ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు ఆకర్షణా? 43 ఏళ్ల ఈ ఆటగాడికి ఎందుకంత క్రేజ్?

M S Dhoni

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అయాజ్ మెమన్
    • హోదా, క్రికెట్ రచయిత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలవగానే మళ్లీ అందరి చూపు ఎంఎస్ ధోనీ వైపు మళ్లింది. 2020లోనే అంతర్జాతీయ ఆట నుంచి రిటైరైనప్పటికీ ధోనీకి ఇప్పటికీ ‘సూపర్ స్టార్’ హోదా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌లో ధోనీ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ధోనీతో పాటు లీగ్‌లో అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. వర్ధమాన స్టార్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ ఆడుతున్నారు. గత 9 నెలల్లో రెండు ఐసీసీ టైటిళ్లను సాధించిన భారత జట్టులో వీరంతా సభ్యులు. టీమిండియా గతేడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్‌తో పాటు, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీని సాధించింది.

అయినప్పటికీ ధోనీ నాయకత్వ లక్షణాలు, లీగ్‌లో అతని ఉనికి అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తూనే ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంఎస్ ధోని, సీఎస్కే, ఐపీఎల్

ఫొటో సోర్స్, AFP

ధోనీకి ఈ ఏడాది జులైలో 44 ఏళ్లు నిండనున్నాయి. ధోనీ వరుసగా 18 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇందులో 16 సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది టోర్నీలో అతిపెద్ద వయస్కుడు ధోనీ.

అయితే, ఐపీఎల్ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ రికార్డు సృష్టించాడు. 45 ఏళ్ల 92 రోజుల వయస్సులో, 2016 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బ్రాడ్ హాగ్ ఆడాడు.

లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ప్రస్థానం మరోలా ఉంది. 41 ఏళ్ల 212 రోజుల వయస్సులో తాంబే, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2019లో 44 ఏళ్ల 219 ఏళ్ల వయస్సులో తన చివరి మ్యాచ్ ఆడాడు.

తాంబే, హాగ్‌లను ధోనీ అధిగమిస్తాడా? లేదా? అనేది చూడాలి.

2025 సీజన్ కోసం ధోనీని అట్టిపెట్టుకునేందుకు ఐపీఎల్ మెగా వేలంలో సీఎస్కే జట్టు రీటెన్షన్ నిబంధనను వాడుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ధోనీని రీటెయిన్ చేసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అభిమానుల్లో ధోనీ పట్ల ఆకర్షణ తగ్గలేదు

18 ఐపీఎల్ సీజన్లలో ధోనీ 5,243 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ధోనీ ఆరో స్థానంలో ఉన్నాడు.

లీగ్‌లో 5,000కు పైగా పరుగులు చేసిన ప్లేయర్లలో రోహిత్ శర్మ, కోహ్లీ కంటే ధోనీ బ్యాటింగ్ సగటు (39.12) ఎక్కువ. డేవిడ్ వార్నర్ (40.52), ఏబీ డివిలియర్స్ (39.70) కంటే తక్కువ.

5,000 పరుగులు చేసిన ప్లేయర్లలో స్ట్రయిక్ రేట్ పరంగా చూస్తే డివిలియర్స్ (151.68), వార్నర్ (139.77) తర్వాత ధోనీ (137.53) మెరుగైన స్థానంలో ఉన్నాడు.

ధోనీ లీగ్‌లో 252 సిక్సర్లు బాదాడు. అతని కంటే గేల్ (357), శర్మ (280), కోహ్లీ (272) ముందున్నారు.

ఈ బ్యాటింగ్ గణాంకాలన్నీ ధోనీ ప్రతిభలోని ఒక కోణాన్ని మాత్రమే ఆవిష్కరిస్తాయి.

వికెట్ కీపర్‌గా ఎవరికీ సాధ్యం కాని రికార్డును ధోనీ నెలకొల్పాడు. ఓవరాల్‌గా 180కి పైగా అవుట్‌లలో ధోనీ కీలక పాత్ర పోషించాడు.

భారత మాజీ కోచ్ రవి శాస్త్రి, ధోనీ వేగంగా స్పందించే తీరు, తెలివైన కీపింగ్ నైపుణ్యాల కారణంగా అతనికి 'పిక్ పాకెట్' అనే ముద్దుపేరు ఇచ్చాడు.

'హెలికాప్టర్ షాట్' అతని బ్యాటింగ్ ప్రతిభకు సిగ్నేచర్ స్ట్రోక్‌లా మారింది.

ధోనీ బ్యాటింగ్‌లో మరో ముఖ్యమైన అంశం మ్యాచ్‌ను నియంత్రించగల అతని సామర్థ్యం. ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లడం, ఉత్కంఠ సమయాల్లో మ్యాచ్‌పై అసాధారణ నియంత్రణ కలిగి ఉండటం, చివర్లో విస్పోటక స్ట్రోక్‌లతో విరుచుకుపడటం ధోనీకి ఉన్న సామర్థ్యాలు.

అలాగే వికెట్ల మధ్య కూడా వేగంగా పరిగెత్తడం మరో అంశం. ఈ లక్షణాలన్నీ అతన్ని మ్యాచ్ విన్నర్‌గా నిలబెట్టాయి.

మహేంద్ర సింగ్ ధోని

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వికెట్ల మధ్య ధోనీ పరిగెత్తే తీరు తరచుగా భారత మ్యాచ్ విన్నర్‌‌గా చేసింది

ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా (210) వ్యవహరించిన, ఎక్కువ విజయాలు (123) సాధించిన కెప్టెన్‌గా ధోనీకి రికార్డు ఉంది. సీఎస్కేకు అయిదుసార్లు టైటిల్ అందించాడు. చాంపియన్స్ లీగ్ టైటిళ్లు కూడా సాధించాడు.

ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. టి20 వరల్డ్ కప్ (2007), వన్డే వరల్డ్ కప్ (2011), చాంపియన్స్ ట్రోఫీ (2013)లలో భారత్ విజేతగా నిలిచింది.

టెస్టు క్రికెట్‌లో కూడా ధోనీ తనదైన ముద్ర వేశాడు. 90 టెస్టులు ఆడిన ధోనీ, ఐసీసీ ర్యాంకింగ్‌లో భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. 2014-15 సిరీస్ మధ్యలో అకస్మాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

భారత మాజీ కెప్టెన్లు సునీల్ గావస్కర్, శాస్త్రి తరచుగా భారత అత్యుత్తమ క్రికెటర్ అంటూ ధోనీని ప్రశంసించారు.

ప్రస్తుత సీజన్‌లో ధోనీపరిస్థితి ఏంటి?

వయస్సు పెరగడం తప్పితే ధోనీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నాడు. గట్టి పోటీదారు.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఫినిషర్‌ పాత్ర పోషించిన ధోనీ, గత సీజన్‌లో ఈ బాధ్యతకు దూరంగా ఉన్నాడు. అతిథి పాత్రలా చివర్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

ధోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధోనీ కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌‌ను అయిదుసార్లు విజేతగా నిలిపాడు

ఐపీఎల్‌లో ఇప్పుడు భాగమైన ఇంపాక్ట్ ప్లేయర్‌ పాత్రలో ధోనీ స్థిరపడొచ్చు. అదేవిధంగా జట్టుకు అనధికార మెంటార్, కెప్టెన్ పాత్రలోనూ కొనసాగవచ్చు.

సీఎస్కేకు జట్టులో ప్లేయర్‌గా ధోనీ పాత్ర చాలా చిన్న విషయం. కానీ, అతని ఆకర్షణ ఆ ఫ్రాంచైజీకి, ఐపీఎల్‌కు భారీ వాణిజ్య, బ్రాండింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

ధోనీ లేకుండా ఐపీఎల్‌ను ఊహించుకోలేమని సీఎస్కే యాజమాన్యం చెబుతుంటుంది.

ఇలా చేయడం వల్ల దేశీ, విదేశీ యువ ప్లేయర్ల అవకాశాలు పరిమితం అవ్వొచ్చనే వాదనను రవిశాస్త్రి తోసిపుచ్చారు.

''స్వేచ్ఛా మార్కెట్ డైనమిక్స్‌పై ఐపీఎల్ పనిచేస్తుంది. ఫ్రాంచైజీ యజమానులు భావోద్వేగాలతో పనిచేయరు. మైదానం లోపల, బయట వాళ్లకు ఏది ఉత్తమమైనదో తెలుసు'' అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)