ఇందిర, ఫిరోజ్: నిరసనల మధ్య వీరిద్దరి పెళ్లి ఎలా జరిగిందంటే...

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిర, ఫిరోజ్ గాంధీ పెళ్లిఫోటో
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కూతురు ఇందిరాగాంధీకి ఫిరోజ్ సరైన వరుడు కాదని జవహర్‌లాల్ నెహ్రూ అనుకున్నారు. ఫిరోజ్ హిందువు కాదు. కశ్మీరీ కూడా కాదు. కానీ నెహ్రూకు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే, ఆయన చెల్లెళ్లు విజయలక్ష్మి, కృష్ణల భర్తలు కూడా కశ్మీరీలు కాదు.

నెహ్రూ తన చెల్లెళ్ల పెళ్లిళ్లనే వ్యతిరేకించలేదు. ఇద్దరు చెల్లెళ్ల భర్తలు ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. సంపన్న, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చారు.

ఫిరోజ్ గాంధీ చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదు. సరైన ఉద్యోగం లేదు. స్థిరమైన ఆదాయ వనరు కూడా లేదు.

‘‘ఫిరోజ్ గట్టిగా, దురుసుగా, బహిరంగంగా మాట్లాడే వ్యక్తి. కానీ, నెహ్రూ అలా కాదు. సౌమ్యంగా, సున్నితమైన, మితంగా మాట్లాడే వ్యక్తి’’ అని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర 'ఇందిర, ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ' అనే పుస్తకంలో కేథరీన్ ఫ్రాంక్ రాశారు.

''చాలామంది తండ్రులలాగానే, నెహ్రూ కూడా కూతుర్ని వదులుకోవాలనుకోలేదు. ఇందిర ఆరోగ్యంపై కూడా నెహ్రూకు బెంగ ఉండేది. నెహ్రూ భార్య కమలా కూడా మరణశయ్యపై ఉండి ఇందిర, ఫిరోజ్‌ల పెళ్లిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫిరోజ్‌కు స్థిరమైన వ్యక్తిత్వం లేదని, అంత నమ్మదగ్గ వ్యక్తి కాదని కమల అభిప్రాయంగా ఉండేది'' అని కేథరిన్ ఫ్రాంక్ రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Keystone/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిర, ఫిరోజ్ గాంధీ పెళ్లి విషయంలో నెహ్రూ మొదట సానుకూలంగా స్పందించలేదు.

ఇందిర మేనత్తల నుంచి కూడా వ్యతిరేకత

ఫిరోజ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇందిర తన మేనత్త కృష్ణకు తెలిపారు. అయితే, కొంత సమయం వెయిట్ చేయాలని, ఇంకా కొంతమంది అబ్బాయిలను చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆమె ఇందిరకు సూచించారు.

‘‘ఆ సమయంలో ఇందిర చిరాకు పడి, ఎందుకు? నువ్వు పది రోజుల్లో రాజా భాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. నాకు ఎన్నో ఏళ్లుగా ఫిరోజ్ తెలుసు. నేనెందుకు వెయిట్ చేయాలి, వేరే అబ్బాయిలను ఎందుకు కలవాలి?'' అని ఇందిర ప్రశ్నించినట్లు ' వీ నెహ్రూస్' పుస్తకంలో కృష్ణ హుతీసింగ్ తెలిపారు.

ఈ విషయం గురించి తన మరో మేనత్త విజయలక్ష్మీ దగ్గర ఇందిర మాట్లాడినప్పుడు, ఆమె కూడా ఇందిరకు అనుకూలంగా మాట్లాడలేదు.

''ఫిరోజ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినప్పటికీ, పెళ్లి గురించి మాత్రం ఆలోచించకు అని నాన్ (విజయలక్ష్మీ) చాలా ముక్కుసూటిగా సలహా ఇచ్చారు. ఇందిరకు చాలా కోపం వచ్చింది. ఆమెను, ఫిరోజ్‌ను చాలా అవమానించినట్టు ఇందిర భావించారు.'' అని ఇందిర బయోగ్రఫీలో పుపుల్ జయకర్ రాశారు.

నెహ్రూ కుటుంబంలో దీనిపై చర్చలు జరుగుతుండగానే, 'మిస్ ఇందిరా నెహ్రూ ఎంగేజ్‌మెంట్' అంటూ అలహాబాద్ వార్తాపత్రిక 'ది లీడర్' తన మొదటి పేజీలో ఒక వార్తను ప్రచురించింది. ఈ వార్త ప్రచురితమైన సమయంలో, నెహ్రూ కోల్‌కతాలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత, నెహ్రూ ఇచ్చిన ప్రకటన 'బొంబే క్రానికల్'తో సహా ఇతర వార్తాపత్రికల్లో ప్రచురితమైంది.

''ఇందిర, ఫిరోజ్‌ల పెళ్లి గురించి ప్రచురితమైన వార్త నిజమే. పెళ్లి విషయంలో తల్లిదండ్రులు కేవలం సూచన మాత్రమే ఇవ్వగలరు. కానీ, తుది నిర్ణయం తీసుకునేది అమ్మాయి, అబ్బాయిలేనని నేను నమ్ముతాను. ఇందిర, ఫిరోజ్‌ల నిర్ణయం గురించి నాకు తెలిసినప్పుడు, హృదయపూర్వకంగా నేను అంగీకరించాను. మహాత్మా గాంధీ కూడా వారిని ఆశీర్వదించారు. ఫిరోజ్ గాంధీ పార్శీ యువకుడు. ఎన్నో ఏళ్లుగా మా కుటుంబానికి మంచి సన్నిహితుడు.'' అని నెహ్రూ తెలిపారు.

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Universal History Archive/ Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిర, ఫిరోజ్ వివాహాన్ని మహాత్మాగాంధీ సమర్థించారు.

రామనవమి రోజే వివాహం

మహాత్మా గాంధీ కూడా తన వార్తాపత్రిక 'హరిజన్'లో ఆర్టికల్ రాయడం ద్వారా వారి పెళ్లికి మద్దతు ఇచ్చారు. కానీ, గాంధీ మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ పెళ్లి విషయంలో ప్రజల ఆగ్రహం ఇసుమంతైనా తగ్గలేదు.

భారత్‌లో ఉన్న శతాబ్దాల నాటి సంప్రదాయాలను వీరి వివాహం దెబ్బతీస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు.

మొదటి విషయం ఈ పెళ్లిని పెద్దలు నిర్ణయించలేదు. ఇక రెండో విషయం, ఈ ఇద్దరూ మతాంతర వివాహం చేసుకుంటున్నారు.

ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ అలహాబాద్‌లో ఆనంద్ భవన్‌కు ఎన్నో టెలిగ్రామ్‌లు వచ్చాయి. వీటిల్లో కొన్ని శుభాకాంక్షలు తెలుపుతూ కూడా వచ్చాయి. వీరి పెళ్లి అప్పటి పత్రికల్లో పెద్ద చర్చనీయాంశం.

ఆర్నాల్డ్ మైఖేల్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ఏళ్ల తర్వాత ఇందిరా గాంధీ ఈ విషయాలను గుర్తు చేసుకున్నారు. ''మా పెళ్లిని భారత్ మొత్తం వ్యతిరేకించినట్టు అనిపించింది'' అని ఇందిరా గాంధీ అన్నారు.

పండితులను సంప్రదించిన తర్వాత, ఇందిరా గాంధీ, ఫిరోజ్‌ల వివాహాన్ని మార్చి 26న జరపాలని నిర్ణయించారు. అదే రోజు శ్రీరామనవమి.

''ఆ రోజు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు పెళ్లి కూతురు తన గది నుంచి బయటకి వచ్చారు. జైలులో రాట్నంపై తన తండ్రి నేసిన గులాబీ రంగు చీర కట్టుకున్నారు. దీనికి వెండి రంగు అంచు ఉంది. చేతి నిండా గాజులు, తలలో పూలతో అందంగా అలకరించుకున్నారు. ఇందిర అంతకుముందెన్నడూ అంత అందంగా కనిపించలేదు. గ్రీక్ నాణెంపై తీర్చిదిద్దిన అందమైన వ్యక్తిలా ఆమె ముఖం ఉంది.'' అని కృష్ణ హుతీసింగ్ రాశారు. ఫిరోజ్ సంప్రదాయ తెల్లటి ఖాదీ షెర్వానీని, చుడీదార్ పైజామాను వేసుకున్నారు.

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Keystone/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, తన పెళ్లి చట్టబద్ధమైనదా..కాదా అన్నదానితో తనకు సంబంధం లేదని ఇందిర అన్నారు.

హిందూ పద్ధతులకు అనుగుణంగా వివాహ వేడుక

ఆనంద్ భవన్ వెలుపల ఉన్న తోటలో వేసిన మండపం కింద పెళ్లి వేడుక జరిగింది. మండపంలో ఏర్పాటు చేసిన అగ్ని గుండం ఎదురుగా ఇందిర, ఫిరోజ్‌లు కూర్చున్నారు.

నెహ్రూ పక్కన సీటును తన భార్య కమలా నెహ్రూకు గుర్తుగా ఖాళీగా ఉంచారు. పెళ్లికి వచ్చిన అతిథులు కుర్చీల్లో, కార్పెట్లపై కూర్చున్నారు. ఆనంద్ భవన్ వెలుపల ఈ ఘట్టాన్ని చూసేందుకు వేలమంది ఆహ్వానం లేని అతిథులు కూడా వచ్చారు.

వారిలో అమెరికాకు చెందిన ఫ్యాషన్ మ్యాగజీన్ ఫొటోగ్రాఫర్ నార్వాన్ హెన్ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన స్థానిక ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో బోధిస్తున్నారు. తన 8ఎంఎం మూవీ కెమెరాలో ఈ ఘట్టాన్ని వీడియో తీసేందుకు ప్రయత్నించారు.

''ఇందిర, ఫిరోజ్‌ల పెళ్లి సంప్రదాయం కాదు, చట్టబద్ధం కాదు. ఆ సమయంలోని బ్రిటీష్ చట్టం ప్రకారం.. రెండు భిన్నమతాలకు చెందిన వారు తమ మతాలను వదిలేసినప్పుడే పెళ్లి చేసుకోగలరు. ఈ పెళ్లి జరగడానికి ముందు ఏడేళ్ల కిందట ఇందిర కజిన్ బీకే నెహ్రూ కూడా హంగేరియన్ యూదు అమ్మాయి ఫోరిని ఇదే విధానంలో పెళ్లి చేసుకున్నారు.

బీకే నెహ్రూ పెళ్లి సమయంలో కూడా మహాత్మా గాంధీ సలహా తీసుకున్నారు. ఆయన సలహా మేరకు, ఈ ఇద్దరూ హిందూ పద్ధతులకు అనుగుణంగా వివాహం చేసుకున్నారు. కానీ, హిందూ చట్టం లేదా బ్రిటీష్ చట్టం దీన్ని గుర్తించలేదు.

ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఇందిరపై బయోగ్రఫీ రాసిన మరో వ్యక్తి ఉమా వాసుదేవ్, దీని గురించి ఆమెను ప్రశ్నించారు. ''నా పెళ్లి చట్టబద్ధమా, కాదా అన్నది నాకు సంబంధం లేదు'' అని ఇందిర సమాధానమిచ్చారు.

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిరకు ఫిరోజ్ గాంధీ కొన్ని దుస్తులు బహుమతిగా ఇచ్చారు.

పవిత్రమైన పార్సీ దారం వేసుకున్న ఫిరోజ్

మొత్తం వివాహ వేడుక రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సమయంలో, పూజారి వెండి చెంచాతో నెయ్యిని అగ్నిగుండంలో పోస్తూనే ఉన్నారు.

ముందుగా, ఇందిర వరండాలో జవహర్‌లాల్ నెహ్రూ పక్కన కూర్చున్నారు. తరువాత ఆమె అవతలి వైపుకు వెళ్లి ఫిరోజ్ గాంధీ పక్కన కూర్చున్నారు.

ఫిరోజ్ ఇందిరకు కొన్ని దుస్తులు బహుమతిగా ఇచ్చారు. ఇందిర తన చేతులతో ఫిరోజ్‌కి ఏదో తినిపించారు.

"దీని తర్వాత, వారిద్దరి మణికట్టులను పూలతో కట్టారు. పూజారి నెయ్యి మరింత వేసి మంటలను పెద్దవి చేశారు. ఆ తర్వాత, ఇందిర, ఫిరోజ్ లేచి నిలబడి అగ్నిగుండం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి సప్తపది ఆచారాన్ని పూర్తి చేశారు. తర్వాత, అక్కడ ఉన్న ప్రజలు వారిపై పూలు చల్లారు'' అని ఇందిర మేనకోడలు నయనతార సెహగల్ తన 'ప్రిజన్ అండ్ చాక్లెట్ కేక్' పుస్తకంలో రాశారు.

"ఫిరోజ్ తన వివాహ దుస్తులను ధరించినప్పుడు, రత్తిమాయి గాంధీ ప్రత్యేకంగా తన షేర్వానీ కింద పార్సీ పవిత్ర దారం ధరించమని చెప్పారు. ఆ రోజు ఇందిర కంటే ఫిరోజ్ చాలా అందంగా కనిపించారు'' అరి బెర్టిల్ ఫాక్ తన ఫిరోజ్ గాంధీ జీవిత చరిత్ర 'ఫిరోజ్ ది ఫర్గాటెన్ గాంధీ'లో రాశారు.

ఈ కార్యక్రమానికి పార్సీ కమ్యూనిటీకి చెందిన అనేకమంది హాజరయ్యారు. వారిలో ఆనంద్ భవన్ వెలుపల ప్రదర్శన చేయడం ద్వారా ఈ వివాహానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ జవహర్‌లాల్ నెహ్రూ రత్తిమాయి గాంధీని అలా చేయవద్దని ఒప్పించాలని అభ్యర్థించారు.

ఆ వివాహానికి హాజరైన వారిలో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ రామారావు కూడా ఉన్నారు. తన వార్తాపత్రికలో వివాహం గురించి రాయడానికి చేతిలో పెన్సిల్, నోట్‌బుక్‌తో ఆయన ఈ వివాహానికి హాజరయ్యారు.

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, Photo by Central Press/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిర పెళ్లికి మహాత్మాగాంధీ హాజరు కాలేదు.

వివాహానికి హాజరైన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు

సాయంత్రం ఆనంద్ భవన్ తోటలో ఏర్పాటు చేసిన విందులో రోటీ, ఆకుపచ్చ కూరగాయలతో కూడిన సాధారణ భోజనం వడ్డించారు. ఈ వివాహానికి హాజరైన వారిలో సరోజిని నాయుడు, ఆమె కుమార్తె పద్మజా నాయుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ కుమార్తె ఈవ్ క్యూరీ ఉన్నారు.

"సాధారణంగా భారతీయ వివాహాలలో, అమ్మాయిలు తమ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏడుస్తారు. కానీ ఇందిరా గాంధీ అస్సలు ఏడవలేదు. జవహర్‌లాల్ నెహ్రూ కళ్ళు కచ్చితంగా తడిగా ఉన్నాయి. చాలామంది ముఖ్యమైన వ్యక్తులు ఈ వివాహానికి రాలేకపోయారు. మహాత్మా గాంధీ కూడా ఈ వివాహానికి రాలేకపోయారు. ఆయన మార్చి 26న బ్రిటన్ నుంచి వచ్చిన సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లారు. పెళ్లి రోజున క్రిప్స్ అక్కడ లేరు. కానీ పెళ్లి తర్వాత నూతన వధూవరులను అభినందించడానికి ప్రత్యేకంగా అలహాబాద్ వెళ్లారు'' అని పుపుల్ జయకర్ రాశారు.

తన రైలు ఆలస్యం కావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్ వివాహానికి హాజరు కాలేకపోయారు. అయితే సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.

ఇందిర పెళ్లి రోజున కూడా రాజకీయ కార్యకలాపాలు ఆగలేదు. విందుకు ముందు, క్రిప్స్ మిషన్‌పై వారి వైఖరిని నిర్ణయించడానికి ఆనంద్ భవన్‌లోని డ్రాయింగ్ రూమ్‌లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమావేశమయింది.

రెండు రోజుల తరువాత, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆచార్య కృపలానీ, భూలాభాయ్ దేశాయ్, సయ్యద్ మహమూద్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ అలహాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరారు.

ఇందిర, ఫిరోజ్, నెహ్రూ

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY

ఫొటో క్యాప్షన్, ఫిరోజ్ గాంధీ, ఇందిర

కశ్మీర్‌లో హనీమూన్

వివాహం అయిన వెంటనే, ఇందిర ఫిరోజ్ 5 ఫోర్ట్ రోడ్‌లోని అద్దె ఇంటికి మారారు. ఆ సమయంలో ఫిరోజ్‌కు ఎలాంటి ఉద్యోగం లేదు. కానీ వార్తాపత్రికలలో వ్యాసాలు రాసి కొంత డబ్బు సంపాదించేవారు.

ఆయన కొన్ని బీమా పాలసీలను కూడా అమ్మేవారు. దాని ద్వారా ఆయనకు కొంత అదనపు ఆదాయం వచ్చేది. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత, ఫిరోజ్ తల్లి రత్తిమాయి గాంధీ, జార్జ్ టౌన్‌లోని తన నివాసంలో అలహాబాద్‌లోని ఉన్నత వర్గాల సమక్షంలో విందు ఏర్పాటు చేశారు.

రెండు నెలల తర్వాత, ఇందిర, ఫిరోజ్ తమ హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లారు. అక్కడి నుంచి నెహ్రూకు ఇందిర టెలిగ్రామ్ పంపారు.

'మేం మీకు ఇక్కడి నుంచి కొంచెం చల్లని గాలిని పంపించగలిగితే బాగుండు'

నెహ్రూ సమాధానం వెంటనే వచ్చింది.

'ధన్యవాదాలు, కానీ మీ దగ్గర మామిడి పండ్లు లేవు!'

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)