భారత క్రికెటర్ స్మృతి మంధానకు ఐసీసీ మహిళా 'వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ అవార్డు'

స్మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతి వన్డేలలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేశారు

భారత క్రికెటర్ స్మృతి మంధాన మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 2024 ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఆమె ఎంపికయ్యారు.

గత సంవత్సరం స్మృతి మంధాన 13 వన్డే మ్యాచ్‌లు ఆడి, 747 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమె బ్యాట్ నుంచి 95 ఫోర్లు, ఆరు సిక్సర్లు వచ్చాయి.

అత్యధిక పరుగులు చేసిన వారిలో స్మృతి తర్వాత లారా వాల్వార్డ్ట్ (697), టామీ బ్యూమాంట్ (554), హేలీ మాథ్యూస్ (469)లు ఉన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ ఐదవ ఎడిషన్ నామినీల జాబితాలో స్మృతి మంధాన పేరు కూడా ఉంది. ఆమెతో పాటు అదితి అశోక్, స్మృతి మంధాన, అవని లేఖరా, మను భాకర్, వినేష్ ఫోగట్‌లు ఉన్నారు.

మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన స్మృతి మంధానకు బీసీసీఐ అభినందనలు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్మృతి మంధాన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 29 ఏళ్ల స్మృతి గత ఏడేళ్లలో పలు ఐసీసీ అవార్డులు సాధించారు.

ఐసీసీ అవార్డులు, రివార్డులు

ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడం లేదా ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తు చేయడంలో స్మృతి నేర్పరి.

2024 జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్‌ 3-0తో విజయం సాధించడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో ఆమె మొత్తం 343 పరుగులు చేశారు.

2024 అక్టోబర్‌లో న్యూజీలాండ్‌పై కూడా ఆమె రాణించారు. ఇక డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సెంచరీ చేసి క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

29 ఏళ్ల స్మృతి గత ఏడేళ్లలో పలు అవార్డులూ గెల్చుకున్నారు.

2019లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా నిలిచారు. 2018లో ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆ ఏడాది నిలకడగా ఆడినందుకు స్మృతికి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా లభించింది.

2018లో ఐసీసీ ఎంపిక చేసిన వన్డే, టీ20 జట్టులో స్మృతికి స్థానం లభించింది.

2022లో ఐసీసీ ‘మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డునూ అందుకున్నారు.

రాహుల్ ద్రవిడ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ ద్రవిడ్‌ని స్మృతి సోదరుడు శ్రవణ్ కలిశారు.

స్మృతి మంధాన 17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ వన్డే గేమ్‌లో డబుల్ సెంచరీ చేశారు. వెస్ట్ జోన్ అండర్-19 టోర్నమెంట్‌లో 138 బంతుల్లో 32 ఫోర్లతో 224 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అప్పటివరకు ఏ భారత మహిళా క్రికెటర్ కూడా వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయలేదు. స్మృతి ఈ సెంచరీ ఘనతను రాహుల్ ద్రవిడ్‌కు ఇచ్చారు.

నిజానికి కొన్నేళ్ల కిందట రాహుల్ ద్రవిడ్‌ను స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ కలిశారు. ద్రవిడ్ తన కిట్ నుంచి ఒక బ్యాట్ స్మృతి కోసం బహుమతిగా ఇచ్చారు. ఆ బ్యాట్‌పై ద్రవిడ్ ఆటోగ్రాఫ్ కూడా చేశారు. అండర్-19లో గుజరాత్‌పై స్మృతి ఈ బ్యాట్‌తోనే డబుల్ సెంచరీ కొట్టారు.

కొన్నేళ్ల పాటు ఈ బ్యాట్‌తోనే ఆడారు స్మృతి మంధాన. భారీగా పరుగులూ సాధించారు. ఈ బ్యాట్ ఇప్పుడు స్మృతి డ్రాయింగ్ రూమ్‌లో భాగమైంది.

స్మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014లో మహిళల టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియాకు ఎంపికయ్యారు స్మృతి.

‘పరుగుల యంత్రం’

2016లో ఛాలెంజర్ ట్రోఫీలో స్మృతి మూడు అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్ మ్యాచ్‌లో 62 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపారు.

2014లో మహిళల టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియాకు ఎంపికయ్యారు స్మృతి. ఈ టోర్నీలో ఆడటానికి ఆమె ఇంటర్ పరీక్షలకు హాజరు కాలేదు. ప్రపంచకప్ అనంతరం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి వచ్చింది. దీంతో ఆమె ఏడాది పాటు చదువుకు దూరమయ్యారు. అయితే, ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా విజయం సాధించడంతో స్మృతికి భారత జట్టులో సుస్థిర స్థానం లభించింది.

ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్మృతి హాఫ్ సెంచరీ సాధించారు. మరో రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో స్మృతి సెంచరీ కొట్టారు.

గాయమైనా..

2017 ప్రపంచకప్‌కు ముందు మోకాలి గాయం కారణంగా స్మృతి ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె ప్రపంచకప్ ఆడగలరా లేదా అనే సందేహం నెలకొంది. కానీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మైదానంలోకి దిగారు.

ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే స్మృతి 90 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై సెంచరీ (106 పరుగులు) సాధించారు. దీంతో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఆ టైటిల్ భారత్ గెలవలేకపోయింది. మొత్తంగా ఈ టోర్నీ ద్వారా స్మృతి అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్క్ చూపించారు.

2018లో దక్షిణాఫ్రికా టూర్‌లో హాఫ్‌ సెంచరీ, సెంచరీలతో ఫామ్ కొనసాగించారు స్మృతి. ఇలా క్రమంగా స్మృతి మంధాన భారత మహిళల జట్టులో ‘పరుగుల యంత్రం’గా పేరు తెచ్చుకున్నారు.

స్మృతి మంధాన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతి మంధాన శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఆటను ఎక్కువగా ఇష్టపడతారు.

బ్యాటింగ్‌లో దూకుడు

ఎడమచేతి వాటం గల స్మృతి మంధాన శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఆటను ఎక్కువగా ఇష్టపడతారు. బహుశా అందుకే సంగక్కర దూకుడు స్మృతి బ్యాటింగ్‌లో కనిపిస్తుంటుంది.

అంతర్జాతీయ పర్యటనలో సంగక్కరను కలిసే అవకాశం స్మృతికి లభించింది. సంగక్కరతో దిగిన ఫొటోను ఆమె ట్విట్టర్‌లో పంచుకున్నారు. భారీ షాట్‌లు ఆడగల స్మృతి అంతే నైపుణ్యంతో సింగిల్స్, డబుల్స్ తీయగలరు.

స్మృతి మంధాన తండ్రి, సోదరుడు శ్రవణ్ సాంగ్లీ జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఆడారు. నిజానికి స్మృతి తన సోదరుడు శ్రవణ్ క్రికెట్ ఆడటం చూసే ఆట నేర్చుకున్నారు. కొడుకు డ్రెస్‌ను స్మృతికి సరిపోయేలా కుట్టించి ఇచ్చేవారు ఆమె తల్లి. అదే డ్రెస్‌లో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసేవారు. ఆమె సోదరుడు నెట్స్‌లో బౌలింగ్ చేసేవారు. ముంబయిలో మొదలైన స్మృతి ఆట.. ఆమె కుటుంబం సాంగ్లీలో స్థిరపడిన తర్వాత కూడా కొనసాగింది.

స్మృతి 11 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడేందుకు రెండేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. అనంత్ తాంబ్వేకర్ కోచింగ్‌లో కాంక్రీట్ పిచ్‌లపై ఆమె ప్రాక్టీస్ చేశారు.

ఉదయం ప్రాక్టీస్, ఆ తర్వాత స్కూల్, మళ్లీ సాయంత్రం ప్రాక్టీస్ ఇలానే సాగింది స్మృతి జీవితం. ఆ సమయంలో బంధువులు ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. అయితే స్మృతి తల్లి 'ఆటపైనే నీ దృష్టి ఉంచు' అని కూతురుకు చెప్పారు.

దాదాపు దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టులో భాగమైన స్మృతి మంధాన.. దేశ విదేశాల్లో పర్యటించినప్పటికీ సాంగ్లీతో బంధాన్ని తెంచుకోలేదు. అక్కడి పన్నీర్ గార్లిక్ బ్రెడ్, వడాపావ్ అంటే చాలా ఇష్టపడతారు స్మృతి .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)