డాక్టర్ జీ: గైనకాలజిస్టుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?

ఆయుష్మాన్ ఖురానా

ఫొటో సోర్స్, @ayushmannk

    • రచయిత, వందన
    • హోదా, బీబీసీ భారతీయ భాషల టీవీ ఎడిటర్
లైను
  • భారత్‌లో మగవారు గైనకాలజిస్టులుగా పనిచేయకుండా అడ్డుకునేందుకు ఎలాంటి చట్టాలూ లేవు.
  • కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మేల్ గైనకాలజిస్టుల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చాయి. అయితే, వీటిలో కొన్ని కోర్టుల్లో తిరస్కరణకు గురయ్యాయి.
  • నేడు మహిళలకు తనిఖీలు నిర్వహించే సమయంలో మగ డాక్టర్లు కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
  • మహిళా నర్సు లేదా సదరు మహిళ బంధువుల సమక్షంలోనే మేల్ గైనకాలజిస్టులు పరీక్షలు నిర్వహించాలి.
  • అంతర్గత అవయవాల తనిఖీలు లేదా పరిశీలనకు సదరు మహిళ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.
లైను

‘‘కేవలం మహిళలు మాత్రమే మహిళల శరీరాన్ని అర్థం చేసుకోగలరని కొందరు భావిస్తారు. నేను మేల్ గైనకాలజిస్టును, అబ్‌స్టెట్రీషియన్‌ను కూడా. నేను గర్భం దాల్చలేను కాబట్టి, గర్భిణులకు చికిత్స అందించలేనని అసలు అనుకోకూడదు. ఇది ఎలా ఉంటుందంటే.. సైకియార్టిస్టులు అందరికీ మానసిక వ్యాధులు సోకి ఉండాలి, అప్పుడే వారికి మానసిక వ్యాధులపై అవగాహన ఉంటుంది అన్నట్లు. ఇలా ఆలోచించడం సరికాదు.’’

ఇవి డాక్టర్ పునీత్ బేడి వ్యాఖ్యలు. దిల్లీలో 30 ఏళ్లుగా ఆయన గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు.

నిజానికి గైనకాలజిస్టు లేదా అబ్‌స్టెట్రీషియన్ పేరు చెప్పగానే చాలా మందికి మహిళా డాక్టర్లు మాత్రమే గుర్తుకువస్తారు. మరోవైపు చాలామంది మహిళలు కూడా ఫిమేల్ గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లడానికే ఇష్టపడతారు.

అసలు మేల్ గైనకాలజిస్టుగా పనిచేసే వారి జీవితం ఎలా ఉంటుంది? మహిళల పూర్తి వ్యక్తిగత విషయాల్లో సేవలు అందించేటప్పుడు మగ డాక్టర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. హిందీ సినిమా ‘‘డాక్టర్ జీ’’ ఈ అంశాల చుట్టూనే తిరుగుతుంది.

గైనకాలజీ

ఫొటో సోర్స్, Dr Amit Tondon

మేల్ గైనకాలజిస్టుతో మాట్లాడేందుకు సిగ్గు ఎందుకు?

ఆ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టు అయ్యేందుకు చదువుతున్న ఏకైక పురుషుడు ఆయన మాత్రమే. అసలు మహిళలకు తను ఎలా చికిత్స అందించగలను అనే విషయంలో ఆయన చాలా గందరగోళానికి గురవుతుంటారు. ఎలాగైనా ఈ విభాగం నుంచి వేరేదానికి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంటారు.

ఆయుష్మాన్ ఖురానా సినిమా ‘‘డాక్టర్ జీ’’ కథ ఇదీ. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.

మహిళలు ఫిమేల్ గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లేందుకు మాత్రమే ఇష్టపడతారని సినిమాలో ఆయుష్మాన్ ఒక డైలాగ్ చెబుతారు. దీనికి ప్రొఫెసర్ (షెఫాలీ షా) సమాధానం ఇస్తూ.. ‘‘ఇక్కడ మగ ఏంటి.. ఆడ ఏంటి.. డాక్టర్ అంటే డాక్టరే’’అని సమాధానం ఇస్తారు.

మరోవైపు లేబర్ రూమ్ (ప్రపవం చేసే గది)లోకి మగ డాక్టర్ వెళ్లినప్పుడు సదరు గర్భిణి కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తారు.

'నువ్వు మహిళల ప్రైవేటు పార్టుల్ని చూస్తున్నావని తెలిస్తే ఏమనుకుంటారు?' అని స్త్రీల వైద్యుడుగా పనిచేస్తున్న కొడుకును తల్లి ప్రశ్నిస్తుంది.

అయితే, ఇవన్నీ సినిమాలో చూస్తున్నప్పుడు బానే కనిపిస్తాయి. కానీ, వాస్తవంలో మగ గైనకాలజిస్టులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా? అసలు దీనిపై వారు ఏం అనుకుంటున్నారు?

రకుల్‌ప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, SPICE PR

ఆగ్రాలో గైనకాలజిస్టుగా డాక్టర్ అమిత్ టండన్‌కు మంచి పేరుంది. వైద్య వృత్తిలోకి ఎలా వచ్చారో తన కథను ఆయన బీబీసీకి వివరించారు. ‘‘మా చిన్నప్పుడు ఆగ్రాలో డాక్టర్ నవల్ కిశోర్ అగర్వాల్ గురించి చెప్పుకొనేవారు. నేపాల్ రాజు కూడా తన కుమార్తె ప్రసవ సమయం దగ్గరపడినప్పుడు కిశోర్‌కు కబురుపెట్టారు. ఆయన చాలా పెద్ద గైనకాలజిస్టు. పెద్దపెద్ద వ్యాపారవేత్తలు కూడా ఆయన దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొనేవారు. అప్పట్లోనే మేల్ గైనకాలజిస్టుగా ఆయనకు మంచి పేరుండేది. ఆయన స్ఫూర్తితో నేను కూడా వైద్యుడిని కావాలని అనుకున్నాను’’అని టండన్ వివరించారు.

అయితే, కెరియర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా టండన్ చెప్పారు. ‘‘నన్ను నేను నిరూపించుకోవాలనే పట్టుదల నాలో ఉండేది. మా అమ్మ కూడా గైనకాలజిస్టే. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆమెకు తెలుసు. అందుకే మహిళల అంతర్గత అవయవాల తనిఖీలు చెపట్టొద్దని ఆమె నాకు సూచించారు. ఎందుకంటే నేను అంతర్గత శరీర భాగాలను పరిశీలించేటప్పుడు, మహిళలు అసౌకర్యానికి గురికావొచ్చని ఆమె భావించేవారు’’అని ఆయన అన్నారు.

‘‘నిజానికి చాలామంది మహిళలు తమ కుటుంబంలోని పురుషులతో తప్పా, బయటి మగవారితో మాట్లాడరు. అదే నాకు కూడా వర్తించేది. పైగా అప్పట్లో నా వయసు కూడా కాస్త తక్కువగా ఉండేది. దీంతో వారు తమ సమస్యలు చెప్పడానికి మొహమాట పడేవారు’’అని ఆయన తెలిపారు.

‘‘కొన్నిసార్లు మహిళల బంధువులు అభ్యంతరాలు వ్యక్తంచేసేవారు. అది మరింత తలనొప్పిగా మారేది. అయితే ప్రసవం అనంతరం ఎలా సేవలు అందించామే ఆ మహిళలే తమ కుటుంబ సభ్యులకు చెప్పేవారు. అలా వారి ధోరణిలో మార్పు వచ్చేది’’అని ఆయన అన్నారు.

‘‘కీలకమైన సమయాల్లో సదరు మహిళ ప్రాణాలతోపాటు కడుపులోని బిడ్డల ప్రాణాలను కూడా మనం కాపాడతాం. మరోవైపు అవివాహితలైన అమ్మాయిల్లో కనిపించే గైనక్ సమస్యలను పరిష్కరిస్తాం. దీని ద్వారా వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తాం. అలా నెమ్మదిగా మనపై వారిలో నమ్మకం కలుగుతుంది. అప్పుడు మగ-ఆడ అనే తేడానే కనిపించదు’’అని ఆయన చెప్పారు.

ఆయుష్మాన్ ఖురానా

ఫొటో సోర్స్, @ayushmannk

డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఏం ఆలోచిస్తారు?

ఈ ప్రశ్నకు తను ఎదుర్కొన్న అనుభవాల సాయంతో డాక్టర్ పునీత్ సమాధానం ఇచ్చారు. ‘‘మనకు కొన్ని సామాజిక, సంస్కృతిక కట్టుబాట్లు లేదా నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భం, సంతాన సమస్యలు, అంతర్గత అవయవాల గురించి మగ డాక్టర్లతో మాట్లాడటాన్ని చాలా మంది సిగ్గుచేటుగా చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ మహిళల వ్యక్తిగత సమస్యలుగా భావిస్తారు. కానీ, సదరు వ్యక్తికి న్యుమోనియా వచ్చినా లేదా ఇతర సంతాన సమస్యలున్నా డాక్టర్ ఒకే కోణంలో చూస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లాలి అనుకుంటే.. శిక్షణ పొందిన నిపుణుల దగ్గరకు వెళ్లాలి. అంతేకానీ.. ఆడ, మగ తేడా చూడకూడదు’’అని ఆయన చెప్పారు.

బహుశా ఇదే విషయాన్ని ‘‘మేల్ టచ్’’గా డాక్టర్-జీ ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో ఒక దగ్గర ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ‘‘అసలు చాలా మంది రోగులు డాక్టర్‌ను డాక్టర్‌గా చూడరు. ఆయన మగవాడా? లేదా మహిళా? అని చూస్తారు’’అని అంటారు.

దీనిపై ప్రొఫెసర్ స్పందిస్తూ.. ‘‘మనం డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు మేల్ టచ్‌ను ఇంటిలోనే వదిలిపెట్టి రావాలి’’అని అంటారు.

ఇదే మేల్ టచ్ గురించి డాక్టర్ పునీత్‌ను ప్రశ్నించినప్పుడు.. ‘‘మహిళలతో ఎలా నడుచుకోవాలో మేల్ గైనకాలజిస్టులకు పూర్తి శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా మేం తనిఖీలు, పరిశీలనలు చేపట్టినప్పుడు, చుట్టుపక్కల ఫిమేల్ నర్సులు, డాక్టర్లు కూడా ఉంటారు. అవసరమైన వరకు మాత్రమే మేం బట్టలను తొలగిస్తాం. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎలా వ్యవహరించాలో మాకు పూర్తి శిక్షణ ఇస్తారు. ఇక్కడ జెండర్‌కు చోటు లేదు’’అని ఆయన అన్నారు.

షెఫాలీ షా

ఫొటో సోర్స్, SPICE PR

‘‘డాక్టర్ అంటే డాక్టరే’’

డాక్టర్-జీలో నటులు రకుల్‌ప్రీత్, షెఫాలీ షాలు ఫిమేల్ గైనకాలజిస్టులుగా నటించారు. దిల్లీలో పెరిగిన రకుల్‌ప్రీత్ కూడా ఈ విషయంలో తన వ్యక్తిగత అనుభవాలను వివరించారు.

‘‘ఇప్పుడు ఇలాంటి విషయాల్లో అపోహలూ తగ్గాయి. కానీ, నేను టీనేజీ వయసులో ఉన్నప్పుడు.. మేల్ గైనకాలజిస్టు దగ్గరుకు వెళ్లడానికి ఆలోచించేదాన్ని. ఒకేఒకసారి నేను గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లాను. ఆయన మగవారే. అసలు ఆయనకు నా సమస్యను ఎలా వివరించాలి? అని చాలా ఆలోచించాను. ఎందుకంటే ఇళ్లలో కూడా మహిళల ఆరోగ్యం గురించి మనం పెద్దగా మాట్లాడుకోం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది’’అని ఆమె చెప్పారు.

‘‘ఇదే విషయాన్ని మేం సినిమాలోనూ చూపించాం. డాక్టర్‌కు జెండర్ అనేదే ఉండదు. ఈ సినిమాతో విప్లవాత్మక మార్పులు వస్తాయని మేం ఆశించడంలేదు. ఇక్కడ వారికి వినోదం పంచడంతోపాటు కాస్త అవగాహన కల్పించగలిగితే చాలు. ఆ దిశగానే మేం ప్రయత్నించాం’’అని ఆమె వివరించారు.

ముంబయిలో పెరిగిన షెఫాలీ ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు.

‘‘నేను ఈ విషయంలో అస్సలు ఆలోచించను. డాక్టర్ అంటే డాక్టర్ అంతే. మేల్, ఫిమేల్, ట్రాన్స్‌జెండర్.. ఎలా ఏ జెండర్ అయితే మనకెందుకు? సినిమాలో ఆయుష్మాన్‌ను మేల్ టచ్ ఇంట్లో వదిలిపెట్టి రావాలని చెప్పినట్లే, మహిళలు కూడా తమ ఫిమేల్ టచ్‌ను ఇంట్లో వదిలిపెట్టి రావాలని చెబుతాను. సమాజం విషయానికి వస్తే, ఈ అంశంపై మా సినిమా చర్చకు దారితీస్తోంది. దీని వల్ల ప్రజల్లో మార్పులు రావాలని అనుకుంటున్నాను. నిజానికి ఇది చాలా పెద్ద బాధ్యత’’అని ఆమె అన్నారు.

మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఉత్తర భారత దేశంలో ప్రజలు ఎక్కువగా మహిళలను మేల్ డాక్టర్ల దగ్గరకు పంపించడానికి ఆలోచిస్తుంటారనే వాదనకు డాక్టర్ పునీత్, డాక్టర్ టండన్ కూడా అంగీకరించారు.

ఆయుష్మాన్ ఖురానా

ఫొటో సోర్స్, @ayushmannk

కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది..

మేల్ గైనకాలజిస్టులు విధి నిర్వహణలో భాగంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.

గైనకాలజీ సమస్యలను సాధ్యమైనంతవరకు మహిళా డాక్టర్లే చూడాలని రాజస్థాన్ ప్రభుత్వం 2016లో ఒక ఆదేశాన్ని జారీచేసింది. దీనిపై డాక్టర్ల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

2010లోనూ ఇలాంటి వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. అప్పుడే గైనకాలజిస్టులు ఆడవారు మాత్రమే అయ్యుండాల్సిన అవసరంలేదని, అసలు ఈ విషయంలో జెండర్‌ను చూడకూడదని కోర్టు చెప్పింది.

సుల్తాన్‌పుర్‌లో గైనకాలజిస్టు నియామకం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన ఈ వివాదంలో.. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో ఒక పురుష డాక్టర్లు అప్పట్లో కోర్టు తలుపుతట్టారు.

భారత్‌లో మగవారు గైనకాలజిస్టులుగా అడ్డుకునేందుకు ఎలాంటి చట్టాలూలేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ జయేశ్ లేలే చెప్పారు. ‘‘కానీ, మేల్ గైనకాలజిస్టుల విషయంలో కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్గత భాగాలను తనిఖీ చేసేటప్పుడు సదరు మహిళ అనుమతులు తీసుకోవాలి’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

ఒక్కరే గైనకాలజీలో..

ఇక మళ్లీ మనం డాక్టర్-జీ సినిమా విషయానికి వస్తే, దీనికి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. కథను సౌరభ్ భరత్ అందించారు.

సౌరభ్ భరత్‌కు బీడీఎస్ డిగ్రీ పట్టా ఉంది. ఆ తర్వాత, ఆయన తన డాక్టరేట్‌ను మధ్యలో వదిలిపెట్టి సినిమాల్లోకి వచ్చేశారు.

ఈ కథ వెనుక మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. సౌరభ్ భార్య గైనకాలజిస్టు. మెడిసిన్ చదివేటప్పుడు ఆమెను కలవడానికి సౌరభ్ వెళ్లేవారు. అక్కడ గైనకాలజీ విభాగంలో ఒకే అబ్బాయి ఉండేవారు. అప్పుడే అసలు ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతుంటారనే ఆలోచన సౌరభ్‌కు వచ్చింది. అలా కథ మొదలైంది.

ఆ తర్వాత 2015లో కన్నడ సినిమా చమక్‌ను చూసినప్పుడు అందులో హీరో గైనకాలజిస్టుగా ఆయనకు కనిపించారు.

ఈ కథ కాస్త భిన్నంగా ఉండేటప్పటికీ, మహిళలు లేదా జంటలకు సాయం చేసినప్పుడు సదరు డాక్టర్ ఎలా ఫీలవుతారో ఆ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ప్రసవంలో బిడ్డను కోల్పోయినప్పుడు ఆ డాక్టర్ చాలా వేదనకు గురవుతుంటారు.

ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన అభవాలను డాక్టర్ పునీత్ బేడీ గుర్తుచేసుకుంటూ.. ‘‘నాకు పిల్లలు ఎలా పుడతారనే అంశంపై చాలా ఆసక్తి ఉండేది. అలా నేను గైనకాలజీ వైపు వచ్చాను. మా నాన్నమ్మ బిడ్డకు జన్మనిస్తూ చనిపోయారు. డాక్టర్ ఒక ప్రాణాన్ని కాపాడగలరు.. కానీ, గైనకాలజిస్టు ఒక కుటుంబం మొత్తాన్ని కాపాడగలరు అని మా నాన్న చెప్పేవారు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్న గర్భవతులు, నవజాత శిశువులు...
లైను
  • డాక్టర్లపై వచ్చే ఆరోపణలపై విచారణకు ఐఎంఏ ఒక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటుచేసింది.
  • ప్రసవ సమయంలో గర్భిణి చనిపోతే చాలాసార్లు వైద్యులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
  • ఈ ఏడాదిలో రాజస్థాన్‌లో ఒక గైనకాలజిస్టు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
లైను
రాజస్థాన్

ఎన్నో సవాళ్లు..

ఇక్కడ పురుషులైనా లేదా మహిళలైనా గైనకాలజిస్టుగా మారేటప్పుడు జీవితాంతం ఏ సమయంలోనైనా సేవలు అందిస్తామని ప్రమాణం చేస్తామని డాక్టర్ పునీత్ బేడి వివరించారు.

‘‘హోలీ కావచ్చు.. లేదా దీపావళి కావొచ్చు.. మనం 24 గంటలూ అందుబాటులో ఉండాలి. నేను ఇదే విభాగంలో 25ఏళ్లుగా పనిచేస్తున్నాను. సమయంతో సంబంధం లేకుండా మనం పనిచేయాలి. ప్రసవం ఏ సమయంలోనైనా మొదలుకావొచ్చు. మనం పార్టీలకు వెళ్లొచ్చు. కానీ, ఎప్పుడూ మద్యం తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ బిడ్డ ఏదైనా సమస్యలతో జన్మిస్తే, చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి’’అని ఆయన అన్నారు.

ఇలాంటి ఒక హైప్రొఫైల్ కేసులో రాజస్థాన్‌లో ఫిమేల్ గైనకాలజిస్టు అర్చనా శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కేసులో ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఒక మహిళ చనిపోయారు. దీనిపై స్థానిక నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఆ డాక్టర్‌పై ఐపీఎస్‌లోని సెక్షన్ 302 (హత్య) ఆరోపణలు మోపారు. దీంతో ఆ డాక్టర్ కుంగుబాటుకు గురై తన ప్రైవేటు ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె ఒక భావోద్వేగ నోట్‌ రాశారు. ‘‘నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా. నేను చనిపోయిన తర్వాత వారిని వేధించొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎవరినీ హత్య చేయలేదు. ఇలా వైద్యులను వేధించడం ఆపాలి’’అని ఆమె కోరారు.

వీడియో క్యాప్షన్, తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇదీ..

డాక్టర్, రోగి మధ్య సంబంధం ముఖ్యం..

ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ వృత్తిలో అత్యుత్తమమైన అంశం ఏమిటి అని ప్రశ్నిస్తే.. ‘‘ఇది చాలా స్వచ్ఛమైన, వెలకట్టలేని నమ్మకం లాంటిది. ఇక్కడ తన వ్యక్తిగత అంశాలను తెలుసుకునేందుకు మహిళా రోగి మనకు అనుమతిస్తారు. ఆమె మనల్ని నమ్మి తన సమస్యలు చెబుతారు. తన అంతర్గత అవయవాల పరిశీలనకు కూడా అనుమతిస్తారు. ఈ నమ్మకం నిజంగా అద్భుతమైనది. కానీ, ఎన్నో ఏళ్లపాటు కష్టపడి సేవలు అంచిన తర్వాత మాత్రమే ఈ నమ్మకాన్ని మనం సంపాదించగలం’’అని డాక్టర్ టండన్ అన్నారు.

‘‘ఆ నమ్మకాన్ని గెలుచుకునేందుకు మేల్ గైనకాలజిస్టులు మరింత ఎక్కువ కృషిచేయాలి. ఆపరేషన్ తర్వాత కుట్ల దగ్గర నొప్పి తగ్గిందని ఆ మహిళ చెప్పినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ల్యాప్రోస్కోపీతో మెరుగ్గా శస్త్రచికిత్స నిర్వహించినప్పుడు సంతృప్తిగా ఉంటుంది. అమ్మాయిల గైనిక్ సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాత వారి జీవితం మెరుగవుతుంది. నిజంగా ఇవన్నీ మనలో సంతృప్తిని పెంచుతాయి’’అని డాక్టర్ పునీత్ కూడా వివరించారు.

ఈ సినిమాతో మహిళల ఆరోగ్యం, మేల్ గైనకాలజిస్టుల విధి నిర్వహణపై ప్రజల్లో అవగాహన వస్తుందని డాక్టర్ టండన్ భావిస్తున్నారు.

అయితే, సినిమా ఎలా ఉన్నా.. ఒక విషయం మాత్రం తను స్పష్టంగా చెప్పాలని భావిస్తున్నానని డాక్టర్ పునీత్ అన్నారు. ‘‘ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, మహిళల ఆరోగ్యాలను చాలా సమస్యలు వేధిస్తుంటాయి. వీటిపై వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. ఇక్కడ మగ లేదా ఆడ అని జెండర్‌ను పట్టించుకోకూడదు. ఈ ప్రపంచంలోకి ఒక బిడ్డకు స్వాగతం పలకడం అనేది చాలా గొప్ప బాధ్యత. దీనిలో మహిళల ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ జెండర్‌ వివక్షకు చోటు ఉండకూడదు’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)