Baby Bathing: పురిటి బిడ్డకి మొదటి స్నానం ఎప్పుడు చేయించాలి.. ఎలా చేయించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలేంటి

నవజాత శిశువుకు స్నానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవజాత శిశువుకు స్నానం
    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

అసలు తొందరేమీ లేని విషయమిది. కానీ లక్షా తొంభై అనుమానాలు.. అవకతవకలతో కూడుకున్న పని ఇది. వివిధ ప్రాంతీయ, సంప్రదాయ, (మూఢ)నమ్మకాలతో కూడుకున్న హంగామా అంతా పసిబిడ్డపై ప్రదర్శించే తొలి ఘట్టం ఇదే.

"ఏమోనమ్మా! ఆ కాన్పు కంపు అంతా వదిలేలా కడిగేయకుండా బిడ్డను ఇంటికి ఎలా తీసుకెళ్లడం?!" అత్తయ్య అంటుంది.

"నువ్వు పుట్టగానే స్నానం పోసింది హాస్పిటల్లో ఆయమ్మే. నీళ్లు పోసి గానీ చేతికి ఇచ్చేవారు కాదు. అప్పట్లోనే నయం." అమ్మ వాపోయింది.

"నా మోకాళ్లు బావుంటే నేనే పోయక పోదునూ నా మునిమనవడికి ...ప్చ్.."అమ్మమ్మ కూడా ఆయమ్మను అడుగుతూ ఉంది.

"అబ్బబ్బా...అసలీ రోజు స్నానం వద్దని పిల్లల డాక్టరు చెప్పారుగా... వాడినిలా నా పక్కన పడుకోబెట్టండి చాలు" అంటుంది అప్పుడే అమ్మయిన అంజలి.

ఇలాంటి స్నానం సందడికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఈ వ్యాసం.

వీడియో క్యాప్షన్, 12 ఏళ్లలో 8 సార్లు గర్భస్రావం.. ఎలా తట్టుకున్నానంటే..

ముందుగా మీకు తెలియాల్సింది:

మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం చర్మం. నవజాత శిశువుల్లో దీని నిష్పత్తి మరింత ఎక్కువ. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడే రక్ష అది. శరీర ఉష్ణోగ్రత - తేమ, స్పర్శ లాంటి కీలక బాధ్యతలూ చర్మానివే.

బాహ్య సౌందర్యం మాట పక్కనపెడితే, శరీరం లోపలి ఆరోగ్యానికి సూచిక చర్మంలోని తేజస్సు. అందుకే, అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో చర్మ సంరక్షణ చాలా బాధ్యతతో చేయాల్సిన విషయం. లేదంటే ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు మొదలు దీర్ఘకాలిక అలర్జీల వరకూ పిల్లలకు వివధ అవస్థలు తప్పవు.

పసిబిడ్డ చర్మం పువ్వుకన్నా నాజూకు

అవును. అప్పటివరకూ తల్లికడుపులో వెచ్చని జలకాలాడి బయటకు దూకిన శిశువు చర్మం పూర్తిగా మనలా అవ్వాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ముఖ్యంగా పై పొర(stratum corneum) మన చర్మంకన్నా పలుచగా ఉండటం వలన శిశువు శరీరంలోంచి వేడి, తేమ వేగంగా కోల్పోతుంది.

అంతే కాకుండా మన చర్మంకంటే ఎక్కువ క్షారీయమై (alkaline) ఉంటుంది కాబట్టి సూక్ష్మ క్రిములను నిలువరించలేదు. లోపలి పొరలు సైతం మన చర్మంకన్నా పలుచనే. అందుకే శిశువు చర్మం అత్యంత కోమలం.

అప్పుడే పుట్టిన శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పుడే పుట్టిన శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది

అసలు పుట్టిన వెంటనే ఏం చేయాలి?

బిడ్డ పుట్టిన వెంటనే శుభ్రమైన, వెచ్చని, మెత్తని పొడిగుడ్డతో తలనుండి క్రిందవరకూ తడిలేకుండా తుడిచి, తల్లి పొట్టపై స్తనాల మధ్యగా పడుకోబెట్టి, మరొక పొడి బట్ట కప్పాలి. అక్కడక్కడా ఉన్న రక్తపు మరకలు,వెర్నిక్స్( మైనం) లాంటివి తుడవనవసరం లేదు.

పుట్టిన రోజే స్నానం అవసరమూ లేదు. తప్పనిసరి అనుకుంటే కనీసం ఆరుగంటల తర్వాత స్నానం చేయించాలి. అప్పటి వరకూ బిడ్డను నీళ్లలో ముంచటం, నూనె రాయడం,వెర్నిక్స్ ను తుడిచివేయడం వంటివి చేయక్కరలేదు.

నవజాత శిశువు బరువుతో పోల్చితే చర్మం చాలా ఎక్కువ భాగం ఉంటుంది (surface area) అందువల్ల శరీరం చాలా వేగంగా తేమను , వేడిని కోల్పోతుంది శిశువు. దాన్ని నివారించడానికి వెర్నిక్స్ చాలా అవసరం.

అలాగే ఈ మైనంలో ఉండే కొన్ని రకాల ఎంజైములు శిశువుకు సూక్ష్మక్రిముల హాని లేకుండా కాపాడతాయి.

కొద్ది గంటల తర్వాత తేలికపాటి నూనెలో అద్దిన నూలు వస్త్రంతో బిడ్డను శుభ్రపరిచి బట్టలు తొడిగితే సరిపోతుంది. తలటోపీ, కాళ్ల, చేతుల తొడుగులు కూడా వేయాలి. లేదంటే ముఖం తప్ప మిగతా శరీరాన్నంతా అంతా మూడు నాలుగు పొరల బట్టతో చుట్టి ఉంచాలి.

మరునాడు, ఇంకా వీలైతే బొడ్డుతాడు ఎండి, రాలి పోయాక (సాధారణంగా ఐదవ రోజు) మొదటి స్నానం చేయించవచ్చు. అప్పటి వరకూ తడి బట్టతో శుభ్రపరచాలి.

సబ్బులు చర్మంపై సహజంగా ఉండే సూక్ష్మ జీవులకు హాని కలిగించనివై ఉండాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సబ్బులు చర్మంపై సహజంగా ఉండే సూక్ష్మ జీవులకు హాని కలిగించనివై ఉండాలి

ఎలాంటి నీటితో స్నానం చేయించాలి?

"కరెంటుకు కాగిన నీళ్లయితే (గీజర్, హీటర్ కాయిల్) పిల్లలు నల్లబడతారు. కట్టెల పొయ్యి మీద లేదా గ్యాస్ స్టవ్ మీద కాచిన నీళ్లయితే మంచిది" అనటం వినేవుంటారు. అదంతా వట్టి మాట.

కంటికి కనపడే నలకలేమీ పరిశుభ్రమైన నీటిని చక్కగా పొగలొచ్చేంతగా (100 ℃) కాచి, గోరువెచ్చగా అయ్యేంత వరకూ ఆగి ఆ నీటితో చంటి బిడ్డకు స్నానం చేయించాలి.

బాగా కాగిన వేడినీటిలో, చల్లని నీరు చేర్చి, గోరువెచ్చగా చేయటం సరైన పద్ధతి కాదు. బిడ్డ శరీరాన్ని తాకే ప్రతి నీటి బొట్టూ మసలకాగి చల్లారినదైతే చాలావరకు సూక్ష్మ క్రిములు నశిస్తాయి.

బాగా వేడి చేసి గోరు వెచ్చగా మారిన నీటితో స్నానం చేయించాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాగా వేడి చేసి గోరు వెచ్చగా మారిన నీటితో స్నానం చేయించాలి

సరైన క్లెన్సర్ ను/ సబ్బును ఎంచు కోవడం ఎలా?

1. అతి తక్కువ ఆమ్లగుణం (5.5 ౼ 7 pH ) కలిగినదై ఉండాలి.

2. ధృవీకరించిన కృత్రిమ రసాయనాలు, పరిమళ రసాయనాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి.

3. తేలికపాటి నురగ వచ్చేదై ఉండాలి. గాఢత ఎక్కువగా ఉన్న సర్ఫక్టంన్ట్ లను (sodium lauryl sulphate) ఎన్నుకోవద్దు.

4. పసిపిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసినదై ఉండాలి.

5. ముందే వాడిన అనుభవం ఉన్న బ్రాండ్లను ఎన్నుకోండి. ( ప్రయోగాలు పసి పిల్లలపై కూడదు)

6. చర్మంపై సహజంగా ఉండే సూక్ష్మ జీవజాలానికి హాని కలిగించనిదై ఉండాలి( యాంటీ సెప్టిక్ మంచిదని అదేపనిగా వాడేయకూడదు)

రోజుకు ఎన్నిసార్లు స్నానం చేయించాలి?

పూర్తి ఆరోగ్యంతో పుట్టిన నవజాత శిశువుకైతే రోజుకు ఒక్కసారి స్నానం, సాయంత్రం వెచ్చని తడిబట్టతో తుడవడం చాలు. మన దక్షిణ భారత ప్రాంతాల్లో చలి కాలం సైతం రోజూ చేయించవచ్చు (మరీ విపరీతమైన చలి ఉండదుగా) మహా అయితే కాస్త ఎండ పడ్డ వేళ స్నానం చేయిస్తే సరిపోతుంది.

పది నిముషాల్లో స్నానం ప్రక్రియ ముగించాలి. మొదటి రెండు, మూడు నెలలూ ఇదే పద్ధతి. వారంలో ఒకటి రెండు సార్లు తలస్నానం చాలు.

స్నానం తర్వాత వెల్లుల్లి, సాంబ్రాణి ధూపాలు వేయడం మంచిది కాదు. సంప్రదాయం పద్ధతులనుకుంటే, తల్లి బిడ్డలను ఉంచే గదిలో కొద్ది నిమిషాలు ధూపం ఉంచి తర్వాత తలుపులూ, కిటికీలు తెరచి ఉంచి తాజా గాలి ప్రసరించనీయండి.

కుంపటి నిప్పుల సామ్రాణి ధూపం పై బిడ్డను సరాసరి తిప్పడం వల్ల పొగ ఊపిరితిత్తుల్లోకి పోవడం వల్ల చర్మం కాలడం లాంటి ప్రమాదాలే ఎక్కువ.

సంప్రదాయం పేరుతో వేసే ధూపదీపాలు ఎక్కువగా వేస్తే ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సంప్రదాయం పేరుతో వేసే ధూపదీపాలు ఎక్కువగా వేస్తే ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు

అనారోగ్యంతో ఉన్నప్పుడు?

ఇందులో మొదట మాట్లాడుకోవలసిన విషయం ౼ నెలలు తక్కువ, బరువు తక్కువ ఉన్న నవజాత శిశువుల గురించి. 32 వారాల వయసు కంటే తక్కువ ఉన్న శిశువులను వెచ్చని నీటితో మాత్రమే తుడవాలి.

ఆరోగ్యం, మెచ్యూరిటీ సరిగా ఉండీ, బరువు మాత్రమే తక్కువగా ఉన్న బిడ్డల విషయంలో సబ్బు వాడవచ్చుగానీ శరీర ఉష్ణోగ్రత విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి.

ఏ విధమైన అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువు నైనా ఆరోగ్య సిబ్బంది అవసరానికి అనుగుణంగా శుభ్రం చేస్తారు. పుట్టు కామెర్ల వంటివి స్నానం చేయించడానికి మినహాయింపేమీ కాదు.

జలుబు, రొంప లాంటివి ఉన్నప్పుడు స్నానం చేయించడంలో వెనకడుగు వేయాల్సిన పని లేదు. బిడ్డ సౌఖ్యానికి అనుగుణంగా వ్యవహరిస్తే సరి.

వీడియో క్యాప్షన్, మొసలి మెడలో ఇరుక్కున్న టైరు.. ఆరేళ్ల తర్వాత..

చివరగా మరికొన్ని జాగ్రత్తలు

1. స్నానం తర్వాత బొడ్డుపై, చెవుల్లో, ముక్కుల్లో నూనె చుక్కలు వేయకూడదు.

2. నోటిని ప్రత్యేకించి శుభ్రం చేయనవసరం లేదు.

3. బిడ్డను పూర్తిగా నీటిలో ముంచి తీయడం ఇలాంటి పద్ధతులు వీడండి.

4. పసుపు, వేప, తులసి, సున్నిపిండి వంటివి సైతం మొదటి మూడు నెలలు వద్దు.

5. నూనె మర్దనలు వద్దు, సున్నితంగా నూనె రాయడం వరకే సరిపెట్టండి.

6. సబ్బు, షాంపూ, నూనె లాంటివి తరచూ బ్రాండ్లు మార్చకండి.

7. ఒకరికి సరిపడిన సబ్బు/షాంపూ మరొకరికి పడకపోవచ్చు. అలాంటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి.

8. స్వచ్ఛత అన్న పేరుతో మరీ పచ్చి/ శుద్ధి చేయని నూనెలు వాడకండి. ఇవి చర్మ వ్యాధులకు దారి తీయవచ్చు.

9. చర్మం మడతలను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. అలా అని తరచూ ఆల్కహాల్/ యాంటీసెప్టిక్ టిష్యూలతో తుడవకండి

10. బిడ్డ చర్మంపై గానీ, బొడ్డు వద్ద గానీ ఏ మాత్రం రంగుమారినా, స్రావాలు కనిపించినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించండి.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)