భారతీయ మూలాలున్న రిషి సునక్ అత్యంత తక్కువ కాలంలోనే బ్రిటన్ ప్రధానిగా ఎలా ఎదిగారు?
బీబీసీ ప్రతినిధి వికీ యంగ్ అందిస్తున్న కథనం.
రిషి సునక్ 2015లోనే ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత చాలా వేగంగా ఉన్నత పదవులను చేపడుతూ ముందుగా ఆర్థికమంత్రి అయ్యారు.
ఆ తర్వాత ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యారు.
ఆయన ప్రస్థానం ఎలా సాగింది?
భారతీయ మూలాలు గల రిషి సునక్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు.
తనను టాప్ ప్రైవేట్ స్కూల్ వించెస్టర్ కాలేజీకి పంపించడానికి వారెంత కష్టపడ్డారో, ఆ అనుభవాలేంటో ఆయనోసారి బీబీసీ డాక్యుమెంటరీకి స్వయంగా చెప్పారు.
''నా స్నేహితుల్లో కొందరు కులీన ప్రభు వర్గాల వారు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. మరి కొందరు కార్మిక వర్గానికి చెందిన వారున్నారు. నేను అందరితో కలిసిపోతాను. ఇన్నర్ సిటీ స్టేట్ స్కూల్స్‌లో చదువుకునే పిల్లల దగ్గరికి వెళ్లి వారిని ఆక్స్‌ఫర్డ్‌కు అప్లై చేసుకోమని చెబుతాను. నా లాంటి వారి అనుభవాలు వారికి చెబుతాను'' అని రిషి సునక్ అన్నారు.
ఆక్స్‌ఫర్డ్‌లో చదివాక, బ్యాంకింగ్‌లో కెరియర్ మొదలు పెట్టారు. బిలియనీర్ నారాయణమూర్తి కూతురును పెళ్లి చేసుకోవడంతో ఆయన అత్యంత సంపన్నుడయ్యారు.
ఆయనకున్న విలాసవంతమైన ఇళ్లు, దుస్తులు, బూట్ల గురించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సామాన్య ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలియవన్నారు.
ఆయన భార్య నాన్-డోమ్ హోదాతో పన్ను ఎగవేశారని బయటపడటంతో ఆయనపై రాజకీయ దుమారం లేచింది. తాను ప్రభుత్వంలో చేరడానికి ముందే ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పానని ఆయన ముందు అన్నప్పటికీ... ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, PA Media
రిషి సునక్ ముందు నుంచీ బ్రెగ్జిట్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. కానీ ఈయూ నుంచి నిష్క్రమణ తర్వాత కలిగిన లాభాలేంటో ఆర్థికమంత్రిగా ఆయన ఎన్నడూ ప్రచారం చేసుకోలేదు.
డౌనింగ్ స్ట్రీట్ పార్టీల కుంభకోణంలో ఆయన పేరు కూడా ఉంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన జరిమానా కూడా చెల్లించారు. కానీ ఆయన స్నేహితులు మాత్రం 'ఓ సమావేశం కోసం ఆయన ముందుగా వచ్చారంతే' అన్నారు.
ఖర్చు విషయంలో బోరిస్ జాన్సన్‌కు, ఆయనకు మధ్య విభేదాలున్నాయనే పుకార్లు కూడా వచ్చాయి.
చాలా కుంభకోణాలు బయటపడ్డాక, నిరసనగా సునక్ రాజీనామా చేశారు.
కానీ తనను పదవిని వదిలిపెట్టేలా చేసింది జాన్సన్ స్నేహితులేనని సునక్ ఆరోపించారు.
గత వేసవిలో తాను కన్జర్వేటివ్ పార్టీ నేతగా పోటీ పడిన సందర్భంగా... లిజ్ ట్రస్ పన్ను కోతల ఎజెండా గురించి ఆయన ఈ హెచ్చరిక చేశారు.
''మీ ప్లాన్లతో మార్ట్‌గేజ్ రేట్లు, వడ్డీ రేట్లు 7 శాతం పెరుగుతాయని స్వయంగా మీ సొంత ఆర్థిక సలహాదారే చెప్పారు. దాంతో ఇక్కడ ఉన్నవారందరిపైనా, దీన్ని చూస్తున్న వారందరిపైనా పడే ప్రభావం ఏంటో ఊహించగలరా? వాళ్ల మార్ట్‌గేజ్ బిల్లులు వేల కొద్ది పౌండ్లలో పెరుగుతాయి'' అని రిషి సునక్ హెచ్చరించారు.
కన్జర్వేటివ్ సభ్యులు కొద్ది వారాల కిందే ఆయన ప్రణాళికను తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు ఆయనే స్థిరత్వం తేగలరని ఆయన సహచరులంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- యుక్రెయిన్-రష్యా: ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న పౌరులను ఈ చలికాలంలో తిరిగి రావొద్దన్న యుక్రెయిన్
- బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే
- 'డర్టీ బాంబ్' అంటే ఏంటి? దీనిని యుక్రెయిన్ ఉపయోగిస్తుందా? రష్యా ఆరోపణలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)