యుక్రెయిన్ యుద్ధం ఒత్తిడిలో పుతిన్.. యుక్రెయిన్ 4 ప్రాంతాల్లో మార్షల్ లా.. రష్యా అంతటా భద్రత ఆంక్షలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, స్టీవ్ రోజెన్‌బర్గ్
- హోదా, రష్యా ఎడిటర్
వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
ఆయన 'స్పెషల్ మిలటరీ ఆపరేషన్' అనుకున్నట్లుగా సాగలేదు. యుక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఊహించని స్థాయిలో ఎదురుకావడంతో తాను ఆక్రమించుకున్న భూభాగాలను రష్యా మళ్లీ కోల్పోతోంది.
అదేసమయంలో యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా ప్రాంతాలలో నిత్యం షెల్లింగ్ జరుగుతోంది.
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లోని 4 ప్రాంతాలు లుహాన్స్క్, డోనెస్క్, జపోరిజియా, ఖేర్సన్‌లలో మార్షల్ లా విధిస్తూ డిక్రీ జారీ చేశారు.
అయతే, మార్షల్ లా వల్ల ఇప్పుడున్న పరిస్థితుల కంటే కొత్తగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇంకా స్పష్టత లేదు.
మరోవైపు యుక్రెయిన్ తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి దక్కించుకోవాలనే నిశ్చయించుకుంది.
అయితే, మూడు వేర్వేరు స్థాయిల భద్రత ఆదేశాలతో రష్యావ్యాప్తంగా మరింత కట్టుదిట్టమైన పరిస్థితులు కల్పిస్తున్నారు పుతిన్.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ సరిహద్దులలో ఉన్న బెల్గరోడ్, బ్రియాన్స్క్, క్రాస్నొడర్, రోస్టోవ్ వంటి ప్రాంతాలలో ఈ డిక్రీ తరువాత మధ్యస్థాయి భద్రత ఆంక్షలు అమలవుతున్నాయి.
ఈ ఆంక్షలలో భాగంగా భద్రత మరింత కట్టుదిట్టం చేయడం, ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాలలోకి ప్రవేశించడం, ఇక్కడి నుంచి వెళ్లడంపైనా ఆంక్షలు, తనిఖీలు ఉంటున్నాయి.
దీని తరువాత స్థాయిలో భద్రతా ఆంక్షలు మాస్కో సహా రష్యాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలకు వర్తిస్తాయి.
వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ ఆంక్షలు వంటివన్నీ ప్రెసిడెన్షియల్ డిక్రీలో ప్రస్తావించారు.
కాగా మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. సాధారణ జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ ఆయన భరోసా ఇచ్చారు.
ఇవి కాకుండా మిగతా ప్రాంతాలు అంటే సైబీరియా, రష్యా తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో అత్యల్ప భద్రత స్థాయి అమలవుతుంది. అక్కడ దీని ప్రభావం పెద్దగా ఉండబోదు.
పుతిన్ సంతకం చేసిన ఈ డిక్రీ అమలు కోసం ప్రాంతీయ గవర్నర్లు అందరూ 'ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్స్' ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
అన్ని ప్రాంతాల హెడ్‌లు, సైనిక ప్రతినిధులు, పోలీసులు ఇందులో భాగస్వాములవుతారు.
సాయుధ బలగాలు, ఇతర దళాల అవసరాలను తీర్చడానికి ప్రాంతీయ గవర్నర్లు సహకరించాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీనర్థం రష్యా సైన్యానికి మరిన్ని అధికారాలు ఇవ్వడమే.
అయితే, వీరందరి సమన్వయంతో భద్రత మార్పులు అమలు కావడానికి కొంత సమయం పట్టొచ్చు.
పుతిన్ సంతకం చేసిన ఈ డిక్రీ రష్యా వ్యాప్తంగా ప్రజలపై నియంత్రణకు.. స్పెషల్ మిలటరీ ఆపరేషన్స్‌లో భాగంగా సైనిక మోహరింపు ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?
- మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












