పాస్టర్‌ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం ఎందుకు అనుమానాస్పదంగా మారింది, క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యులు ఏమన్నారు?

ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ కుమార్ మరణాన్ని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేయాలని ఆందోళనలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ రాజమండ్రి దగ్గరలోని కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

క్రైస్తవ మత ప్రబోధకుడైన పగడాల ప్రవీణ్ కుమార్, మార్చి 24న హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌‌పై బయలుదేరారని, అదే రోజు రాత్రి 11.31 గం.లకు కొవ్వూరు టోల్ గేట్ దాటిన 10 నిమిషాల తర్వాత కొంతమూరు దగ్గర మరణించారని పోలీసులు తెలిపారు.

అయితే, కొంతమూరు జాతీయ రహదారి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో ఆయన వాహనంతో సహా పడిపోయి ఉండటం, అక్కడే మరణించడంపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.

పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కొవ్వూరు నుంచి కొంతమూరు మధ్య 11 కి.మీ. దూరం ఉంది. ఈ 11 కిలోమీటర్ల మధ్య, 11 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ కుమార్ ప్రయాణించిన బుల్లెట్

ఆ రాత్రి ఇంకా ఏం జరిగిందంటే...

రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కొంతమూరు దగ్గరున్న నయారా పెట్రోల్‌ బంకు దగ్గర మార్చి 24 రాత్రి 11.42 నిముషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు.

అయితే ఇది ప్రమాదం కాదని క్రైస్తవ సంఘాలు, ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారి ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహా కిశోర్ వివరించారు.

''హైదరాబాద్‌ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ వాహనంపై మార్చి 24న రాజమండ్రి బయలుదేరారు. అదే రోజు రాత్రి 11.42 నిముషాలకు తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతంలో పడిపోయారు.

అయితే ఆయన అక్కడ పడిపోయినట్టు మరుసటి రోజు వరకు ఎవరికీ తెలియదు. మార్చి 25 (మంగళవారం) ఉదయం మాకు సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించాం. సీసీ కెమెరా ఫుటేజీలను తనిఖీ చేశాం. బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్‌ రహదారి పైనుంచి కిందికి జారడం, ఆ బుల్లెట్‌ ఆయనపై పడడంతో మృతిచెందినట్టు అక్కడ లభించిన ఆధారాలతో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం.

ఆయన సెల్‌ఫోన్ అక్కడ లభించడంతో, అందులో ఆయన చివరగా కాల్ చేసిన రామ్మోహన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి సంఘటన స్థలానికి పిలిపించాం. రామ్మోహన్, ఆయనతో పాటు సంఘటన స్థలానికి చేరుకున్న కొందరు క్రైస్తవ కమ్యూనిటీ పెద్దలు, కుటుంబ సభ్యులు...ప్రవీణ్ మృతి చెందిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు'' అని ఎస్పీ చెప్పారు.

ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, కొవ్వూరు టోల్ ప్లాజా
ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహా కిశోర్

కేసు నమోదు చేశాం: ఎస్పీ

ఇది రోడ్డు ప్రమాదం కాదని, పాస్టర్‌ ప్రవీణ్‌ను ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

అదే తరుణంలో పోస్టుమార్టం కోసం పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని తరలించిన ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కోరిన విధంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించారు.

‘‘ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్‌లు లభించాయి. సోమవారం రాత్రి 11.31 నుంచి 11.42 వరకు మధ్య ఉన్న 11 నిముషాలలో ఏం జరిగిందనే దానిపై దృష్టి పెట్టాం. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ వాహనాన్ని ఐదు వాహనాలు దాటుకుని వెళ్లినట్లు గుర్తించాం. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయి. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నాం. ఈ కేసులో ఎవరి దగ్గరైనా బలమైన ఆధారాలు ఉంటే మాకు అందించవచ్చు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అని కోణాల్లోనూ విచారణ చేస్తాం." అని ఎస్పీ నరసింహ కిశోర్ చెప్పారు.

ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించిన కొంతమూరు హైవే దగ్గర ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉన్నాయని, పోస్టుమార్టం కూడా ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, ఇద్దరు క్రైస్తవ వైద్యులు సమక్షంలో చేయాలని, దానిని వీడియో రికార్డింగ్ కూడా చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

దీనికి అంగీకరించి పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.

ఈ కేసు తర్వాత కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని, ఇలా రెచ్చగొట్టేవారు చట్టపరిధిలో శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఎస్పీ నరసింహ కిశోర్ హెచ్చరించారు.

ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, Bishop pratap Sinha

ఫొటో క్యాప్షన్, పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(ఫైల్ ఫోటో)

పూర్తి ఫుటేజ్ బయటపెట్టాలి: కేఏ పాల్

పోస్టుమార్టం జరుగుతుండగా ప్రజాశాంతి పార్టీ నేత, మత బోధకుడు కేఏ పాల్ అక్కడికి చేరుకుని, పాస్టర్‌ ప్రవీణ్ కుమార్ మృతిపై తనకు కూడా అనుమానాలున్నాయన్నారు.

''సీసీ ఫుటేజ్ పూర్తిగా ఎందుకు విడుదల చేయలేదు? అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపెట్టాలి. ఇటీవల పవన్ కల్యాణ్ అనవసరపు మాటలు అనడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఈ కేసును పారదర్శకంగా విచారణ చేయాలి. మీరు తప్పుడు‌ విచారణ చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఈ విషయంలో రాజకీయం చేయకండి" అని పోలీసులను ఉద్దేశించి కేఏ పాల్ మీడియా ముందు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

‘‘పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిన కారణంగానే అనుమానాలు కలిగాయి. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం జరిగింది ముమ్మాటికీ హత్యే. పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వాలి. పాస్టర్ ప్రవీణ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌లో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లి రీ-ఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తాను." అని హర్ష కుమార్ అన్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.

"పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించాం. పాస్టర్ ప్రవీణ్‌‌‌కు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి లోతైన విచారణ జరపాలని చెప్పాం.'' అని అనిత అన్నారు.

29 తేదీన పోస్టు‌మార్టం రిపోర్టును విడుదల చేస్తామని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. దాన్ని కుటుంబసభ్యులకు ఇస్తామని తెలిపారు.

ప్రవీణ్ కుమార్, పాస్టర్

ఫొటో సోర్స్, LAKKOJU SRINIVAS

ఫొటో క్యాప్షన్, బిషప్ ప్రతాప్ సిన్హా

ప్రమాదం జరిగిన తీరే అనుమానాస్పదం: బిషప్ ప్రతాప్ సిన్హా

ప్రవీణ్ కుమార్ మరణించిన ప్రదేశానికి వెళ్లి చూసినప్పుడు ముందు ప్రమాదం అనుకున్నామనీ, కానీ ఆ తర్వాత నిశితంగా చూస్తే పలు అనుమానాలు కలిగాయని రాజమండ్రికి చెందిన బిషప్ ప్రతాప్ సిన్హా బీబీసీతో అన్నారు.

"ఆయన తలపై గాయాలున్నాయి. చొక్కాపై బూటు అచ్చులు కనిపించాయి. వాహనం ఆయనపై పడి ఉంది. లోతైన ప్రాంతలోకి జారిపోతే మనిషి, వాహనం వేర్వేరుచోట్ల ఉండాలి. కానీ అక్కడ అలా లేదు. పైగా హెల్మెట్‌కు చిన్న గీత కూడా పడలేదు. ఇలాంటివి ఒక్కొక్కటి చూస్తే ఆయన మృతి అనుమానాస్పదంగానే అనిపిస్తోంది." అని ప్రతాప్ సిన్హా అన్నారు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన కొంతమూరు జాతీయ రహదారిపై పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. మార్చి 27న బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు మరికొన్ని ఆధారాలు సేకరించే పనిలో కనిపించారు.

ప్రవీణ్ కుమార్ వాహనంతో పాటు అక్కడ పడిఉన్న హెల్మెట్, మరికొన్ని వస్తువులను సంఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)