నాలుగు వాటర్ బాటిళ్లు, నాలుగు బిస్కెట్ ప్యాకెట్లతో వేల కి.మీల సముద్ర యానానికి ప్రయత్నం, చివరకు ఏం జరిగింది....

- రచయిత, బ్లాంకా మునోజ్, క్రిస్ అల్‌కాక్, మమే చీక్ ఎంబే
- హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ బృందం
సెనెగల్ రైతు మహమ్మద్ ఔలే ఎప్పుడూ సముద్రం వైపు వెళ్లలేదు. అయితే ఆయన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇలాంటి ప్రయాణాలు ఇప్పటికే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒక శ్మశానంగా మార్చాయి.
“పడవ యజమాని కాల్ చేశారు. నేను రెడీగా ఉండాలని చెప్పారు. నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సమయం వచ్చింది” అని ఆయన బీబీసీతో అన్నారు.
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌లోని కేనరీ ఐలండ్స్ చేరుకునేందుకు శరణార్థులు ఉపయోగించే రహస్యమైన, ప్రమాదకరమైన ప్రపంచంలోకి బీబీసీ ఐ ప్రవేశించగలిగింది.
కేనరీ ఐలండ్స్‌కు చేరుకోవాలని భావిస్తున్న శరణార్థుల్లో ఔలే ఒకరు. ఇప్పటికే ఈ దీవులకు చేరుకున్న శరణార్థుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.
శరణార్థులు పరిమితికి మించి పోయారని స్థానిక ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇవేవీ ఔలే నిర్ణయాన్ని మార్చలేకపోయాయి.
వస్తువులన్నీ సర్దుకుని పరిమితికి మించి జనం కూర్చున్న పొడవాటి చిన్న పడవ ఎక్కారాయన. చేపలు పట్టేందుకు నాలుగు పొడవాటి మొద్దులతో చేసిన పడవ అది. ఔలే ప్రయాణం రోజులు, వారాలు నెలలు పట్టవచ్చు. ఆయన గమ్యానికి చేరడం అనేది ఏ మాత్రం దయ లేని సముద్రపు వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది.
సెనెగల్ నుంచి కేనరీ ఐలండ్స్‌కు భూమార్గం ద్వారా చేరుకోవాలంటే 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే సముద్రం మీద అయితే మనం ఎక్కడ నుంచి బయల్దేరతామనే దాన్ని బట్టి 2వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని అంచనా. శరణార్థులు మధ్యధరా సముద్రంలో ప్రయాణించే మార్గాలతో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ.
కేనరీ ఐలండ్స్‌కు వెళ్లే సముద్ర మార్గంలో తుపానులు, వేగంగా వచ్చే సముద్ర ప్రవాహాల వల్ల శరణార్థులు తరచూ తాగు నీరు లేక జబ్బుల పాలవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వారిని భయం కూడా వెంటాడుతుంది.
ఆ మార్గంలో ప్రయాణించేవారు ఒక్కోసారి నీరు లేక, ఆందోళనకు గురై పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు.


సముద్ర తీరానికి దూరంగా సెనెగల్ తూర్పు ప్రాంతంలో ఉన్న టంబకౌండాలో ఔలే అతని పిల్లలు, కుటుంబ సభ్యులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
పని కోసం వచ్చి పడవలు బయల్దేరే ప్రాంతానికి చేరువగా పని చేసుకుంటున్న ఔలే దాదాపు ఏడాదిపాటు తన పిల్లలు, కుటుంబ సభ్యులను చూడలేదు.
అక్కడ ఆయన మోటార్‌బైక్ టాక్సీ డ్రైవర్‌గా పని చేసేవారు. కేనరీ ఐలండ్స్‌కు వెళుతున్న పడవ ఎక్కేందుకు బైక్ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తూ సంపాదించిన సొమ్ముతో పాటు స్నేహితుల వద్ద నుండి అప్పు తీసుకుని వెయ్యి డాలర్లు (సుమారు రూ. 84 వేలు) చెల్లించారు.
తనను మోసం చేస్తారేమోననే భయంతో, పడవ ద్వారా గమ్యం చేరిన తర్వాతనే పూర్తి సొమ్ము చెల్లిస్తానని స్మగ్లర్లతో ఒప్పందం చేసుకున్నారు.
“ఈ సముద్ర జలాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. సముద్రంలో దెయ్యాలు నన్ను చంపెయ్యవచ్చు” అని ఒడ్డుకు చేరుకున్న తర్వాత బీబీసీతో అన్నారు ఔలే.
“పడవ తిరగబడితే అందరూ చనిపోతారు. మీరు నీళ్లలో పడిపోతే పట్టుకోవడానికి ఏం దొరుకుతుంది? చావడమే. అయితే మీరు రిస్క్ తీసుకోవాలి” అని ఔలే అన్నారు.
ఇక్కడ ఇప్పటికే డజన్ల కొద్దీ పడవలు కనిపించకుండా పోయాయి. వందలాది జీవితాలు సముద్రంలో కలిసిపోయాయి. సరైన సామగ్రి లేకుండా మొదలు పెట్టిన ప్రయాణం అట్లాంటిక్ అంతటా అటు ఇటు తిరిగి బ్రెజిల్ తీరానికి చేరిన సందర్భాలు ఉన్నాయి.
ఔలే ఈ ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానం చేరితే తన కుటుంబానికి అవసరమైన మేరకు సంపాదించవచ్చని భావించారు. అయితే తన ప్రయాణం గురించి తెలిస్తే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారని భావించి రహస్యంగా ఉంచారు.
2010 నుంచి సెనెగల్ ఆర్థికంగా స్థిరంగా ఉన్నా, దేశంలో మూడో వంతు ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
“నేను ఏ పనైనా చెయ్యగలను. అయితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. నా కుటుంబ సభ్యుల ఆశలన్నీ నా మీదనే ఉన్నా నా దగ్గర డబ్బు లేదు” అని ఔలే చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఆఫ్రికా ఖండంలోని సబ్ సహరన్ దేశాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, పేదరికం, అంతర్యుద్ధం వల్ల ఔలే మాదిరిగానే అనేక మంది ఈ దారి గుండా శరణార్థులుగా వలస పోతున్నారు.
ఆఫ్రికన్ దేశాల నుంచి అక్రమ మార్గాల్లో యూరప్ చేరుకునే శరణార్థులకు కేనరీ ఐలండ్స్ ప్రధాన ద్వారంగా మారింది. లిబియా, ట్యునీషియా నుంచి మధ్యధరా సముద్రం గుండా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై ఇటలీ, గ్రీస్ గట్టి నిఘా పెట్టడంతో కేనరీ ఐలండ్స్ ద్వారా యూరప్ చేరుకుంటున్న వారి సంఖ్య పెరిగింది.
2023లో కేనరీ ఐలండ్స్‌కు 40వేల మంది వచ్చారు. ఇటీవలి దశాబ్ధాలలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఇప్పటి వరకు 30,800 మంది కంటే ఎక్కువ మంది కేనరీ ఐలండ్స్‌లోని టూరిస్ట్ బీచ్‌లకు చేరుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.
అట్లాంటిక్ సముద్రంలో వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే, పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని కేనరీ ఐలండ్స్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
సముద్రంలో బాధితుల్ని రక్షించే అత్యవసర వ్యవస్థ, పోలీసులు, రెడ్ క్రాస్ వలంటీర్లు తమ పరిమితిని దాటి పని చేస్తున్నారని కేనరీ ఐలండ్స్ అధ్యక్షుడు ఫెర్నాండో క్లవిజో బీబీసీ ఆఫ్రికా ఐ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
“దీని వల్ల మరింత మంది ప్రజలు చనిపోవచ్చు. శరణార్థులకు వారు కోరుకుంటున్న సౌకర్యాలు మేము అందించలేకపోవచ్చు” అని ఆయన వివరించారు.
“ప్రస్తుతం యూరప్ మధ్యధరా సముద్ర మార్గాన్ని బ్లాక్ చేసింది. దీంతో ప్రమాదకరమైన అట్లాంటిక్ మార్గం వారికి సులువైనదిగా కనిపిస్తోంది” అని క్లవిజో చెప్పారు.
స్పెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ టీమ్ సభ్యులతో బీబీసీ మాట్లాడింది. ఈ పరిస్థితులతో తాము విసిగిపోయామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.
“ఎమర్జెన్సీ బృందంలో సభ్యులు ఇకపై ఈ మరణాలు, విధ్వంసాన్ని ఏ మాత్రం భరించగలిగే పరిస్థితుల్లో లేరు” అని ఆ బృందంలో ఒక సభ్యుడు చెప్పారు.
కేనరీ ఐలండ్స్ ద్వీప సముదాయంలో అత్యంత చిన్నదైన ఎల్ హియర్రో అనే చిన్న దీవికి 2023లో 30వేల మందికి పైగా శరణార్థులు వచ్చారు. ఇది స్థానికం జనాభా కంటే రెండు రెట్లు ఎక్కువ.
స్థానికులు ప్రభుత్వ బస్సుల్ని ఉపయోగించుకోలేకపోతున్నారని, అవన్నీ శరణార్థుల్ని తరలించడానికే కేటాయిస్తున్నట్లు క్లవిజో చెప్పారు. దీని వల్ల శరణార్థుల పట్ల స్థానికుల్లో విద్వేషం పెరగవచ్చని, అది సామాజిక అశాంతికి దారి తీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“శరణార్థుల సమస్య గురించి యూరోపియన్ యూనియన్, స్పానిష్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కేనరీ ఐలండ్స్ ఒక్కతే ఈ సమస్యను పరిష్కరించలేదు” అని క్లవిజో అన్నారు.
దీవులకు అక్రమ మార్గంలో వస్తున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో వారి గురించి దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ మొదలైంది. శరణార్థుల్లో తోడు ఎవరూ లేని పిల్లల సంరక్షణకు ప్రభుత్వం మరిన్ని నిధులు ఇవ్వాలని స్థానిక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మళ్లీ సెనెగల్ దగ్గరకు వస్తే, ఐలండ్స్‌కు వెళ్లే పడవ ఎక్కేందుకు రహస్య ప్రదేశానికి చేరుకోవాలని స్మగ్లర్లు ఆయనకు సమాచారం పంపించారు. ఇప్పుడాయన భవిష్యత్ వాళ్ల చేతిలో ఉంది.
“అక్కడ మాలాంటి వాళ్లు అనేక మంది ఉన్నారు. మాలి, గయానా నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మమ్మల్ని చిన్న చిన్న పడవల్లో, ఒక్కోదాంట్లో 10 నుంచి 15 మందిని ఎక్కించుకుని పెద్ద పడవ దగ్గరకు తీసుకెళ్లారు. అందరూ ఎక్కాక ప్రయాణం మొదలైంది” అని ఔలే చెప్పారు.
దాదాపు రెండువేల కిలోమీటర్ల ప్రయాణం కోసం ఔలే దగ్గర ఉన్నది కొన్ని వాటర్ బాటిళ్లు, చేతి నిండా బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే.
ప్రయాణం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే ఆయన జబ్బున పడ్డారు. పడవలో తగినంత చోటు లేకపోవడంతో ఆయన ఎక్కువ సేపు నిల్చునే ఉండేవారు. పడవ లోపల సముద్రపు నీరు, ఆయిల్ కలిసిపోయిన చోట నిద్ర పోయేవారు.
ఆయన దగ్గర ఉన్న నీరు అయిపోవడంతో సముద్రపు నీరు తాగాల్సి వచ్చింది.
పడవలో ఉన్న కొంతమంది భయంతో పిచ్చి పట్టినట్లు పెద్దగా అరిచేవారు. వారు అలా అరిచినప్పుడల్లా వారిని గట్టిగా పట్టుకోవాలని, కింద కూర్చోబెట్టాలని పడవ సిబ్బంది చెప్పేవారు. అలా చెయ్యకపోతే వారు సముద్రంలోకి దూకడంతో పాటు మరి కొంతమందిని కూడా నెట్టేస్తారని భయపడేవారు.

ప్రపంచంలో శరణార్థులు ప్రయాణిస్తున్న మార్గాల్లో అట్లాంటిక్ మార్గం చాలా వేగంగా ప్రమాదకరమైనదిగా మారుతోందని ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్) లెక్కలు చెబుతున్నాయి.
2024లో ఇప్పటి వరకు 807 మంది కనిపించకుండా పోవడమో లేదా చనిపోవడమో జరిగిందని అంచనా. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 76శాతం ఎక్కువ.
గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ మార్గంలో జరిగిన అనేక ఘోరమైన ప్రమాదాలు రికార్డులలో చేరలేదు.
స్పానిష్ హక్కుల గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ సేకరించిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ “తీరం చేరుకోవడానికి బయల్దేరిన శరణార్థుల్లో ప్రతీ 45 నిముషాలకు ఒకరు చనిపోతున్నారు. దీనర్థం ఏంటంటే మానవ అక్రమ రవాణా మాఫియాలు మరింత శక్తివంతంగా మారాయని” అని క్లజివో చెప్పారు.
ఈ మార్గం ద్వారా నేరస్తులు 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1261 కోట్లు) సంపాదిస్తున్నారని ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ఆఫీసు అంచనా వేసింది.
“అక్రమంగా శరణార్థుల్ని తరలిస్తున్నా మాఫియాలు, ఇది మాదక ద్రవ్యాల రవాణా మాదిరి మంచి ఆదాయ వనరు అని గుర్తించాయి. ఇందులో వాళ్లు పట్టుబడే అవకాశాలు కూడా చాలా తక్కువ” అని లెఫ్టినెంట్ ఆంటోనియో ఫ్యుంటెస్ బీబీసీతో చెప్పారు. ఈ స్మగ్లర్లను పట్టుకునేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గార్డియా సివిల్ సెటప్ బృందంలో ఆయన పని చేశారు.
“శరణార్థులు వారి దృష్టిలో కేవలం వస్తువులు మాత్రమే. వాళ్లు ఆయుధాలు, డ్రగ్స్‌ను అక్రమంగా తరలించినట్లే ప్రజల్ని కూడా అక్రమంగా తరలిస్తున్నారు. శరణార్థులంతా బాధితులు” అని ఆంటోనియో ఫ్యుంటెస్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
స్మగ్లర్ల నెట్‌వర్క్ గురించి సమగ్ర అవగాహన కోసం బీబీసీ సెనెగల్ నుంచి పడవ ప్రయణాలను నిర్వహిస్తున్న ఒక స్మగ్లర్‌తో మాట్లాడింది. ఆయన తన గుర్తింపు వెల్లడించవద్దని చెప్పారు.
“మీరొక పెద్ద పడవ తీసుకుంటే 200 నుంచి 300 మందిని పంపించవచ్చు. వారిలో ప్రతీ ఒక్కరు 500 డాలర్లు (సుమారు రూ. 42 వేలు) చెల్లిస్తారు. దీని వల్ల మాకు చాలా డబ్బు వస్తుంది” అని ఆయన చెప్పారు.
మానవ అక్రమ రవాణాలో భాగంగా పడవల్లో ప్రయాణిస్తున్న వారు చనిపోతే, అందుకు బాధ్యుడిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా అని బీబీసీ ఆ స్మగ్లర్‌ను ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ “ఇది నేరమే, ఇందులో దొరికిన వాళ్లను జైల్లో పెట్టాల్సిందే. అయితే మరో మార్గం లేదు” అని చెప్పారు.
“సముద్ర జలాల్లో చిక్కుకుని చనిపోయిన వారిని మీరు చూస్తున్నారు. అయినప్పటికీ పడవలు వెళుతూనే ఉన్నాయి” అన్నారు ఆ వ్యక్తి.
ఐదు రోజుల వరకు ఔలే గురించి బీబీసీకి ఎలాంటి సమాచారం అందలేదు. ఒక రోజు సాయంత్రం ఆయన ఫోన్ చేశారు.
“పడవ మోటార్ వేడెక్కుతోంది. గాలులు బలంగా వీస్తున్నాయి. మేము మొరాకో వైపు వెళుతున్నామని కొంతమంది చేపలు పట్టేవాళ్లు చెప్పారు. అయితే దాన్ని మా కెప్టెన్ ఒప్పుకోలేదు. మనం నిదానంగా వెళితే ఉదయం ఆరు గంటల కల్లా స్పెయిన్‌లో ఉంటామని చెప్పారు” అంటూ ఔలే వివరించారు.
ఔలే, ఆయన ఎక్కిన పడవ మరో రోజులో కేనరీ ఐలండ్స్ చేరుకునేంత దూరంలో ఉన్నప్పుడు వారి పడవ ఇంజన్ పాడైంది. బలమైన గాలులు వీస్తూ ఉండటంతో పడవలో ప్రయాణిస్తున్న ఇతర శరణార్థులు భయపడ్డారు. పడవ అట్లాంటిక్ సముద్రంలో ఉండగానే వారు కెప్టెన్‌పై తిరుగుబాటు చేశారు.
“అందరూ వాదనలకు దిగారు, ఒకరినొకరు నిందించుకున్నారు. దీంతో కెప్టెన్ సెనెగల్‌కు తిరిగి బయల్దేరారు” అని ఔలే చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఔలే ఈ ప్రయాణంలో సురక్షితంగానే తిరిగి సెనెగల్ చేరుకున్నారు. అయితే ఆయనకు గాయాలయ్యాయి. ప్రయాణంలో ఆరోగ్యం బాగా దెబ్బతింది.
శరీరమంతా నొప్పిగా ఉండటంతో వేగంగా నడవలేకపోయారు.
ఏడాది పాటు ప్లాన్ చేసినప్పటికీ, ఆయన మళ్లీ సెనెగల్‌లోని స్క్వేర్ వన్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని కలుసుకున్నారు. అయితే కేనరీ ఐలండ్స్‌కు వెళ్లేందుకు అవసరమైన సొమ్మును భద్రపరచుకున్నారు.
“నేను మళ్లీ వెళ్లాలని అనుకుంటున్నాను. అవును, దేవుడి మీద ఒట్టు. నాకు అదే మంచిదని నా నమ్మకం. నేను చనిపోతే అది దేవుడి నిర్ణయం”
ఔలే యూరప్ చేరుకుంటే మరి కొన్నేళ్ల పాటు కుటుంబాన్ని చూడలేకపోవచ్చు. సముద్రంలో చనిపోతే శాశ్వతంగా చూడలేకపోవచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










