరో వీడియోలో చెప్పారు.
ఉన్నత చదువులు చదువుకునేందుకు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వెళ్లానని, అక్కడున్న బైబిల్ కాలేజ్‌లో మతపరమైన విద్యను అభ్యసిస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, CCTV
'ఇందౌర్ అమ్మాయితోనే వివాహం'
ఒక వీడియోలో ప్రవీణ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం,
ఆయన ఇందౌర్‌లో మతపరమైన విద్యను పూర్తి చేయడంతో పాటు అక్కడ మత ప్రసంగాలు కూడా చేసేవారు. ఈ క్రమంలోనే అక్కడున్న ఓ పాస్టర్ల కుటుంబానికి సన్నిహితులయ్యారు.
ప్రవీణ్ కుమార్ పగడాల ప్రవర్తన నచ్చడంతో ఒక పాస్టర్ మా అమ్మాయిని వివాహం చేసుకుంటారా? అని ప్రవీణ్ కుమార్‌ని అడిగారు. మీ అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమేనని ప్రవీణ్ కుమార్ అనడంతో 2006లో ప్రవీణ్ కుమార్ వివాహం జరిగినట్లు ఆయన ఓ సందర్భంలో చెప్పారు.
ప్రవీణ్ కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
ఆయన వివాహానికి ముందు మార్కెటింగ్ జాబ్ చేశారు. అది చేస్తూనే హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అనుబంధంగా మరో కంపెనీ పెట్టారు. దానితో పాటు క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రసంగాలు కొనసాగించేవారు.

ఫొటో సోర్స్, UGC
ఆయన కారులోనే వెళ్లేవారు, కానీ ఆ రోజు...: పీఏ స్వర్ణలత
సాప్ట్‌వేర్ కంపెనీ అధినేత, పేరుపొందిన క్రైస్తవ మత ప్రసంగీకుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ పగడాల, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్రవాహనంపై రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వాహనంపైనే ఆయన ప్రమాదానికి గురై మరణించారు.
"రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్‌కు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఉంది. ఏప్రిల్‌లో ఎక్కువ రాజమండ్రిలోనే ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఒక వాహనం ఉంటే తిరిగేందుకు సులభంగా ఉంటుందని భావించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ తన ద్విచక్రవాహనంపై మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు.
సాధారణంగా ఆయన కారులో డ్రైవర్ సహాయంతో లేదా, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూనే ఎక్కడికైనా వెళ్తుంటారు. కాకపోతే రాజమహేంద్రవరంలోనే ఎక్కువ కార్యక్రమాలు ఉండటంతో వాహనం అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు" అని పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోజువారి షెడ్యూల్ చూసే ఆయన పీఏ స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
హైదరాబాద్‌లోని కాప్రలో ప్రవీణ్ కుమార్ పగడాల కుటుంబం నివాసముంటున్నట్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది.
ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ ఆయన బావమరిది వాలెస్ శామ్యూల్ మార్చి 25, 2025న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














