ఉత్తరప్రదేశ్‌లో 2017 తరువాత 'అల్లర్లు జరగలేద'న్న యోగి ఆదిత్యనాథ్ మాటల్లో నిజమెంత - BBC RealityCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రుతి మేనన్, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్, విజువల్ జర్నలిజం
ఉత్తరప్రదేశ్‌లో గత అయిదేళ్లలో ఎలాంటి అల్లర్లూ జరగలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత వారం అన్నారు.
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి మిగతా వాదనలను మేం పరిశీలించాం.
వాదన: గత అయిదేళ్లల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లూ జరగలేదు
ఫ్యాక్ట్ చెక్: అల్లర్ల సంఖ్య తగ్గిందన్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఈ వాదన తప్పు.
తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఇటీవల విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది చెప్పారు.
గతంలో కొందరు బీజేపీ నేతలు కూడా ఇలాంటి వాదనలు చేశారు.
రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, మతపరమైన ఘర్షణలకు సంబంధించిన పూర్తి అధికారిక గణాంకాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా అందిస్తుంది.

ఈ గణాంకాల ప్రకారం, 2018 నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లో మతపరమైన అల్లర్లు జరగలేదు. కానీ, 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ రాష్ట్రంలో 195 మతపరమైన ఘటనలు నమోదయ్యాయి.
కానీ, యూపీలో జరిగిన మొత్తం అల్లర్లకు సంబంధించిన గణాంకాలు మరో చిత్రాన్ని చూపిస్తున్నాయి.
2017లో రాష్ట్రంలో అల్లర్ల కేసులు తగ్గడం కనిపించింది. కానీ 2019-2020 మధ్య అవి 7.2 శాతం పెరిగాయి.
భారత్‌లో అత్యధికంగా అల్లర్లు జరిగిన రాష్ట్రాల్లో యూపీ మహారాష్ట్ర, బిహార్‌తో కలిసి టాప్ 5లో కనిపించింది.
2016లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏడాది ముందు రాష్ట్రంలో 8106 అల్లర్ల కేసులు నమోదయ్యాయి.
తర్వాత 2017లో ఈ కేసుల సంఖ్య 8,900కు, 2018లో 8,908కి పెరిగింది. 2020లో 6,126కు తగ్గింది.

వాదన: యోగి ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ దాదాపు 60 శాతం తగ్గింది
ఫ్యాక్ట్ చెక్: ఇది తప్పు.
తగ్గడం మాట నిజమేగానీ, వారు చెబుతున్నంత కాదు. అయితే, తగ్గాయి కాబట్టి దీన్ని మనం అర్థ సత్యంగానే పరిగణించాలి.
పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ప్రసంగిస్తూ హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో నేరాల సంఖ్య 60 శాతం తగ్గిందని చెప్పారు.
ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం, నేరాలను రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఒక కేటగిరీలో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వచ్చే నేరాలను రికార్డు చేస్తారు.
ప్రత్యేక చట్టం (స్పెషల్ లా) లేదా స్థానిక చట్టం (ఎస్ఎల్ఎల్) కింద వచ్చే నేరాలను సంమరో కేటగిరీలో నమోదు చేస్తారు.
నార్కోటిక్స్ లేదా గాంబ్లింగ్ లాంటి నిర్దిష్ట అంశాలకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక చట్టాలను రూపొందించిం. స్థానిక చట్టాలు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం లేదా ప్రాంతం వరకే ఉంటాయి.
2017 తరువాత రాష్ట్రంలో ఐపీసీ కింద నమోదయ్యే నేరాలు పెరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ డేటా చెబుతోంది.

తులనాత్మక విశ్లేషణ కోసం 2013, 2020 మధ్య డేటాను పరిశీలించాం. అంటే అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో చివరి నాలుగు సంవత్సరాలు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మొదటి నాలుగు సంవత్సరాల డేటాను పోల్చి చూశాం.
2013-2016 మధ్య ఐపీసీ కింద మొత్తం 9,91,011 నేరాలు నమోదయ్యాయి. తరువాతి నాలుగు సంవత్సరాలలో ఈ సంఖ్య 13,60,680కి పెరిగింది. అంటే 37 శాతం పెరిగింది.
అఖిలేశ్ పాలనలో స్థానిక చట్టాల కింద రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 35,14,373 కాగా, బీజేపీ పాలనలో ఈ సంఖ్య 24,71,742కు తగ్గింది. అంటే 30 శాతం తగ్గింది.
నేరాలు ఎలా నమోదు చేస్తారు అనే దానిలో మార్పు వీటిలో తగ్గుదలను వివరిస్తుంది.
2012, 2013లో స్పెషల్, లోకల్ లాస్ ప్రకారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే అప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేని కేసులు వీటిలో ఉంటూ వచ్చాయి.
వాటిలో మోటార్ వెహికల్స్ చలానాలు, పోలీస్ యాక్ట్, సిటీ పోలీస్ యాక్ట్ లాంటివి ఉంటాయి.
2014లో యూపీ, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎస్ఎల్ఎల్ నేరాలు 80 శాతం వరకూ తగ్గాయి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేని, మేజిస్ట్రేట్ ప్రమేయం లేని నేరాలను వీటినుంచి మినహాయించారు.
దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం అయిన యూపీ, అత్యధిక క్రైమ్ రేటు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. 2020లో అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
వాదన: నేను అయిదేళ్ల యోగి పాలనను, మీ పదవీ కాలాన్ని (అఖిలేశ్) పోల్చి చూశాను. యోగి పాలనలో దోపిడీలు 70 శాతం, హత్యలు 30 శాతం తగ్గాయి. వరకట్న హత్యలు కూడా 22.5 శాతం తగ్గాయి.'
ఫ్యాక్ట్ చెక్: ఇవి తగ్గాయి. కానీ, అక్కడ చెప్పినంత తగ్గలేదు.
ఇది కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో చేసిన వాదన.
బీజేపీ నాలుగేళ్ల పాలనలో దోపిడీలు గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే కానీ, అది 70 శాతం కాదు. ఎన్‌సీఆర్‌బీ గణాంకల ప్రకారం అవి 51 శాతం తగ్గాయి.
సమాజ్‌వాదీ పార్టీ మొత్తం పదవీ కాలం (2012-16)తో, బీజేపీ పాలన కాలాన్ని (2017-20) పోల్చి చూస్తే ఈ రేటు 57 శాతానికి తగ్గినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.
ఇదే సమయాల్లో నమోదైన హత్య కేసులు కూడా తగ్గాయి. 2013-16తో పోల్చి చూస్తే 2017-20లో హత్యలు 20 శాతం తగ్గాయి.
కానీ వరకట్న మరణాలు తగ్గడానికి బదులు స్వల్పంగా 0.4 శాతం పెరిగింది.

వాదన: ఇక్కడ ఒకప్పుడుఅల్లర్లు ఎక్కువగా ఉండడమే కాక, మన ఆడపిల్లలను చదువు కోసం వేరే ప్రాంతాలకు పంపించాల్సి వచ్చేది. ఎందుకంటే, ఇక్కడ వారికి భద్రత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పశ్చిమ యూపీలోని ఏ ఆడపిల్లా చదువు కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్లతో ఎవరూ తప్పుగా ప్రవర్తించే ధైర్యం చేయలేరు.
ఫ్యాక్ట్ చెక్: అధికారిక గణాంకాల ప్రకారం మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఎన్నికల ర్యాలీలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ అవి ఎలాంటి నేరాలు అనేది ఆయన చెప్పలేదు.
అయితే, ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో మహిళలపై జరిగే నేరాలను వివిధ కేటగిరీల కింద విభజిస్తారు. వరకట్న హత్యలు, అత్యాచారం తరువాత హత్య, భర్త పెట్టే హింస, అపహరణలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటివి ఇందులో ఉంటాయి.

2013-2016 మధ్య మహిళలపై నేరాల సంఖ్య 1,56,634 కాగా, 2017-2020 మధ్య ఈ సంఖ్య 2,24,694కి పెరిగింది. అంటే 43 శాతం పెరుగుదల ఉంది. అయితే, 2019-2020 మధ్య రాష్ట్రంలో మహిళలపై నేరాలు 17 శాతం తగ్గాయి.
కానీ, రాష్ట్రంలో 2019-2020 మధ్య మహిళలపై జరిగే నేరాల్లో 17 శాతం తగ్గుదల కనపించింది. కానీ ఇక్కడ ఇలాంటి నేరాలు దేశంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. యూపీ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉన్నాయి.
కానీ, మహిళలపై నేరాల విషయంలో ఉత్తర్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత వరుసలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, అసోం ఉన్నాయి.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఇటీవల అందించిన ఒక రిపోర్టు ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.
2021లో తమకు మొత్తం 31,000 ఫిర్యాదులు అందాయని, వాటిలో సగానికిపైగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చినవేనని ఎన్‌సీడబ్ల్యూ నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
- WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










