యూరప్‌కు అక్రమంగా వెళ్ళే దారిలో స్మగ్లర్ల కాల్పులు, దారుణమైన కారు ప్రమాదాలు... అయినాసరే ప్రాణాలకు తెగిస్తున్నారు

ఫొటో సోర్స్, HUNGARIAN GOVERNMENT
- రచయిత, నిక్ థ్రోప్
- హోదా, బీబీసీ న్యూస్
స్మగ్లర్ల మధ్య చోటు చేసుకుంటున్న తుపాకీ కాల్పులు, ప్రాణాంతక కారు ప్రమాదాలు ఇటీవల వెస్ట్రన్ బాల్కాన్స్ ద్వారా యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించే వలస మార్గాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి.
అయినప్పటికీ, ఈ మార్గం గుండా యూరప్‌లోకి ప్రవేశిస్తోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
గత వారం ప్రత్యర్థి గ్యాంగ్‌ల మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. వారు ఆఫ్గాన్‌లకు చెందిన వారని తెలిసింది.
ఈ కాల్పుల ఘటన హంగేరీ సరిహద్దు కంచెకు కొన్ని వందల కి.మీల దూరంలో ఉన్న పాడుబడ్డ సెర్బియన్ ఫామ్ బిల్డింగ్‌లో జరిగింది.
సెర్బియాతో హంగేరి దక్షిణ సరిహద్దుకు ఉన్న బోర్డర్ కంచెపై నియంత్రణ కోసం మొరాకో, ఆఫ్గాన్, సిరియా గ్యాంగ్‌ల మధ్య తీవ్ర కొట్లాట నడుస్తుందని, దీని వల్ల సరిహద్దులో హింస పెరుగుతుందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
సెర్బియా సరిహద్దు గ్రామాలైన హర్గోస్, హజ్దుకోవోలోని నివాసితులు, సుబోటికా నగరానికి చెందిన ప్రజలు సరిహద్దుల్లో శాంతి, సామరస్యతను పరిరక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
అయితే, సరిహద్దులకు ఇరువైపుల ఉన్న పోలీసులు స్మగ్లర్లతో కుమ్మక్కయ్యారని కొందరు ఆరోపిస్తున్నారు.
పటిష్టమైన సరిహద్దు కంచె, అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం, వెనక్కి పంపించడం చేస్తున్ననప్పటికీ.. హంగేరి గుండా తమ సరిహద్దులోకి పెద్ద ఎత్తున వలసదారులు చేరుకుంటున్నారని ఆస్ట్రియా, స్లోవాక్ ప్రభుత్వాలు నిరసిస్తున్నాయి.
హంగేరి ప్రధానమంత్రి విక్టోర్ ఆర్బాన్ కూడా వలస వ్యతిరేక విధానాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అయినప్పటికీ ఈ వలసలు మాత్రం ఆగడం లేదు.

‘‘కొన్నిసార్లు ఏజెంట్లు(స్మగ్లర్లు) చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు మమ్మల్ని కొడతారు’’ అని 33 ఏళ్ల మాజీ ఆఫ్గాన్ ఆర్మీ అధికారి సదార్ చెప్పారు.
మరి కొన్నిసార్లు దయా హృదయంతో తమ కోసం ఆహారం తీసుకొస్తారని, ఉండేందుకు వసతి కూడా కల్పిస్తారని చెప్పారు.
హంగేరీ కంచెకు సెర్బియా వైపు ఉన్న బీడు భూమిలోని ఒక పాడుబడ్డ భవంతిలో నేను అత కలిశాను.
సెర్బియా-బల్గారియా సరిహద్దు గుండా సెర్బియాలోని పిరోట్ నగరం నుంచి అతను బస్సులో ఇక్కడికి వచ్చాడు.
ఇస్తాంబుల్ నుంచి అతను వచ్చినట్లు చెప్పాడు. జర్మనీకి టిక్కెట్ కోసం అతను 10 వేల డాలర్లు అంటే రూ.8 లక్షల పైన ఇచ్చినట్లు తెలిపాడు.
డబ్బులు చెల్లించకుండా కంచె దాటాలని ప్రయత్నిస్తున్న ఆఫ్గాన్ యువకులను దారుణంగా కొడుతున్న దృశ్యాలను, స్మగ్లర్ల ఆకృత్యాలను సుబోటికాలో బీబీసీ తీసిన వీడియోల్లో మీరు చూడవచ్చు.
మరో వీడియోలో సుబోటికాకి దగ్గర్లో జరిగిన తుపాకీ కాల్పులు కనిపిస్తున్నాయి.

175 కి.మీల పొడవున్న సరిహద్దు గుండా విద్యుదీకరించిన రాజోర్ వైర్‌తో ఉండే హంగేరీ కంచె, ఎవరు ఎప్పుడు క్రాస్ చేయాలో నియంత్రించేందుకు స్మగ్లర్లకు సాయపడటమే కాకుండా.. వ్యక్తిగత కార్యకలాపాలను అడ్డుకునేందుకు సహకరిస్తుంది.
యువ వలసదారులు దీన్ని ఒక గేమ్‌గా పిలుస్తున్నారు. పలు గ్రూప్‌లకు చెందిన వారు ఒకే సారి కంచెను వివిధ ప్రాంతాల్లో కత్తిరిస్తారు.
ఆ సమయంలో వారు పట్టుబడితే, వెనక్కి పంపేస్తారు. కానీ, కొందరు మాత్రం ఎవరి కనుసన్నల్లో పడకుండా కంచెను దాటేస్తారు. అక్కడితే గేమ్ అయిపోతుంది అని యువ వలసదారులు అన్నారు.
కోసోవో నుంచి ఇక్కడికి వచ్చే ఆటోమేటిక్ రైఫిల్స్, పిస్టల్స్ కొత్త రకం ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి.
గత సంవత్సరం జూలైలో సుబోటికాకు చెందిన మకోవా సెడ్మికా సబ్ అర్బ్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 16 ఏళ్ల బాలిక చనిపోగా, పలువురు వలసదారులు గాయపడ్డారు.
మొరాకో, ఆఫ్గాన్ గ్యాంగ్‌ల మధ్య ఈ తుపాకీ కాల్పులు జరిగాయి.
గత శుక్రవారం జరిగిన కాల్పుల్లో కూడా హర్గోస్ కంచె వద్ద సెర్బియాకు చెందిన గ్యాంగ్, ఆఫ్గాన్ గ్యాంగ్‌పై కాల్పులు జరపడం ప్రారంభించింది.
ఉత్తర సెర్బియా నుంచి సరిహద్దును దాటే చాలా మంది వలసదారులు సిరియా, ఆఫ్గాన్‌లకు చెందిన వారుంటున్నారు. కుర్దులు, పాకిస్తానీలు, ఇతర దేశస్తులకు చెందిన వారు కూడా సరిహద్దులను క్రాస్ చేస్తున్నారు.
స్మగ్లర్ల వద్ద ఆయుధాలు ఉంటున్నాయని, వలసదారుల వద్ద కాదని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
‘‘స్థానిక ప్రజల భయాన్ని నేను అర్థం చేసుకోగలను’’ అని సుబోటికాకు చెందిన జర్నలిస్ట్ విరాగ్ గ్యుర్కోవిక్స్ చెప్పారు.
‘‘వైర్‌కు(సరిహద్దు కంచెకు) ఒక ఉద్దేశ్యముంటుంది’’ అని స్థానిక కార్యకర్త వ్లాదిమిర్ పోలోవినా చెప్పారు.
‘‘కేవలం వలసలను ఆపడమే కాదు. చెల్లింపులను కూడా ఇది నియంత్రించాలి. సరిహద్దును దాటే ప్రతి వ్యక్తి నుంచి వారికి యూరోలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకూ వైర్ ఉంటే, మీరు కూడా ఇలా చేసుకోవచ్చు’’ అని అన్నారు.
హంగేరియా వైపు చూస్తే, ప్రభుత్వ తీసిన వీడియోలో కంచె వైపుకి నిచ్చెనల విసరడం, వాటిని ఎక్కడం, దూకడం, పెద్ద పెద్ద కర్రలతో పోలీసు కార్లను కొడుతున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి.
తుపాకీలతో వలసదారుల్ని భయపెడుతున్న వ్యక్తుల దృశ్యాలు కూడా సెక్యూరిటీ కెమెరాలు తీసిన వీడియోల్లో రికార్డయ్యాయి.
కొంతమంది స్మగ్లర్ల వద్ద ఆయుధాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ఒక స్మగ్లర్ల కారులో ముందు వరుస సీట్ల మధ్య కలాష్నికోవ్(ఒక రకమైన తుపాకీ) ఉన్న వీడియో సుబోటికాలో తీశారు.
సరిహద్దు కంచెను పదేపదే నాశనం చేస్తున్నారని హంగేరీ పోలీసు విభాగానికి చెందిన యాంటీ ట్రాఫికింగ్ యూనిట్ హెడ్ గబోర్ బలోగ్ చెప్పారు.
వారు పలు విద్యుత్ పరికరాలను వాడుతున్నారని, కంచెకు పెద్ద పెద్ద బొక్కలు చేస్తున్నారని అన్నారు. వీరు చేసిన బొక్కలలో కొన్ని తలుపు సైజులో ఉన్నాయని చెప్పారు.
హంగేరిలోకి రావాలనుకునే వారిపై పెరుగుతోన్న స్మగ్లర్ల హింసకు సంబంధించిన సెర్బియా రిపోర్టులను పోలీసులు సైతం ధ్రువీకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
తుపాకీ గురిపెట్టి కంచె గుండా వలసదారులను నెడుతుంటారని చెప్పారు.
కంచెను దాటిన తర్వాత ప్రతి రాత్రి 80 శాతం మంది పట్టుబడుతున్నారని, మిగిలిన వారిని దేశంలోకి వెళ్లే వాహనాల్లో అదుపులోకి తీసుకుంటున్నట్లు హంగేరీ పోలీసులు తెలిపారు.
హంగేరీ పోలీసులు, సరిహద్దు కాపలాదారులు కూడా వలసదారుల్ని కొడుతున్న కేసులు నమోదవుతున్నాయి.
సెర్బియా వైద్య కార్మికులు, హంగేరియా జర్నలిస్ట్‌లు దీనిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. కానీ, ఈ డాక్యుమెంటరీని, రిపోర్టులను హంగేరియా పోలీసులు కొట్టివేశారు.
పోలీసులు పట్టుకున్న చాలా మంది హర్గోస్‌కి దగ్గర్లో ఉన్న కంచె వద్దనున్న గేటు గుండా తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు.
అయితే, తిరిగి పంపడం కూడా అంతర్జాతీయ చట్టాన్ని అతిక్రమిస్తున్నాయి.
అసోత్తలోమ్, మోరహలోమ్ గ్రామాలకు మధ్యనున్న కంచెకు హంగేరీ వైపున్న రోడ్డు మార్గంలో నిలిపిన కార్లను కాల్చి వేశారు. ఇవి పట్టుబడ్డ స్మగ్లర్లకు చెందిన కార్లు.
హంగేరికి దూరాన స్లోవాకియాకు ఉత్తర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న గ్రామంలో పగలిపోయిన అద్దాల ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు చెత్తలో పడి ఉన్నాయి.
12 మంది శరణార్థులతో వెళ్తోన్న వ్యాన్‌కు చెందినవి ఇవి. అక్టోబర్ ప్రారంభంలో హైవే 21పై స్లోవాక్ సరిహద్దు సమీపంలోని గ్రామం గుండా ఉత్తరం వైపుకి వెళ్తున్నప్పుడు పోలీసులు కారు చేజ్‌లో ఈ వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఏడుగురు శరణార్థులు ఈ ప్రమాదానికి గురయ్యారు.
గత ఏడాది కాలంలో హంగేరిలో వలసదారులతో వెళ్లే వాహనాల్లో 20 ప్రమాదానికి గురయ్యాయి. వాటిలో ఈ ప్రమాదం ఒకటి.
ఆస్ట్రియా సరిహద్దు గుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు ప్రయత్నించినప్పుడు కేవలం బుర్గెంల్యాండ్ రాష్ట్రంలోనే 70 ప్రమాదాలు జరిగాయి.
ఈ స్మగ్లర్ గ్యాంగ్‌లు అనుసరించే కొత్త వ్యాపార విధానం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆస్ట్రియా పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గాజా చరిత్ర: ఎన్నో విధ్వంసాలు, విపత్తులు, విషాదాలను భరించిన వేల ఏళ్ళనాటి నగరం
- కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయా, కరోనా వచ్చినవారు పరిగెత్తవద్దని ఆరోగ్యమంత్రి ఎందుకు హెచ్చరించారు?
- వరల్డ్ కప్ 2023 : ద్రవిడ్ ప్రతీకారం తీర్చుకుంటారా...ఎవరి మీద, ఎందుకు?
- అమ్మ ఎవరికైనా అమ్మే...తుపానులో రెండు రోజులుగా ఆహారంలేని పసిబిడ్డకు వీధిలోనే పాలిచ్చిన పోలీసాఫీసర్
- నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














