అపర్ణ యాదవ్: బీజేపీలో చేరిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలి కథ

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
ఐపీఎస్ అధికారి అసీం అరుణ్‌తోపాటు ఆమె గత వారమే లఖ్‌నవూలో బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను మొదట ఆమె సన్నిహితులు ఖండించారు.
మరోవైపు బీజేపీలో ఆమె చేరికపై లఖ్‌నవూ కంటోన్మెంట్ సీటు నుంచి గతంలో పోటీచేసిన రీటా బహుగుణ జోషి మీడియాలో అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచే అపర్ణ పోటీ చేయాలని భావిస్తున్నారు.
బీజేపీతోపాటు యోగి ఆదిత్యనాథ్‌తో అపర్ణకున్న దగ్గర సంబంధాలపై గతంలోనూ వార్తలు వచ్చాయి.
2017 మార్చి 31న సరోజినీనగర్‌లోని అపర్ణకు చెందిన గోశాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. అప్పుడే ఆమె బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై గతంలో ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రస్తుతం చేస్తున్న పనిపై దృష్టిపెట్టాలని పెద్దలు చెబుతారు. భవిష్యత్‌లో ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ ఆమె సమాధానాన్ని దాటవేశారు.
ఆ ఘటనకు ఐదేళ్ల తర్వాత ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. అపర్ణ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణాల్లో లఖ్‌నవూ కంటోన్మెంట్ సీటు కూడా ఒకటి. 2017లో ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై పోటీ చేశారు. అయితే, అపర్ణ ఓడిపోయారు.
ప్రస్తుతం ఈ సీటును తన కుమారుడికి ఇవ్వాలని రీటా డిమాండ్ చేశారు. లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, ANI
లఖ్‌నవూ కంటోన్మెంట్ సీటు..
ఈ సీటు నుంచే పోటీ చేస్తానని మొదట్నుంచీ అపర్ణ భీష్మించుకుని కూర్చున్నారు. 2017లో ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్‌లను కాదని అఖిలేశ్ అపర్ణకు ఈ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలు కూడా వచ్చాయి.
టికెట్ ఇవ్వడంతోపాటు ఆమెకు మద్దతుగా అఖిలేశ్ ప్రచారం కూడా చేశారు. కానీ అపర్ణ 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆమె భావించారు. అయితే, ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ సుముఖత వ్యక్తం చేయలేదు.
ఈ సారి అపర్ణ కంటే స్థానిక కౌన్సెలర్ రాజు గాంధీని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం మేలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. అయితే, ‘‘జీవ్ అశ్రయ’’ పేరుతో ఒక ఎన్జీవోను పెట్టి గత తొమ్మిది-పదేళ్లుగా ఈ నియోజకవర్గంలో అపర్ణ సేవలు అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, APARNA BISHT YADAV FB PAGE
వీధుల్లోని అవులు, గేదెలు, కుక్కలను తీసుకెళ్లి కన్హా సంరక్షణ కేంద్రంలో ఆమె ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎన్జీవో ద్వారా తను చేస్తున్న సేవల వల్ల తను గెలుస్తానని ఆమె భావిస్తున్నారు.
‘‘అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడం వల్ల సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం ఉండకపోవచ్చు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తల్లోనూ సంతోషం ఉండదు. ఎందుకంటే ఆ సీటు ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఒకే సీటుకు ఇద్దరు గట్టి అభ్యర్థులు వచ్చి పడ్డారు’’అని ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ విశ్లేషకుడు శారద్ గుప్తా వ్యాఖ్యానించారు.
‘‘సమాజ్‌వాదీ టికెట్‌పై అపర్ణ పోటీచేసి గెలవడం కష్టం. అదే బీజేపీ టికెట్‌పై పోటీచేస్తే ఆమె తేలిగ్గానే విజయం సాధిస్తారు’’ అని అన్నారు.
ఎస్పీ ఎప్పుడూ గెలవలేదు
ఇక్కడున్న 3.15 లక్షల మంది ఓటర్లలో 60 వేల మంది బ్రాహ్మణులు, 50 వేల మంది దళితులు, 40 వేల మంది వైశ్యులు, 30 వేల మంది వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎస్పీ ఎప్పుడూ గెలవలేదు. ఇది బీజేపీకి కంచుకోట లాంటిది. దీంతో బీజేపీలో చేరడంతో అపర్ణ యాదవ్‌కు మేలే జరుగుతుంది.
‘‘శివ్‌పాల్ యాదవ్‌తో చర్చల్లో చేసిన తప్పులను తాజాగా బీజేపీ సరిదిద్దుకున్నట్లు అయ్యింది. అపర్ణ చేరికతో పెద్దగా ఓట్లు తారుమారు కాకపోవచ్చు. కానీ సొంత కుటుంబ సభ్యులను కూడా అఖిలేశ్ సరిగ్గా చూసుకోలేకపోతున్నారని దీనితో తేలుస్తుంది’’అని సీనియర్ జర్నలిస్టు రామ్‌దత్ త్రిపాఠి వ్యాఖ్యానించారు.
బహిరంగ వేదికలపై అఖిలేశ్ యాదవ్ గురించి మాట్లాడేటప్పుడు అపర్ణ యాదవ్ చాలా గౌరవంతో వ్యవహరించేవారు. అయితే, తాజా పరిణామాల తర్వాత ఆమె ఎలా నడచుకుంటారనేది ఆసక్తికరంగా మారనుంది.

ఫొటో సోర్స్, APARNA YADAV FB PAGE
అత్తగారి అడుగు జాడల్లో..
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య, తన అత్తగారు అయిన సాధనా గుప్త పర్యవేక్షణలో అపర్ణ ముందుకు వెళ్తుంటారని లఖ్‌నవూ రాజకీయ చర్చల్లో చెప్పుకుంటుంటారు. తన కుమార్తె ములాయం కుటుంబ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తుందని అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ కూడా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు.
‘‘2007లో ములాయం తర్వాత పార్టీని అఖిలేశ్ నడిపిస్తారని ఓ వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో ములాయం రెండో భార్య సాధన నిరసన వ్యక్తం చేస్తున్నారని కథనంలో పేర్కొన్నారు. అయితే, ఆ వార్త తర్వాత ఆ పత్రికపై చర్యలు తీసుకున్నారు. ఓ వివరణను కూడా ఆ పత్రిక ప్రచురించాల్సి వచ్చింది.
అపర్ణను సాధన మొదట్నుంచీ ప్రోత్సహిస్తున్నారు. 2014లో అపర్ణ భర్త, తన కుమారుడు అయిన ప్రతీక్ యాదవ్‌ను కూడా ఆమె ఆజంగఢ్ నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే, రాజకీయాలపై ఆయనకు అంత ఆసక్తి లేదు’’అని లఖ్‌నవూకు చెందిన సీనియర్ రాజకీయ జర్నలిస్టు వీరేంద్ర భట్ చెప్పారు.
యోగి ఎందుకు లేరు?
‘‘ఇప్పటివరకు ములాయం కోడలుగా మాత్రమే అపర్ణకు గుర్తింపు ఉంది. కానీ అఖిలేశ్ మాత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అఖిలేశ్‌ను అపర్ణతో సవాల్ చేయలేం’’అని శారద్ వివరించారు.
‘‘యోగితో అపర్ణ కుటుంబ సన్నిహిత్యం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, ఆమె పార్టీలో చేరినప్పుడు యోగి ఆదిత్యనాథ్ కనిపించలేదు. కేవలం కేశవ్ ప్రసాద్ మౌర్య, స్వతంత్ర దేవ్ సింగ్ మాత్రమే వేదికపై కనిపించారు. గత కొన్ని రోజులుగా ఓబీసీ నేతలు తమను వదిలివెళ్లడంతో జరిగిన నష్టాన్ని బీజేపీ పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’’అని రామ్‌దత్ వివరించారు.
మరోవైపు భర్తపైనున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై దర్యాప్తు జరగకుండా చూసేందుకే అపర్ణ బీజేపీలో చేరారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, APARNA BISHT YADAV FB PAGE
2011లో కోడలిగా..
32ఏళ్ల అపర్ణ 2011లో ములాయం ఇంటిలో కోడలిగా అడుగుపెట్టారు. ప్రతీక్, అపర్ణలది ప్రేమ వివాహం. స్కూలులో చదువుకున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చదువుకోవడానికి వీరు ఇంగ్లండ్ వెళ్లారు.
ప్రజాసేవతోపాటు సంగీతం అంటే కూడా అపర్ణకు ఇష్టం. శాస్త్రీయ సంగీతంలో ఆమె శిక్షణ తీసుకున్నారు. పాటలు కూడా బాగా పాడతారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కొత్త పీఆర్సీపై వివాదమేంటి, ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- సానియా మీర్జా: ‘టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతా.. నా చివరి సీజన్ ఇదే’
- అగ్నిపర్వతం బద్దలవడంతో బూడిదమయమైన టోంగా - అమెరికా తీరాన్ని తాకిన సునామీ అలలు
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













