లూసిఫర్‌లో ఉన్నదేంటి ఎంపురాన్‌లో లేనిదేంటి.. హీరో ఎలివేషన్లు తెలుగు ప్రేక్షకులకు రొటీన్ అయిపోయాయా?

ఫొటో సోర్స్, Aashirvad Cinemas
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
హిట్ అయిన సినిమాకి సీక్వెల్ తీసి మెప్పించడం కష్టం. ఎందుకంటే పార్ట్ -1తో పోల్చుకుంటారు కాబట్టి. అయితే బాహుబలి, కేజీఎఫ్ సక్సెస్ సాధించి చూపించాయి.
ఈ మ్యాజిక్ అన్ని సినిమాలకి రిపీట్ కాదు. భారతీయుడు-2 ఎంత ఘోరంగా వుందో మనకి తెలుసు.
2019లో మళయాళంలో వచ్చిన లూసిఫర్ హిట్ సినిమా. మోహన్‌లాల్ రేంజ్ పెంచింది. తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేసారు.
ఆరేళ్ల తర్వాత లూసిఫర్ 2 ఎంపురాన్ పేరుతో వచ్చింది. మరి ఇది ప్రేక్షకులని ఆకట్టుకుందా?


ఫొటో సోర్స్, lyca productions
కథ ఏంటంటే...
లూసిఫర్‌లో ముఖ్యమంత్రి మరణం తర్వాత రాజకీయ అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడితే, సీఎం అల్లుడు బాబీ తాను చక్రం తిప్పాలని చూస్తాడు.
అప్పుడు స్టీఫెన్ (మోహన్‌లాల్) రంగ ప్రవేశం చేసి అన్నీ చక్కదిద్ది, రామ్‌దాస్ కుమారుడు జతిన్‌ని సీఎం చేసి వెళ్లిపోతాడు.
స్టీఫెన్ గతం ఏమిటి? ఆయన వెంట వున్న మసూద్ ఎవరనే ప్రశ్నలతో పార్ట్ 1 ముగుస్తుంది.
లూసిఫర్ 2లో జతిన్ దారి తప్పుతారు. భజరంగ్ అనే మతోన్మాదితో చేతులు కలిపి పార్టీని చీల్చాలని చూస్తారు.
అతని సోదరి ప్రియదర్శిని (మంజు వారియర్) వ్యతిరేకిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో స్టీఫెన్ మళ్లీ ఎంటరై రాజకీయాల్ని సరి చేస్తారు. సింపుల్‌గా ఇదీ కథ.
లూసిఫర్‌లో బిగువైన కథనం, ఎమోషన్స్‌తో పాటు హీరో బిల్డప్ వుంటుంది. హీరో మీద అక్రమ కేసు పెట్టి జైలుకి పంపే సంఘర్షణ వుంటుంది. ప్రారంభం నుంచి బలమైన విలన్ ఉంటాడు. పొలిటికల్ డ్రామా పండింది.
ఇవన్నీ లూసిఫర్-2 ఎంపురాన్‌లో లోపించాయి.

ఫొటో సోర్స్, Aashirvad Cinemas
హీరో ఎంట్రీకే గంట సమయమా...
కథకి సంబంధం లేని మతకలహాల హింసతో సినిమా ప్రారంభం అవుతుంది. జాయేద్ మసూద్ (పృథ్విరాజ్ సుకుమారన్) కథలో ఉపపాత్రధారి అయినపుడు అంత పెద్ద ప్లాష్‌బ్యాక్ పూర్తిగా అనవసరం.
అక్కడ ఎస్టాబ్లిష్ అయిన విలన్ భజరంగి (అభిమన్యుసింగ్) తరువాత పెద్దగా చేసేదేమీ వుండదు.
గట్టి విలన్ లేకపోవడం సినిమా ప్రధాన లోపం.
ఎంత పెద్ద డాన్‌నైనా హీరో సులభంగా ఫినిష్ చేస్తున్నపుడు, ఇక సంఘర్షణ ఏముంది?
ఎంతసేపు మోహన్‌లాల్ ఎలివేషన్లు, బిల్డప్‌లు తప్ప ఇంకేమీ లేదు.
మూడు గంటల సినిమాలో హీరో ఎంట్రీకే గంట సమయం పడుతుంది. అప్పటి వరకు ఏవేవో సీన్స్ వచ్చి పోతుంటాయి.
మలయాళంలో కొత్త కావచ్చేమో కానీ, తెలుగులో హీరో ఎలివేషన్లు చూసిచూసి ప్రేక్షకులు రాటుదేలిపోయారు.
పార్ట్ 1లో వున్న ఎమోషన్, తనను పెంచిన తండ్రి కుటుంబం కోసం హీరో తపన ఇవన్నీ డెప్త్‌ని పెంచాయి. పార్ట్ 2లో రచయిత మురళిగోపి రైటింగ్ బలహీనంగా వుంది. దేశవిదేశాల్లో భారీగా కనిపించే లొకేషన్స్ , ఫైటింగ్ సీన్స్ గట్టెక్కిస్తాయనుకున్నట్టున్నారు.
ఇంటర్నేషనల్ డాన్ ఖురేషి అబ్రామ్‌గా మోహన్‌లాల్ చాలా స్టయిలిష్‌గా కనిపించినా, కథలో అల్లిక మిస్ కావడంతో సినిమా భారంగా అనిపిస్తుంది. 3 గంటల నిడివి తగ్గించి వుండాలి.
సినిమా హాలివుడ్ స్థాయిలో తీసారు. ఫొటోగ్రఫీ రిచ్‌గా వుంది. ఫారెస్ట్ ఫైట్ ఎక్స్‌లెంట్. అన్నీ వున్నా ఎమోషన్ లేకపోవడమే మైనస్. కొన్ని సన్నివేశాల్లో మంజువారియర్ అద్భుతంగా నటించారు. మిగతావాళ్లకి పెద్దగా స్కోప్‌లేదు. దీనికి పార్ట్ 3 కూడా వుందని హింట్ ఇచ్చారు. ఈ సారి హీరో పోరు చైనా మాఫియాతో.
ప్రేక్షకులకి బిల్డప్‌లు , ఎలివేషన్లు, ఫైటింగ్‌లు ఇష్టమే కానీ అవి కథలో కలిసిపోవాలి. దేనికదే అంటే మ్యాజిక్ రిపీట్ కాదు.

ఫొటో సోర్స్, lyca productions
ప్లస్ పాయింట్స్
1) మోహన్‌లాల్ నటన
2) మేకింగ్‌లో రిచ్‌నెస్
3) యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
1) హీరో లేట్ ఎంట్రీ
2) బలహీన కథనం
3) బలమైన విలన్ లేకపోవడం
(గమనిక: రివ్యూలో అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














