సానియా మీర్జా రిటైర్‌మెంట్: ‘టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతా.. నా చివరి సీజన్ ఇదే’

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

వింబుల్డన్ డబుల్స్ మాజీ ఛాంపియన్, భారత ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2022 తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు.

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్‌లో ఓటమి చవిచూసిన ఆమె తాజా నిర్ణయాన్ని వెల్లడించారు.

‘‘నా చివరి సీజన్ ఇదే కావాలని నిర్ణయించుకున్నాను. ఈ సీజన్ చివరి వరకు ఉంటానో లేదో తెలియదు. కానీ చివరివరకు ఉండాలని ఉంది’’ అని ఆమె విలేఖరులతో చెప్పారు.

35ఏళ్ల సానియా 2005లో డబ్ల్యూటీఏ సింగిల్స్ గెలిచిన తొలి భారతీయురాలు.

మార్టినా హింగిస్‌తో సానియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్టినా హింగిస్‌తో సానియా

అయితే, ఆ తర్వాత గాయాల వల్ల ఆమె డబుల్స్‌పైనే దృష్టిపెట్టారు. 2015లో స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్‌తో కలిసి ఆమె వింబుల్డన్ గెలిచారు. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా ఓపెన్లు కూడా ఆడారు.

2016 రియో ఒలింపిక్స్‌లో సానియా, రోహన్ బోపన్నల జోడీకి పతకం తృటిలో తప్పిపోయింది. ఆ నాడు వీరు వీనస్ విలియన్స్‌, రాజీవ్ రామ్‌ల జోడీతో పోటీపడ్డారు.

మహేశ్ భూపతితో కలిసి సానియా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచారు. 2009లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్సెడ్ డబుల్స్ ఆమె గెలిచారు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

టీనేజీ వయసులోనే వేసవి సెలవుల్లో సానియా టెన్నిస్ ఆడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత టోర్నమెంట్లవైపుగా అడుగులు వేశారు. 15ఏళ్ల వయసులో ఆసియా గేమ్స్‌లో ఆమె తొలి టైటిల్ గెలిచారు.

2003లో ఆమె డబ్ల్యూటీఏ టూర్‌లో ఆడారు. అదే ఏడాది తన కెరియర్‌లో అత్యుత్తమమైన 27వ ర్యాంకు సాధించారు. టెన్నిస్‌లో భారత మహిళలు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే.

టెన్నిస్ కోర్టు వెలుపల సానియా జీవితంపైనా మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

బాబుకు జన్మనిచ్చిన తర్వాత, రెండేళ్ల విరామం అనంతరం 2019ల్లో సానియా తన కెరియర్‌ను మళ్లీ మొదలుపెట్టారు.

ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మొత్తంగా సానియా మీర్జాకు 25 మిలియన్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు.

క్రికెట్‌ను అమితంగా ఆరాధించే భారత్‌లో ఎందరో అమ్మాయిల్లో టెన్నిస్ ఆడేలా సానియా స్ఫూర్తిని నింపారు.

తను వేసుకునే బట్టలు, తన పెళ్లి లాంటి అంశాలపై వచ్చే ట్రోల్స్‌కు గట్టి సమాధానాలు ఇస్తూ తరచూ సానియా వార్తల్లో నిలుస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)