ఐపీఎల్ రిటెన్షన్ 2025: ఆ ఐదుగురే ఎందుకు? సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్‌లో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

ఐపీఎల్, ఐపీఎల్ రిటెన్షన్ 2025, సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, @SunRisers/X

    • రచయిత, బోడ నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ దీపావళి పండుగ నాడు వచ్చేసింది.

పెద్దగా ఊహించని ట్విస్ట్‌లు లేకుండా, ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే బలమైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి.

ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్‌ ఎలా ఉంది? పరుగుల వరద పారించిన వారికి పెద్దపీట వేసిన మేనేజ్‌మెంట్, బౌలింగ్ సంగతి మరచిపోయిందా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..!

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ

ఫొటో సోర్స్, @IPL/X

ఫొటో క్యాప్షన్, హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

క్లాసెన్‌కు కాసుల పంట

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ చూస్తే... హెన్రిచ్ క్లాసెన్‌‌ను రూ.23 కోట్లు, పాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లు, అభిషేక్ శర్మను రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్‌ను రూ. 14 కోట్లు, హైదరాబాదీ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లతో రిటెయిన్ చేసుకుంది.

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌లో అత్యధిక ధర పలికాడు హెన్రిచ్ క్లాసెన్‌.

నూతన నిబంధనల ప్రకారం అన్‌క్యాప్డ్ ‌ప్లేయర్‌కు గరిష్ఠంగా రూ.4 కోట్లు మాత్రమే చెల్లించాలి.

అయితే, ఇటీవలే టీం ఇండియా తరపున నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడంతో అతడు క్యాప్డ్ ప్లేయర్‌గా మారాడు.

దీంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ అతడికి రూ.6 కోట్లు చెల్లించింది. 2023లో నితీశ్ కుమార్ రెడ్డిని రూ. 20 లక్షలకే ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.

నితీశ్ కుమార్ రెడ్డి, ఐపీఎల్ మెగా వేలం

ఫొటో సోర్స్, @SunRisers/X

ఫొటో క్యాప్షన్, 2024 సీజన్‌‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఆ ఐదుగురే ఎందుకు?

డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారిగా 2016లో కప్‌ గెలుచుకుంది. ఆ తరువాత విలియమ్సన్ కెప్టెన్సీలో 2018లో రన్నరప్‌గా నిలిచింది.

ఆ తరువాత వివిధ కారణాల వల్ల నాయకత్వ మార్పులతో జట్టు సతమతమైంది. ఆ సమయంలో సరైన నాయకత్వం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదురుచూస్తోంది.

అదే సమయంలో, 2023 వన్డే వరల్డ్‌కప్ సాధించిన ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మినీ వేలంలోకి వచ్చాడు. దీంతో, ఏకంగా 20.5 కోట్లు వెచ్చించి అతడిని ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. అందుకు తగ్గట్లుగానే కమిన్స్ తనదైన కెప్టెన్సీ మార్క్ చూపించాడు.

సాధారణంగా బౌలింగ్ బలంతో బరిలోకి దిగే సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 సీజన్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

2020 తరువాత తొలిసారిగా 2024లో ‘ప్లే ఆఫ్స్‌’లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అందుకే కమిన్స్‌ను వదులుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇష్టపడలేదు.

గత సీజన్‌లో ఓపెనింగ్ జోడి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదరగొట్టారు. ట్రావిస్ హెడ్ 190కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 567పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 200కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు సాధించాడు. వీరిద్దరు పవర్‌ ప్లేలోనే భారీగా పరుగులు రాబడుతూ మంచి ఆరంభాన్ని ఇస్తుంటారు.

“ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల జోడిని కొనసాగించడం మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈసారి కూడా వారి నుంచి విధ్వంసకర బ్యాటింగ్ ఆశించవచ్చు” అని టీం ఇండియా మాజీ క్రికెటర్, క్రికెట్ అనలిస్ట్ నోయల్ డేవిడ్ బీబీసీతో అన్నారు.

క్లాసెన్, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ 2025

ఫొటో సోర్స్, @SunRisers/X

ఫొటో క్యాప్షన్, విధ్వంసకర బ్యాటర్‌గా పేరు సంపాదించిన హెన్రిచ్ క్లాసెన్

క్లాసెన్‌కు రూ.23 కోట్లు ఎందుకు?

“హెన్రిచ్ క్లాసెన్‌కు ఇతర ఫ్రాంచైజీల నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయి. అందుకే, ఎస్‌ఆర్‌హెచ్ అత్యధికంగా రూ. 23 కోట్లు చెల్లించాల్సి వచ్చింది” అని క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ బీబీసీ తెలుగుకు తెలిపారు.

“హెన్రిచ్ క్లాసెన్‌కు రూ.23 కోట్లు చెల్లించడం సరైన నిర్ణయమే. గతేడాది ఒంటిచేత్తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయాలు అందించాడు. కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, పవర్‌ఫుల్ హిట్టర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లోనూ మంచి ఫామ్‌ కనబర్చాడు” అని నోయల్ డేవిడ్ అన్నారు.

ఇక నితీశ్ రెడ్డి విషయానికొస్తే...గత సీజన్‌లో 13 మ్యాచుల్లో 300కు పైగా పరుగులు, 3 వికెట్లతో రాణించి టాటా ఐపీఎల్ 2024 ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు.

“అంతకుముందు సీజన్‌లో చివరి ప్లేస్‌లో ఉన్న టీమ్‌, 2024లో రన్నరప్‌గా నిలవడానికి కారణం ఈ ఐదుగురే. ఈ జాబితాలో ఓపెనర్స్, కెప్టెన్, ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్స్, కీపర్, పవర్ ఫుల్ హిట్టర్ ఇలా ప్రధాన కేటగిరీలన్నీ కవర్ అవుతున్నాయి. కోర్ టీమ్ ఇదే కాబట్టి వీళ్లను అట్టిపెట్టుకోవడం మంచి నిర్ణయం” అని వెంకటేశ్ చెప్పారు.

బౌలింగ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్

ఫొటో సోర్స్, @SunRisers/X

ఫొటో క్యాప్షన్, బౌలర్ నటరాజన్‌ను వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

రూ.45 కోట్లతో మంచి బౌలింగ్ దళం వస్తుందా?

ఈ ఏడాది వేలం కోసం ప్రతి టీమ్‌కు పర్స్ విలువ రూ.120 కోట్లుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.

రిటెన్షన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 75 కోట్లు ఖర్చు చేయడంతో ఆ జట్టు ఖాతాలో ఇంకా రూ.45 కోట్లు మాత్రమే మిగిలి ఉంది.

బౌలింగ్ టీమ్‌గా మంచి పేరున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్, పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో భీకర బ్యాటింగ్ టీమ్‌గా మారిపోయింది.

2024 ఒక్క సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ 250కిపై పరుగులు మూడు సార్లు సాధించింది. అందుకేనేమో, ఫ్రాంచైజీ ఆ బ్యాటింగ్ బలాన్ని వదులుకోలేదు.

అయితే, రిటెన్షన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క ప్రధాన బౌలర్‌ను కూడా తీసుకోలేదు. మెగా వేలంలో పాల్గొనేందుకు ఆ జట్టు దగ్గర కేవలం రూ. 45 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తరుణంలో ఈ డబ్బుతో నాణ్యమైన బౌలింగ్ దళాన్ని సంపాదించగలమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

“గత సీజన్‌లో భువనేశ్వర్‌తో సహా బౌలర్లు అంతా తేలిపోయారు. కాబట్టి, వాళ్లను రిటెయిన్ చేసుకోకుండా వేలంలోకి వెళ్తున్నారు. భువనేశ్వర్‌కు వయసైపోతుంది కాబట్టి నటరాజన్‌ కోసం వేలంలో ట్రై చేయొచ్చు. ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి ఇండియన్ స్పిన్నర్ లేని లోటు ఉంది. కాబట్టి, ఈసారి ఆ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది” అని వెంకటేష్ అన్నారు.

“ఎస్ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ చాలా తెలివైనవారు. రూ.45 కోట్ల పర్స్‌తో ఎవరెవరిని కొనాలనే ప్లానింగ్ ముందే చేసుకుని ఉంటారు. అందుకే, ఏ ఫ్రాంచైజీ సాహసం చేయనట్లుగా ఒక ప్లేయర్‌కు (క్లాసెన్‌) రూ. 23 కోట్లు వెచ్చించారు” అని నోయల్ డేవిడ్ అభిప్రాయపడ్డారు.

‘రైట్ టు మ్యాచ్’ ఎలా పని చేస్తుంది?

రిటెన్షన్‌లో భాగంగా ఒక్కో జట్టు ఆరుగురు ప్లేయర్స్‌ను ఉంచుకోవచ్చు. కానీ, చాలా వరకు టీమ్స్ ఐదుగురినే అట్టిపెట్టుకున్నాయి. పంజాబ్ కింగ్స్ అయితే కేవలం ఇద్దరినే రిటెయిన్ చేసుకుంది.

ఇలా తక్కువ ప్లేయర్స్‌ను తీసుకున్నప్పటికీ, త్వరలో జరగబోయే మెగా వేలంలో ‘రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎమ్)’ కింద వదిలేసుకున్న ఆటగాళ్లను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది.

ఇది ఎలా పని చేస్తుంది అంటే..

ఉదాహరణకు...సన్ రైజర్స్ హైదరాబాద్ అబ్దుల్ సమద్‌ను వదిలేసింది. కానీ, వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ కింద అతడిని తిరిగి దక్కించుకోవాలని అనుకుంది.

అయితే, వేలంలో ఆర్సీబీ అతడిని రూ. 5 కోట్లు బిడ్ వేసి దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 5 కోట్లు చెల్లించి ‘రైట్ టు మ్యాచ్’ కింద అబ్దుల్ సమద్‌ను తీసుకోవచ్చు.

పాత నిబంధనల ప్రకారం ఇలాగే ఉండేది. కానీ, కొత్త నిబంధనల్లో ఒక ట్విస్ట్ ఉంది.

ఒకవేళ ఆర్సీబీ కూడా అబ్దుల్ సమద్‌ను కచ్చితంగా కావాలనుకుంటే మరోసారి బిడ్ వేయవచ్చు. ఈసారి ఆ ధరను 5 నుంచి 6, 7 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ పోయిందనుకోండి, అలా గరిష్ఠంగా ఎంత బిడ్ వేస్తారో ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే ‘రైట్ టు మ్యాచ్’ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని సొంతం చేసుకోగలదు. లేకపోతే, ఆ ఆటగాడు ఆర్సీబీకి వెళ్లిపోతాడు.

ఇదిలా ఉంటే.. నూతన నిబంధనల ప్రకారం ఒక జట్టు ఆరుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకోవచ్చు. అందులో కచ్చితంగా ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి.

ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్లు క్యాప్డ్ ప్లేయర్లే. కాబట్టి, ప్రస్తుతం ‘రైట్ టు మ్యాచ్’ కింద ఆ జట్టు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని మాత్రమే తీసుకునేందుకు వీలుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)