మహేంద్ర సింగ్ ధోనీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో దక్కని చోటు, ఇక ధోనీ కెరీర్ ముగిసినట్లేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివేంద్ర కుమార్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019లో నవంబర్ చివరి వారంలో రెండు కీలక ప్రకటనలు వచ్చాయి. తన కెరీర్ గురించి స్పందిస్తూ, జనవరి వరకు వేచిచూడమని మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు.
ఆ తర్వాత 24 గంటల్లోనే బీసీసీఐ కొత్త అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మరో ప్రకటన చేశారు.
'ధోనీ భవిష్యత్తు గురించి అంతా క్లియర్‌గా ఉంది' అని వార్త ఏజెన్సీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టీమ్ మేనేజ్‌మెంట్, బోర్డు, ధోనీ ముగ్గురి మధ్య పారదర్శకత ఉందని అన్నారు.
కానీ ధోనీ లాంటి పెద్ద క్రీడాకారుడి విషయంలో ఇలాంటి వ్యవహారాలన్నీ నాలుగు గోడల మధ్యే ఉంచాల్సి వస్తుంది. ఈ విషయాలను బహిరంగ వేదికల మీద ప్రజలకు తెలిసేలా చేయకూడదు. ఆ సమయంలో ధోనీ, గంగూలీ వ్యాఖ్యల లోతైన అర్థం ఎవరికీ తెలియలేదు.
జనవరిలో ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెడతారని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ ఇప్పుడు జరగడం లేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన క్రీడాకారుల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బట్టి ఆ రెండు ప్రకటనల సంకేతాలను ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల్లో ధోనీ పేరు ఏ విభాగంలోనూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
రిటైర్‌మెంట్‌కు-కాంట్రాక్టుకు నేరుగా సంబంధం లేదు.
2020లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ ఆడతాడా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. 2020లో ధోనీ కొన్ని మ్యాచ్‌లు ఆడొచ్చని ఈ కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకుని చెప్పొచ్చు. కానీ ఈ ఏడాది ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడరని చెప్పలేరు.
ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. టీమిండియాలో ఆడాలంటే కాంట్రాక్టు కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. కాంట్రాక్టు లేకపోయినా.. అందుబాటులో ఉండి.. సెలక్టర్లు ఎంపిక చేస్తే ఆ క్రికెటర్ టీమిండియా తరఫున ఆడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. ఏడాదిలో టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వారితో మాత్రమే బీసీసీఐ కాంట్రాక్టులు కుదుర్చుకుంటుంది.
కానీ గతేడాది వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తర్వాత సెలక్షన్‌కి ధోనీ అందుబాటులో లేరు. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన మైదానంలోకి దిగలేదు.
అందుకే బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో ధోనీ పేరు లేదని లాజికల్ చెప్పొచ్చు. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌కి వెళ్లాల్సి ఉంది. దానికోసం టీమ్‌ని ఇదివరకే ప్రకటించారు. అంటే ధోనీ మరో రెండు నెలలు మైదానానికి దూరంగా ఉంటారు.
ఒక క్రీడాకారుడు ఇన్ని రోజులు సెలక్షన్‌కి దూరంగా ఎలా ఉంటారని ఇటీవలే సునిల్ గవాస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ధోనీ లాంటి క్రీడాకారుడికి ఈ ప్రకటన(బీసీసీఐ కాంట్రాక్టు) ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపించదు. తుది జాబితా రూపొందించడానికి ముందే బీసీసీఐ బోర్డు ధోనీతో మాట్లాడి ఉంటుంది. ఇరువర్గాల అంగీకారంతోనే జాబితాను ప్రకటించి ఉంటారు. గతేడాది కూడా ధోనీ పేరు 'ఏ ప్లస్' విభాగంలో లేదు.
అన్ని ఫార్మాట్ల (టెస్టు, వన్ డే, టీ20)లో మ్యాచ్‌లు ఆడే క్రీడాకారులను 'ఏ ప్లస్' విభాగంలో చేరుస్తారు. ధోనీ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నందున అతను 'ఏ ప్లస్' కేటగిరీలోకి రారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కచ్చితంగా ఆడతారు. చెన్నై సూపర్‌కింగ్స్‌కి ఆయన కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్: 'ఇదంతా ఓ గేమ్.. మీరు దీన్ని పాడు చేయకండి సార్'
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- పుతిన్ భవిష్యత్ ప్రణాళికల ప్రకారమే రష్యా ప్రభుత్వం రాజీనామా
- ప్రియురాలిని హత్య చేసి టీవీ స్టూడియోకి వెళ్లి నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తి
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
- అమెజాన్‌కు రిలయన్స్ జియోమార్ట్ పోటీ ఇవ్వగలదా
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి
- ఇరాన్ అణు ఒప్పందంలోని కీలకాంశాలేమిటి... వాటిని ఆ దేశం ఉల్లంఘించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








