చిరంజీవి:‘ఇన్నాళ్లూ ఇంట గెలవలేకపోయాను’ అని ఎందుకు అన్నారు, 17ఏళ్ల కిందట ఏం జరిగింది?

చిరంజీవి

ఫొటో సోర్స్, facebook/Akkinenninagarjuna

ఫొటో క్యాప్షన్, అమితాబ్ బచ్చన్ నుంచి ఏఎన్ఆర్ అవార్డును స్వీకరించిన చిరంజీవి.
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'యెస్... నేను ఇప్పుడు ఇంట గెలిచాను'.

తెలుగు సినిమా తారల కరతాళ ధ్వనుల మధ్య ‘ఏఎన్‌ఆర్ నేషనల్ అవార్డ్’ను స్వీకరించిన సందర్భంగా సినీ నటుడు చిరంజీవి అన్న మాటలు ఇవి.

నటునిగా చిరంజీవికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు వరించాయి. ఇలా ‘రచ్చ గెలిచిన’ తాను ఇన్నాళ్లూ ‘ఇంట గెలవలేదు’ అని చిరంజీవి అన్నారు.

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి ‘ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు’ను స్వీకరించిన తరువాత ‘ఇప్పుడు ఇంట గెలిచినట్లు’గా ఫీలవుతున్నట్లు చిరంజీవి చెప్పారు.

ఇంత కాలం ఇంట అంటే టాలీవుడ్‌లో ‘గెలవలేదు’ అనే భావనలో చిరంజీవి ఉన్నారనే విషయం ఆయన ప్రసంగం వింటే అర్థమవుతుంది.

ఒకనాడు తనకు ‘లెజెండరీ’ అవార్డు రూపంలో ‘గెలిచే’ అవకాశం వచ్చినా కొన్ని ‘ప్రతికూల పరిస్థితుల’ వల్ల సాధ్యం కాలేదని, అందుకే ‘నాడు ఇంటగెలవలేదు అనిపించిందని’ చిరంజీవి చెప్పారు.

‘‘తెలుగు సినిమా పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. నాడు నాకు లెజండరీ అవార్డును ప్రకటించారు. చాలా సంతోషపడ్డా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది హర్షించని కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోలేదు. అందుకే దాన్ని టైమ్ క్యాప్సుల్ బాక్సులో ఉంచాను. అర్హత ఉన్నప్పుడే ఆ అవార్డు తీసుకుంటానని చెప్పా. ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డును అమితాబ్ చేతులు మీదుగా తీసుకోవడం ద్వారా ఇంటకూడా గెలిచాను అనే ఫీలింగ్ వచ్చింది’’ అని చిరంజీవి సోమవారం (28.10.2024)నాడు ఏఎన్ఆర్ అవార్డు స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అక్కినేని అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి

ఫొటో సోర్స్, YT/Annapurnastudios

ఫొటో క్యాప్షన్, తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవికి లెజండరీ అవార్డు ప్రకటించారు.

ఏమిటా ప్రతికూల పరిస్థితులు?

చిరంజీవికి అప్పట్లో అడ్డుపడిన ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటి? చిరంజీవికి లెజండరీ అవార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని హర్షించని వ్యక్తులు ఎవరో తెలియాలంటే సుమారు 17 ఏళ్లు వెనక్కు వెళ్లాలి.

తెలుగు సినిమా పరిశ్రమకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2007 జనవరిలో వజ్రోత్సవాలు జరుగుతున్న రోజులవి.

‘మెగాస్టార్’‌గా అభిమానులతో పిలిపించుకుంటూ తెలుగు సినిమా రంగంలో ‘అగ్రస్థానం’లో ఉన్న చిరంజీవి తన రాజకీయ అరంగేట్రానికి వేదికను సిద్ధం చేసుకుంటున్న తరుణమది.

వజ్రోత్సవాల సందర్భంగా పలువురు నటీనటులకు సన్మానం చేశారు. అదే తరుణంలో చిరంజీవికి ‘లెజండరీ’ అవార్డును ప్రకటించింది వజ్రోత్సవ కమిటీ. ‘నాడు తనకు దక్కలేదు’ అని తాజాగా చిరంజీవి చెబుతున్న ‘గెలుపు’ కూడా ఇదే.

తెలుగు సినీ నటుడు చిరంజీవి

ఫొటో సోర్స్, facebook/Akkinenninagarjuna

ఫొటో క్యాప్షన్, గతంలో తాను ఇంట గెలవలేకపోయాయని చిరంజీవి చెప్పారు.

ఆ ‘గెలుపు’ ఎందుకు దక్కలేదు?

టాలీవుడ్ వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవికి ‘లెజండరీ’ అవార్డు ప్రకటించడాన్ని సీనియర్ నటుడు మోహన్ బాబు వజ్రోత్సవ వేదికపైనే తప్పుబట్టారు.

‘‘నాకు ఆ మధ్య చెప్పారు. మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దండీ ఈ సన్మానాలు...అయినా ఏమిటా సన్మానం అని అడిగా... ‘‘సెలబ్రిటీగా మిమ్మల్ని సన్మానిస్తాం. మీరు లెజెండ్ కాదు అని నిర్వాహకులు చెప్పారు’’ అని మోహన్ బాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘అందుకే ‘‘లెజెండ్ అంటే ఎవరు? సెలబ్రిటీ అంటే ఎవరు? సెలబ్రిటీలను ఈ విధంగా గౌరవించాలి. లెజెండ్‌కు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ఒక పుస్తకాన్ని రాయండి. దాన్ని అచ్చు చేసి మాకు చెప్పండి’’ అని మోహన్ బాబు ఆరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన కెరియర్‌తో పాటు నటునిగా, నిర్మాతగా ఎన్నో సినిమాల్లో నటించిన, నిర్మించిన తనను లెజెండ్‌గా ఎందుకు పరిగణించలేదని మోహన్ బాబు నిర్వాహకులను ప్రశ్నించారు.

‘‘సినిమా ఇండస్ట్రీలో బతికున్న వాళ్లలో మొట్టమొదట రాజ్యసభకు వెళ్లాను. భారత ప్రభుత్వం ఇటీవలే గౌరవం (పద్మశ్రీ) ప్రకటించింది. కులమతాలకు అతీతంగా 25 శాతం సీట్ల (విద్యా సంస్థల్లో)ను ఉచితంగా ఇస్తున్నా. 500కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. 47 చిత్రాలను నిర్మించాను. ఇవన్నీ లెజండరీ లిస్టులో లేవా?’’ అని ఆయన ప్రశ్నించారు.

సినీ నటులు మోహన్ బాబు

ఫొటో సోర్స్, facebook/DrMmohanbabu

ఫొటో క్యాప్షన్, సెలబ్రిటీ అంటే ఎవరు, లెజెండ్ అంటే ఎవరు అని మోహన్ బాబు ప్రశ్నించారు.

‘సీనియర్లకు గౌరవం ఏది?’

కృష్ణం రాజు వంటి సీనియర్లకు సరైన గౌరవం దక్కలేదని మోహన్‌బాబు అన్నారు. ‘‘కృష్ణం రాజు గారు లెజండరీ కాదా? ఆయనను నిలబెట్టి ఒక దండ వేశారు.. ఇది న్యాయమా? విజయ నిర్మలగారు 50 సినిమాలు తీస్తే కనీసం ఆమె క్లిప్పింగ్ కూడా వేయరా? ఈవీవీ సత్యనారాయణ, గిరిబాబు వంటి వారికి వజ్రోత్సవం గురించిన కబురు కూడా లేదు’’ అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకరిది కాదు, అందరిది’’ అని మోహన్ బాబు అన్నారు.

కాబట్టి ‘‘ప్రజల ఆశీస్సులు ఉండి సినిమా హిట్ అయితే చాలు. ఈ సన్మానం నాకు వద్దు అనుకున్నా’’ అని నాడు వేదిక మీద మోహన్ బాబు వజ్రోత్సవ కమిటీ సన్మానాన్ని తిరస్కరించారు.

అప్పటి వరకు ఆటపాటలతో సందడిగా సాగిన వేడుక మోహన్ బాబు ప్రసంగంతో గంభీరంగా మారింది.

ఏఎన్‌ఆర్ అవార్డు కార్యక్రమంలో తాజాగా చిరంజీవి ప్రస్తావించిన ‘ప్రతికూల పరిస్థితి’ వెనుక ఉన్నది ఈ పరిణామమే.

టైమ్ క్యాప్సుల్‌లో వేస్తున్నా: చిరంజీవి

మోహన్ బాబు ప్రసంగం తరువాత చిరంజీవి వేదిక మీదకొచ్చి మాట్లాడారు.

నేరుగా మోహన్ బాబు వ్యాఖ్యలను ప్రస్తావించక పోయినా చిరంజీవి ప్రసంగం మొత్తం ఆ మాటలకు కౌంటర్‌గానే సాగింది.

తనకు ‘లెజండరీ’ అవార్డు తీసుకోవడం ఇష్టం లేదని, ముందుగానే వద్దు అని చెప్పానని చిరంజీవి అన్నారు.

‘‘నాకు లెజెండరీ అవార్డు ఇస్తానని చెప్పినప్పుడు, నేను నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్... మేమంతా ఒక వయసు వాళ్లం. నన్ను వాళ్ల నుంచి దూరం చేసి పెద్దవాడిని చేయొద్దు. నాకు అలాంటి అవార్డు వద్దు అన్నాను. ఈ మాట అందరికీ తెలుసు’’ అని ఆయన చెప్పారు.

అయినా తనకు అర్హత లేదనుకుంటే ఆ అవార్డు తీసుకోవడం లేదని చిరంజీవి అన్నారు.

‘‘నేను ఈ అవార్డుకు తగిన వాడిని కాదనుకుంటూ ఉంటే మనస్ఫూర్తిగా దాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నా’’ అన్నారు చిరంజీవి. దాన్ని ఒక టైమ్ క్యాప్సుల్‌‌లో పెట్టి సమాధి చేస్తున్నట్లు చెప్పారు.

‘‘ఆ అవార్డు, శాలువా, మొమెంటోను ఈ టైమ్ క్యాప్సుల్‌లో పెడతాను. (టాలీవుడ్‌కు)100 ఏళ్ల అప్పుడు అంటే 25 ఏళ్ల తరువాత నాతో పాటు మిత్రులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి వాళ్లం పెద్దవాళ్లం అయి ఉంటాం. అప్పుడు మీరు మాకు అర్హత ఉంది అనుకుంటే మా హీరోలందరినీ లెజెండ్స్ అని పిలిచి సన్మానం చేయండి. అప్పుడు తీసుకుంటాను. అప్పటి దాకా ఆ అవార్డును సమాధి చేసి పెడుతున్నా’’ అని చిరంజీవి అన్నారు.

పరిశ్రమలోని లోపాల గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని కూడా చిరంజీవి తప్పు పట్టారు.

ఏదైనా సమస్య ఉంటే ఒక కుటుంబం మాదిరిగా నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి కానీ ఇలా రచ్చకు ఎక్కడం వల్ల నలుగురిలో తెలుగు సినీ పరిశ్రమ విలువ తగ్గిపోతుందని ఆయన అన్నారు.

మోహన్ బాబు, చిరంజీవి

ఫొటో సోర్స్, facebook/DrMmohanbabu

ఫొటో క్యాప్షన్, మోహన్ బాబు, చిరంజీవి కలిసి చాలా సినిమాల్లో నటించారు.

‘మిత్ర భేదం’

మోహన్ బాబు, చిరంజీవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. తామిద్దరం ‘మంచి మిత్రులం’ అని కొన్ని సినిమా వేడుకలలో చెప్పుకున్నా, వారి మధ్య అప్పుడప్పుడు విభేదాలు కూడా కనిపించాయి.

2006లో చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం వచ్చినప్పుడు, సన్మాన కార్యక్రమంలో మోహన్ బాబు చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. తన గురించి ఎవరో ఏదో చెబితే చిరంజీవి కొంత కాలం తనతో ముభావంగా ఉన్నారని మోహన్ బాబు చెప్పారు.

అలాగే ‘తన ఫంక్షన్లకు చిరంజీవి ఏ రోజూ నన్ను పిలవరు. నేను వచ్చిన తొలి ఫంక్షన్ ఇదే’ అని నాడు మోహన్ బాబు అన్నారు.

ఇక 2021లో జరిగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లోనూ మోహన్ బాబు, చిరంజీవి కుటుంబాల మధ్య పరోక్ష వైరం కనిపించింది. ఆ ఎన్నికల్లో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు బరిలో నిలిచారు. ఆయనకు పోటీగా నిలిచిన ప్రకాశ్ రాజ్‌కు చిరంజీవి సోదరుడు నాగబాబు వంటి వారు మద్దతుగా నిలిచారు.

నాడు ఎన్నికల ప్రచారంలో నాగబాబు, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

ప్రస్తుతం ఏఎన్‌ఆర్ అవార్డు స్వీకరిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యల వల్ల పాత ఘటనలన్నీ మరొకసారి చర్చలోకి వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)