Dirty Bomb: 'డర్టీ బాంబ్' అంటే ఏంటి? దీనిని యుక్రెయిన్ ఉపయోగిస్తుందా? రష్యా ఆరోపణలు ఎందుకు?

అణుధార్మికత

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ ఒక 'డర్టీ బాంబు'ను ఉపయోగించాలని ప్రణాళిక రచిస్తున్నట్లు రష్యా చెప్తోంది.

మామూలు పేలుడు పదార్థాలతో పాటు అణుధార్మిక పదార్థాలు కూడా కలిపి ఉండే బాంబును డర్టీగా బాంబుగా వ్యవహరిస్తున్నారు.

రష్యా ఆరోపణలను యుక్రెయిన్ తిరస్కరించింది. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు కూడా రష్యా మాటలను కొట్టివేశాయి.

రష్యా ఏం చెప్పింది?

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తాజాగా బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుక్రెయిన్ ఒక డర్టీ బాంబును ఉపయోగించటం ద్వారా రెచ్చగొట్టే అవకాశం ఉందని తాము ఆందోళన చెందుతున్నట్లు ఆ సందర్భంగా చెప్పారు.

అమెరికా, ఫ్రాన్స్, తుర్కియే దేశాల రక్షణ మంత్రులతోనూ ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ డర్టీ బాంబును ఉపయోగించే అవకాశముందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా రష్యా ఈ ఆరోపణలు చేసింది. డర్టీ బాంబును ఉపయోగించటం అణు ఉగ్రవాద చర్యే అవుతుందని పేర్కొంది.

రష్యా వ్యాఖ్యలను ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులు తిరస్కరించారు. రష్యా ''విస్పష్టంగా తప్పుడు ఆరోపణలు'' చేస్తోందని వారు విమర్శించారు.

''ఈ యుద్ధంలో చెత్త అంతా రష్యా నుంచే పుట్టుకొస్తోంద''ని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ మండిపడ్డారు.

డర్టీ బాంబ్ అంటే ఏమిటి?

డర్టీ బాంబ్ అంటే.. యురేనియం వంటి అణుధార్మిక పదార్థాలు కలిగిన బాంబు. అందులోని సంప్రదాయ పేలుడు పదార్థాలు పేలినపుడు వాటితో పాటు ఉన్న అణుధార్మిక పదార్థం గాలిలో వ్యాపిస్తుంది.

ఈ బాంబుకు.. అణు బాంబులో ఉపయోగించే తరహా అత్యంత శుద్ధి చేసిన అణుధార్మిక పదార్థం అవసరం లేదు. ఆస్పత్రులు, అణు విద్యుత్ ప్లాంట్లు, పరిశోధన లేబరేటరీల్లో ఉండే అణుధార్మిక పదార్థాలను ఈ బాంబులో ఉపయోగించవచ్చు.

అణ్వాయుధాల కన్నా చాలా చౌకగా, చాలా వేగంగా ఇలాంటి పదార్థాలతో డర్టీ బాంబును తయారు చేయవచ్చు. ఈ డర్టీ బాంబులను వాహనాల్లో సైతం తీసుకెళ్లవచ్చు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్ యుద్ధాల్లో పశ్చిమ దేశాలు రష్యా, చైనాలను ఎదుర్కోగలవా?

అణుధార్మికత సోకటం క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బులకు దారితీయవచ్చు. అలాంటి డర్టీ బాంబు లక్ష్యంగా చేసుకున్న జనంలో తీవ్ర భయాందోళనలను కలిగించగలదు.

ఆ బాంబు పేలిన ప్రాంతం, దాని చుట్టూ భారీ విస్తీర్ణంలోని ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించాల్సి వస్తుంది కూడా.

ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ సంస్థ లెక్కించిన దాని ప్రకారం.. 9 గ్రాముల కోబాల్ట్-60ను, ఐదు కిలోల టీఎన్‌టీని న్యూయార్క్‌లోని మనహటన్ శిఖరాగ్రం మీద పేల్చినట్లయితే.. న్యూయార్క్ నగరం మొత్తం దశాబ్దాల పాటు నివాసానికి పనికి రాకుండా పోతుంది.

ఈ కారణం వల్ల డర్టీ బాంబులను 'వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్'గా పిలుస్తారు.

అయితే, ఈ ఆయుధాలు ఆధారపడ్డ తగ్గవి కావు.

ఒక డర్టీ బాంబులోని అణుధార్మిక పదార్థం లక్ష్యంగా చేసుకున్న ప్రాంతమంతటా వ్యాపించేలా చేయాలంటే దానిని పొడి రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పొడి మరీ పలుచగా ఉండి, బలమైన గాలుల్లోకి విడుదలైనట్లయితే అవి మరింత విస్తారమైన ప్రాంతంలోకి వ్యాపించి, మరింత హాని చేస్తాయి.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ డర్టీ బాంబ్ ఉపయోగించవచ్చునని రష్యా ఎందుకు ఆరోపించింది?

''భయం పుట్టించే వాదనలతో యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందిస్తున్న సైనిక సాయాన్ని నిలిపివేసేలాగా లేదా నెమ్మదింపజేసే లాగా చేయటంతో పాటు.. నాటో కూటమిని బలహీన పరిచటం'' లక్ష్యంగా రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తుండవచ్చునని అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ (ఐఎస్‌డబ్ల్యూ) విశ్లేషించింది.

యుక్రెయిన్ లోనే రష్యా ఒక డర్టీ బాంబును పేల్చి, అది యుక్రెయిన్ బలగాల పనే అని నిందించే 'ఫాల్స్ ఫ్లాగ్' దాడికి రష్యా ప్రణాళిక రచిస్తోందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

అయితే.. డర్టీ బాంబు వల్ల తన సొంత సైన్యానికి, తన నియంత్రణలో ఉన్న ప్రాంతానికి జరిగగల నష్యం దృష్ట్యా.. రష్యా ఇంత తెలివితక్కువగా వ్యవహరించదని చాలా మంది సైనిక విశ్లేషకులు అంటున్నారు.

''రష్యా ఫాల్స్-ఫ్లాగ్ డర్టీ బాంబు దాడికి సన్నద్ధమయ్యే అవకాశం లేదు'' అని ఐఎస్‌డబ్ల్యూ కూడా పేర్కొంది.

అల్ ఖైదా సభ్యుడు ధీరేన్ బారోట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డర్టీ బాంబు తయారు చేయటానికి కుట్రపన్నిన కేసులో అల్ ఖైదా సభ్యుడు ధీరేన్ బారోట్‌‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు

గతంలో డర్టీ బాంబును ఉపయోగించారా?

ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా విజయవంతమైన డర్టీ బాంబు దాడి జరగలేదు.

అయితే కొన్ని ప్రయత్నాలు జరిగాయి.

1996లో చెచెన్యా తిరుగుబాటుదారులు మాస్కోలోని ఇజమాయిలోవో పార్కులో.. డైనమైట్‌, సీజియం-137 కలిగిన బాంబును పెట్టారు.

అందులో ఉపయోగించిన సీజియంను.. క్యాన్సర్ చికిత్స పరికరాల నుంచి సేకరించారు.

ఈ బాంబు పెట్టిన స్థానాన్ని భద్రతా సంస్థలు కనిపెట్టి, దానిని నిర్వీర్యం చేశాయి.

1998లొ చెచెన్యాలోని ఒక రైల్వే లైన్ వద్ద పెట్టిన డర్టీ బాంబును చెచెన్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ గుర్తించి నిర్వీర్యం చేసింది.

2002లో అల్-ఖైదాతో సంబంధాలున్న జోస్ పడిల్లా అనే అమెరికన్.. డర్టీ బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడన్న ఆరోపణలతో చికాగోలో అరెస్టయ్యాడు. అతడికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

రెండేళ్ల తర్వాత అల్ ఖైదా సభ్యుడు, బ్రిటిష్ జాతీయుడు అయిన ధీరేన్ బారోట్‌ను లండన్‌లో అరెస్ట్ చేశారు. అమెరికా, బ్రిటన్‌లలో డర్టీ బాంబుతో ఉగ్రవాద దాడికి కుట్ర చేసినందుకు గాను అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

పడిల్లా కానీ బారోట్ కానీ అరెస్ట్ అయ్యేసరికి ఆ డర్టీ బాంబును తయారు చేయటం మొదలుపెట్టలేదు.

వీడియో క్యాప్షన్, దక్షిణ ఖేర్సన్ ప్రాంత యుద్ధ క్షేత్రం నుంచి స్పెషల్ రిపోర్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)